Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 44

 

        దూరంనుంచి సాహితిని చూసి గూర్ఖా లోపలికి పరుగెత్తాడు. ఇల్లంతా లైట్లు వేసి వున్నాయి. అర్దరాత్రి సూట్ కేస్ తో ఇంటికి తిరిగోచ్చిన కూతుర్ని, నిర్మల భోరున ఏడుస్తూ వచ్చి వాటేసుకుంది. "ఏం పాపం చేశానమ్మా? నేనేం పాపం చేశాను? ఇలా ఇంట్లోంచి ఆడపిల్ల అలిగి వెళ్ళిపోతే ఎంత అప్రదిష్ట! అయినా నువ్వు లేకపోతే ఇక నా బ్రతుకు ఎందుకు? ఈ రాత్రి నువ్వు తిరిగి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుని వుండేదాన్ని" అని బావురుమంది.
   
    సాహితికి ఆవిడను చూస్తే జాలేసింది. కోపంతో ఎగిరి పడుతుందనుకున్న తల్లి, ఇంత హృదయ విదారకంగా ఏడవటం చూస్తే బాధ కలిగింది. ఆమెకూడా తల్లిని కౌగిలించుకొని "ఊర్కో మమ్మీ! వచ్చేశాగా నువ్వింత బాధపడతావని తెలిస్తే నేనిలా చేసేదాన్ని కాను. ఇంకెప్పుడూ యిలాంటి పనులు చేయను" అంది.
   
    ఈ సిట్యుయేషన్ గానీ భరద్వాజ చూసివుంటే 'కౌగిలింతలో కరిగిపోయిన కష్టాలు' అన్న నవల వ్రాసి వుండేవాడేమో.
   
    నిర్మల కళ్ళనీళ్ళు తుడుచుకుంది. ఇద్దరూ ఒకర్నొకరు పొదివి పట్టుకుని అలాగే లోపలికి వెళ్ళారు.
   
    లోపల దేవుడి గదిలో పరమహంస బాసింపట్టు వేసుకుని సమాధిలో కూర్చున్నాడు. నిర్మల వెళ్ళి అతని కాళ్ళమీద పడింది. "మీ తపశ్సక్తి అమోఘం. మీరు అన్నట్టుగానే మీరు సమాధిలోంచి లేవకముందే అమ్మాయి ఇంటికి వచ్చేసింది."
   
    పరమహంస కళ్ళు తెరిచి సాహితివైపు చూసి నవ్వాడు.
   
    సాహితి మౌనంగా తన గదిలోకి వెళ్ళింది. అప్పటివరకూ వున్నసంతోషం ఒక్కక్షణంలో పోయింది. అల్మెరా వెతుక్కుంది. కావల్సింది దొరికింది. ఈసారి రెట్టింపు డోసు వేసుకుంది.
   
    అక్కడ సమాధిలోంచి లేచాక పరమహంస స్నానం చేశాడు. టైము రాత్రి పదకొండున్నర అయింది. నిర్మల మల్లెలు తలలో తురుముకుంటుంది. "ఇప్పుడే సాహితితో మాట్లాడి వస్తాను నిర్మలా!" అని ఆ గదిలోకి వెళ్ళాడు. ఆపాటికే సాహితి మత్తులోకి జారుకుంది. 'కాస్త జరుగమ్మా?' అని ప్రక్కలో కూర్చున్నాడు.
   
    "ఎందుకు వెళ్ళావమ్మా? మేము ఎంత భయపడ్డామో తెలుసా?"
   
    "ఊ? ఊ??"
   
    "నువ్వు అలా వెళ్ళిపోతే ఎక్కడ బ్రతగ్గలవు? ఇంత డబ్బులో పెరిగి ఇంత సుఖంలో పెరిగిన దానివి..... అవునా?"
   
    "అవ్....అవును."
   
    "నువ్వు వెళ్ళిపోతే అమ్మ చచ్చిపోతుంది. అమ్మను చంపేస్తావా?"
   
    "చంపను.... చమ్ పను" మత్తుగా సమాధానం ఇచ్చింది.
   
    "మ్న కుటుంబ విషయాలు బయట ఎక్కడా చెప్పకూడదు. చెప్తే నాన్న ఆత్మ క్షోభిస్తుంది. అవునా?"
   
