నిశ్చలంగా చూశాడు రుత్వి. మనసులో మొగ్గ తొడిగే వాక్యాలకి సంక్షిప్తమైన రూపమిస్తూ "చూడు సశ్యా! నేనూ అందరిలాంటి మగాడ్నే. అందరిలా నేనూ స్పందిస్తాను .అయితే నాలోని విచక్షణ నన్ను ఇప్పుడు నిరోధించింది. లేకపోతే అటూ ఇటూ ఊగిసలాడే నా మనసుని మెదడు తప్పు అని ఆదేశించిందో నాకు తెలీదు కానీ ఆగిపోయాను. ఒకరకంగా చెప్పాలీ అంటే నీనుంచి దూరంగా పారిపోతున్నాను" అన్నాడు నిస్సహాయంగా.
ఉద్విగ్నంగా కాదు గర్వంగా చూసింది సశ్య.
రుత్విని కూడా తనలాగే వూగిసలాడారు అంటే అది తనమీదున్న ఇష్టంగా అనిపించింది అది చాలు రుత్వి తనవాడూ అని నమ్మడానికి.
జరిగింది ఏమైనా కానీ రుత్వి మరింత స్పష్టంగా అర్దమయ్యాడు.
అతడేమిటో తెలుసుకోవాలీ అనుకుంటే చిరుగాలి కెరటమై కల్లోలిత హృదయాన్ని తాకి నేను నీవాడ్నే అని చెప్పకుండా చెప్పేశాడు.
"అయితే వెళ్లిపోతావా?" ఏం మాట్లాడాలో తెలియనట్లు అడిగింది సశ్య.
"తప్పదు సశ్యా..... వెళ్లాలి"
"బాగా భయపడ్డావన్నమాట" ఉడికిస్తున్నట్టుగా అంది అప్పటికి పూర్తిగా తేరుకున్న సశ్య"ఇంక ఆ కేసెట్ నేను ప్లే చేయనని హామీ ఇస్తున్నాను."
"చూడు సశ్యా" మృదువుగా అన్నాడు "ఇంతదాకా వచ్చాక నీకు ఓ నిజం చెప్పాలి"
అర్దం కానట్టు చూసింది.
"డబ్బుతో ఫుడ్డు కొనుక్కోగలం గానీ ఆకలిని కొనలేం. అదే డబ్బుతో బెడ్డుని కొనగలమేమోగానీ నిద్రని కొనలేం. డబ్బుతో మందుని కొనగలం తప్ప ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బుంటే గ్రంధాలని కొనగలం తప్ప మేధస్సుని కొనలేం"
"ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు" ఇంచుమించు అరిచినట్లుగా అంది సశ్య. "ఏ ఉద్దేశ్యంతో?"
"నువ్వు అర్దం చేసుకోవాలి సశ్యా! నువ్వు చిన్న పిల్లవికాదు."
"అంతకన్నా నువ్వు విషయాన్ని సూటిగా చెప్పొచ్చుగా" అసహనంగా అంది.
"ఓకే!" వెళ్లబోతూ ఆగాడు "అర్జంటుగా ఓ పని చేయ్."
విస్మయంగా చూసింది.
"వాముని పెరుగునీ సమభాగంగా తీసుకుని మెత్తగా నూరి రాత్రి పూట మొహానికి రాసుకుంటూ వుండు."
"దేనికి?"
"నీ ముఖం మీద వున్న మొటిమలు తగ్గుతాయి."
ఫకాల్న నవ్వబోతూ నిభాయించుకుంది.
అదే... ఎంత టెన్షన్ లోనుంచైనా సునాయాసంగా తేరుకోవడమే కాదు - మాటలతో పరిసరాల్లోని టెన్షన్ ని తగ్గించి తన వునికిని నిరూపించుకుంటాడు రుత్వి.
అనాలోచితంగా ఆమె చెంప చేతితో స్పృశించింది.
నిజమే.....
బుగ్గమీద పింపుల్స్
"ఇంకా ఏం చేయాలి?" అడిగింది ఆకతాయిగా.
