Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 43

     "పరుసవేదిలాంటి సి. ఎం. పదవే నీ దగ్గరుండగా నా ఆశీస్సులతో పనేమిటి నాయుడూ?"

    "మీ ఆశీస్సులతో వచ్చిందే ఆ పదవి. మీరిప్పుడు నాతో మా ఇంటికి రావాలి."

    "ఇప్పుడు కుదరదు నాయుడూ! అవతల చాలామంది విజిటర్స్ వున్నారు."

    కుదరదంటే కాదు. మీరు నాతో రావాలి. నా భవిష్యత్తు, నా అధృష్టం అంతా మీ చేతిలో వుంది. నేనుచాలా టెన్షన్  లో వున్నాను. మీరు నాతో రాకతప్పదు."

    "సరే పద, సరయిన కారణం లేనిదే, నువ్వింత మొండిపట్టు పట్టవు" ఆసనం మీదినుండి దిగి పాంకోళ్ల టకటకలాడించుకుంటూ బయల్దేరాడు అంబాజీ.


                         *    *    *    *

   
    సి.ఎం. కారు ఆయన బంగళా ఆవరణలో ఆగింది.

     మొదటిసారిగా ఆ ఇంటికి వచ్చిన అంబాజీ కారు దిగుతూనే పరిసరాలను పరీక్షగా చూసాడు.

     చక్రవర్తులు వుండదగినట్లుగా వున్న అధునాతనమైన బంగళా.

    ఆవరణలో  దేసవిదేశాలనుండి తెప్పించి నాటుకున్న మొక్కలు. దానికొక  తోటమాలి.

     గణేశ్ ఉత్సవాల సందర్బంగా భక్తులను అలంకరించడానికి రికార్డు డాన్సులు చేసేవాడు. స్టేజీ నాటకాలాడేవాడు. ఆ స్థాయినుండి సినిమా నటుడిగా ఎదిగి హీరో ఛాన్సులు తగ్గుతున్న దశలో రాజకీయాల్లోకి డైవర్టు అయ్యి కొత్త పార్టీ పెట్టి అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కిన  నాయుడి ఇల్లు అలా లేకపోతే  ఆశ్చర్యపోవాలిగానీ వుంటే ఆశ్చర్యమేముంది?

    సి. ఎం. అయ్యాక రెండు చేతులతో కాదు, సహస్ర బాహువులతో సంపాదిస్తున్నాడని పత్రికలవాళ్ల భోగట్టా.

     "మీరొకసారి మా బంగళా అంతా కలియదిరగాలి స్వామీజీ!"

    "ఇంటి వాస్తు చూడాలా?"

    "కొంచెం అలాంటిదే."

    అంబాజీని వెంటబెట్టుకుని ఇల్లంతా తిప్పి చూశాడు నాయుడు.

     "అంతా వాస్తుప్రకారమే కనబడినట్టుందే."

    "నాకు వాస్తు నమ్మకాలున్నాయి. వాస్తు తెలిసిన ఇంజనీర్లచే ప్లాన్ వేయించి కట్టించా."

    "ఇక నేను చూడాల్సింది ఏముంది?"

    "చేతికొచ్చింది మూతికందని స్థితిగా వుంది స్వామీజీ. అదేమిటో మీరు కనిపెట్టాలి. మీరునా అదృష్టరేఖను సరిదిద్దాలి."

    బంగళా అంతా చూశాక అండర్ గ్రౌండ్  కి తీసుకెళ్లాడు.

     "అబ్బో! భూగృహం కూడా కట్టావే.  బ్లాక్ మనీ బాగా కూడబెట్టి వుంటావు. సి. ఎం. పోస్టు అంటే కామధేనువులాంటిది కదా!"

    "అది తప్పదు. ఈ పదవి అలాంటిది. వద్దన్నా వచ్చి పడుతూ వుంటుంది" నసిగాడు.

     మెట్లు దిగగానే పెద్ద హాలు.

     ఎ. సి. చేయడంవల్ల చల్లగా వుంది.
 
     అంతా హాయి అయిన వాతావరణంలో ఏదో... ఏదో ఇబ్బందికర మైన ఫీలింగ్.

     అంబాజీ చుట్టూ గుచ్చి గుచ్చి చూస్తూ - "ఏదో స్మెల్ వస్తోంది నాయుడూ.  నాకీ వాసన సుపరిచితమైందే. నిధి... నిధి వున్నచోట వచ్చేవాసన. కానీ ఇందులో మళ్లీ ఏదో దుర్వాసన  మిళితమై వస్తోంది. అంటే ఆ నిధిని ఏదో ధనపిశాచి ఆవరించి వుండాలి. ఆశ్రమంలో నువ్వన్న మాటకు అర్దం ఇప్పుడు పూర్తిగా బోధపడింది.  నీకు అనుకోకుండా గుప్త నిధి దొరికింది. అది భైరవకొండలోని నిధి."

