ఈ పోటీ మంత్రగాడికీ మంత్రగాడికీ మధ్యన. అంబాజీకి శ్రీచక్రకీ కాదు.
కొత్తగా మిలమిల్లాడుతున్న ఐరస్ సేఫ్ ని చూశాడు అంబాజీ. అంతా అర్దమైనట్లుగా తల పంకించాడు.
"పోలీస్ స్టేషన్ లో దాచిని నిధిని రాత్రికి రాత్రి మాయంచేసి ఇక్కడ దాచాలన్నమాట. చాలా టక్కరివే. రొట్టె విరిగి నీ చేతిలో పడిందన్నమాట!"
"కానీ ఏం లాభం స్వామీజీ?" ఏడుపు ముఖం పెట్టాడు నాయుడు.
"ఏం? ధనలక్ష్మి నిన్ను ముట్టుకోనివ్వడంలేదా?"
"పవిత్రమైన మీ హస్తస్పర్శతో అంతా చక్కబడుతుందన్న నమ్మకం నాకుంది" ఐరన్ సేఫ్ తాళం చెవులు అంబాజీ చేతికి అందించాడు నాయుడు.
సేఫ్ ని చేత్తో తాకాడు అంబాజీ.
సలసల మరుగుతున్న లోహంలా వుందది. చప్పున వెనక్కి తీసుకున్నాడు.
"అబ్బా! ఎలా మరుగుతుందో? వెంటనే సరైన చికిత్స చేయకపోతే బొగ్గులుగా మారిపోయే ప్రమాదం వుంది."
"ధనం బొగ్గులుగా మారుతుందా స్వామీజీ?"
"ఎవరికీ దక్కని నిధి మండి మండి చివరికి బొగ్గులుగా మారుతుంది. ఈ నిధికి ఎంత చరిత్ర వుందో, ఈ నిధి ఎందరిని బలి తీసుకుందో తెలిస్తే, నువ్వింత సాహసం చేసేవాడివి కాదు నాయుడూ!"
"వినకేం? విన్నాను. కానీ ఆ నిధిని ఆవరించి వున్న దుష్టశక్తులను పరిహరించాకే కదా నిధిని గుహనుండి బయటకు తేగలిగింది?"
"అక్కడే నువ్వు పొరబడ్డావు. ధనలక్ష్మి ధన పిశాచంగా మారడానికి వేరే శక్తులతో పనిలేదు. వంద సంవత్సరాలుగా ఒక గుహలో సురక్షితంగా నిక్షిప్తం చేయబడిన ధనలక్ష్మి ఈమె. గుహ దాటి పదిమంది చేతుల్లో పడ్డాక ఈమె చంచలమైంది. ఎప్పుడెవరిని బలి తీసుకుంటుందో తెలీదు.
నువ్వింత వరకు రక్తం కక్కుకు చావకపోవడమే నాకు ఆశ్చర్యంగా వుంది నాయుడూ?"
నాయుడి ముఖం మరింత పాలిపోయింది.
"నీకొకసారి శ్రీచక్రం వ్రాసిచ్చాను. పూజ చేస్తున్నావా?"
ఒకసారి అంబాజీని ఆశ్రమంలో కలిసినప్పుడు - " ఏ పని తలపెట్టినా విజయం సాదించేలా ఏదైనా యంత్రం ఇవ్వమని అడిగాడు నాయుడు. అప్పుడు శ్రీచక్రం గీయబడిన రాగిరేకు ఇచ్చాడు. అది భద్రంగా తీసుకెళ్లి పూజామందిరంలో వుంచాడు. రోజూ ఉదయమే స్నానంచేసి పూజ చేయనిదే టీగానీ, టిఫిన్ గానీ ముట్టుకోని పద్దతి చాలా ఏళ్ల నుండి ఆచరిస్తున్నాడు నాయుడు.
మొదటి నుండి నాయుడికి దైవభక్తి ఎక్కువే. అయితే అది అద్యాత్మిక వున్నతికి అనుకుంటే పొరపాటే. జీవితంలో అనుకున్నది సాధించడానికి దైవానుగ్రహం కావాలనుకునే మనిషి.
'దేవుడా నీకు కొబ్బరికాయ కొడతాను, నీకు లక్ష పత్రిపూజ చేయిస్తాను. లక్ష దీపారాధన చేయిస్తాను ఆ ఆర్చన చేయిస్తాను, ఈ అర్చన చేయిస్తాను' అని దేవుడికే లంచం ఇచ్చి పనులుచేయించుకోవాలనుకునే రకం. ప్రపంచంలోని ఆస్తికుల్లో ఈ రకం మనుషులే జాస్తి.