    "అ.....అవును...."
   
    భవిష్యత్ పట్ల భయం, సెంటిమెంటు పట్ల బలహీనత, సామాజిక కట్టుబాట్ల పట్ల నిస్సహాయత ఆమెలోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు అతడు.
   
                           *    *    *
   
    "నీ కథంతా వింటే నాకు ఒకటే అనిపిస్తుంది. భవిష్యత్తు పట్ల భయం, సెంటిమెంట్ల పట్ల బలహీనత, సామాజిక కట్టుబాట్ల పట్ల నిస్సహాయత.....ఇవే మనుషుల్ని బాధ పెడతాయి, వేదనకి గురిచేస్తాయి" అన్నాడు భరద్వాజ.
   
    పావని అర్ధంకానట్టు చూసింది.
   
    రజని ఆమెతో నవ్వుతూ, "మా నాన్నగారు మాట్లాడే మాటలు సగం అర్ధం కావు లెండి. నవలల్లో పతఃరాలు మాట్లాడినట్లు చెపుతారు" అంది. భరద్వాజ పావనిని ఇంటికి తీసుకొచ్చాడు. భరద్వాజకి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు పెద్దమ్మాయి రజనిని పదహారేళ్ళుంటాయి.
   
    పావని అతడికి కార్లోనే తన కథంతా చెప్పింది. సాహితి కథ విన్నప్పుడు అతడంతగా ఫీలవలేదు. అసలది అతడికి ఒక సమస్యగానే కనబడలేదు. కానీ ఇక్కడ విషయం వేరు. కనీసం మగతనం కూడా లేని ఒకడు, కేవలం తను పురుషుడు అయినందుకు కట్నం ఆశించటం, పురుషాధిక్యత నిరూపించుకోవటం కోసం భార్యని బాధపెట్టి నిస్సహాయురాల్ని చేయటం అతడికి బాధనిపించింది. "అసలిదంతా ఇంతకాలం ఎలా సహించావు?"
   
    "లేకపోతే ఏం చేయాలి?"

    "ఇలా కన్నా  ఇంకోరకంగా మన జీవితం బాగుంటుందని అనిపించినప్పుడు దీన్ని వదిలిపెట్టి అలా జీవించడంలో తప్పేముంది? అలా ఎందుకు ప్రయత్నించరు?"
   
    రజని కల్పించుకుంటూ - "మరీ అలా చెపుతావేంటి నాన్నా? జీవితం అంటే భోజనమా ఏమిటి? ఈ కూర బావోలేదని అన్నం ప్రక్కన పెట్టేసి మరొక కూర వేసుకుని తినటానికి" అని పావనివైపు తిరిగి- "మీరేమీ అనుకోకండి. మా ఇంట్లో యిలాగే ఉపమాన ఉపమేయాలతో గ్రాంధిక భాష మాట్లాడుకుంటూవుంటాం. ఊ.....చెప్పు చెప్పు నాన్నా! ఈ అమ్మాయి తన పాత జీవితాన్ని వదిలిపెట్టేసి వుండాల్సిందా! అలాగయితే మన దేశంలో సగంమంది ఆడవాళ్ళు తమ సంసారాల్ని వదిలి, ఒంటరిగా వుంటే ఎలా వుంటుందో ప్రయోగం చెయ్యాలి" అంది.
   
    "నేనన్నది అదికాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. నాకు పెళ్ళి కావటం లేదు, వరకట్న సమస్య! నాకు ఉద్యోగం లేదు- నిరుద్యోగ సమస్య!! మా ఆయన చిన్న ఇల్లు పెట్టాడు - భద్రతా రాహిత్య సమస్య!!! ఇలా రకరకాల సమస్యలతో రకరకాలుగా బాధపడుతూ వుంటారు. ఈ బాధలన్నిటికీ సామాజిక స్పృహతో పరిష్కారాలు వ్రాయమని, రచనలు చేయమనీ అడుగుతుంటారు. అన్ని సమస్యలకీ వ్యక్తిత్వం పెంచుకోవటం ఒకటే పరిష్కారమని చెబితే వినిపించుకోరు. ఈ రాత్రి సాహితీ సభలో జరిగిన గలాభా కూడా నేను ఈ విషయం చెప్పినందుకే."
   
