"మరి నువ్వు?" అని అడగలేదు ఇస్మాయిల్. కమెండో ఆపరేషన్ లో అటువంటి ఎదురు ప్రశ్నలకు తావుండదు. అజ్మరాలీని నడిపించుకుంటూ బ్రిడ్జి అవతలికి చేరుకున్నారు. శత్రువుల వాహనాలు దాదాపు అరకిలోమీటరు దగ్గరకు వచ్చాయి. వాహనాల్లో సైనికులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నారు.
క్రింద నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తూంది. పైన చెక్కబ్రిడ్జి అటూ ఇటూ వూగుతున్నా, బలంగా స్థిరంగా వుంది.
పిస్టల్ చేతిలో పట్టుకుని, అజ్మరాలీని ముందు నడిపిస్తూన్న ప్రనూషకి చైతన్య తమని ఎందుకు బ్రిడ్జి దాటి వెళ్ళమన్నాడో అర్ధంకాలేదు. కనీసం అటువైపే వుండి అడవిలో తలోదిక్కుకీ పారిపోతే కనీసం కొందరికయినా ప్రాణాలు దక్కేవేమో! ఇప్పుడు ఇటు రాళ్ళ మైదానంలోకి రావటం ద్వారా, తమని వెతికి వేటాడటానికి వాళ్ళకి రెండు నిముషాలు చాలు.
వ్యాను స్టార్ట్ అయిన చప్పుడు విని ఆమె చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. చైతన్య వ్యాను ఎక్కి బ్రిడ్జివైపు వస్తున్నాడు. అతడేం చేయబోతున్నాడో ఆమెకి ఒక్కక్షణం అర్ధంకాలేదు. మిగతావాళ్ళు కూడా అర్ధంకానట్టు అటువైపే చూడసాగారు. వెనుక వస్తున్న శత్రువుల వాహనాలు ఆ స్థలానికి చేరుకోవటానికి ఇంకొక్క నిమిషంకన్నా ఎక్కువ లేదు. రంగనాయకి మొహంలో కొడుకు గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తూంది. అజ్మరాలీకి కూడా చైతన్య ప్లాన్ అర్ధంకాలేదు.
చైతన్య మెరుపు వేగంతో క్రిందికి దిగాడు.
వ్యాను ముందుభాగం వంతెన కొసకి ఆనుకుని వుంది. ఇక ముందుకి రావటానికి వీల్లేకుండా వంతెనకి అటూ ఇటూ వున్న కర్రలు అడ్డుగా వున్నాయి.
చైతన్య వ్యాన్ తలుపు పట్టుకుని పైనుంచి ముందుకి ఎక్కి బోయెనెట్ తెరిచాడు. డీసిల్ కనెక్షన్ తీసేశాడు.
ప్రనూషకి అతడేం చేయదల్చుకున్నాడో అప్పుడు అర్ధమైంది. ఉద్విగ్నతవల్ల అరచేతులు చెమట్లు పడుతున్నాయి. వెనుక నుంచి వస్తూన్న వాహనాలు దగ్గరగా వచ్చి ఆగాయి. బ్రిడ్జికి అడ్డుగా వున్న వ్యానుని చూసి, దాన్ని అడ్డుగా అక్కడ పెట్టి అవతలివైపుకి పారిపోయారేమో అనుకున్నారు.
వ్యాను బోయెనెట్ దగ్గర వున్న చైతన్య వాళ్ళకి కనపడలేదు. వ్యాను అడ్డు తొలగించమని 'చీఫ్' ఉత్తర్వు యిచ్చినట్టున్నాడు. పదిమంది సైనికులు బిలబిలమని దిగి, వంతెనవైపు రాసాగారు.
ప్రనూషకి టెన్షన్ తో స్పృహ తప్పుతుందేమో అనిపించేలా వుంది. వ్యాను ముందుభాగంలో చైతన్య క్రిందికి వంగి లైటర్ వెలిగించాడు.
సైనికులు పది గజాల దూరంలో వుండగానే వ్యాను ముందుభాగం భగ్గున అంటుకుంది. డీసిల్ క్రిందికి కారటంతో వంతెన కూడా అంటుకుని మండసాగింది.
ఈ హఠాత్పరిణామానికి సైనికులు బిత్తరపోయారు. మంటలు ఉవ్వెత్తున లేచేసరికి వాళ్ళకి ఒక్కక్షణం ఏం చేయాలో అర్ధంకాలేదు. అప్పుడు పరుగెత్తాడు చైతన్య.... మొత్తం బలం అంతా కాళ్ళలోకి తీసుకుని.... కొన్ని నెలలపాటు అభ్యసించిన దాన్ని అమలులో పెట్టి మెరుపుకన్నా వేగంగా ఆ బ్రిడ్జి మీదనుంచి అవతలివైపుకి పరుగెత్తాడు.
