"డామిట్"
అర్దరాత్రి గడుస్తున్నా ఇంకా అలజడితో కదిలిపోతున్న విజూషని చూస్తూ అంది స్పూర్తి.
"ఇప్పుడేమైందని. రుత్వి ఓ రాత్రంతా సశ్యతో వుంటాడు. అంతేగా."
ఖరీదైన భవంతి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ లో సైతం చెమటతో తడిసిపోతున్న విజూష పాలభాగాన్ని స్పృశిస్తూ అంది స్పూర్తి మళ్లీ "నిన్ననే ఎందుకంత బాధపడతావ్?"
"నీకు తెలుసు నేను ఓటమిని తట్టుకోలేను" విజూష కళ్లనుంచి నీళ్ళు రాలేట్టున్నాయి.
సుమారు రెండు దశాబ్దాల కాలం తను ఆడింది ఆటగా. పాడింది పాటగా బ్రతికిన ఓ అయినింటి ఆడపిల్ల అహానికి తప్ప సహనానికి అంత ప్రాముఖ్యతనివ్వని ఓ అందమైన అమ్మాయి గెలుపూ ఓటములనే జంట పదాలని ప్రయోగిస్తుంది తప్ప ఇంకా వాస్తవాన్ని అర్దం చేసుకోలేక పోతోంది.
రుత్వి అనే యువకుడ్ని ఆమె యిష్టపడుతోంది.
కాదు........
ఆరాధిస్తోంది.
ఇద్దరిమధ్యా పరిచయం ఏర్పడింది నిన్నగాక మొన్న అయినాగానీ ఎన్నో జన్మల ఆత్మీయుడ్ని దూరం చేసుకుంటున్నంతగా ఆమె కలవరపడుతోంది.
మామూలుగా అయితే రుత్విని ఏదో ఓనాటికి తనవాడ్ని చేసుకునేదేమోగాని ఇప్పుడు మరో అమ్మాయి పోటీలో అదేపనిగా అతడి గురించి ఆలోచిస్తూ అతడిపై తనకు పెరిగే అనురాగానికి ఆయువుని నింపుతూంది వేడిగా, వేగంగా.
"ఏటి కడుపున దాగి తోట నిదురోయింది
ఆలనా నా సొదకు పాలనా యనుకుంటే
కొమ్మలో కోయల 'కో' బాగువోగెరుగదే"
మృదువుగా నవ్వుతూ నండూరి కవితని చెప్పింది స్పూర్తి.
విజూష అదోలా చూసింది.
అసలు స్పూర్తి ఇంత ప్రసాంతంగా మాట్లాడడం నచ్చలేదేమో అవేశంగా అంది "స్పూర్తి! ఇప్పుడు నేనేం చేయాలి?"
"నువ్వు ఓడింది ఒక్కసారి మాత్రమే విజూషా! ఈ ఒక్క ఓటమి రుత్విని నీకు దూరం చేయదు"
" అదికాదే ఈ ఓటమి ప్రారంభం మాత్రమే అయితే రేపు నేను రుత్వికి దూరమైపోతాను"
రుత్వి తనవాడు కావాలనే దానికన్నా తనే రుత్వి మనిషి కావాలన్న ఆమె ఆలోచన ఆమె మాటల్లో ధ్వనిస్తుంటే లాలనగా విజూష తల నిమిరింది స్పూర్తి.
"ఈవారం నా సీరియల్ చదివావ్ కదూ?"
విజూష అర్దంకానట్టు చూసింది.
"అందులో కథానాయిక తండ్రిని తనప్రేమ విషయంలో ఒప్పించలేక ఏం చేసింది?" అడిగింది స్పూర్తి.
"పెళ్లికి ముందే హీరోతో సంబంధం పెట్టుకుని తల్లి కావాలనుకుంది."
అసంకల్పితంగా అనేసిన విజూష టక్కున ఆగిపోయింది ఎవరో గొంతు నొక్కినట్టుగా.