    "కానీ ఈ అమ్మాయికి చదువులేదు, డబ్బులేదు నాన్నా."
   
    "ఆ రెండే సరిపోతే మరి చదువూ, డబ్బూ వున్న సాహితి అనే అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది....?" ఎదురు ప్రశ్న వేశాడు.
   
    ఎవరూ మాట్లాడలేదు.
   
    అతనే అన్నాడు- "జీవితాన్ని ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్ గా మొదలుపెట్టవచ్చు పావనీ! రేపట్నుంచే కొత్త జీవితం ఎలా ప్రారంభించాలో నువ్వు కృషి చెయ్యి. ఇంతకన్నా ఎక్కువ ఆనందంగా ఎందుకు బ్రతకవో చూపించు" అని అక్కన్నుంచి లేచాడు.
   
    రజని నవ్వి, "మొత్తానికి పావనిగారిని నువ్వు చాలా కష్టపెట్టబోతున్నావ్ నాన్నా! అసలు అమ్మాయిలు ఇలా కష్ట పెట్టె వాళ్ళ కారులకింద పడకూడదు. ఏ కుర్రాడు కారు క్రిందో, లేదా భార్య మరణించిన మధ్యవయస్కుడి కారు క్రిందో పడాలి. అతడి పిల్లలకి ఆయాగా వెళ్ళి, శుభానికి ఒక లైను ముందు అతడి గుండెలమీద వాలిపోవాలి" అంది.
   
    భరద్వాజ ఆమె తలమీద మొట్టి "చాలా రాత్రయింది వెళ్ళి పడుకో" అన్నాడు. ఆమె వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయింది పావని.....! ఆమె కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళుతిరిగాయి. ఒకప్పుడు తనూ తండ్రి దగ్గర యిలాగే వుండేది.
   
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్? ఈ రాత్రికి పడుకో రేపేం చెయ్యాలీ అన్నది ఆలోచిద్దాం."
   
    "మీ అమ్మాయిని చూస్తూంటే ముచ్చటగా వుందండీ" అంది పావని మనస్ఫూర్తిగా.
   
    "ఎందుకు?"
   
    "ఆ నవ్వూ, ఎప్పుడూ హుషారూ, చలాకీతనం."
   
    "మా భాషలో చెప్పాలంటే సెల్స్ కాన్ఫిడెన్స్."
   
    "అంతంత పెద్ద మాటలు నాకు తెలీదనుకోండి. కానీ మీలాంటి నాన్నగారూ, డబ్బూ, ఆ అమ్మాయికున్న చదువు అన్నీ వుండబట్టేగా ఆ చలాకీతనం వచ్చింది."
   
    "నీ సిద్దాంతం తప్పు పావనీ! అదే నేను చెప్పేది" తలుపు దగ్గరగా వెళ్ళి అన్నాడు. "సమస్యని సరయిన కోణంలో చూస్తే పరిష్కారం దొరుకుతుంది. మరణాన్ని సరైన కోణంలోంచి ఆహ్వానించగలిగితే బ్రతికినంతకాలం ఆనందం మిగులుతుంది. దానికి సజీవ తార్కాణం నా కూతురు....మరణం అంచున బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే నా కూతురు రజని."
   
                                6
   
    'చేతన' కార్యాలయం స్థాపించబడి పదేళ్ళు దాటింది. ఏ దారీ లేని అనాధలకు, నాధులుండీ వాళ్ళ చేత నానా రకాల హింసలు పడుతూ భరించలేక పారిపోయి వచ్చే యువతులకూ అక్కడ ఆశ్రయం దొరుకుతుంది. ఏ మాత్రం చదువులేని అమాయకులకి కూడా అక్కడే స్థానం వుంది. వాళ్ళకు ఏదో ఒక వృత్తి చూపించి, శిక్షణ ఇచ్చి తమ కాళ్ళమీద తాము నిలబడగలిగే వరకు వాళ్ళను పోషిస్తుంది చేతన.
   
    'చేతన'కు కార్యదర్శి భారతీదేవి ఆవిడ పట్టుదల, తీసుకునే శ్రమవల్లనైతేనేమి, సంస్థని చాలా సమర్ధవంతంగా నడపగలుగుతోంది.

 Previous Page Next Page