తను చూసింది కలో నిజమో అర్ధంకాని పరిస్థితిలో వుండి పోయింది ప్రనూష.
ఈ పనిమీద బయల్దేరబోయేముందు చైతన్య కొన్ని నెలలు టైమ్ కావాలని అడిగినప్పుడు ఆమె ఎందుకని అన్నది. చైతన్య రకరకాల ట్రెయినింగ్ లు పొందటం, ఇసుకలో పరుగెత్తటం మొదలైనవి చూసి ఆమె ఇదంతా అనవసరమైన టైమ్ వృధా అనుకుంది. 'మనం సైనికులకి దొరికిపోతే ఎలాగూ బ్రతకనివ్వరు. ఈ పరుగెత్తటాలూ, జలసంభన విద్యలూ ఎందుకు?" అని అనుకుంది.
దాని విలువ ఏమిటో ఇప్పుడు కళ్ళారా చూసింది. ప్రతీ కండరాన్ని స్వాధీనంలో వుంచుకోవటం అంటే ఏమిటో ప్రత్యక్షంగా గమనించింది. చుట్టూ వున్న సైనికులు యింకా తేరుకోకముందే చైతన్య కంఠం ఆ ప్రదేశంలో మార్మోగింది. "ఎవరైనా కొద్దిగా కదిలినట్టు కనిపించినా మీ కమాండర్ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి జాగ్రత్త."
అక్కడ గాలి తప్ప ఇంకే శబ్దమూ వినపడటంలేదు. ఏం చెయ్యాలో తోచనట్టు అందరూ నిశ్చేష్టులుగా నిలబడి వున్నారు. అప్పుడే స్పృహ లోకి వచ్చిన దానిమల్లె ప్రనూష తేరుకుని, తనని బంధించి వుంచిన మరో సైనికుడి దగ్గిర్నుంచి రైఫిల్ తీసుకుంది.
అజ్మరాలీ భుజం పట్టుకుని పైకి లేపి, వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళాడు చైతన్య. దూరంగా నిలబడివున్న సైనికులతో బిగ్గరగా అన్నాడు. "మేము సరిహద్దు దాటేవరకూ ఇతను మా బందీగా వుంటాడు. మాకే మాత్రం అపాయం తలపెట్టినా ఇతడు ప్రాణాల్తో మిగలడు.
ఎవరూ మాట్లాడలేదు. ఇదంతా తమ కళ్ళముందే జరుగుతూ వుందనీ, తమ నాయకుడి బందీ అయ్యాడనీ స్వయంగా చూస్తున్నా నమ్మేస్థితిలో లేరు వాళ్ళు. అంతా అయోమయంలో వున్నారు.
ప్రనూష డ్రైవ్ చేస్తూ వుండగా వ్యాన్ కదిలింది. చైతన్య అజ్మరాలీ నుదుటికి ఇంకా తుపాకీ గురిపెట్టే వుంచాడు. ఏ విధమైన రిస్కు తీసుకోదల్చుకోలేదు అతడు.
"ఒక చెడువార్త" అంది ప్రనూష ఎలా ప్రారంభించాలో తెలియనట్టు.
"ఏమిటి?"
"డాక్టర్ పాల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ గూఢచారి."
పెద్ద గుంటలో పడి వ్యాన్ పైకి లేచింది. చైతన్య మొహం వివర్ణమైంది. అతని చేతిలో తుపాకి వణికింది. అజ్మరాలీ బిగ్గరగా నవ్వాడు.
"ఈపాటికి అక్కడ అంతా జరిగిపోయి వుంటుంది చైతన్యా! ఇస్మాయిల్ ని పాల్ చంపేసి వుంటాడు. లక్ష్మిని....." పైన హెలికాఫ్టర్ చప్పుడు వినిపించటంతో మాటలు ఆపుచేశాడు. చాలా దగ్గిర్నుంచి వ్యాన్ మీదుగా వెళ్ళి పోయింది అది. అజ్మరాలీ సంతోషంగా అన్నాడు.