    నాయుడు చప్పున అంబాజీ పాదాలమీద వాలిపోయాడు.

     "మీరు నాకు అభయం ఇచ్చేవరకూ మీ పాదాలను వదలను."
   
    "దేనికి అభయం?"

    "మీకంతా తెలుసు. నా నోటితో నేనింకేమీ చెప్పను."

    అంబాజీ  నిధులు కనిపెట్టడంలోను, అంజనం వేయడంలోను దిట్ట. అది అతడి గురువు నుండి సంక్రమించిన విద్య.

     అది భైరవకొండలోని  నిధి అని చెప్పడానికి  మాత్రం కథ వుంది.

    నగరం చేరి తన  తెలివితేటలతో ఈరోజు ఎంత ఎత్తుకెదిగినా ఎందరు శిష్యులను సంపాదించుకున్నా, రామాపురంలో వెనకుటి రోజుల్లో  కలసి మెలసి తిరిగిన కొందరు మిత్రులు ఇప్పటికీ తనని కలుస్తుంటారు.

    అందులో బైరవకొండలోని నిధి కోసం ప్రయత్నించి భంగపడిన భాషా కూడా వున్నాడు.  సుబ్రహ్మణ్యస్వామి శ్రీచక్రతో కలసి ఆ నిధిని తెచ్చి ప్రజోపయోగం కోసం ఉపయోగించమని చెప్పి ప్రభుత్వపరం చేయడం, స్వార్దుపరుడైన నాయుడు ఆ నిధిని  లోలోపలే  మాయం చేసి  కట్టుకథలల్లడం అన్నీ అంబాజీకి చేరవేశాడు.  "ఆ నిదికోసం మనం ఎన్నో కష్టాలుపడ్డాం. కొండల్లో, కోనల్లో ప్రయాణం చేసి  పాములబారిన తేళ్ల బారిన పడుతూ  మృత్యువు వెన్నంటి వచ్చినా వెరువక  ట్రై చేశాం. అన్ని కష్టాలుపడ్డ మనకు దక్కకుండా  ఆ సిఎం కొట్టుకుపోయాడే! అది నా బాధ!"

    "శ్రీచక్ర ఎక్కడో విన్నట్టుందే ఆ పేరు?"

    "మన మారుతీ గుర్తున్నాడా? వాడి కొడుకు. ఇప్పుడు మారుతి మారుతికాదులే. మారుతీరావు. సిటీలో పెద్ద బిజినెస్ మాగ్నెట్."

    "అవును. తెలుసు. ఇక్కడే వుంటున్నాడు కదా? నాలుగైదేళ్ల క్రిందట తన కొడుక్కి జయసూర్య ఆత్మ ఆవహించినట్లు అనుమానంగా వుందని, ఆ ఆత్మద్వారా  భైరవుని కొండలోని నిధి రహస్యం తెలుసుకునే  అవకాశం వుందేమో చూడమని నన్ను తీసుకెళ్లాడు. శ్రీచక్రని ముగ్గులో  కూర్చోబెట్టి జయసూర్య ఆత్మను ఆవహింపజేసి ఆ నిధి రహస్యం  రాబట్టే ఫ్రయత్నంలో నేను ఘోరంగా  దెబ్బతిన్నాను అతడి చేతిలో. జయసూర్య శక్తి ఉపాసకుడు. శక్తి ఉపాసకుల ముందు ఎంతటి మంత్రగాడూ నిలువలేడు."

    "ఏం జరిగింది?" కుతూహలంతో ప్రశ్నించాడు భాషా.

     "ఏం జరిగిందో జరిగింది. పూజలో వుండగా నా ఉత్తరీయం అంబముందు వెలిగించిన అఖండ జ్యోతి మీద పడింది. కనుమూసి తెరిచేలోగా నా శరీరం మంటల్లో చిక్కుకుంది. ఆ దెబ్కు హాస్పిటల్లో మూడునెలలు పడ్డాను. ఇవిగో కాలిన గుర్తులు." చొక్కాపైకి తీసి చూపించాడు. "అప్పుడే  తీర్మానించుకున్నాను శ్రీచక్రమీద ప్రతీకారం తీర్చుకోవాలని.  కానీ నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి వాడు పై చదువులకు విదేశాలకు వెళ్ళాడని  తెలిసింది. ఆ తరువాత ఆ విషయం  మరుగున పడ్డట్టుగా అయింది. ఇప్పుడు మారుతీ కొడుకు ఇక్కడే వున్నాడన్నమాట. అతడి సంగతి తేల్చుకుంటాను."

    "శక్తి ఉపాసకుల ముందు ఎంతటి మంత్రగాడూ ఆగలేడని అన్నావ్?"

