Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 46


    జీపుల తాలూకు ముందు వుండే రేకులు (బోయినెట్ లు) విప్పి, కత్తియుద్ధంలో ఉపయోగించే "డాలు" లాగా తమని తాము రక్షించుకుంటూ వస్తున్నారు సైనికులు.

    ఆ దృశ్యాన్ని చూస్తున్న అజ్మరాలీ, వాళ్ళ మూర్ఖత్వానికి నవ్వుకున్నాడు. మరోవైపు కోపమూ, విసుగూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే "డాళ్ళు" రైఫిల్ బుల్లెట్లకి అడ్డు నిలబడవు. వంతెనకి కాస్త ఇటువైపుకి దగ్గరకి రాగానే చైతన్య ఇస్మాయిల్ పేల్చే కాల్పులకి అందరూ నల్లుల్లా మాడిపోతారు.

    అయితే అతని అంచనాని తప్పుచేస్తూ, సైనికులు మరో నాలుగు గజాలు వంతెనమీద ముందుకు వచ్చి ఆగిపోయారు. చేతిలో వున్న రేకులు వంతెనకి జల్లెడలా అడ్డుపెట్టి, వెనక్కి వెళ్ళి విరిగిపోయిన చెక్కలు రిపేరు చేయసాగారు. ఇటువైపు వున్నవాళ్ళకి రేకులు తప్ప సైనికులు కనపడటంలేదు.

    ఇస్మాయిల్ కసిగా పళ్ళు కొరికాడు.

    చైతన్య మాత్రం బాధపడ్డాడు. అతడి బాధకి కారణం వుంది.

    వాళ్ళు అడ్డుగా పెట్టిన రేకులు, బుల్లెట్ ఫ్రూఫ్ లు కావు. తను రైఫిల్ పేలిస్తే ఆ బుల్లెట్ రంధ్రం చేసుకుంటూ వెళ్ళి అవతలి వాళ్ళని చంపక తప్పదు. కానీ ఇందులో ఒక చిన్న చిక్కు మాత్రం వుంది. ఆ రేకుల అవతల ఏ మనిషి ఎక్కడున్నాడో సరిగ్గా తెలియదు. అది ఇరవై బుల్లెట్లు పేలిస్తే ఒకటి సరీగ్గా తగులుతుంది.  

    తమ దగ్గిరవున్న బుల్లెట్స్ ని వృధాచేయటం అవతలి కమాండర్ ఉద్దేశ్యమని చైతన్యకి అర్ధమైంది. కానీ దానికోసం అతను వేస్తున్న "ఎర" అని చూసి బాధ కలిగింది. అవతలి సైన్యాన్ని ఛిన్నాభిన్నం చేయటానికి, సర్వనాశనం చేయటానికీ ఒక సైనికుడు ఆత్మత్యాగం చేసినా తప్పులేదు. కానీ తమలాంటి "నిస్సహాయుల్ని" చంపటానికి సైనుకుల్ని ఎందుకు బలిపెట్టాలనుకున్నాడో అర్ధంకాలేదు. కమాండర్ దీన్ని తన గౌరవానికి సంబంధించిన విషయంగా తీసుకున్నాడని మాత్రం అర్ధం అయింది.

    "ఏం చేద్దాం" అన్నట్టు చూశాడు ఇస్మాయిల్.

    చైతన్య రైఫిల్ చేతిలోకి తీసుకున్నాడు.

    ఇస్మాయిల్ తన దగ్గిరవున్న బుల్లెట్స్ అన్నీ అతనికివ్వబోయాడు.

    అవసరం లేదన్నట్టు తల అడ్డంగా వూపి, వెనగ్గా వెళ్ళి గుట్టపైకి ఎక్కసాగాడు చైతన్య.

    అతడు చేయదల్చుకున్నది ఏమిటో అర్ధంకాక అజ్మరాలీ కూడా ఆశ్చర్యంగా చూడసాగాడు.

    గుట్టపైకి వెళ్ళాక బోర్లా పడుకుని, రైఫిల్ గురి చూసుకున్నాడు. శత్రువులు అడ్డుగా పెట్టిన బోయినెట్స్ పైనుంచి సైనికులు కనపడుతున్నారు. అతడు ఏకాగ్రతనంతా కంటిచూపులోకి తెచ్చుకున్నాడు. అంత దూరంనుంచి కాల్చటం దాదాపు అసాధ్యం. కానీ మనిషికి అసాధ్యం కానిదేదీ లేదని నమ్మినవాళ్ళల్లో అతనొకడు.

