"కానీ అతను నీ తల్లినీ- తండ్రినీ...."
"నిజమే...." అతడి మాటలు మధ్యలో ఆపుచేస్తూ అంది. "అతడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన మాట నిజమే. నా జీవితమంతా అతడిని ఎలా కడతేర్చాలా అని ఆలోచిస్తూ గడిపిన మాట కూడా నిజమే! కానీ నేను ఇప్పుడు మాత్రం ఆ పని చేయలేను" ఆమె అక్కణ్ణుంచి దూరంగా వెళ్ళిపోయింది.
చైతన్య తండ్రివైపు జరిగాడు. "మిమ్మల్ని ఇతడు పాతిక సంవత్సరాలు జైల్లో వుంచాడు. మీతో రహస్యం చెప్పించటం కోసం నరకం చూపించాడు. దానికి ప్రతీకారంగా మీరు అతన్ని చంపదల్చుకుంటే... ఇదిగో పిస్తోలు."
జగదీష్ కొడుకువైపు ఓ క్షణం చూసి "నాకలాంటి ఉత్సాహమేమీ లేదు" అన్నాడు ఇంగ్లీషులో.
చైతన్య ఇస్మాయిల్ తో "నువ్వు ఆర్మీలో పనిచేశావుగా. ఇలాంటి పనులు సులభంగా చేయగలవు, ఇతడు మనతోపాటూ వుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఇతని గురించి ఒకరు ఎప్పుడూ పని మానుకుని కూర్చోవాలి" అన్నాడు.
"నాకు అతనిపట్ల ఎటువంటి శత్రుత్వమూ లేదు."
"కానీ నువ్వు సైన్యంలో పనిచేసి వచ్చావు."
"సైన్యంలో కూడా శత్రువులు ఇలా నిస్సహాయంగా వుంటే ఎవరూ చంపరు."
"అతడు నీ మనస్థుడని చంపటానికి సంశయిస్తున్నావు కదూ..."
ఇస్మాయిల్ చివుక్కున తలెత్తి, అంతలోనే ఏదో అర్ధమైనట్టు అన్నాడు. "ఇదంతా నన్ను రెచ్చగొట్టటానికి నువ్వు అంటున్నావని నాకు తెలుసు. అతడు నా మతస్థుడే. కానీ మతం మనిషి నిర్మించుకున్నది. మతంకన్నా మానవత్వం గొప్పదని మా అల్లాయే చెప్పాడు."
అజ్మరాలీ వారిద్దరి సంభాషణనూ వింటున్నాడు.
చైతన్య అన్నాడు. "సరిహద్దు కూడా మనిషి నిర్మించుకున్నదే! కేవలం ఒక గీతకి అటూ ఇటూ వుండటంవల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులు అవుతారు....... చిత్రంగా లేదూ."
"మమ్మల్నందర్నీ అడుగుతున్నావు. అతన్ని నువ్వే చంపవచ్చుగా?"
"అతనితో నాకు పని వుంది" అన్నాడు చైతన్య. "... ఆ పని కోసం అతన్ని వాడుకోబోయేముందు మీ అందరినీ అడగాలి కదా! ముఖ్యంగా ప్రనూషని. ఆమే కదా ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి ఇతన్ని చంపటం కోసం వచ్చింది..." అని ప్రనూషవైపు తిరిగి- "నాకిచ్చిన పని పూర్తి అయింది. అతన్ని నీకు ఒప్పచెప్పాను. అతన్ని నువ్వు చంపకుండా వదిలేస్తున్నావు అంతేనా?" అని అడిగాడు.
"అంతే" అన్నట్లు ఆమె మౌనంగా వుండిపోయింది.
సాయంత్రమవుతోంది.
అజ్మరాలీ కాలికి స్వయంగా కట్టుకట్టాడు చైతన్య. తరువాత గుట్టల వెనుక వున్న టెంట్స్ అన్నీ వెతికి ఒక పెద్ద చెక్క పలక తీసుకొచ్చాడు. దాని అవసరం ఏముందో అక్కడి వారికి అర్ధం కాలేదు.
అంతలో వంతెనకి అవతలి పక్కనుంచి శబ్దం వినిపించి అందరూ అటు చూశారు.
