"కొండ జాతివాళ్లం చినసామీ. మాకు మీలాగా కూరలు పప్పులు దొరకవు. అడవిలో దొరికేవే మా ఆహారం. తేనె, దుంపలు, మాంసం....... అయినా మాకున్న బలం మీకుంటుందా?"
"ఏం? నువ్వు నాకంటే బలవంతురాలివా?"
"ఆ బలవంతురాల్నే. చూస్తావా?" ధీమాగా అంటూ చెయ్యి ముందుకు చాచింది.
రవి ముఖంలో పౌరుషం పడగవిప్పినట్లుగా అయింది. విసురుగా ఆమెతో చేయి కలిపి బలప్రదర్శన మొదలుపెట్టాడు.
ఆ రెండుచేతులు కలిసి ఒకటి మరొకదాన్ని ఓడించాలని చూస్తుంటే బరిలో రెండు పోట్లగిత్తలు తలపడినట్లుగా వుంది.
సిరి నిశ్చలంగా నిలబడి తన శక్తినంతా చేతిలో కేంద్రీకరించి అతడితో చెయ్యి కలిపితే ఆమెను గెలిచే ప్రయత్నంలో అతడు ఆపాదమస్తకం వణికిపోతున్నాడు. అతడి ముఖంలో చెమటలు కారిపోతున్నాయి.
సిరి మాత్రం చెక్కుచెదరలేదు.
కౌస్తుభ, అనసూయే కాకుండా గుడికి వచ్చిన కొందరు భక్తులు కూడా ప్రేక్షకులయ్యారు.
"మగజాతి పరువుతీస్తున్నావు కదయ్యా? ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోతే ఎందుకు?" ఒకాయన రవికి హుషారివ్వబోయాడు.
"మగజాతి పరువును నువ్వు నిలబెడ్తావా పంతులూ? అయితేరా?" రెండో చేతిని అతడివైపు చాచింది.
అతడు కొంచెం బలాఢ్యుడే. మంచి వూపుతో వచ్చి ఆమెతోచేతులు కలిపాడు. ఒక గడ్డిపోచలా ఆమెను తీసేయగలననుకున్నాడు. ఇదెంత పని అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఆమెతో చేయి కలిపిన అతడు కొన్ని క్షణాల్లోనే కళ్లు తేల్చేశాడు.
ఇద్దరినీ గిరగిరా తిప్పి విసిరేసింది సిరి.
చెరోవైపు విసురుగా వెళ్లి నేలమీద పడ్డారు. ఆ పడడంలో నడుం పట్టుకున్నట్లుగా అయింది ఇధ్దరికీ.
"అమ్మో! ఇది మనిషి పిల్ల కాదు. దెయ్యం పిల్ల వున్నట్టుంది. లేకపోతే మామూలుగా కనిపిస్తున్న ఈ పిల్లలో ఇంత బలం ఏమిటి? అబ్బా" లేవలేక ప్రయాసపడసాగాడు మగధీరుడు.
"అవును మరి. మామూలు పిల్లకాదు. కొండజాతి పిల్లను. తెలిసిందికదా నేనెవర్నో? వస్తావా? మళ్లీ ఒక పట్టుపట్టి చూద్దాం" కవ్వించింది సిరి.
"మళ్లానా? అమ్మో!"
ఆరాధన అవుతున్న గుర్తుగా నగారా మ్రోగసాగింది.
ఆలయప్రాంగణంలోనే వున్న కోనేట్లో దిగి చేతులు, కాళ్లు కడుక్కుని మండపంలోకి వచ్చేసరికి స్వామివారికి తెగ అడ్డుగా పట్టుకుని గర్బగుడిలో స్వామివారికి ఆరగింపు కార్యక్రమం జరుపుతున్నారు పూజారులు.
అయిదు నిముషాల్లో ఆరగింపు, హారతి ముగించి భక్తులకి శఠగోపం పెట్టి తీర్దప్రసాదాలు ఇవ్వసాగారు.
అనసూయ తీర్దప్రసాదాలు తీసుకుని ఈ పిల్లెక్కడా అని చూసింది.
"రవీ! బయటుందేమో పిలుచుకురా. స్వామివారి ప్రసాదం, తీర్దం తీసుకుంటుంది."
రవి మండపం దిగి ఆవరణలోకి వచ్చాడు. అక్కడ తచ్చాడుతున్నట్లుగా సిరి కన్పించింది.