"పూజా మందిరంలో వుంచాను స్వామీజీ! మీరు చెప్పినట్లు రోజూ పాలతో కడుగుతున్నాను."
"నిన్ను ఆ శ్రీచక్రమే కాపాడిందన్నమాట."
అంబాజీ ఐరన్ సేఫ్ తాళం తీస్తుంటే, వంద నాగులు ఒక్కసారి పూత్కారం చేసినట్లుగా శబ్దం వినిపించింది.
అయినా ఆగలేదు అంబాజీ. తాళం చెవి కన్నంలో తిప్పి తలుపు తెరిచాడు.
నాయుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి వణికిపోయాడు.
"తలుపులు మూసేయండి స్వామీజీ. అవి బయటికి వస్తే మన పని ఆఖరు."
"అవి బయటకు రావు భయపడకు. అవి నిజం పాములు కావు, నిజం తేళ్ళూ కావు."
తలుపుని నిశ్శబ్దంగా మూసేసి లాక్ చేశాడు అంబాజీ.
"ఈ త్రీజోరీని తీసుకుపోయి ఏ చెర్లోనో, బావిలోనో పడేసిరా నాయుడూ! ప్రాప్తం వున్నవాడికి దక్కుతుంది. నీకు మాత్రం దక్కదు. దీనికోసం ఆశపడితే నువ్వూ, నీ వంశం సర్వనాశనం అయిపోతారు" అన్నాడు స్వామి.
"అలా అంటే ఎలా స్వామీజీ! మిమ్మల్నే నమ్ముకున్నాను. మీకు అసాధ్యమన్నది వుంటుందా?"
"ఇది నీ ఇంట్లో మాత్రం వుంచుకోవద్దు. ఏట్లో పారేయటానికి నీకు మనసొప్పకపోతే వెంటనే నా ఆశ్రమానికి తరలించు. దీని సంగతేమిటో నేను అక్కడ చూస్తాను."
స్వామీజీ స్వచ్చత మీద మొదటిసారి అనుమానం వచ్చింది వెంకునాయుడికి.
"నా పూజామందిరంలో శ్రీచక్రం వుండగా భయం దేనికి స్వామీజీ?"ఇంతవరకూ రక్షించిన ఆ యంత్రం ఇప్పుడు మాత్రం రక్షించదా?"
"ఈ తేళ్లనీ, పాములనీ ఏం చేసుకుంటావయ్యా?"
"తేళ్లనీ, పాములని మీరు మాత్రం ఏం చేసుకుంటారు స్వామీజీ?" బాలాజీ చెప్పిన కోమటి కథ ఎందుకో గుర్తొచ్చింది నాయుడికి.
"దీన్ని మామూలు రూపంలోకి తీసుకు రావటానికి మంత్రశాస్త్రాన్ని మధించాలి నాయుడూ!" చివరికి కన్నెబలి కూడా ఇవ్వాల్సి వస్తుందేమో!" అన్నారు స్వామీజీ.
"కన్నె బలి!" అదిరిపడ్డాడు నాయుడు.
"ధనలక్ష్మి నరబలి కోరుతుంది నాయుడూ. కన్నెపిల్లనో, పూర్ణ గర్బిణినో ఇవ్వాల్సి వస్తుంది."
"నరబలి అమానుషం, ఆటవికం కాదా?"
"బలి నీకు కొత్తా నాయుడూ! నువ్వీ రాజకీయాలలో ఎవరి మెడ మీదా వేటు వేయకుండానే, ఈ పదవికి వచ్చావా? మనిషిని బలితీసుకోవడం కంటే మనసును బలి తీసుకోవడం కంటే ఎక్కువ కిరాతకం.
శరీరానిదేముంది? ఒక్కసారి చచ్చి వూరుకుంటుంది. కానీ నీచేత దెబ్బతిన్న మనిషి మళ్లీ మళ్లీ చస్తూనే వుంటాడు . సరే మనం చర్చలతో తర్కాలతో విషయం సాగదీయొద్దు..... ఒక ఒప్పందానికి వచ్చేద్దాం."
దీన్ని యధారూపానికి తీసుకురావటానికి నా శక్తినంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ప్రతిఫలంగా నువ్వేమిస్తావో చెప్పు?" అడిగాడు స్వామీజీ.
