అతడికి చెమటలు ముంచెత్తడం మొదలుపెట్టాయి.
ఆ మంట వచ్చి విసురుగా లారీ ముందుభాగాన్ని తాకింది.
ఒక పెద్ద బాంబు విస్పోటనంలా శబ్దం. పెట్రోల్ టాంక్ పేలిపోయింది. లారీని మంటలు చుట్టుముట్టాయి.
హాహాకారాలు చేస్తూ జనాలు దూరంగా పారిపోవడం మొదలుపెట్టారు. వాహనాలు రివర్స్ అయి వెనక్కి పోవడం మొదలుపెట్టాయి.
తగలబడిపోతున్న డానీ లారీ కాబిన్ లోంచి క్రిందికి దూకి రోడ్డు మీద పరుగెత్తసాగాడు.
ఆ దృశ్యం అత్యంత భీతావహంలా వుంది.
అప్పుడతడు పెడుతున్న కేకలకు ప్రకృతి సైతం ఉలిక్కిపడేలా వుంది. జనాలు పిట్టల్లా వణకిపోసాగారు.
డానీకి ఇక పరిగెత్తడం చేతకాలేదు. క్రిందపడి దొర్లసాగాడు.
సరిగ్గా కౌస్తుభ కాళ్ల దగ్గర.....
ప్రక్కనే ఇళ్లు కట్టటానికి పోసిన ఇసుక కుప్ప కనిపించింది కౌస్తుభకు.
దోసిళ్లతో గబగబా ఇసుక చిమ్మసాగింది అతడిమీద. ఆమెను చూసి మిగతావాళ్ళు కూడా అదే పని చేయసాగారు.
క్షణాలలో అతడిమీద ఇసుక కుప్పగా పడి మంటలార్పేశాయి.
అప్పటికే డెభ్బైశాతం ఒళ్లుకాలి స్పృహ తప్పిపోతున్న డానీకి కౌస్తుభ మాటలు వినిపించాయి.
"ఇతడిని అర్జంటుగా హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి. అంబులెన్స్ కి ఫోన్ చేసి, అది వచ్చి తీసికెళ్ళేంత టైమ్ లేదు. కారున్నవాళ్లు ఎవరయినా దయతో ముందుకు రావాలని అర్దిస్తున్నాను."
* * * *
డానీ ఫోన్ కోసం చూస్తున్న దిగంబరరావు అసహనంగా గదిలో పచార్లు సాగిస్తున్నాడు.
డానీ నుండి ఫోన్ ఆలస్యమవుతున్నకొద్దీ అంతకంటే అసహనంతో సోఫాలో కదలసాగింది వినోదిని.
గంట తరువాత డానీ సహచరుడి నుండి ఫోన్ వచ్చింది.
డానీ లారీతోసహా తగలబడిపోయాడనీ, హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నాడనీ.
మరునాడు పత్రికల్లో నడిరోడ్డుమీద లారీ తగలబడిపోయిన ఉదంతం వచ్చింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందు పెద్ద బాంబు ప్రేలినట్లుగా పెద్ద శబ్దమయిందనీ, ఏమిటని చూస్తే, లారీ తగలబడిపోతూ కనిపించిందనీ, వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారనీ వార్త ప్రచురింప బడింది.
* * * *
ఇంట్లో ఏదయినా శుభకార్యం జరుగుతుంటే తమ స్వగ్రామంలో వున్న తమ ఇంటి ఇలవేలుపు కోదండరాముడికి పూజలు చేయించి బ్రాహ్మడికి సాహిత్యం ఇచ్చాకే పనులు మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం యోగానందం ఇంట్లో.
అనసూయ ఓ మంచి రోజు చూసుకుని పూజాద్రవ్యాలు, బ్రాహ్మడికి ఇవ్వాల్సిన సాహిత్యం సిద్దం చేసుకుని బయలుదేరింది.
ఆమెతోపాటు కౌస్తుభ, రవి, "మీరెళ్లిపోతే నాకిక్కడేం తోచదంటూ సిరీ వచ్చారు.
ఏ పని మీదైనా వెడుతుంటే ముగ్గురూ బయలుదేరకూడదు. నాలుగో మనిషి వుంటే మంచిదేలే అని అనసూయ అభ్యంతరం చెప్పలేదు.
తెల్లవారుఝామునే బయలుదేరి ఎనిమిదింటికల్లా అక్కడికి చేరుకున్నారు.