"తీర్దప్రసాదాలు ఇస్తున్నారు తీసుకుందువురా. అమ్మ పిలుస్తోంది నిన్ను."
"చినదొరా! ఇక్కడ నిధి వుంది. గుప్త నిధి తెలుసా?"
"ఎక్కడ? నీకెలా తెలుసు?" రవి గొంతులో ఉద్విగ్నత.
"ఎక్కడో.... అదే సరిగా తెలియడంలేదు ఖచ్చితంగా నిధిమాత్రం వుంది. ఇక్కడే ... ఈ చుట్టుపక్కల్నే!"
"నిధి వుందని నీకెలా తెలిసింది?"
"నిధి వున్నచోట ఒక విధమైన వాసన వస్తుంది. ఆ వాసన మామూలుగా కాదు. చాలా గాఢంగా వస్తూంది. వజ్రవైఢూర్యాలతో కూడిన నిధి వుండాలిక్కడ" అంటూ నేలను పరిశీలనగా చూస్తూ ద్వంజం స్తంభం చుట్టూ తిరగసాగింది.
రవి ముఖంలో పట్టలేని టెన్షన్.
రెండుమూడుసార్లు ద్వజస్థంబం చుట్టూ తిరిగి హఠాత్తుగా తల పైకెత్తింది సిరి.
ఆకాశాన్ని చుంబిస్తున్నట్లుగా ఎత్తుగా రాతితో మలచిన ద్వజస్తంభం. ద్వజ స్తంభానికి చిరుగంటలు గాలికి వూగుతూ చిరుసవ్వడి చేస్తున్నాయి. ద్వజ స్తంభం శిఖరాన అప్పుడే ఎక్కడినుండో ఎగిరొచ్చి వాలినట్లుగా వున్న చిలుక. రాతి చిలుక. బాగా చూస్తేతప్ప అక్కడ చిలుక వున్నట్లు తెలియదు.
"అక్కడ ఏం కనిపిస్తుంది నీకు చినదొరా?"
"చిలక కదూ? రాతితో మలచిన చిలుక"
"దాని కడుపులో వున్నాయి వజ్రాలు. కోట్లు విలువచేసే వజ్రాలు."
"ఆ!" ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రవి.
"నువ్వు చెప్పేదంతా నిజమేనా? లేకపోతే ఆట పట్టిస్తున్నావా?"
"నీ చేతిలో ధనరేకుండది చినసామీ! నువ్వు కోట్లకు పడగెత్తుతవని ఎప్పుడో చెప్పినా లేదా?"
"నీ మాట నిజమే అనుకుందాం. కానీ నీవు కనిపెట్టిన నిధి నీదే అవుతుంది. నాదెలా అవుతుంది?"
"అడవి మనుషులం. రేపో మాపో మా గూడానికి ఎల్లిపోతా. అడవిలో మాకు డబ్బెందుకు దొరా! అడవితల్లి చల్లగా వుంటే చాలు. ఆ నిధి నీకు చెందాల్సిందే. నువ్వే ఆ వజ్రాలకి వారసుడివి."
"ఎవరో గుప్తంగా దాచిన వజ్రాలకు నేనెలా వారసుడినవుతాను."
"మనుషులకు జన్మ పరంపర వుంటుందంటే నమ్ముతావా?"
"ఆ!"
"ఈ జన్మకి ముందు నువ్వు ఎన్ని జన్మలెత్తినావో, ఏమేం చేసినావో, నువ్వు ఏ జన్మలో దాచుకున్న ధనమో? నీకుగాక ఇంకెవరికి దక్కుతుంది?"
"గుప్తనిధులను తాకితే కీడు జరుగుతుందంటారు. ప్రాణహాని కూడా జరగొచ్చునంటారు."
"ఇది నీకు చెందాల్సిన ధనమే. నీకేం కాదు. మా మాటమీద నమ్మకముంచి తీసుకో!"
"పోవే వెర్రిదానా! నిజంగా అందులో వజ్రాలున్నట్లు?నన్ను తీసుకొమ్మని ఆటపట్టిస్తున్నావని నాకు తెలీదా?"
"నిన్ను ఆట పట్టిస్తే నాకేమొస్తది దొరా?" సిరికి కోపం వచ్చింది. ఆ కోపంతోటే ధ్వజస్తంభాన్ని సరసరా కోతిలా పాకిపోయి చివర కాళ్లు పెనవేసి కూర్చుంది."