"బెడ్ మీద కలువ ఆకుల్ని పరుచుకుని నిద్రపోతూ వుండు."
"ఏమవుతుంది?"
"ప్రతి దానికీ రియాక్ట్ కాకుండా కూల్ గా వుండటం అలవాటవుతుంది" అప్రతిభురాలై చూస్తున్న సశ్యతో అన్నాడు అవును సశ్యా! శరీరానికి చలువచేసే గుణం గల కలువలు బ్లెడ్ ప్రెషర్ పెరగకుండా కాపాడుతాయి కూడా."
"అంటే నేను బి. పి. పెరిగినట్టు ప్రవర్తిస్తున్నానా?" అడిగింది ఉక్రోషంగా.
వెంటనే జవాబు చెప్పలేదు రుత్వి.
అలాగే చూస్తూ నిలబడితే సశ్య మరేదో అనే అవకాశముంది. అది కాదు. కాస్త చల్లబరిస్తే ఆ రాత్రి ఇక నిద్రపోదు.
"నువ్వు చాలా అందంగా వుంటావ్ సశ్యా."
కెంపులు నక్షత్రాల్లా ఆమె చెంపలపై మెరిశాయి.
"ఆయుర్వేద సారన్ని అర్దం చేసుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి తల్లీ నీలాంటి అందమయిన పిల్లల్ని కనేది.
సిగ్గు దొంతర మధ్య చిలిపి పారిజాతమై అతడు చెబుతున్నదేమిటో అర్దంకానట్టు మరింత విస్మయంగా.
"నీకు తుమ్మఆకు తెలుసుగా" అడిగాడు.
తలూపింది తెలుసు అన్నట్లుగా.
"నీడలో ఎండబెట్టిన లేత తుమ్మాకుని ఐదు కంతులు తామర గింజల పప్పుని ఒక వంతు పటికబెల్లాన్ని ఆరువంతులు కలిపి ముద్దగా దంచాలి. స్త్రీకి గర్బం వచ్చిన నాలుగోనెల నించి ప్రతిరోజూ ఉదయం పూట ఆ మిశ్రమాన్ని మూడు గ్రాముల చొప్పున కప్పు ఆవుపాలతో కలిపి తాగాలి. అలా కనీసం నలబై రోజులు తాగితే"
"ఏమవుతుందీ?"
"నీఇంత అందమైన, ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది."
వెళ్లబోతుంటే ఠక్కున అతని చేతిని పట్టుకుంది.
"నేను తెలుసుకోవాలనుకుంటున్నది నీ ఆయుర్వేద పరిజ్ఞానం గురించి కాదు" ఇందాకటి విషయం మననం చేసుకుంటూ అంది "డబ్బుతో బెడ్డు కొనగలం తప్ప నిద్రని కొనలేం అన్నావ్."
"అవును." ప్రశాంతంగా అన్నాడు రుత్వి. "అలా అన్నది నీకు నా గురించి అర్దం కావాలని సశ్యా. నీ స్నేహం నన్ను నీ దగ్గరికి రప్పించగలదే తప్ప అన్నిటికీ ఒప్పించలేదు"
అప్రతిభురాలైన సశ్య తేరుకుని చూసేసరికి రుత్వి లేడు.
ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి.
కొన్ని క్షణాల క్రితం తనవాడు మాత్రమే అనుకున్న రుత్వి మళ్లీ అంతలోనే తమ మధ్య దూరాన్ని గుర్తు చేసి వెళ్లిపోయాడు.
ఉక్రోషంగా ఫ్లవర్ వాజ్ ని అందుకుంది.
రుత్వితో రాత్రంతా వుండే అవకాశాన్ని చేజార్చిన టి. వి. స్క్రీన్ పైకి విసిరింది. బ్లూఫిలిం కేసెట్ ని వి. సి. ఆర్ లో మరిచిపోయిన మార్గరేట్ వుంటే అదిరిపోయేది కాని ఆ క్షణంలో లేదక్కడ.
* * * *