Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 43


    అతను మాట్లాడకుండా క్రిందికి దిగి వెళ్ళిపోయాడు.

 

    ఆమె కాఫీ ముగించాక అద్దంముందు నిలబడి ముఖం చూసుకుంది. నిద్రలేని కారణంచేతా, ప్రయాణపు బడలికవల్లా ముఖమంతా వాడిపోయి వుంది. కళ్ళు కొంచెం ఎర్రబారినాయి, జుట్టంతా రేగిపోయి తలవెంట్రుకలు ముఖంమీదకు చిందరవందరగా పడుతున్నాయి. ఆమె ఒకసారి జుట్టు సరిచేసుకుంది. తరువాత స్నానం చేయాలనిపించింది. బాత్ రూం గదికి కలిపే ప్రత్యేకంగా వుంది. సూటుకేస్ తెరచి అందులోంచి చీరె, కొన్ని బట్టలూ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుంది.

 

    ఓ పావుగంట గడిచాక ఆమె స్నానం ముగించి చీరె కట్టుకుని యువతలకు వచ్చేసరికి వంటవాడు కుర్చీలో కూర్చుని వున్నాడు. ఆమెకి చికాకు కలిగింది. తనని చూసి వాడు వెంటనే లేస్తాడనుకుంది. కాని అతడు లేవలేదు. చూసీ చూడనట్లు ఊరుకున్నాడు.

 

    ఆమెకి పట్టరాని ఆగ్రహం కలిగింది. వీడు... వంటచేసే వెధవ తనముందు కూర్చిని వుండడమా? "అక్కడ్నుంచి లే" అని గట్టిగా అరుద్దామనుకుంది. కాని వాడితో అవసరం వుంది కదా అని తమాయించుకొని ఊరుకుంది తను.

 

    ఎట్లా యిప్పుడు? తను తల దువ్వుకోవాలి. వాడక్కడ అట్లా కూర్చుని మిడిగుడ్లు పెట్టుకొని అసహ్యంగా చూస్తుంటే ఎట్లా దువ్వుకుంటుంది తను.

 

    "నువ్వు కొంచెం అవతలికి వెళ్ళు. నేను తల దువ్వుకోవాలి" అంది అతనివైపు చూడకుండా.

 

    వంటవాడు అక్కడ్నుంచి కదల్లేదు. ఆమెవంక ఓచూపు చూశాడు "తల దువ్వుకోవటానికి నేను అవతలకెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? చీరె కట్టేసుకున్నారుగా" అన్నాడు.

 

    మనోరమ ఈ సమాధానం విని నిర్ఘాంతపోయింది. అతని దగ్గర్నుంచి యిలాంటి మాట వినవల్సివస్తుందని పొరపాటున కూడా అనుకోలేదు. ఛడామడా తిట్టేద్దామనుకుంది. వాడు తనని అమ్మా అనిగాని, అమ్మగారూ అనిగానీ, సంబోధించకుండా ఎంత అహంతో మాట్లాడాడు?

 

    వాడ్ని చివరికి ఏమీ అనలేక కోపాన్ని చంపుకుని సూటుకేసులోంచి దువ్వెనతీసి అద్దంవైపు తిరిగి తల దువ్వుకోసాగింది.

 

    వంటవాడు జేబులోంచి సిగరెట్టుతీసి కాల్చుకుంటూ పొగవదులుతూ, మధమధ్య ఆమెనోకంట గమనిస్తూ కూర్చున్నాడు.

 

    మనోరమ యిదంతా కనిపెడుతూనే వుంది. ఆమె శరీరమంతా తేళ్ళూ, జెర్రులూ పాకినట్లుగా వుంది. గబగబ తనపని ముగించుకోసాగింది.

 

    ఆమె జడ వేసుకోవటం పూర్తిచేసి ఇటు తిరగ్గానే అతను "నేను స్నానం చేస్తాను" అన్నాడు తాపీగా.

 

    "చేసిరా."

 

    అతను లేచి నిలబడి ఆమెకి కాస్త దగ్గరగా వచ్చి "తువ్వాల ఇవ్వండి" అన్నాడు.

 

    "ఏమిటి?" అంది కోపంతో పెదవులు వణుకుతుండగా.

 

    అతను ఏమీ చలించలేదు. "అవును. నా వస్తువులేమన్నా తీసుకోనిచ్చారు గనుక" అన్నాడు.