పెద్ద గాలిగోపురం, చుట్టూ సత్రాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, పూజకోసం అత్యంత శ్రద్దగా పెంచబడిన తోటలో క్రింద రాలిపడిన పారిజాతాలు, పున్నాగలు, పొగడలు, దేవగన్నేరులు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
"ఓహ్.... .ఎంత బాగుందిక్కడ? ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం, ఇంత చక్కని తోట వుందని మాకు చెప్పలేదేం అత్తా....?" అంది కౌస్తుభ తోట అందానికి పరవశించిపోతూ.
"ఇది సంస్థానాధీశులు కట్టించిన గుడి. ఈ గుడికి ఎన్నో మడులూ, మాన్యాలూ రాసిచ్చారు. శంకరమ్మ దొరసాని అనే ఆమె వుండేది. ఆమె పరమ భక్తురాలు. ఆమె ఈ ఆలయం అభివృద్దికోసం చాలా ఖర్చుపెట్టింది. స్వామి పూజకోసం ఈ తోట ఆమె వేయించింది. మా చిన్నప్పుడు ఇంకా చాలా చెట్లుండేవి. ఇప్పుడన్ని చెట్లులేవు.
ఇంకా పూర్వ చరిత్రకి వెళితే ఈ ఆలయం వున్నచోట చిన్న గుడి మాత్రమే వుండేదట. ఆ గుడి శిధిలావస్థకి చేరితే, దాని స్థానంలో ఈ పెద్ద దేవాలయం సంస్థానాధీశులు కట్టించినట్లు ఊరివాళ్లు చెబుతారు."
అత్తాకోడలు మాటల్లో వుండగానే సిరి రవిని లాక్కుని ఎక్కడికో తీసుకుపోవడం కనిపించింది.
"దానికి తెలివిలేదు. వట్టి అడవిమేళం! వయసొచ్చిన పిల్లాడిని పట్టుకుని ఆ పరుగులేమిటి?"అని విసుక్కుంది అనసూయ.
వాళ్లకి కొన్ని గజాల దూరంలో ఒక పెద్ద రావిచెట్టుంది. ఆ చెట్టు చిటారుకొమ్మల్లో పెద్ద పెద్ద తేనెపట్లు వేలాడుతున్నాయి.
సిరి వాటికేసి చూపిస్తూ "చెట్లెక్కి తేనెపట్టు తెచ్చుకుందామా?" అని అడిగింది రవిని.
"నీ మొహం. వాటి జోలికెళితే తేనెటీగలు వెంటపడి కుట్టి కుట్టి చంపుతాయి. మా క్లాసు పిల్లాడొకడు సెలవుల్లో వాళ్ల వూరికి వెళ్లినప్పుడు పొలంలో చెట్టుకి వేలాడుతున్న తేనెపట్టుకి రాయి విసిరాడట. ఇంకేముంది? తేనెటీగలు గుంపుగా లేచి వెంటపడి కుట్టడం మొదలుపెట్టాయి. వాటి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు వాడికి. బాధ భరించలేక బావిలో పడ్డాడుట. అప్పుడు తేనెటీగలు వాడిని విడిచిపెట్టిపోయినా, వాటి ముళ్ళు ఒంట్లో ఇరుక్కుని సెప్టిక్ అయి హాస్పిటల్ లో కన్నుమూశాడు. నేను వెళ్లి హాస్పిటల్ లో వాడిని చూసొచ్చాను తెలుసా?"
"ఈ కథలన్నీ నాకు చెప్పకు చిన్నదొరా!నేను చెట్టెక్కి తేనెపట్టు తీసుకువస్తాను. తేనెటీగలు ఏం చేస్తాయో చూద్దాం."
చెట్టెక్కబోతున్న సిరిని గాబరాగా చేయి పట్టి లాగాడు రవి.
"చూడడానికేమీ వుండదు. శత్రుసైనికుల్లా అవి నీమీద దాడిచేస్తాయి. వాటి ముళ్లు నాటుకుని ఒళ్ళంతా వాచిపోతుంది. చచ్చిపోతావు."
"అవి ఏం చేయవు చిన్నదొరా! మేం కొండల్లో తిరిగి తేనెపట్టు పట్టేవాళ్ళం. తేనె లేనిదే మాకు పొద్దు గడవదు. చూడు నిముషంలో తేనెపట్టు వున్న కొమ్మ్ని చేరుకుంది సిరి. కోతిపిల్ల కొమ్మనుండి కొమ్మకు దూకుతూ పోతున్నట్టుగా వుందా దృశ్యం.