కొండపైన మెలికలు తిరిగి వున్న రోడ్డుమీద నుంచి వరుసగా దిగి వస్తూ కనిపించాయి.
టాంకులు... ఒకదాని వెనుకే ఒకటి...
శత్రువుని కబళించటానికి వస్తూన్న మృత్యువు కోరల్లా వున్నాయవి.
వరుసగా నాలుగయిదుసార్లు అవి పేలితే చాలు. ఇటు పక్క అంతా శ్మశానంలా మారుతుంది.
వాటికి భయపడి వెనక్కి తగ్గితే, వాళ్ళు వంతెనదాటి వచ్చేస్తారు.
ఎటూ దారి లేదు.
వస్తూన్న టాంకుల శబ్దం ఎక్కువైంది. సైనికులందరూ చెట్లచాటునుంచి వచ్చి, టాంకులు పొజిషన్ లో నిలబడడం కోసం జీపులు పక్కగా తీసి పెడుతున్నారు. అంతా కోలాహలంగా వుంది. మరికొద్ది నిమిషాల్లో లభ్యమయ్యే విజయోత్సాహం వాళ్ళల్లో ఇప్పుడే కనిపిస్తోంది.
ప్రనూష, లక్ష్మి అందరూ నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డారు.
ఇస్మాయిల్ చైతన్య దగ్గరగా వచ్చి "ఏం చేద్దాం" అని అడిగాడు.
అతను సమాధానం చెప్పకుండా అవతలి ఒడ్డుకేసి చూస్తున్నాడు.
టాంకులు వచ్చి ఆగాయి. నెమ్మదిగా వాటి గురి యివతలితీరం మీదకు చేరుతోంది.
"మనం ఇక్కడ్నించి ఆ కొండల్లోకి పారిపోతే కొంచెం సేపయినా ప్రాణాలు రక్షించుకోగలమనుకుంటాను" అన్నాడు ఇస్మాయిల్.
"ఎంతసేపు? అయిదు నిమిషాలో... పది నిమిషాలో...."
"ఇక్కడుంటే అదీ దక్కదుగా" ప్రనూష అంది. "ఇస్మాయిల్ చాలా వీక్ గా వున్నాడు. మిగతా ఇద్దరూ వృద్ధులు. వాళ్ళందర్నీ వదిలేసి విడివిడిగా వెళ్ళిపోలేంగా."
ఆమె మాటల్లో లాజిక్ కి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు.
టాంక్ నుంచి మొదటికాల్పు వినిపించింది. వీళ్ళున్న ప్రదేశానికి వంద గజాల దూరంలో వచ్చిపడింది గుండు. రాళ్ళు, దుమ్ము పైకి లేచాయి. ఒకవైపు నుంచి వరుసగా "క్లియర్" చేసుకుంటూ రావటం వాళ్ళ ఉద్దేశ్యమని స్పష్టంగా తెలుస్తూంది.
మరోసారి టాంక్ పేలింది. ఈసారి మరింత దగ్గరగా....
చైతన్య లేచి, "ఇస్మాయిల్... మిగతావాళ్ళని నువ్వు దూరంగా తీసుకువెళ్ళు" అని అజ్మరాలీ దగ్గరకి వెళ్ళి "లే..." అన్నాడు.
అజ్మరాలీ అర్ధంకానట్టు చూశాడు.
"నిన్ను మీ వాళ్ళ దగ్గరకు పంపించేస్తున్నాను."
వింటూన్న ప్రనూష అదిరిపడింది. ఏదో అనబోయి మళ్ళీ వూరుకుంది.
అజ్మరాలీ ఇంకా దిగ్భ్రాంతినుంచి తేరుకోలేదు.
చైతన్య అన్నాడు, "నిన్ను చంపటం ప్రనూషకి ఇష్టం లేదు. నువ్వు ఆమె తల్లిదండ్రుల్ని చంపినా, ఆమెని బలవంతం చేయబోయినా, ఆమెకి ఇప్పుడు నీమీద కోపంలేదు. మాతోవుంటే మాతోపాటూ మరణించాలి. అందుకే పంపించేస్తున్నాను" అంటూ అతన్ని లేపి నిలబెట్టాడు.