అది స్పూర్తి రాసింది తన గురించే అన్నట్లు అనపిస్తోంది.
తన గళంలో దాగిన ఏ కలంతోనో ఓ కొత్త ఆధ్యాయాన్ని రాసి ఇటు తన తండ్రినీ, అటు సశ్యనీ ఓడించాలని నిర్ణయించుకుందేమో.
"నేనూ అదే.......అలాంటి నిర్ణయంతోనే చివరి గెలుపుని సాధిస్తాను స్పూర్తీ" అనేసింది ట్రాన్స్ లోలా.
గది బయట నిలబడివున్న ప్రసాదభూపతి అప్రతిభుడయ్యాడు.
ఆవేశంగా గదిలోకి అడుగుపెట్టి కూతుర్ని నిలదీసేవాడే.
కానీ విజూష తో బాటు ఆమె స్నేహితురాలు స్పూర్తి వుంది.
అందుకే ఆగాడు ప్రసాదభూపతి.
అదికాదు.
తన అంతస్తుకీ తగ్గ కెనడా సంబంధం గురించి చూచాయగా తెలియజెప్పినా విజూష ఇలాంటి ఒక నిర్ణయమేదో స్వతంత్రంగా తీసుకోడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు.
ప్రేమని సైతం వడపోసి పంచి పెంచి తండ్రిగా తన స్థానాన్ని అరుదైనది అని నిరూపించుకోవడానికి ఇన్నేళ్ళుగా అతడు చేసిన ప్రయత్నం తన కళ్లముందే ఎంత ఘోరంగా విఫలమైందో అర్దమౌతుంటే.....
ఉప్పొంగిపోతున్న తరంగాల్ని ఉక్కు కొమ్ముతో విరిచేస్తూ నవ్వుకున్నాడు మర్మాన్ని పెదవుల మాటున దాచుకునే యమధర్మంలా.
విజూష అందంలోగానీ, అంతస్థులోగానీ నీడ మాత్రమే. కానీ తను నిజం.
విజూష ఆకృతి అయితే దానికి జన్మనిచ్చిన అద్దం తాను.
అందుకే.....
ఉప్పెన దాగిన కడలిలా తుఫానుని గుండెలో దాచుకున్న ఇసుక ఎడారిలా మౌనంగా నిలబడిపోయారు. యముడిలా వెనక్కి మరలాడు.
ఆ రాత్రి విజూష నిద్రపోలేదు.
ఏం చేయాలో తనకు మాత్రమే తెలిసినట్టు తన బ్రతుకు ఇదిహాసపు నిడివిని కొలవాల్సిందీ తనే అన్నట్టు బెడ్ పై అటు ఇటు పొర్లుతూ తెల్లవార్లూ గడిపింది రవళించే శ్రుతిలా, మస్తిష్కపు భృతిలా, రాయనికృతిలా ధృతిలేని మధురస్మృతిలా.....
ఆ మరుసటిరోజు తెల్ల వారుజామునే రుత్విని కలుసుకుంది స్పూర్తి.
"రాత్రి ఫోన్ చేస్తావనుకున్నాను" అన్నాడు రుత్వి స్పూర్తికి అభిముఖంగా కూర్చుంటూ.
"అంటే నువ్వు టెన్షన్ లో కూరుకుపోతున్నావన్న మాట" నవ్వేసింది స్పూర్తి.
రుత్వి జవాబు చెప్పలేదు.
"ఇది టెన్షన్ కాదు స్పూర్తీ! ఒక బాధ్యత .కొందరు వ్యక్తులకు తప్పనిసరిగా చెప్పాల్సిన జీవిత సత్యం గురించి అమ్మకిచ్చిన మాటకోసం నీ సహాయంతో చేస్తున్న ఓ ప్రయోగం."
"కానీ ఈ ప్రయోగంలో నువ్వూ మానసికంగా ఇన్వాల్వ్ అయిపోతున్నట్టుగా వుంది."
"అఫ్కోర్స్"
"ఎటు మొగ్గుతున్నావ్?"