భారతీదేవి వయసు అరవై డెబ్బై మధ్య వుంటుంది. రోజంతా చురుగ్గా పనిచేస్తుంది. ఒక్క విషయమైనా వృధాగా పోనివ్వదు. ఆ వయసులో ఆవిడ ఉత్సాహం, ఓపిక చూస్తూంటే ఎవరికయినా ఆశ్చర్యం కలుగుతుంది. ఆవిడ ఆలోచనా విధానం, ఆవిడ ఇచ్చే ప్రోత్సాహం ఏ స్త్రీకయినా తనమీద తనకి నమ్మకం కలుగుతుంది. పావనిని 'చేతన'లో చేర్చి వెళ్ళిపోయాడు భరద్వాజ. ఈ కథలో అతడు కేవలం కెటలిస్టు మాత్రమే! ఆవిడ జరిగిందేమిటో వివరంగా అడిగి తెలుసుకుంది. అప్పటికే తన భవిష్యత్తుని పదే పదే ఆలోచించిన పావనికి, భరద్వాజతో చెప్పినప్పటి ధైర్యంపోయి దైన్యం, భయం ఆవరించుకున్నాయి. ఒక స్త్రీగా ఆవిడ అనునయించి అడిగేసరికి దుఃఖం ముంచుకొచ్చింది. "అమ్మా! నాలాంటి జీవితం పగవాళ్ళకు కూడా వద్దు. భర్త, తండ్రీ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ వుండి కూడా లేని అనాధనయ్యాను. నా గతేమిటిప్పుడు?" వెక్కి వెక్కి ఏడ్చేసింది.
పావని పూర్తిగా తేరుకునేవరకు భారతీదేవి ఏమీ మాట్లాడలేదు. అలాంటి కథలు వినీ వినీ మనసు మొద్దుబారిపోయినందువల్ల కాదు......ఆ దుఃఖమే వాళ్ళకు ఉపశమింప చేస్తుందని అనుభవం వలన ఆమె తెలుసుకుంది.
"చూడు పావనీ! నువ్వు చాలా కష్టంలో ఉన్నావు. నిజమే....కానీ ఒక్కసారి బయట హాల్లోకి వెళ్ళి చూడు,. అక్కడ వాళ్ళ కథలు అడిగి తెలుసుకో నీకంటే అభాగ్యులు చాలామంది కనిపిస్తారు. నీ భర్త డబ్బు కాంక్ష నపుంసకత్వం నిన్నెంత బాధపెట్టిందీ చెప్పావు. శృంగారం పేరిట సిగరెట్టు పీకలతో కాల్చి, గుండుసూదులతో గుచ్చి ఆనందించే భర్తలనుంచి పారిపోయి వచ్చిన భార్యలు యిక్కడ కనిపిస్తారు. తాళికట్టిన భర్తలే డబ్బుకోసం భార్యని పరాయి మగవాడి పక్కలోకి తోస్తుంటే అసహ్యించుకొని తప్పించుకు వచ్చిన యువతులున్నారు. అన్నం తింటుంటే నీ భర్త అనరాని మాటలంటాడనీ, ముద్ద మింగుడుపడదనీ అన్నావు. రోజంతా చాకిరీ చేయించి ఓ ముద్ద అన్నం పెట్టకుండా మాడ్చి చంపే భర్త నుంచి పారిపోయిన వాళ్ళున్నారు. డబ్బుకోసం నీ భర్త వేధించాడు. నిజమే..... లక్షల కట్నం తీసుకుని, భార్య నెలకు ఇరవై వేలు జీతం సంపాదించి తెస్తున్నా, పుట్టింటినుంచి తెచ్చింది సరిపోలేదని ఒంటినిండా వాతలు పెడుతూంటే ఈ సంస్థను శరణు కోరిన వాళ్ళను చూపిస్తాను. నీ భర్త ఓ స్త్రీని చెల్లి అంటూ పిలుస్తూనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అన్నావు. భార్యముందే పరాయి స్త్రీలను పడగ్గదిలోకి తీసుకెళ్ళి అంతకంటే అసభ్యంగా ప్రవర్తించే భర్తల విషయం నీకు వీరివల్ల తెలుస్తుంది. వాళ్ళ సమస్యముందు నీ సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇరవై ఒకటో శతాబ్ధంలో అడుగు పెడుతున్న పవిత్ర భారత సమాజంలో ఈనాటి స్త్రీ పరిస్థితి ఇదేనమ్మా దీనికి కారణాలు ఏమిటని యిప్పుడు విశ్లేషించను. ఒక విషయం మాత్రం చెపుతాను. స్త్రీ అయినా, పురుషుడైనా తన హక్కుల్ని, స్వాతంత్ర్యాన్ని తనే సాధించుకోవాలి. తన కష్టాలను పదే పదే తలచుకుని బాధపడుతూ ఎదుటివాళ్ళ సానుభూతి మాత్రం ఆశిస్తూ గడపటం వలన వచ్చే ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. అలా చెయ్యకపోతే రాముడు పుట్టిన ఈ దేశంలో సగంమంది స్త్రీలకి పెళ్ళే ఒక 'అగ్నిప్రవేశం' అమ్మా."