అజ్మరాలీ బాధగా మూలిగాడు.
అతన్ని ప్రనూష భుజాలమీదకి ఆసరాగా చేర్చాడు చైతన్య. "జాగ్రత్తగా వంతెన దగ్గరికి తీసుకురా ఇతన్ని" అని ప్రనూషతోచెప్పి తను రైఫిల్ తీసుకుని వంతెన దగ్గరగా వెళ్ళి ఒక రాతిపక్కన నిలబడ్డాడు.
ఇస్మాయిల్ మిగతా వాళ్ళని తీసుకుని కొండలవైపు వెళ్ళిపోయాడు.
అవతలిపక్క టాంకు మరోసారి పొజిషన్ చూసుకుంటూంది.
ప్రనూష భుజాలమీద చేయివేసి భారంగా నడుచుకుంటూ దగ్గరకి వచ్చాడు అజ్మరాలీ.
అవతలివైపున్న కమాండర్ బైనాక్యులర్స్ లో అజ్మరాలీని, ప్రనూషనీ చూశాడు.
ప్రనూష మీద రైఫిల్ పేల్చమని తన సైనికులకి ఆజ్ఞ ఇవ్వబోయాడు.
అంతలో రాతిపక్కనున్న చైతన్య స్వరం గట్టిగా వినపడింది.
"మీ చీఫ్ ని వదిలి పెడుతున్నాం. అతను మీ వైపుకి వస్తున్నాడు. మీరు ఆమెకి అపాయం తలపెడితే, మీ చీఫ్ ని ఇక్కణ్ణుంచి నేను గురిచూసి చంపేయవలసి వుంటుంది."
ఆజ్ఞ ఇవ్వబోయిన కమాండర్ ఆగిపోయాడు. అతడికి చైతన్య చర్య అర్ధంకాలేదు.
కావాలనుకుంటే ఆ కమాండర్ అజ్మరాలీని ప్రనూషనీ కూడా కాల్చవచ్చు. కానీ ఎంత కాదనుకున్నా అజ్మరాలీ తన చీఫ్. అందుకని ఆగిపోయాడు. అదీగాక అజ్మరాలీ వంతెన దాటి వచ్చే వరకూ ఆగటంలో ప్రమాదం ఏమీ కనబడలేదు. ఆ తర్వాత ఎలాగూ వాళ్ళు తమ చేతికి దొరక్క తప్పదు.
టాంకుని పేల్చటంకూడా ఆపమని తన సైనికులకు సైగచేశాడు.
ప్రనూష అజ్మరాలీని వంతెన వరకూ తీసుకెళ్ళి వదిలి, పక్కనే రాతి వెనుకగా నిలబడివున్న చైతన్య దగ్గరకి వచ్చింది.
వంతెనకున్న తాళ్ళు పట్టుకుని ఒంటికాలితో నెమ్మదిగా దేకసాగాడు అజ్మరాలీ. రెండు అడుగులు వేసి కూలిపోయాడు. అవతల్నుంచి సైనికులు ఎవరూ అతనికి సాయం చేయటానికి రాలేదు.
తన చేతిలో రైఫిల్ ప్రనూషకిచ్చి చైతన్య అతనివద్దకు పరుగెత్తుకు వెళ్ళాడు. అతన్ని సరిగ్గా నిలబెట్టి, మరో మూడు అడుగులు వేసేవరకూ వుండి వెనక్కి రాబోయాడు.
అజ్మరాలీ వెనక్కి తిరిగి చూశాడు.
ఇద్దరికళ్ళూ కలుసుకున్నాయ్!
అజ్మరాలీ మొహంలో ఏదో చెప్పలేని భావం. తలతిప్పి, తిరిగి నడక కొనసాగించాడు.
చైతన్య వెనక్కి పరుగెత్తుకు వచ్చేశాడు. అంతవరకూ అతని మీద కాల్పులు లేకుండా ప్రనూష కాపలా కాసింది.
"ఎందుకు అతని గురించి అంత జాగ్రత్త తీసుకుంటున్నారు? అవసరమైన దానికంటే ఎక్కువ?" అడిగింది అతను తనని చేరుకోగానే.
