Previous Page Next Page 
దావాగ్ని పేజి 45


    మీకు మంచి వైన్ ఇస్తాను. కానీ నాకు వైనూ, లిక్కరూ రెండు అక్కరలే...దు"

 

    "మరి?"

 

    "మీ కళ్ళలోని కైపూ, మీ అధరసుధాపానం ఈ రెండూ చాలు కిక్ రావడానికి..."

 

    అప్రయత్నంగానే అప్సర అధరాలు అరవిచ్చుకున్నాయి ఆహ్వానిస్తున్నట్లు. వాటిని తన పెదవులతో అందుకున్నాడు రుద్ర.

 

                                     *    *    *    *

 

    అర్ధరాత్రి దాటాక - అరమోడ్పు కళ్ళతో అతన్ని చూస్తూ అడిగింది అప్సర.

 

    "రుద్రా: నన్ను పెళ్ళి చేసుకోవడం నీ కిష్టమేనా?"

 

    "అంతకంటే మహద్భాగ్యం మరోటి ఉంటుందనుకోను" అన్నాడు రుద్ర. ఆమెని దగ్గరికి లాక్కుంటూ.

 

    అంతలోనే ఫోన్ రింగయింది. దుప్పటినే లుంగీలా కట్టుకొని లేచి ఫోన్ అందుకున్నాడు రుద్ర. లైన్ లో అవతల ఉన్నవాళ్ళు చెప్పింది వింటుంటే అతడి మొహం వికసించింది.... "ఓకే:" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.  

 

    అప్పటికే లేచి బట్టలు వేసేసుకుంది అప్సర.

 

    "నేను వెళతాను"

 

    "పునర్దర్శనం ఎప్పుడు?"

 

    "పెళ్ళిలోనే" అని నవ్వి, బై చెప్పి వెళ్ళిపోయింది అప్సర. టాక్సీ ఎక్కి తను అపార్ట్ మెంటు చేరుకుంది.

 

    ఇంటికి చేరేటప్పటికి ఆమె కోసం ఒక అర్జెంట్ మెసెజ్ ఎదురు చూస్తూ వుంది.

 

    "నువ్వు తక్షణం ఇండియాకి రావాలి. అత్యవసరం:

 

                బాబూజీ."

 

    వెంటనే అవసరమయిన సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టింది అప్సర.

 

                                   *    *    *    *

 

    క్లబ్ లో కూర్చుని వున్నాడు సత్యజిత్. అతని ముందు ఓపెన్ చేసి ఉన్న విస్కీ బాటిల్ వుంది. సగం ఖాళీ అయిపోయింది ఆ బాటిలు... సత్యజిత్ కళ్ళు ఎర్రగా వున్నాయి. వాచ్ చూసుకున్నాడు అతను... తర్వాత ప్రవేశద్వారంవైపు చూశాడు.  

 

    అతను ఎదురు చూస్తున్న మనిషి జాడలేదు. కానీ ఒక వయసు మళ్ళిన నీగ్రో లోపలికి రావడం కనబడింది. చిన్న వుంగరాలు తిరిగి వున్న బిరుసు జుట్టు సగం నెరిసిపోయి ఉంది. దూదికూరిన బస్తాలా లావుగా ఉంది అతడి శరీరం.

 

    అటూ యిటూ చూసి, సత్యజిత్ వున్న టేబుల్ దగ్గరకి వచ్చి, "మే ఐ జాయిన్ యూ సర్:" అని మర్యాద కోసం అడిగి జవాబు కోసం ఎదురు చూడకుండానే కూర్చున్నాడు ఆ నీగ్రో.

 

    తన ఏకాంతానికి భంగం కలిగించినందుకు చిరాగ్గా ఆ నీగ్రోవైపు చూశాడు సత్యజిత్.

 

    "నన్ను గుర్తుపట్టలేదా సత్యజిత్?" అన్నాడు నీగ్రో రూపంలో వున్న రాణా నవ్వుతూ.

 

    నివ్వెరపోయి చూశాడు సత్యజిత్.

 

    రాణా: రోజుకో రూపంలో జనాన్ని ఏమార్చగల రాణా:

 

    ఈ విద్యకే అతనికి హాట్సాఫ్ అని చెప్పవచ్చు.

 

    "రాణా: మీరా:" అన్నాడు నెమ్మదిగా.

 

    "నేనే సత్యజిత్: మరోసారి మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కలుసుకోవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను."

 

    ఆ ఉపోద్ఘాతం దేనికో అర్థమైంది సత్యజిత్ కి. రాణా తనకి అప్పగించిన పనిని నిర్వహించడంలో మరోసారి విఫలమయ్యాడు తను.

 

    "అందుకే చెప్పాను సత్యజిత్: ఏజెంట్లకి ప్రేమానురాగాల్లాంటివి ఉండకూడదని" అన్నాడు రాణా మందలింపూ, హితవూ కలిసిన స్వరంతో.

 

    "కానీ నేను మనిషిని మిస్టర్ రాణా: మాకును కాదు"

 

    "మనిషినే కావచ్చు సత్యజిత్: కానీ మనసును చంపుకోవాలి"

 

    నిర్వేదంగా నవ్వాడు సత్యజిత్.

 

    "సత్యజిత్: మరోసారి చెబుతున్నాను. ఈ ప్రేమా, గీమా అన్న పిచ్చి పిచ్చి భావాలు దగ్గరికి రానీకు. మన వృత్తికీ, ప్రవృత్తికీ అలాంటి వికారాలు వ్యతిరేకం"

 

    "ప్రేమనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిలో ఎందుకు అంకుశిస్తుందో ఎవరికీ అంతుతెలియని పెద్ద మిస్టరీ రాణా: ప్రేమలో పడటం పడకపోవటం అనేది మన చేతిలో లేదు. ఒకసారి ప్రేమలోపడ్డాక అందులోంచి బయటపడటం మన చేతిలో వుండదు. కాన్సర్ కన్నా విరుగుడు కనిపెట్టగలరేమో గానీ ప్రేమజ్వరానికి మందూ మాకూ ఏమీ ఉండవు. మనసులు కలిస్తే మనుషులు కూడా కలిసిపోవడం ఒక్కటే మార్గం:"

 

    "మిస్టర్ రాణా: నాకు పవిత్ర కావాలి"

 

    సత్యజిత్ మాటలు వింటూ అతనివైపు నిశితంగా చూశాడు రాణా.

 

    "ఎవరెన్ని చెప్పినా వినే స్థితిలో లేవు నువ్వు సత్యజిత్: ఆల్ రైట్: పవిత్రను పెళ్ళి చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను. కానీ ఒక్క షరతు మీద: మా ఏస్ ఏజెంట్ కి కాబోయే భార్యగా ఆమెలో కొన్ని గుణగణాలు కొన్ని విశిష్ట లక్షణాలూ ఉండాలని నేను కోరుకోవడంలో తప్పు లేదనుకుంటాను. నేను ఒకసారి పవిత్రను పర్సనల్ గా మీటవాలి. ఆమెను టెస్ట్ చెయ్యాలి. ఆ పరీక్షలో ఆమె నెగ్గగలిగితే, ఆమెను నువ్వు నిరభ్యంతరంగా పెళ్ళాడవచ్చు."

 Previous Page Next Page