* * *
పదిహేను రోజులు గడిచేటప్పటికి పావని అక్కడ వున్న స్త్రీలు అందరి గురించి తెలుసుకుంది. రకరకాల సమస్యలు, కనీవినీ ఎరగని వింత కష్టాలు. తనకున్నపాటి కొద్ది చదువు కూడా ఎవ్వరికీ లేదు. బుట్టలల్లుకోవడం, టైలరింగ్ నేర్చుకోవడం, ఎంబ్రాయిడరీ చేయడం లాంటి పనులు నేర్చుకుంటున్నారు. తన కాళ్ళమీద తను నిలబడాలనే స్థయిర్యం కలిగించుకుని కష్టపడి పనిచేస్తున్నాడు. పావనికి ఏ పని నేర్చుకోవాలో మొదట అర్ధం కాలేదు. కుట్లు, అల్లికలు స్కూల్లోనే నేర్చుకుంది. కానీ అదే బ్రతుకు తెరువుగా ఏర్పరచుకోవడం ఇష్టంగా అనిపించడంలేదు. ఆమె సమస్య భారతీదేవి తీర్చింది.
చేతన లాంటి సంస్థల్లో స్త్రీలచే తయారు చేయబడ్డ వస్తువులు అమ్మడానికి స్త్రీ సంక్షేమశాఖ వాళ్ళు నిర్వహిస్తున్న ఓ షోరూంలో పావనికి ఉద్యోగం ఇప్పించింది. చదువుకుంది కాబట్టి అక్కౌంట్లు వ్రాయడం కూడా ఆమెకే అప్పగించారు.
మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పావనికి చాలా భయం వేసింది. ఉద్యోగం చేయాల్సొస్తుందని కలలో కూడా వూహించలేకపోవడం ఒక కారణం. పదిమందిలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం మరో కారణం. మొదటి రోజు కస్టమర్ల ప్రశ్నలకు జవాబులివ్వడానికే తడబడింది. ఆమెతోపాటు మరో ఇద్దరు సేల్స్ గర్ల్స్, ఒక క్యాష్ కౌంటర్ క్లర్కు వున్నారు. సాయంత్రమవగానే లెక్కలుకట్టి, క్యాష్ టాలీ చేసుకుని బయటపడింది పావని. ఆమెకు తృప్తిగా అనిపించింది. కాస్త అలవాటైతే ఈ ఉద్యోగం చెయ్యడం అంత కష్టం కాదు. ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె గాల్లో తేలిపోతూ 'చేతన' కి తిరిగొచ్చింది. గేటు దగ్గరే సహోధ్యాయి కమల కనిపించింది.
"మీ నాన్నగారట! వచ్చి చాలా సేపైంది. నీ కోసం విజిటర్స్ రూంలో ఎదురు చూస్తున్నారు" అంది. పావనిలో ఉత్సాహమంతా అణగారిపోయింది. ధైర్యం కూడగట్టుకుంటూ విజిటర్స్ గదివైపు అడుగులేసింది. విశ్వపతి మొహం చాలా గంభీరంగా వుంది. పావని నెమ్మదిగా వచ్చి ఎదురు కుర్చీలో కూర్చుంది.
విశ్వపతి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. తను పెంచిన కూతురేనా అన్నట్టు చూశాడు. పావని కళ్ళు క్రిందికి దించుకోలేదు. "ఎప్పుడు వచ్చావ్ నాన్నా?" అనడిగింది.