 

    ఆమె కోపాన్నంతా తనలోనే దిగమ్రింగుకుంటూ తువ్వాల అతనివైపు విసిరేసి "తీసుకో" అని అరిచింది.

 

    అతను ఆమె ధోరణినేమీ లక్ష్యం చెయ్యకుండా తుండు భుజంమీదకి వేసుకుని బాత్ రూంవైపు పోతున్నాడు.

 

    "ఎక్కడికటు?" అందామె రూక్షస్వరంతో.

 

    "స్నానానికి?"

 

    "ఇక్కడ చెయ్యొద్దు. క్రింద ఎక్కడికన్నా పోయి చెయ్యి."

 

    అతనాశ్చర్యంగా ఆమెవైపు చూసి "మరి ఎక్కడ చేస్తాను? మనం ఈ గది తీసుకున్నాం. బాత్ రూం ఇక్కడే వుంది" అని లోపలకు వెళ్ళబోతూ "సబ్బు లోపలే వుందికదూ" అన్నాడు.

 

    ఆమె నిరుత్తరాలయింది. గుడ్డప్పగించి చూడసాగింది. అతను రెండు క్షణాలు సమాధానంకోసం నిరీక్షించి, ఆమె మాట్లాడకపోయే సరికి చల్లగా లోపలికి పోయి తలుపు మూసుకున్నాడు.

 

    ఓ నిముషం పోయాక లోపలినుండి నీళ్ళచప్పుడూ, సన్నని కూనిరాగం వినిపించసాగాయి.

 

    మనోరమకి కడుపులో దేవినట్లుగా అయింది. శరీరం రోమాంచిత మయింది. వీడు ఎందుకిట్లా చనువు తీసుకుంటున్నాడు? ఎందుకు ఏమీ గట్టిగా అనలేకపోతోంది తను? ఈ పళంగా వాడ్ని యిక్కడే వదిలేసి తన మానాన తను వెళ్ళిపోదామనుకుంది. కాని ఇప్పుడెక్కడికి పోతుంది? రాత్రిదాకా తను ఇక్కడే తల దాచుకోవాలాయె.

 

    ఆమె ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుంది.

 

    కాసేపు గడిచాక వంటవాడు స్నానం ముగించుకొని, తిరిగి అంతకు ముందు వేసుకున్న బట్టలనే వేసుకుని ఇవతలకి వచ్చాడు. సరాసరి అద్దం ముందుకు వెళ్ళి ఇందాక మనోరమ అక్కడ వదిలివేసిన దువ్వెనతో తల దువ్వుకోసాగాడు.

 

    దువ్వుకోవటం అయినాక ఆమెవంక తిరిగి "నేనలా బయటకు వెళ్లివస్తాను. మీరు ఒక్కరే వుండగలరు కదూ" అన్నాడు.

 

    ఆమె సమాధానంగా తల ఆడించి ఊరుకుంది.

 

    "మీకు బజారునుంచి ఏమన్నా తెచ్చిపెట్టమంటారా?"

 

    "అక్కర్లేదు" అన్నట్లుగా చూసింది.

 

    అతను కొంచెం దగ్గరకు వచ్చి "ఒక అయిదు రూపాయలిలా ఇవ్వండి. కావాలి" అన్నాడు.


    
    ఆమె మారు మాట్లాడకుండా సూట్ కేసు తెరచి అందులోంచి ఓ అయిదు రూపాయలనోటు తీసి అతనివైపు విసిరింది.

 

    అతనది తీసుకొని "ఓ రెండు గంటల్లో వస్తాను" అని వెళ్ళిపోయాడు.

 

    అతను గదిబయటకి అడుగుపెట్టగానే మనోరమ ఒక్క ఉదుటున లేచి వెళ్ళి తలుపులు గడియపెట్టేసింది. అద్దం దగ్గరకు వెళ్ళి దువ్వెన చేతుల్లోకి తీసుకుని రెండుముక్కలుగా విరిచి మూలకి విసిరిపారేసింది. బాత్ రూంలోని సబ్బుని నేలమీదికి గిరాటేసి కాలితో అవతలికి తోసేసింది. వాష్ బేసిన్ దగ్గర శుభ్రంగా చేతులు కడుక్కుని వచ్చి పరుపుమీద వాలిపోయింది.

 Previous Page Next Page