వ్యాను దగ్గర్నుంచి పరుగెత్తుకు వెళ్ళిపోతున్న చైతన్యని చూడగానే 'చీఫ్' కి జరిగినది అర్ధమై "ఫైర్" అని అరిచాడు.
సైనికులు రైఫిల్స్ పొజిషన్ లోకి తీసుకుని కాల్పులు సాగించారు. అప్పటికే చైతన్య వంతెన మీద వందగజాల దూరం పరుగెత్తాడు. వెనుకనుంచి బుల్లెట్ల వర్షం కురవసాగింది. చైతన్య వంతెనకి అవతలి పక్కకి చేరుకుని, అదే వేగంతో ఒక బండ పక్కకి వెళ్ళిపోయాడు.
అప్పటివరకూ ఉద్వేగంతో చూస్తున్న వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు.
అవతలిపక్క సైనికులు కాల్పులు ఆపుచేశారు.
వంతెనకి ఇటువైపు వాళ్ళు, అటువైపు చైతన్యా, మిగతా బృందం.... మధ్యలో కాలుతున్న వ్యాను.... అందరూ ప్రేక్షకుల్లా చూడసాగారు.
ప్రనూషకి సంతోషంగా వుంది. మధ్యలో బ్రిడ్జి కూలిపోతే ఇక సైనికులు ఇటు రాలేరు. నడి దాటటం పడవలమీద దాదాపు అసంభవం. ఎంత లేదన్నా తమకి ఇరవై నాలుగు గంటల టైమ్ దొరుకుతుంది. హెలికాఫ్టర్ తో వెంటాడే రిస్క్ కూడా వాళ్ళు తీసుకోరు!
ఆమె అప్రయత్నంగా చైతన్య చెయ్యి పట్టుకుని అభినందిస్తున్నట్టు నొక్కింది. అయితే దురదృష్టం వాళ్ళని వెంటాడుతోంది.
డీసిల్ తో అంటుకున్న బ్రిడ్జి, పూర్తిగా తగలబడకముందే వ్యాన్ అడుగుభాగంలో వున్న చెక్కలు, బరువుకి క్రిందికి కృంగిపోయాయి. దాంతో వ్యాన్ మరింత క్రిందికి జారింది. డీసిల్ డైరెక్ట్ గా చెక్కలమీద పడటంతో అవి మరింత ఉజ్వలంగా మంది, ఫట్ ఫట్ మంటూ విరిగిపోయాయి. వంతెనకి చెరోవైపునవున్న 'రెయిలింగ్' అలాగే వుండగా అడుగుభాగం మాత్రం కాలిపోవటంతో, వ్యాన్ .... మండుతున్న గోళంలా నీళ్ళలోకి జారిపోయింది. న్యూస్ పేపరులో ఎర్రటి నిప్పుకణం పెడితే అది రంధ్రం చేసుకుని ఎలా క్రిందికి జారిపోతుందో, అలా వ్యాన్ క్రిందికి వెళ్ళిపోయింది.
చైతన్య నిర్విణ్ణుడయ్యాడు. ప్రనూష కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అవతల పక్కనుంచి సైనికులు హర్షాతిరేకంతో చేస్తున్న అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి.
నీటిలో పడిన వ్యాన్ కొద్దిదూరం దొర్లుకుపోయింది! దాన్ని బట్టే నీటివేగం తెలుస్తోంది. వ్యాన్ తోపాటే వంతెన తాలూకు చెక్కలు కొన్ని మండిపోతూ నీళ్ళలో పడ్డాయి.
దాదాపు పది అడుగుల ఖాళీ ఏర్పడింది. జీపులు రాలేకపోయినా, పక్కనున్న కర్రలు పట్టుకుని ఒకరి తరువాత ఒకరు వంతెన దాటవచ్చు. వాళ్ళ కమాండర్ అదే ఆజ్ఞ ఇచ్చినట్టున్నాడు. సైనికుల్లో నలుగురు వంతెన దగ్గరగా వచ్చారు.
వంతెనకి చెరోవైపున వున్న కర్రల అంచులు పట్టుకుని, కూలిపోయిన కర్రల పక్కనుంచి జాగ్రత్తగా నడుస్తూ ముందుకు రాసాగారు.