"టైం లేదు. చెప్తా పద....." అంటూ వేగంగా ఆమెతో కలిసి దాదాపు అరకిలోమీటరు పరుగెత్తాడు. అతడు ఏం చేయబోతున్నాడో ఆమె ఊహించలేదు.
"అతని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళానంటే..." గుట్ట వెనక్కి చేరుకుంటూ అన్నాడు చైతన్య. ".... వంతెనమీద 'లాండ్ మైన్' ఒకటి వదిలి వచ్చాను" ఇద్దరూ ఆయాసంతో రొప్పుతున్నారు.
అంత ఉద్వేగ భరితమైన స్థితిలో కూడా ఆశ్చర్యంతో విస్తుబోయింది. ఆమెకి మొత్తం విషయమంతా ఒక్కొక్కటే వరుసగా అర్ధమయింది. అజ్మరాలీకి తాము ప్రధమ చికిత్స చేస్తున్నప్పుడు అతడు తిరిగి ఆ "ప్రమాదకరమైన" స్థలానికి ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు తెలిసింది. తనతోపాటు రహస్యంగా ఒక లాండ్ మైన్ ని తవ్వి తీసుకొచ్చాడన్నమాట!
దాన్ని వంతెన మధ్యలో వదిలి రావటం కోసం అజ్మరాలీకి సాయం చేసే నెపంమీద వెళ్ళాడు! ఎంత అద్భుతమైన ఆలోచన!
ఆమె అతనివైపు అభినందిస్తున్నట్టు చూసింది.
"అజ్మరాలీని వదిలి పెట్టడానికి కారణం యిదా?" అడిగింది.
"ఇదొక్కటే కాదు. అతన్ని చంపటం నీ కిష్టం లేదన్నావు. ఇక అతను మనతో వుండి లాభం ఏమిటనిపించింది. రెండూ కలిసొస్తాయి కదా అని అతన్ని వదిలిపెట్టి వచ్చాను. అతను మనతో వుంటే, ఆ ఒంటికాలుతో అతడిని మనతో ఎలాగూ తీసుకువెళ్ళలేం. అతడిని వదిలేసి మనం వెళ్ళిపోతే, ఈ టాంకుల తాకిడికి అజ్మరాలీ మరణించక తప్పదు" అతడి మాటలు పూర్తికాకుండానే టాంకుల నుంచి పేలుడు వినిపించింది.
తమ మనిషైన అజ్మరాలీ వంతెనకి అటువైపుకి చేరుకోగానే వాళ్ళు టాంకుల దాడి ప్రారంభించారు. అయితే చైతన్య, ప్రనూష సురక్షితమైన ప్రాంతంలో దూరంగా వుండబట్టి దాని ప్రభావం వాళ్ళమీద పడలేదు.
పది నిమిషాలపాటు టాంకులు ఆ ప్రదేశాన్నంతా విధ్వంసంతో నింపేశాయి. గడ్డిపోచని కూడా వదల్లేదు. పశ్చిమాన సూర్యుడు కృంగిపోతున్నాడు. నెమ్మదిగా చీకట్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నాయి. అజ్మరాలీకి అంబులెన్స్ లో చికిత్స జరుగుతోంది.
అవతలిపక్క టాంకుల శబ్దం ఆగిపోయింది. చీఫ్ సూచనలు యిచ్చినట్టున్నాడు. సైనికులు వంతెన మీదకి వచ్చారు. చైతన్య దూరంనుంచి ప్రేక్షకుడిలా వారిని గమనిస్తున్నాడు. ప్రనూష గుండె వేగంగా కొట్టుకుంటూంది. సైనికుల్లో ఎవరన్నా వంతెనని పరీక్షించుకుంటూ నడిచివస్తే ప్రమాదం. అయితే అటువంటి దేమీ అవలేదు.
సైనికులు వంతెనని బాగుచేయటం లీలగా కనిపిస్తూంది.
"లే, మళ్ళీ మనం వంతెన దగ్గరికి వెళ్ళాలి" ఆయత్తమౌతూ అన్నాడు. ఆమె విస్మయంగా "ఎందుకు?" అని అడిగింది.