"మా వాళ్ళు నన్ను ఎలా రక్షించాలా అని చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ప్రాణాల్తో వదలరు. అక్కడ పాల్ మీ వాళ్ళని చంపేసి వుంటాడు. ఇక్కడ మా వాళ్ళు మిమ్మల్ని...." అతడి మాటలు పూర్తికాలేదు. హెలికాఫ్టర్ ఒకసారి రౌండ్ కొట్టి మళ్ళీ వెనుకనుంచి వచ్చింది. వ్యాన్ దగ్గరకి రాగానే బుల్లెట్ల వర్షం కురిపించింది. జరుగుతున్నదేమిటో అర్ధమయి అజ్మరాలీ మొహం తెల్లగా పాలిపోయింది. ఆర్మీ చీఫ్ నుంచి ఆర్డర్లు వచ్చి వుంటాయి. "మన కమాండర్ చచ్చిపోయినా ఫర్వాలేదు. వాళ్ళని మాత్రం ప్రాణాలతో వదలకండి" అని- దాని పర్యవసానం ఇది.
ఆ మాత్రం అర్ధం చేసుకోలేనంత మూర్ఖుడు కాదు అజ్మరాలీ. అతడి పెదవులు బిగుసుకున్నాయి. ప్రాణభయం కాదు. అవమానం... ఇంతకన్నా అవమానం ఏ సైనికాధికారికీ జరిగి వుండదు.
ప్రాణాలు పోబోయే ఆ స్థితిలో కూడా చైతన్యకి సంతోషం కలిగింది. ఓరగా అజ్మరాలీవైపు చూశాడు. అతడు కట్టెలా- నిశ్చలంగా వున్నాడు. తన ప్రాణాలకి పై అధికారులు ఏ మాత్రం విలువ ఇవ్వలేదని అర్ధమైంది అతడికి.
"నీ శాడిజమే నిన్ను ఈ పరిస్థితుల్లోకి తోసింది అజ్మరాలీ" అన్నాడు చైతన్య. "....శత్రువుని ఆర్మీ కాంప్ లోకి ఆహ్వానించి మరీ నాటకాలాడించినందుకు నీ పై అధికారులు ఈ రకమైన శిక్ష విధించి వుంటారు. నీకు నువ్వు లేకుండానే నీ మీద కోర్ట్ మార్షల్ జరిగి వుంటుంది."
"నేను మరణించినా ఫర్వాలేదు. నాతోపాటు మీరు ఛస్తారు. అది చాలు" అన్నాడు. అజ్మరాలీ పైకి అలా అన్నాడేగానీ, లోపల చాలా కలత చెందుతున్నాడని అతని ముఖ భంగిమే చెపుతోంది.
చైతన్య వ్యాన్ కిటికీలోంచి తల బయటపెట్టాడు. హెలికాఫ్టర్ తిరిగి దగ్గరగా వస్తోంది. రెండుసార్లు రైఫిల్ పేల్చాడు. ఒక గుండు విండ్ షీల్డ్ కి తగిలింది. మరొకటి పైలెట్ చెవి పక్కనుంచి దూసుకుపోయింది. అద్దాలు గాలిలో చెల్లాచెదురయ్యాయి.
హెలికాఫ్టర్ దూరంగా వెళ్ళింది.
వేగంగా కదులుతున్న వ్యాన్ లోంచి హెలికాఫ్టర్ ని షూట్ చేసిన వ్యక్తి సామాన్యుడు కాదని పైలెట్ కి అర్ధమై వుంటుంది. రిస్కు తీసుకోకుండా పక్షిలా పైనుంచి గమనిస్తూ వ్యాన్ తోపాటే నడపసాగాడు. ప్రనూష దగ్గర్నుంచి స్టీరింగ్ తను తీసుకుని వేగం పెంచాడు చైతన్య.
బుల్లెట్ల వర్షం తాత్కాలికంగా ఆగటంతో కాస్త వూపిరి పీల్చుకున్నాడు.
దాదాపు రెండు గంటలపాటు క్రింద వ్యాను, పైన హెలికాఫ్టరు ప్రయాణం చేశాయి.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. చైతన్య మనసులో టెన్షన్ తో కూడిన బాధ. టెన్షన్ తన గురించికాదు, డాక్టర్ పాల్ చేతిలో తన తల్లిదండ్రులు ఏమయ్యారోనని...
ప్రనూష కూడా ఆ విషయమే ఆలోచిస్తూన్నది. వ్యాన్ కొండ మలుపు తిరుగుతూ వుండగా సడెన్ గా బ్రేక్ వేశాడు చైతన్య. ఎదురుగా రోడ్ ప్రక్కనుంచి ఇస్మాయిల్ ముందుకు వచ్చాడు. దూరంగా వున్న తల్లిదండ్రుల్నీ, లక్ష్మినీ చూడగానే చైతన్య మొహం విప్పారింది.