    ఒక పాకిస్తానీ సైనికుడు వంతెనమీద చెక్క బిగిస్తున్నాడు. దాదాపు పాతికేళ్ళు వుంటాయి. ఇంకా లేతగానే వున్నాడు. చైతన్య ఒక్కక్షణం తటపటాయించాడు. కానీ యుద్ధంలో తప్పదు. ట్రిగ్గర్ మీద వేలు బిగించి. మరొకసారి గురి సరిగ్గా చూసుకుని నొక్కాడు.

    రైఫిల్ పేలింది. ఒకటే ఒక బుల్లెట్...

    అడ్డుగా పెట్టిన బోయినెట్స్ అసలు కదల్లేదు. చైతన్య పేల్చిన గుండు ఆ రేకుల పైనుంచి వెళ్ళి సైనికుడి భుజాల్ని తాకింది. అతను గట్టిగా ఆర్తనాదం చేశాడు. వంతెన మీద పని చేస్తున్న సైనికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతులయ్యారు. క్షణంలో అక్కణ్ణుంచి వెనక్కి పరుగెత్తి చెట్లలో మాయమయ్యారు. చైతన్య సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

    అవతలివైపు ఆర్మీ కమాండర్ కి కళ్ళముందు ఏదో మెరిసినట్టయింది. శత్రువు అంత వెనక్కి వెళ్ళి గుట్టమీద నుంచి కాలుస్తాడనీ, ఒకవేళ కాల్చినా అది సూటిగా తగులుతుందనీ అతడు ఊహించలేకపోవటంతో తబ్బిబ్బు అయ్యాడు.

    చైతన్య అనుకున్నట్లు ఆ కమాండర్ కేవలం ఒక్క "రేకే" అడ్డు పెట్టలేదు. మొత్తం తమ దగ్గిర వున్న వాహనాల తాలూకు స్టీల్ అంతా రెండేసి పొరలు అమర్చాడు. దానివల్ల బుల్లెట్ దగ్గిరకొచ్చేసరికి వేగం తగ్గిపోతుంది. నిజంగానే ఇది చాలా మంచి ప్లాను. అయితే చైతన్య అసలు ఈ అడ్డంకిని పట్టించుకోకుండా పైకి వెళ్ళి కాల్చటముతో మరో సైనికుడు గాయపడ్డాడు.

    జగదీష్ కొడుకుని అభినందిస్తున్నట్లు చూశాడు. అయితే చైతన్య గుట్టదిగి వస్తూండగా ఊహించని సంఘటన జరిగింది.

    అవతలి పక్షంలో సైనికుడు గాయపడటం, అందరూ వెనక్కి పరుగెత్తటం చూస్తూ ప్రనూష ఒక్కక్షణం ఏమరుపాటుగా వుంది. అది గమనించి అజ్మరాలీ తిరగబడ్డాడు. ఆమె కళ్ళు తిప్పుకునేలోపులో, చేతిమీద బలంగా కొట్టి ఆమె దగ్గిర ఆయుధాన్ని క్రింద పడతోసాడు. ఆమె దాన్ని వంగి అందుకోబోయింది. దానికన్నా ముందే అతడు దాన్ని తీసుకుని పరుగెత్తాడు.

    అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు.

    అందరికన్నా ముందు తేరుకున్నది ఇస్మాయిల్.

    ఇస్మాయిల్ అజ్మరాలీ వెంటబడ్డాడు.

    చైతన్య "వద్దు-వద్దు" అని అరుస్తున్నాడు. కానీ ఇస్మాయిల్ ఆగలేదు.

    అతనెందుకు అజ్మరాలీ వెనుక పరుగెడుతున్నాడో చైతన్యని తెలుసు. అజ్మరాలీ అలా ఆయుధంతో వదిలేస్తే అతడు తమ వెనుక వైపు వుంటాడు. ముందొక శత్రువునీ, వెనుకొక శత్రువునీ పెట్టుకొని పోరాడటం కష్టం. అందుకే ఇస్మాయిల్ చేతిలో ఆయుధం వుందని తెలిసికూడా వెనుక పరుగెత్తటం ప్రారంభించాడు.

    ఆ చుట్టుప్రక్కల చెట్లు లేవు. అన్నీ రాళ్ళూ గుట్టలు.

    అజ్మరాలీ సైన్యంలో వున్నవాడు. ఇస్మాయిల్ సైన్యం నుంచి రిటైరయినవాడు. అయినా ఇస్మాయిలే చురుగ్గా వున్నాడు. సైన్యంలో ఉన్నతాధికారులకి రోజువారీ ప్రాక్టీస్ వుండదు.