    "శక్తి కూడా అంతేకదా! నేను అంబ పూజ చేస్తాను. నా గురువు గొప్ప మంత్రవేత్త.  అణిమాది అష్టసిద్దులను పొందినవాడు.  నామీద పుత్రవాత్సల్యం వుండేది ఆయనకు. అనర్ఘరత్నాలనతగ్గ మంత్రాలను నాకు ఉపదేశించాడు. కానీ ఆయన చెప్పిన నియమాలకు నేను కట్టుబడి వుండలేదు.  ఆయన చెప్పిన నియమాలకు కట్టుబడి మంత్రశుద్ది చేసి వుంటే ఆ జయసూర్యని  ఇలా గాల్లో ఉఫ్ న వూదేసేవాడిని.  ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రీచక్రం వేసి మండలం రోజులు శ్రీలలితోపాసన చేశానంటే, ఈ జయసూర్యనేమిటి అతడి తాతలను కూడా గడగడలాడించేస్తాను."

    "ఇంకా జయసూర్య ఆత్మ ఎక్కడుంది అంబాజీ! అతడే  శ్రీచక్రగా పుట్టాడని, పూర్వజన్మ జ్ఞాపకాలున్నంతవరకే కృష్ణభూపాల్ గారి అవసాన దశలో మనూరికి వచ్చి ఆయనకి అంత్యక్రియలు నిర్వహించి కర్మకాండ నిర్వహించాడని జనం చెప్పుకుంటున్నారు.

     భూపాల్ గారి స్థిరచరాస్థులన్నీ వీలునామా ప్రకారం శ్రీచక్రకే చెందాయి తెలుసా? అసలు మేం ఆరునెలలు జైల్లో వుండి వచ్చింది ఈ శ్రీచక్రవల్లే. ఎస్పీ రవికుమార్ ని తీసుకెళ్లి జయసూర్యని పూడ్చిపెట్టిన  చూపించింది  ఈ శ్రీచక్రే" అంటూ ఆ సంగతంతా చెప్పుకొచ్చాడు బాషా.

    "అతడే శ్రీచక్రగా పుట్టాడా? అయితే మరీ మంచిది. అతడే అయితే అతడి శక్తి వున్నతంగానే వుంటుంది. ఆత్మ అయితే అతడి శక్తి రెట్టింపవుతుంది. ఆత్మని  ఎదుర్కోవడంకంటే మనిషిని ఎదుర్కోవడం తేలిక."

    పాతికేళ్ల క్రితం జయసూర్య డాక్టరై తమ ఊరికి రావడం, అతడు బీదల  గురించీ, రోగుల గురించీ తాపత్రయపడడం, నిధిదొరికితే గ్రామ ప్రజలకోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆశపడడం, నిధి అన్వేషణకు అతడు నల్లమల అడవికి రావడం,  నల్లమలలో నిద్రించిన ఆ రాత్రి జయసూర్య తన స్వప్నవృత్తాంతం చెప్పడం... అదంతా అంబాజీ జ్ఞాపకాల పొరల్లో భద్రంగా వుంది.

     గతజన్మలో అతడు నిజంగా చెంచు యులకుడు తిమ్మడే అయితే, అతడు మంత్ర శాస్త్రాన్ని ఔపోసపట్టినవాడు. మంత్ర సాధనకు అంకితమైతే తను ప్రేమించిన పడతినే నిధికి బలి ఇచ్చేందుకు కఠోరత కలుగుతుంది. అది మహా మంత్రవేత్తలకే సాధ్యం.

     డాక్టర్ జయసూర్య.

    మహామనిషి అనతగ్గ ఉత్తమ వ్యక్తిత్వం.

     అకాల మరణంతో పైశాచికత్వం పొందిన చంద్రరేఖ ఆత్మ నుండి తప్పించుకోడానికి అతడు హనుమంతో  పాసన కూడా చేశాడు.

     ఇప్పుడు జన్మజన్మల సంచితమైన ఆత్మశక్తితో ఎదిగిపోయిన శ్రీచక్రని ఎదుర్కోవడమంటే మాటలు కాదు.

     చూపుతోనే తనని మంటలకి ఆహుతి చేయబోయిన అతడిని ఎదుర్కోవడమంటే మృత్యువుతో తలపడినట్టే!

     జయసూర్య తమ మిత్రుడు. కానీ తనని మంటలకి ఆహుతి చేయబోయాడు.

     ఆ మైత్రిని భంగపరచింది అతడే.

     ప్రతీకారం తీర్చుకోకపోతే తన శిష్యుడు ఇంత చేతకాని వాడైతే అణిమాది అష్టసిద్దులు పొందిన తన గురువుకే అవమానం. గురువుగారు ఉపదేశించిన అనర్ఘరత్నాలనదగ్గ మంత్రాలు తన దగ్గరున్నాయి.

 Previous Page Next Page