ఇస్మాయిల్ సుశిక్షితుడైన సైనికుడు కాబట్టి- మాటల్తో సమయం వృధా చేయకుండా అందర్నీ వ్యాన్ ఎక్కించాడు. మళ్ళీ వ్యాన్ కదిలింది. చాలా క్లుప్తంగా డాక్టర్ పాల్ విషయం ఏం జరిగిందో వివరించాడు ఇస్మాయిల్. అజ్మరాలి స్థాణువు అయ్యాడు.
లక్ష్మి వెనుక సీట్లో కూర్చుని వుంది. అంతా విని ప్రనూష వెనుతిరిగి, లక్ష్మితో "కంగ్రాచ్యులేషన్స్. గ్రేట్ జాబ్" అంది. చైతన్య ఏమీ మాట్లాడకుండా అద్దంలోంచి వెనక్కి చూశాడు. అతడి కళ్ళల్లో అభినందన అందుకున్నట్టు లక్ష్మి తలదించుకుంది.
మరో పావుగంట ప్రయాణం చేశాక వ్యాన్ ఆపుచేశాడు.
ఎదురుగా చిన్న నదిపాయ. కొండల్లోంచి వేగంగా ప్రవహిస్తూంది. రావి- సట్లెజ్ - చీనాబ్- ఏ నదో ప్రనూషకి గుర్తురాలేదు. నదులకీ పర్వతాలకీ ఎల్లలు లేవని నిరూపిస్తూ ఒక దేశంలోంచి ఇంకో దేశంలోకి స్వచ్చందంగా ప్రవహిస్తున్నాయి.
నది మీద చిన్న బ్రిడ్జి వుంది.
కానీ....
దానిమీద వ్యాను వెళ్ళదు. జీపులు మాత్రమే వెళ్ళగలిగేటంత వెడల్పుంది ఆ బ్రిడ్జి.
తమని వెంటాడుతూన్న హెలికాఫ్టరు ఎందుకు ఫైర్ చేయలేదో అప్పుడు అర్ధమైంది చైతన్యకి. ఎలాగూ తమ వ్యాన్ ఇక్కడితో ఆగిపోతుంది కాబట్టి. అనవసరంగా కోటిరూపాయల రిస్కు తీసుకోదల్చుకోలేదు వాళ్ళు.
"ఏం చేద్దాం?" ఇస్మాయిల్ అడిగాడు.
"ఇక్కడ నుండి కాలినడకన సరిహద్దు దాటాలి. ఇంకో మార్గం లేదు" అన్నాడు చైతన్య.
పర్వతాలవైపు చూస్తూ ప్రనూష గాఢంగా విశ్వసించింది. ఈ వృద్ధులతో ఆ కొండలు ఎక్కి దిగి, అవతలివైపుకి చేరుకోవటం దాదాపు అసంభవం.
"ఈ దారి ఎక్కడికి వెళుతుంది?" ఇస్మాయిల్ అడిగాడు.
"ఇంకో కిలోమీటరు ముందుకు వెళ్ళి కొండ అంచున ఆగిపోతుంది. ఆ తరువాత ఏమీలేదు. క్రింద రాళ్ళు. కొండలమీద మంచు...."
"సరిహద్దు ప్రాంతాల్లో సైనిక శిబిరాలు లేకపోవటం చిత్రంగా వుంది" చుట్టూ చూస్తూ అన్నాడు జగదీష్ ప్రసాద్.
"పేరుకి రెండు గంటల ప్రయాణం చేశామన్న మాటేగానీ, మనం వచ్చింది పది కిలోమీటర్లే. అంత దుర్భరమైన ప్రదేశం ఇది! అందుకే రెండు దేశాలకీ ఈ ప్రాంతంమీద ఇంటరెస్ట్ లేదు. దూరంగా కనబడుతున్న ఆ కొండల వెనుక భారత సరిహద్దు వుంది. నిజానికి ఈ నది అవతలివైపు వరకూ కూడా భారత ప్రాంతమే." బ్రిడ్జి అవతల కనబడుతూన్న పాడుబడిన శిబిరాలని చూపిస్తూ చైతన్య అన్నాడు.... "అవి మన సైనిక శిబిరాలే. ఒకప్పుడు మన పోస్ట్ వుండేది అక్కడ. కేవలం ఈ కొద్ది ప్రదేశాన్ని స్వాధీనంలో వుంచుకోవటానికి కొండల కివతల ఆర్మీ పోస్ట్ వృధా అని మనవాళ్ళు వెనక్కి తగ్గారు. ఆ పర్వతాలు దాటి భారతసైన్యం ఇటు రాదని పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలుసు. అందుకే బ్రిడ్జి దాటాక ఆ కొండలవరకూ రోడ్డు వేసి వదిలేశారు. ఈ రకంగా యీ రెండు దేశాలమధ్యా ఇది స్వభావసిద్ధమైన నో- మాన్స్- లాండ్ [NO MAN'S LAND]గా మారింది."
అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని, సరిహద్దు రేఖల్నీ అంత బాగా ఆకళింపు చేసుకున్న చైతన్యవైపు అజ్మరాలీ దిగ్భ్రాంతితో చూశాడు. తన సైన్యంలో పనిచేసే చాలామందికి ఆ వివరాలు తెలియవని అతడికీ తెలుసు.
ప్రనూష కూడా అలాంటి సంభ్రమాశ్చర్యాలకే గురయింది. తను లక్షలు ఖర్చుపెట్టి సంపాదించిన ఆ సరిహద్దు మ్యాపుల్ని అతడు అంత బాగా గుర్తుంచుకోవటం ఆమెకి సంతోషాన్ని కలిగించింది. అతడిమీద గౌరవాన్ని మరింత పెంచింది.
"సరిహద్దుల్ని దాటటానికి ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నావ్?" జగదీష్ అడిగాడు.
"ఇంకే మార్గంగుండా దాటినా పాకిస్తానీ సైనికుల వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్ళాలి. అది దాదాపు అసాధ్యం. అదీగాక...." చైతన్య ఆగి అన్నాడు... "ఈ బ్రిడ్జి కేవలం జీపుపట్టేంత వెడల్పు మాత్రమే వుంటుందని నేననుకోలేదు. ఒకసారిబ్రిడ్జి దాటివెళ్ళాక, వీలైనంత దూరం వ్యానులో వెళ్ళి, అక్కడ్నుంచి మనలో ఒకరు భారత సైనిక శిబిరం వరకూ వెళ్ళి సహాయం కోరవచ్చు అనుకున్నాను. ఇదంతా చీకట్లో జరుగుతుంది కాబట్టి శత్రువులకి మనం దొరకటం జరగదు."
"ఇదంతా నావల్లే జరిగింది" బాధగా అంది ప్రనూష... 'మీరు నన్ను వదిలేసి వచ్చినా సరిపోయేది."
"అసంభ...." అనబోతూ చైతన్య చప్పున మాటలు ఆపుచేశాడు. అతడి దృష్టి అక్కడికి వెనగ్గా కిలోమీటరు దూరంలో వెనుకవిఅపు వున్న గుట్టమీద పడింది. ఆ గుట్ట వెనుకనుంచి దుమ్ము పైకి లేస్తూంది.
కొద్ది క్షణాలు తరువాత రెండు జీపులూ, వెనుకే నాలుగు సైనిక వాహనాలు వస్తూ కనిపించాయి.
అందరూ చేష్టలుడిగి నిలబడ్డారు. ఆ వస్తున్నవి, తమని నిర్ధాక్షిణ్యంగా చీల్చి చెండాడడానికి మృత్యురూపంలో వస్తూన్న యమదూతలని అక్కడి వారందరికీ అర్ధమైంది. అక్కడ శ్మశాన నిశ్శబ్దం వ్యాపించింది. పాకిస్తానీ సైన్యం దగ్గరవుతూంది.
చైతన్య తాము వచ్చిన వ్యానువైపు నిస్సహాయంగా చూశాడు. దాన్ని వదిలేసి, కాలినడకన బ్రిడ్జి దాటి అటు వెళ్ళినా జీపుల్లో వెంటాడి అయిదు నిమిషాల్లో తమని పట్టుకుంటారు.
"బహుశా ఇదంతా ఊహించే ఏ మాత్రం తొందర లేకుండా తాపీగా వస్తున్నారేమో వాళ్ళు!" అనుకున్నాడు.
రంగనాయకి జగదీష్ చేతిని గట్టిగా పట్టుకుంది. చివరి క్షణాల్లోనయినా భర్తకి దగ్గరగా వుండాలన్నట్టు.
వాహనాలు మరింత దగ్గరవుతూ వుండగా, చైతన్య ఇస్మాయిల్ తో అన్నాడు.
మీరందరూ బ్రిడ్జి దాటి అవతలివైపుకి వెళ్ళండి.... క్విక్."