అవతలి పక్కనుంచి ఈ చర్యని చూస్తూన్న చైతన్య "మన దగ్గర ఎన్ని రైఫిల్స్ వున్నాయి?" అని అడిగాడు.
"నాలుగు. బుల్లెట్స్ వందదాకా వుండవచ్చు. ఒక పిస్టల్, ఒక రివాల్వర్ వున్నాయి" ఇస్మాయిల్ సమాధానం ఇచ్చాడు.
ఆర్మీ క్యాంప్ నుంచి వ్యాన్ లో తీసుకొచ్చినవి అవి. వీళ్ళలా మాట్లాడుకుంటూ వుండగా సైనికులు మరింత ముందుకొచ్చారు. రాత్రిపూట ఇంటిలో ప్రవేసించి దొంగల్లా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నారు.
అప్పుడు పేల్చాడు చైతన్య. ఒకే ఒక బుల్లెట్.
అందరికన్నా ముందు నడుస్తూన్న సైనికుడు ఆర్తనాదం కూడా చెయ్యలేదు. బుల్లెట్ తగలగానే అతడు నీళ్ళలోకి జారిపోయాడు. ప్రవాహం ఎంత వేగంగా వుందంటే, నీళ్ళు కనీసం ఎర్రగా మారకముందే అతడి శరీరం కొట్టుకుపోయింది.
మిగతా సైనికులు మిడతల్లా వెనక్కి పరుగెత్తారు. వంతెన వుంటుందా, కూలిపోతుందా అనికూడా చూసుకోకుండా అవతలివైపుకి గెంతారు. రైఫిల్ శబ్దానికి ఒడ్డున వున్న మిగతా సైనికులుకూడా క్షణంలో చెట్లచాటుకి అదృశ్యమయ్యారు. రెప్పపాటు కాలంలో అక్కడంతా నిర్మానుష్యమై పోయింది.
వెనక్కి పరిగెడుతున్న సైనికుల్ని చైతన్య కాల్చలేదు. కావాలనుకుంటే కాల్చవచ్చు కానీ కాల్చలేదు. మనుషుల్ని చంపటం అతని అభిమతం కాదు.
వంతెనకి అటువైపునున్న కమాండర్ నిశ్చేష్టుడయ్యాడు. అవతలివాళ్ళ దగ్గర తుపాకులున్నవని అతడికి తెలుసు. కానీ ఆ తొందరలో మర్చిపోయాడు ఫలితంగా ఒక సైనికుడిని కోల్పోయాడు. పై అధికారులు దీన్ని క్షమించరు.
ఒక్క తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినట్టు అక్కడ ప్రశాంతత ఏర్పడింది. ఇది చాలా కొద్దిసేపే అని చైతన్యకి తెలుసు. అతడు వెనక్కి చూశాడు. దూరంగా కొండలు....
అంతలో మైక్ లోంచి అవతలిపక్క కమాండర్ మాటలు వినిపించాయి. "చైతన్యా! మీకు అయిదు నిముషాలు టైము ఇస్తున్నాను. లొంగిపోకపోతే ప్రాణాలతో మిగలరు."
చైతన్య వారికి సమాధానం చెప్పలేదు. ఇస్మాయిల్ వైపు 'ఏం చేద్దాం' అన్నట్టు చూశాడు.
"వాళ్ళు ఇప్పట్లో బ్రిడ్జి మీదకు వచ్చే సాహసం చెయ్యరు" అన్నాడు ఇస్మాయిల్.
"కానీ ఈపాటికే వైర్ లెస్ లో వాళ్ళు తమ క్యాంప్ కి ఇక్కడి పరిస్థితి చెప్పి వుంటారు. అక్కడనుంచి టాంకులు బయలుదేరి వుంటాయి. రెండు మూడు గంటల్లో అవి ఇక్కడకు చేరుకుంటాయి. ఒక్కసారి టాంకులు ఇక్కడకు వస్తే ఇక మనం ఈ స్థలం ఖాళీచేసి వెనక్కి తగ్గాల్సి వుంటుంది. వెంటనే వాళ్ళు బ్రిడ్జిదాటి ఇటు వచ్చేస్తారు."
"బ్రిడ్జి రిపేరు చేసుకుని వాళ్ళు రావటానికి రెండు మూడు గంటలు పడుతుంది కాబట్టి మనం ఇప్పుడే వెనక్కి బయలుదేరటం ప్రారంభిస్తే."