"ఏమివ్వాలో మీరే సెలవివ్వండి."
"ఫిఫ్టీ ఫిఫ్టీ."
"సన్యాసులు. మీకెందుకు స్వామీజీ ధనం?"
"కౌపీన సంరక్షణార్దం అన్న కథ వినే వుంటావు. సన్యాసినయినా గోచిగుడ్డ ఉండనే వుంటుంది. గోచి గుడ్డకోసం పిల్లి, పిల్లికోసం ఆవు. ఆవుకోసం భార్యా కావలసి వచ్చారు. ఆ కథ వినే వుంటావు."
"వినడం కాదు. చిన్నప్పుడు క్లాసు పాఠాల్లో చదువుకున్నాను" అన్నాడు నాయుడు.
"సంసారికి భార్యాపిల్లలే సంసారం. సన్యాసికి విశ్వమంతా సంసారమే. అందరి బాగు సన్యాసికే కావాలి. సన్యాసినయినా నాకు ఆశ్రమం వుంది.
ఆశ్రమాన్ని అభివృద్ది పర్చాలి. ఊరూరునా ఆశ్రమాలు స్థాపించి నా కార్యక్రమాలు కొనసాగించాలి. ఏది తలపెట్టినా ధనం కావలసిందేకదా నాయుడూ?"
నిధికి నరబలి ఇవ్వాల్సి వస్తే తన ఇంట్లో కుదరదు.
వెయ్యి కళ్లతో కనిపెట్టి వుండే సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చడం కాదు - ఏ కాస్త విషయం లీక్ అయినా పత్రికలవాళ్లు ఇల్లు పీకి పందిరి వేస్తారు.
ప్రతిపక్షాలకి పండగే పండగ.
అప్పుడు పదివికే గండం వస్తుంది.
ఫిఫ్టీ పోతే ఫిఫ్టీ అయినా దక్కుతుంది. కదా?
ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరింది.
ఆ రాత్రి ఐరన్ సేఫ్ ఆనందాశ్రమానికి తరలిపోయింది.
* * * *
బస్టాపులో బస్సు దిగి ఇంటికి నడవసాగింది కౌస్తుభ.
బస్టాప్ కి కొద్ది గజాల దూరంలో లారీ ఆపుకుని సిగరెట్ పీలుస్తున్న డానీ మృత్యు ఘడియలు సమీపిస్తున్న జీవికి యమపాశం విసరటానికి సిద్దముగా వున్న యముడిలా వున్నాడు.
మరికొద్ది సెకన్లు
ఆమె రక్తపు మడుగులో శవంగా మారాలి.
శవంగా మారి తీరాలి.
ఈసారి ఫెయిలైతే తను దిగంబరరావు ముందు తలెత్తుకోలేడు.
ఆమె కొన్ని గజాలు దూరం నడిచాక లారీ స్టార్ట్ చేసాడు డానీ.
మృత్యురధంలా ముందుకు దూసుకురాసాగింది లారీ.
రోడ్ మీద ట్రాఫిక్ రద్దీగానీ, అటు ఇటు దూసుకుపోతున్న వాహనాలుగానీ పట్టలేదు డానీకి.
అతడి కంటికి కౌస్తుభ మాత్రమే కనిపిస్తోంది.
కబళించటానికి వస్తున్న మృత్యుకెరటంలా ఆమెకు ఐదారు గజాల దూరంలోకి వచ్చేసింది లారీ.
నిండు వేసవిలో గడ్డివాము మీద పెట్రోలు పోసి అగ్గిపుల్ల గీసి విసిరేసినట్లుగా ఎదురుగా పెద్ద మంట.
ఆకాశంలోకి నాలుకలు చాస్తున్న ఆ మంటతప్ప కౌస్తుభగానీ, మరెవరుగానీ కనిపించలేదు డానీకి.
విభ్రాంతికి లోనయిన అతడి చేతులు స్టీరింగుమీద బిగుసుకున్నాయి.
నిలువెత్తున లేచి క్షణంలో విశ్వమంతా వ్యాపించినట్లుగా కళ్లముందు అంతా మంట.
మనిషి అడుగులు వేస్తూ వస్తున్నట్లుగా ఆ మంట లారీకేసి రాసాగింది.
డానీ లారీని వెనక్కి నడపాలని ప్రయత్నించాడుగానీ స్టీరింగ్ కదలలేదు.