    ...ఇద్దరి మధ్యా వేగం తక్కువైంది.

    ఇస్మాయిల్ అజ్మరాలీని అందుకోబోయాడు. అజ్మరాలీ వెనక్కి తిరిగి పిస్టల్ కాల్చాడు. దగ్గిర రేంజిలో కాల్చటం వల్ల బుల్లెట్ ఇస్మాయిల్ చేతిగుండా దూసుకుపోయింది. రక్తంతో అతడి బట్టలు తడిచిపోయాయి. బాధగా మోకాళ్ళమీద కూలిపోయాడు.

    బహుశా అప్పుడర్ధమై వుంటుంది అజ్మరాలీకి. తన చేతిలో వున్న ఆయుధంతో మిగతావాళ్ళని బెదిరించవచ్చని....

    ఇస్మాయిల్ భుజం పట్టుకుని పైకిలేపి, ముందుకు నడిపిస్తూ అరిచాడు. "....మీ ఆయుధాలు వదిలేసి లొంగిపోండి. లేకపోతే ఇస్మాయిల్ ని కాల్చేస్తాను."

    చైతన్య, ప్రనూష, లక్ష్మి, జగదీష్, రంగనాయకి... అందరూ శిలాప్రతిమల్లా నిలబడి వున్నారు. చైతన్య తన చేతిలోని రైఫిల్ ని వదిలేసాడు.

    అవతలి వాళ్ళకి ఈ దృశ్యం బహుశా లీలగా కనిపిస్తూ వుంటుంది. అటువైపు కూడా అలికిడి లేదు.

    అజ్మరాలీ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది. ఇలా అందర్నీ ప్రాణాల్తో (ముఖ్యంగా జగదీష్ ప్రసాద్ ని) పట్టుకోవడం ద్వారా పై అధికారుల ప్రాపకం సంపాదించుకోవచ్చని అనుకుంటున్నాడు.

    విజయోత్సాహంతో ఇస్మాయిల్ వెనుకే పిస్తోలు పట్టుకుని వస్తూన్న అజ్మరాలీని నిస్సహాయంగా చూస్తున్నారు మిగతావాళ్ళు. అందరూ తమ తమ ఆయుధాలను క్రింద పడేసారు.

    అజ్మరాలీకీ ఇస్మాయిల్ కీ మధ్య అయిదారడుగుల దూరం వుండి వుంటుంది.

    రాళ్ళని దాటుకుంటూ ముందుకొస్తూన్న అజ్మరాలీ, ఒక చోట అడుగు వేయగానే, చెవులు మార్మోగేలా బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగింది. పెద్ద పేలుడుతో భూమిలోంచి థూళి పైకిలేచింది. దాంతోపాటే అజ్మరాలీ శరీరం కూడా పైకి లేచింది. అతని కాలు నిలువుగా చీలిపోయింది. అతని ముందు నడుస్తూన్న ఇస్మాయిల్ తూలిపడ్డాడు. ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండింది. అక్కడేం జరిగిందో, కొద్దిక్షణాలపాటు అయోమయంతో ఎవరికీ అర్ధంకాలేదు.

    "లాండ్ మైన్" అరిచాడు చైతన్య. "...ఇస్మాయిల్- జాగ్రత్తగా రా"

    ఇస్మాయిల్ కూడా సైన్యంలో పనిచేశాడు కాబట్టి 'లాండ్ మైన్స్' గురించి అతడికి తెలుసు. సైన్యం ఒక ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు శత్రు సైనికుల్లో నష్టం కలుగచేయటానికి లాండ్ మైన్స్ (భూమి అడుగున బాంబులు) ఏర్పాటు చేస్తారు. ఏ మాత్రం వత్తిడి తగిలినా ఇవి పేలిపోతాయి.

    ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవటానికి వెళ్ళిన వారి అడుగు గానీ, వాహనాల బరువుగానీ పడగానే, ఇది పేలి, విపరీతమైన నష్టం కలుగచేస్తాయి.

    భారత సైన్యం ఆ ప్రదేశాన్ని ఖాళీచేస్తూ వెళ్ళిపోతున్న సమయంలో ఏర్పాటు చేసిన మైన్లు అయి వుంటాయని అనుకున్నాడు చైతన్య.

    ఇస్మాయిల్ జాగ్రత్తగా తన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రనూష అతడి గాయం పరిశీలించింది. అదృష్టవశాత్తు బుల్లెట్ అతని శరీరంలో చిక్కుకుపోలేదు. రక్తం మాత్రం ధారగా కారుతూంది. గుడ్డతో గట్టిగా దాన్ని బిగించి, ప్రధమ చికిత్స ప్రారంభించింది.

