"ఇప్పటికీ ఖచ్చితంగా తేల్చుకోలేకపోతున్న విషయానికి నేను జవాబు చెప్పలేను స్పూర్తీ" క్షణం ఆగాడు రుత్వి. "కానీ నేను నాకు తెలియక ఓట్రాన్స్ లోకి వెళుతున్నాను ఈ ప్రయత్నంలో నేను ఆ ఇద్దరిలో ఎవరికి దగ్గరయినా అది మా అమ్మ కోరిక నెరవేర్చినట్టవుతుంది."
మౌనంగా వుండిపోయింది స్పూర్తి చాలాసేపటిదాకా.
రుత్విని ఓ తోబుట్టువులా పలకరించే చనువున్న స్పూర్తి అరనిముషం తర్వాత అది "ఎక్కడో ఓ పల్లెలో వున్న మీ అమ్మగారి కోరిక నెరవేర్చడానికి నువ్వు చాలా శ్రమపడుతున్న మాట నిజమే రుత్వీ. నీకు ఇలా సహకరించడానికీ నాకు అభ్యంతరం లేదు కానీ ప్రసాదభూపతి గారు ప్రేమనే పదాన్ని వినడమూ సహించలేని మనిషి"
"ఇప్పుడిప్పుడే ఆయనకి విజూష ప్రేమ విషయం తెలిసే అవకాశం లేదు."
"కానీ ఇప్పటికే తెలిసిపోయింది."
దిగ్ర్బాంతిగా చూసాడు రుత్వి.
"నిజం రుత్వీ! నిన్న రాత్రి నిన్నూ సశ్యని రెస్టారెంటులో చూసిన విజూష నన్ను విడిచిపెట్టలేదు. ఇంటికి తీసుకువెళ్లింది. అర్దరాత్రిదాకా నీ విషయమే మాట్లాడింది. అదంతా విన్నారు ప్రసాదభూపతి. అయితే అతన్ని నేను గమనించినట్టు ఆయనకి తెలీదు"
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"ఇదీ ఒకందుకు మంచిదేనేమో" అన్నాడు రుత్వి సాలోచనగా.
"ప్రసాదభూపతి బ్యాక్ గ్రౌండ్ నీకు తెలుసు."
"కాదనను స్పూర్తీ! కానీ ఆయన బ్రతికేది ఏ ప్రపంచమయినా ఇప్పుడు విజూష ఆయన ప్రపంచం. అందుకు విజూష నిజంగా నన్ను కోరుకుంటే ప్రసాదభూపతిని ఎదుర్కోవడం నాకు కష్టంకాదు."
స్పూర్తి పుట్టి పెరిగిన పల్లె రుత్వి తల్లి పుట్టిన వూరు ఒకటే కావటంతో స్పూర్తికి రుత్వితో బాల్యంనుంచీ చనువుంది. అందుకే అతడి పథకంలో తను పత్రగా మారడానికి సిద్దపడింది.
విజూష మనస్తత్వాన్ని మననం చేసుకుంటూ అంది స్పూర్తి "నిజంగా విజూష నిన్ను ప్రేమిస్తుందో లేక ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తుందో నాకు తెలీదు రుత్వీ! కానీ నీ కోసం తను ఏదన్నా చేసే స్థితికి చేరుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలీ అంటే తను గెలిచి తీరాలన్న మొండి పట్టులో తను కోరి గాయపడడానికే సిద్దంగా అనిపిస్తుంది."
స్పూర్తి రాస్తున్న సీరియల్ లోని కథానాయికలా తను రుత్వి మనిషి కావడానికి దేనికయినా సిద్దమన్నట్లు మాటాడిన విజూష జ్ఞప్తికి రావడంతో పరోక్షంగా తెలియజెప్పిన స్పూర్తి "సశ్య ఎలా వుంది?" అంటూ అడిగింది ఆసక్తిగా.
"ఇంచుమించు విజూషలానే తనూ ఆలోచిస్తుంది" నిన్న రాత్రి ఆమె ప్రవర్తనని మననం చేసుకున్నాడు. "అలా అని నేను సశ్యని తక్కువగా ఆలోచించడంలేదు స్పూర్తీ కానీ ఇద్దరూ మొండిగా ఆలోచించే మనస్తత్వంగల ఆడపిల్లలు కాబట్టి భయంగా వుంది."
"దేనికి?"
" నా మీద ప్రేమకన్నా పరస్పరం ద్వేషించుకోవడంలో హద్దులు దాటుతారేమోనని."
"అవకాశం లేదు రుత్వీ" నవ్వేసింది స్పూర్తి. "అంతదాకా నువ్వు రానివ్వవన్న నమ్మకం నాకుంది. అసలు విజూష సశ్యల్లో నువ్వు ఎవర్ని చేసుకున్నా మీ అమ్మగారికి ఆనందమేగా."