రాతి చిలుకని అక్కడున్న చెట్లలోకి విసిరేయడం చూసిన రవి విభ్రాంతిగా సిరినే చూస్తున్నాడు.
కొంగున చిన్న మూటతో క్రిందకు దిగిన సిరి ఆ మూటలో వున్నవి రవి జేబులో జారవిడిచింది.
అవి జేబులోకి జారుతున్నప్పుడు గలగలమన్న శబ్దం రవి గుండెను చిన్నగా వణికించింది.
"ఇవి తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టు దొరా! ఇప్పుడే ఎవరికీ చెప్పకు. మీ అయ్యకీ, అమ్మకి కూడా"
"నిజంగా ఇవి కోట్లు విలవచేసే వజ్రాలా?" రవికి ఇంకా నమ్మకం కలగలేదు. జేబులో చెయ్యిపెట్టి తడిమి చూశాడు. చేతికి రాళ్లలా తగిలాయి.
* * * *
"మంచిగా వుండటం మంచిదేగానీ మరీ ఇంత మంచితనం కొంప ముంచుతుందండీ!"ఊరి నుండి వస్తూనే సణగడం మొదలుపెట్టిన భార్య కేసి ఆశ్చర్యంగా చూశాడు యోగానందం.
"ఇప్పుడు కొంపమీదికి ఏం వచ్చింది?"
"ఇంట్లో మనకి ఓ వయసొచ్చిన పిల్లాడున్నాడా? వయసు పిల్లను తెచ్చి ఇంట్లో పెట్టారు. అదుట్టి అడవిమేళం. రవి మీద మీద పడుతోంది. వయసు కదండీ? ఇద్దరి మద్యన చనువు ఏర్పడ్డం అసహజం ఏం కాదు. ఎవరో ఏమిటో తెలీకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం మనదీ బుద్ది తక్కువ."
రవికీ, సిరికీ ఏర్పడిన చనువు గురించి అనసూయ చెబుతుంటే నవ్వేశాడు యోగానందం.
"అనుమానం ముందుపుట్టి ఆడవాళ్ళు తరువాత పుట్టారట. కాస్త చనువుగా, స్నేహంగా వున్నంత మాత్రాన ఏదేదో వూహించుకోవడం సంస్కారం అనిపించుకోదు. ఆ పిల్లని ఏదైనా అనాధాశ్రమంలో చేర్చేవరకు ఓపికపట్టు."
"మీతో చెప్పడం నాదీ బుద్ది తక్కువ!"
* * * * *
వీధిలో ఐస్ క్రీం బండిపోతుంటే చూసిన సిరి ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చి రవి చెయ్యి పట్టుకులాగడం మొదలుపెట్టింది.
"బయట ఐసు బండిపోతుంది నాకు ఐసు కప్పు ఇప్పియ్యి చినదొరా" అంటూ.
"ఏయ్! ముందు వాడి చెయ్యి వదిలిపెట్టు, వాడిమీద పడకుండా మాట్లాడలేవా?" అక్కడే వున్న అనసూయ చిరచిరలాడిపోయింది.
"ఏంది తల్లో? నేనేం చేసిన నీ కొడుకుని. కొరుక్కుతింటినా?"
"ఈసారి వాడిని ముట్టుకోకు. అసలు వాడితో నీకేమిటి పని? చదువుకుంటున్న పిల్లాడిని చెయ్యిపట్టి లాగి ఐస్ క్రీం ఇప్పించమని అడుగుతావా?"
"రవి బాబంటే నాకిష్టం. నేనాయన్ని కట్టుకుంటే నువ్వు ఇడిపించగలవా ఏంది?" అంటూ కన్ను కొట్టింది సిరి.
"ఎంత ధైర్యమే నీకు? వాడిని కట్టుకుంటావా? దిక్కులేనిదానివని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు శాస్తి బాగానే చేసావు. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో వుండటానికి వీల్లేదు. నడూ బయటికి నడూ" అనసూయకి పట్టరాని కోపం వచ్చింది.
"పెద్దొరొస్తే నన్నెళ్లగొట్టినవని చెబుతవా?"
"చెబుతా! నాకేమిటి భయం?"
"నీకు కోపమొచ్చాక నేనెట్లుంట?పోతలే తల్లో. కానీ మళ్లొస్తా. ఈసారి కోడలినై వస్త. పోతున్న కద చినదొరా నాకు ఐసు కప్పు ఇప్పించి పంపవా?" జాలిగా అడిగింది.