"ఈ బ్రిడ్జిని మనం గార్డుచేయటం మానేసేమని వాళ్ళకు తెలిస్తే వెంటనే ఇటువైపు వచ్చేస్తారు. ఈ వృద్ధులతో కలిసి మనం పర్వతాలు దాటి వెళ్ళేలోపులో పట్టుకుంటారు."
"వాళ్ళు పట్టుకోవటం సంగతి అలా వుంచు. మీ అమ్మానాన్నగార్లతో పర్వతాలు దాటివెళ్ళటం అసలు సాధ్యమయ్యే పనేనా?"
ఆ ప్రశ్నకి చైతన్య వద్ద సమాధానం లేదు. వ్యాన్ పట్టేంత వెడల్పుతో బ్రిడ్జి లేదని తెలియగానే అతనికి తన ఆపరేషన్ ఫెయిల్ అయిందన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు శత్రువుల సంచలనం చూస్తూంటే, తనతోపాటు తన వాళ్ళనీ, ప్రనూషనీ కూడా ప్రమాదంలోకి తోశానన్న భావం కృంగదీస్తోంది.
ఇస్మాయిల్ చైతన్య మొహంలో కదులుతూన్న భావాల్ని గమనించి, అతని మూడ్ మార్చటానికి మరో ప్రశ్న అడిగాడు. "వాళ్ళు ఇంకో బ్రిడ్జి మీదుగా ఇటువైపు రావటానికి వీలున్నదా?"
"ఈ నదిమీద మరో యాభై కిలోమీటర్ల వరకూ వంతెనలేదు. ఒకవేళ అట్నుంచి దాటినా, మన దగ్గరికి వచ్చే దారి వాహనాలకి వీలుగా లేదు."
ఇస్మాయిల్ వంతెనకి అటువైపు నున్న సైనికులవైపు చూస్తూ, "ఆ కమాండర్ 'టాంకుల' కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటాను" అన్నాడు.
చైతన్య మాట్లాడలేదు.
ఇస్మాయిలే అడిగాడు. "టాంకులకన్నా హెలికాఫ్టర్లయితే వాళ్ళపని సులభం అయ్యేదనుకుంటాను."
"వాళ్ళు ఇప్పటికే చాలా చిన్న వ్యవహారాన్ని పెద్దది చేశారు. అజ్మరాలీవల్ల ఆర్మీ క్యాంప్ కి బాగా నష్టం జరిగింది. అందుకే అజ్మరాలీ మనకి బందీగా వున్నాడని తెలిసి కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. అతని ప్రాణాలు పోయినా ఫర్వాలేదని పైనుంచి ఇన్ స్ట్రక్షన్స్ వచ్చి వుంటాయి. ఇప్పుడీ కమాండరు ఎలాగయినా మనల్ని బంధించాలనిగానీ, చంపాలనిగానీ దృఢ నిశ్చయంతో వున్నాడు. మనం ఎటూ తప్పించుకోలేమని అతడికి తెలుసు. ఆ ఖ్యాతి అంతా తనే సంపాదించాలని అతను అనుకుంటున్నాడు. అందుకే హెలికాఫ్టర్ల సాయం అడగకుండా టాంకులతో పని జరపాలనుకుంటున్నాడు."
ఇస్మాయిల్ తో మాట్లాడుతున్నాడన్న మాటేగానీ, చైతన్య ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. తాము ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయామనేది అతడికి అర్ధమవుతోంది. వంతెనని వదిలేసి వెళ్ళిపోతే, దాన్ని బాగుచేసుకుని వచ్చి వేటాడతారు. తమలో ఎవరన్నా కొండలకి అవతలి పక్కకు కాలినడకన వెళ్ళి, భారతసైన్యానికి తమ విషయం చెప్పి అక్కడ్నుంచి తమకు రవాణా సౌకర్యం ఏర్పరచాలి! దానికి కనీసం నాలుగురోజులు పడుతుంది. అంతవరకూ ఈ వంతెనని రైఫిల్స్ సహాయంతో రక్షించుకోవటం కష్టం!
"అరె- అటుచూడు" ఇస్మాయిల్ అన్న మాటలకి చైతన్య ఆలోచనలనుంచి తేరుకుని అటు చూశాడు. ఒక్కక్షణం అర్ధం కాలేదు. ఇస్మాయిల్ మొహంలో కలవరం స్పష్టంగా కనిపిస్తూంది. దూరంగా వున్న లక్ష్మి, అజ్మరాలీకి పిస్టల్ గురిపెట్టి నిలబడివున్న ప్రనూషా, అందరూ ఆందోళనగా వంతెనవైపు చూశారు.