సిరి చెయ్యి పడగానే తేనెటీగలు లేచి వెంటపడతాయనే భయంతో పరుగెత్తి తల్లి, కౌస్తుభ వున్న చోటికి చేరుకున్నాడు రవి.
"దెయ్యం! తేనెటీగలు కుడతాయని చెప్పినా వినకుండా తేనెపట్టు కోసం చెట్టెక్కింది అది. తేనె జుర్రేలోగా ఆ ఈగలు దాన్ని జుర్రుతాయి" పరుగెత్తుకుంటూ రావడంవల్ల వగర్చుతూ అన్నాడు.
"అది చెంచిత! తేనెపట్టు తీయటం వాళ్లకి ఉగ్గుపాలతో పెట్టిన విద్య" అంది అనసూయ.
"ఎంత చెంచిత అయితేమాత్రం తేనెటీగలకి ముద్దా? చూడు అవి కుట్టి కుట్టి లబలబలాడుకుంటూ క్రిందికి రాకపోతే.... !తేనే జుర్రుతుందట తేనే......" సిరి తన మాట వినలేదన్న కోపం అతడి మాటల్లో వ్యక్తమౌతుంటే ఆశ్చర్యంగా చూసింది కౌస్తుభ.
మొదట్లో సిరిని చూసి సిగ్గుపడేవాడు రవి. ఈ రోజు సిరితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు.
సిర తన మాట వినలేదని కోపం తెచ్చుకుంటున్నాడు. సిరిని తేనెటీగలు కుడతాయని బాధపడుతున్నాడు.
"ఇది వెళ్లి చెట్టెక్కి కూర్చుందే. గుళ్లో ఆరాదన టైం అవుతోంది. పన్నెండు గంటలకి స్వామివారికి నైవేద్యం పెట్టి పెద్ద మంగళ హారతి యిస్తారు. తరువాత భక్తులకి ప్రసాదం పంచుతారు."
"పులిహోర పెడతారా? గుడిలో పులిహోర చాలా రుచిగా వుంటుందని చెబుతుంటారు మామయ్య?"
"పులిహోరనో, చక్కరపొంగలో, రద్దోజనమో ఏదో ఒకటి పెడతారు."
"తను వస్తుందిగానీ మనం వెడదాం పద అత్తా!"
రెండడుగులు వేశారో లేదో తేనెపట్టు చేత్తో పట్టుకుని రానేవచ్చింది సిరి. ఒక్క తేనెటీగ కూడా ఆమె వెంటపడలేదు.
"దోసిలి పట్టండి - తేనె పిండుతాను. తేనె నిండావుంది. రెండురోజులయితే అంతా తాగేసి వెళ్లేవి!"
ఆమె చేతుల్లో వున్న పట్టులోంచి తేనె బొట్లు బొట్లుగా కారుతోంది. అప్పటికే ఆమె తేనె నాకేసినట్లుగా వుంది. ఆమ మూతినిండా తేనె.
ఆమె చెట్టెక్కుతుంటే గాబరాపడిన రవికి తేనె చూడగానే నోరూరింది. అక్కడ వున్న బాదం చెట్టు ఆకులు తలా ఒకటి కోసిచ్చి తనొక ఆకు దోనెలా మడిచి పట్టుకున్నాడు. సిరి అతడి దోనెనిండా తేనె పిండింది. కౌస్తుభకి, అనసూయకి కూడా తేనె పిండింది.
తేనెపట్టు గళ్లు గళ్ళుగా వుంది. ఆ గళ్లల్లో తెల్లగా పురుగు లున్నాయి. తేనే పిండడం అయిపోయాక తేనెపట్టు తినడం మొదలుపెట్టింది సిరి.
"ఛీ! అందులో పురుగులున్నాయి. ఎలా తింటున్నావే అసహ్యంగా?"
"పాలమీదున్నాయి పురుగులు. తింటే రుచేకాదు బలం కూడా."
సిరి తేనెపట్టు పీక్కుతింటుంటే ఒకరోజు దొడ్లో కోడి గొంతు కొరికి మూతినిండా రక్తంతో కనిపించడం గుర్తువచ్చి ఒంటినిండా రోమాలు నిక్క బొడుకున్నట్లుగా అయ్యాయి అనసూయకు. "ఇది మనిషి పిల్లా? దెయ్యం పిల్లా?" అనుకుంది.
"అబ్బ! ఇంత అసహ్యంగా ఎలా తింటున్నావ్ ఆ పురుగుల తెట్టెను? చూడడానికి నాజూకుగా వున్నావు. తింటమేమో పరమ మోటుతిండి" రవి కూడా అన్నాడు.