"కేవలం నా పెళ్లి మాత్రమే ఆమెకి ఆనందాన్ని ఇవ్వదు స్పూర్తీ! ఈ ప్రొసెస్ లో అమ్మకి ప్రాణస్నేహితురాలయిన రూపాదేవికి న్యాయం జరగాలి. అంటే రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన రూపాదేవి, ప్రసాదభూపతులు ప్రత్యర్దులుగా అయినా కలుసుకుని కనీసం తమ బిడ్డల కోసమయినా భార్యాభర్తలుగా బ్రతకడానికి సిద్దపడాలి."
ఏనాడో భర్తనుండి దూరమై గర్భవతిగా పుట్టినింటికి వెళ్లిపోయిన రూపాదేవి ఆ తరువాత అమెరికాలో సెటిలయి సశ్యకి జన్మనిచ్చినా ఆ విషయం ప్రసాదభూపతికి తెలీదు.
అసలు రుత్వి తన స్నేహితురాలి కొడుకన్న విషయం కూడా రూపాదేవికి తెలీని విషయమే.
అయినా సశ్య ప్రేమించిన వ్యక్తిగా అతడే తన అల్లుడు కావాలనుకుంది. ప్రేమలో తను పరాజిత అయినా తన కూతురు ప్రేమించిన రుత్విని సశ్య దక్కించుకుతీరాలనుకుంటుంది.
ఇద్దరమ్మాయిలూ ఎవరో తెలిసి విడిపోయిన దంపతుల్ని కలపాలనుకుంటున్న రుత్వి, స్పూర్తి ఇద్దరూ ఎలాంటి ప్రమాదంలో కూరుకుపోతున్నదీ ఆ ఇద్దరికీ తెలీదు.
* * * *
సాయంకాలం నాలుగు గంటల సమయం.
కృష్ణా ఒబరాయ్ కాన్ఫరెన్స్ హాల్ నగరంలో అత్యున్నతస్థానానికి చెందిన కుటుంబాలు మొదలుకొని మధ్యతరగతి స్త్లీలదాకా నిండిపోయి వుంది. "ఆరోగ్యానికి ఆయుర్వేదం" అనే టాపిక్ తో ఇక్క డ సమావేశాన్ని ఏర్పాటుచేసింది ఎవరో కాదు. ప్రముఖ సంఘ సేవిక రాష్ట్ర మహిళా సంఘాలకి అధ్యక్షురాలయిన శ్రీమతి కమలాదాసు.
అప్పుడెప్పుడో ఓ రాత్రి రెస్టారెంటులో రుత్విని కలిసిన స్త్రీలంతా కమలాదాసుని బలవంతం చేసి రుత్విని యిలా రప్పించారు.
అయితే సమావేశాన్ని వున్నవాళ్లకే కాక మామూలు వర్గానికి చెందిన స్త్రీలకి విస్తరింపజేసి కమలాదాసు కాస్త సంయమనాన్ని పాటించింది.
పదిహేను నిముషాల రుత్వి ఉపన్యాసంలో ఋగ్వేదానికి వున్న ప్రశస్తిని వివరించి అందర్నీ తన మాటలతో మంత్రముగ్దుల్ని చేశాడు.
ఉపన్యాసం కాగానే మహిళా మండలి సభ్యులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది కమలాదాసు.
బక్కగా ఓపిక లేనట్టు కనిపిస్తున్నా ఒంటి నిండా నగలు అలంకరణతో ముప్పయ్యేళ్ళ వయసున్న ఓ స్త్రీ ముందుగా అడిగింది రుత్విని చూస్తూ "అందరూ లావు తగ్గడానికి సలహాలడుగుతారు. కానీ నేను లావు పెరగాలనుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పండి."
ఆ ప్రశ్నతో గొల్లుమంటూ నవ్విన యువతుల్ని చూస్తూ సంక్షిప్తంగా జవాబు చెప్పాడు. "లావు పెరగకుండా వయసుకి తగ్గ బరువుని మెయిన్ టైన్ చేస్తూ వుండడం ఆరోగ్యానికి చాలా అవసరం సరే మీరు లావు కావాలీ అనుకుంటున్నారు కాబట్టి...." క్షణం ఆగాడు రుత్వి.
"రోజూ స్వీట్స్ తినండి. తెల్లజొన్నలతోపాటు పాలు కలిపి పాయసంలా చేసుకుని రోజూ తీసుకోండి. అలా చేస్తే లావవడం ఖాయం."
"మరినేనేమో లావు తగ్గాలనుకుంటున్నాను" అందో మధ్య వయస్కురాలు. చూడడానికి పిప్పళ్లబస్తాలా వుంది. అయినా ఏదోతింటూ అడిగింది.