    ఈ లోపులో చైతన్య కర్ర సాయంతో అజ్మరాలీ దగ్గిరికి వెళ్ళాడు.

    భూమిలో పాతి పెట్టబడి వున్న లాండ్ మైన్స్ మీద పొడవాటి కర్ర సాయంతో వత్తిడి కలిగిస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ అవి పేలినా, వెనుక నడుస్తున్న మనిషికి అపాయం వుండదు.

    అజ్మరాలీ రక్తపు మడుగులో పడి వున్నాడు. కాలు దాదాపు పనికిరాదు. ఒక రాతిముక్క ఎముకని చీలుస్తూ లోపలికి గుచ్చుకుని పోయి వుంది. దానితోపాటు కాలు కూడా తీసెయ్యవచ్చు. ఆ రాయి అడ్డు వుండటంవల్ల రక్తం రావటం లేదు.

    దగ్గరికి వస్తూన్న చైతన్యని చూసి ఆ స్థితిలో పిస్టల్ కోసం వెతికాడు అజ్మరాలీ. కానీ ఆ ప్రేలుడులో అది ఎక్కడ పడిందో కనపడలేదు. చైతన్య అతడిని లేపి, వచ్చిన దారివెంటే జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చాడు.

    అప్పటికి ఇస్మాయిల్ గాయానికి కట్టు కట్టడం పూర్తిచేసింది ప్రనూష.

    వాళ్ళ ముందుకొచ్చి అజ్మరాలీ పడిపోయాడు.

    "కాల్చు" అన్నాడు చైతన్య.

    అంత హఠాత్తుగా అతడు అలా అనేసరికి, అతడేం చెయ్యమంటున్నాడో అర్ధంకాక ప్రనూష అయోమయంగా చూసింది. చైతన్య తన చేతిలోని పిస్టల్ ఆమె చేతికిచ్చి అజ్మరాలీని చూపిస్తూ "కాల్చు" అన్నాడు మళ్ళీ. అక్కడున్న వారంతా ఈ హఠాత్ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. చైతన్య వాళ్ళని పట్టించుకోలేదు. "ఇతన్ని చంపటం కోసమేగా నన్ను నీతో తీసుకొచ్చావ్. ఇతని మీద పగ తీర్చుకోవడం కోసమేగా ఇంత ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు ఇంత శ్రమపడి... ప్రాణాలకు తెగించి వచ్చావ్" అన్నాడు.

    ఆమె ఇంకా సందిగ్ధంలో వుంది.

    "నేను నిజంగానే చెపుతున్నాను. ఇతన్ని చంపేస్తే ఒక పని అయిపోతుంది. ఇంతసేపూ ఇతను మనకి బందీగా వుంటే పాకిస్తాన్ సైన్యం మనమీద దాడి చెయ్యదని అనుకున్నాను. అది ఎలాగూ తప్పని తెలిసిపోయింది. ఇప్పుడు యితన్ని మనతో వుంచుకోవటం పాముని పక్కలో పెట్టుకోవడమే అనిపిస్తోంది. ఇతడి అవసరం మనకి లేదు. నువ్వు చంపెయ్యవచ్చు."

    ప్రనూష చైతన్యవైపు బ్లాంక్ గా చూసింది. తను చెప్పవలసింది అయిపోయినట్టు చైతన్య దూరంగా, లాండ్ మైన్స్ వైపు వెళ్ళాడు.

    చుట్టూ వున్నవాళ్ళు నిశ్శబ్దంగా ఆమెవైపే చూస్తున్నారు ఆమె ఇబ్బందిగా పిస్టలు పట్టుకుని వుంది. పది నిముషాల తర్వాత చైతన్య తిరిగి అక్కడికి వచ్చేసరికి ఇంకా ఆమె అలాగే వుంది.

    "ఏమిటి ఆలస్యం?"

    ఆమె నిస్సహాయంగా అతనివైపు చూస్తూ "అలా పడివున్న వాడిని ఎలా చంపను?" అంది.

    "కానీ అతన్ని చంపటం కోసమేగా నన్ను నీ సైన్యంలో నియమించుకున్నావు".

    "యుద్ధంలోనో, మామూలుగా తిరగబడితేనో చంపటంవేరు.... ఇలా నిస్సహాయంగా పడివున్న వాడిని చంపడం వేరు." 

 

 Previous Page Next Page