"ఈ రోజు ఉదయమే. అసలు వారం క్రితమే రావాల్సింది. అబ్బాయికి ఫోన్ చేస్తే 'ఊరెళుతున్నాం రాకండి' అన్నాడు. అసలు విషయమిదీ అని నాకు తెలీదు. ఎందుకింత పనిచేశావు పావనీ?" అతని స్వరంలో బాధ, కోపం తొంగిచూశాయి.
పావనికి నవ్వూ, దుఃఖమూ కలిగాయి. 'ఎందుకింత పని చేశావు?' అని అడగటంలోనే తప్పుచేశానన్న భావం కన్పిస్తోంది. "ఏం చేశాను నాన్నా? ఏం జరిగిందని. ఆ భాస్కరరామ్మూర్తి నీతో ఏం చెప్పాడు?" అంది 'భాస్కరరామ్మూర్తి' అని అనటంలో వ్యంగ్యం అతని దృష్టి దాటిపోలేదు.
"ఏం జరిగిందో నువ్విక్కడ వుండటంలోనే అర్ధమైపోతూందిగా! సమస్యలు ప్రతీ ఇంటా వుంటూనే వుంటాయి పావనీ. సర్దుకుపోక తప్పదు. నువ్వు నా దగ్గరకు రావల్సింది. కనీసం ఇలా జరుగుతోందని ఓ ఉత్తరమైనా వ్రాయలేదు."
"వ్రాస్తే ఏం చేసేవాడివి నాన్నా?"
"అల్లుడిని కూడా పిలిపించి సామరస్యంగా మాట్లాడేవాడిని. తప్పు అతనిదైతే మందలించేవాడిని."
"అంటే.....'ఈసారి కిరసనాయిలు పోస్తే పూర్తిగా తగల బడేట్టు చూడు. గట్టిగా పట్టుకుని సగంలో అలా వీధిలోకి పోనివ్వకు' అని చెప్పేవాడివా? లేదా పెట్రోలైతే సులభమని సలహా ఇచ్చేవాడివా?"
"పావనీ!" అతనరిచాడు. "ఆ పరిస్థితుల్లో ఏ మగవాడైనా అలాగే ఆవేశపడతాడు. అతను చేసింది తప్పే. కానీ అతనికంత ఆవేశం...." విశ్వపతి మాటలు పూర్తికాకుండానే...."అంటే అతను చెప్పింది నువ్వుకూడా నమ్ముతున్నావా నాన్నా?" అంది. "అతనికి నేను తెలిసి రెండేళ్ళే అయింది. కానీ మీకు ఇరవయ్యేళ్ళుగా తెలుసు. అయినా నువ్వు నమ్మటంలేదు" విషాదంగా నవ్వింది.
"పొరపడుతున్నావు. అతనూ నమ్మలేదు కానీ పదిమందిలోనూ రామనాథమలా చెప్పేసరికి ఏ మగాడికైనా రక్తం మరుగుతుంది. అయినా అల్లుడు జరిగిందానికి చాలా బాధపడుతున్నాడు."
"క్షమించండి నాన్నా! నేను రాలేను" అంది మర్యాదగా.
"పావనీ" కోపంగా అరిచాడు విశ్వపతి. "అసలు నువ్వు నేను పెంచిన పావనివేనా అన్న అనుమానం కలుగుతోంది. చిన్న చిన్న సమస్యలకే అందరూ ఇలా కాపురాలు కూలగొట్టుకుని ఇళ్ళు వదిలిపోతున్నారా? సభ్యతా సంస్కుతీ వదిలేస్తున్నారా? అసలు నీకేముందే? చదువా? ఆస్థా? దేన్ని చూసుకుని బయటకొచ్చావు?"
"ఆత్మస్థయిర్యం నాన్నా" నెమ్మదిగా అంది పావని. "కొన్ని రోజుల క్రితం ఒక అర్ధరాత్రి నేనొక అమ్మాయిగురించి చెవుల్తో విన్నాను-ఒకమ్మాయిని కళ్ళతో చూశాను. విన్న అమ్మాయి పేరు సాహితి-చూసిన అమ్మాయి పేరు రజని. నువ్వన్నావే - అసలు నీకేముంది ఆస్థా? చదువా? అని ఆ రెండూ వుండికూడా సమస్యల్లోంచి బయటకు రాలేకపోతుంది సాహితి. పోతే- విధి వ్రాసిన దురదృష్టపు గీతతో, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ కూడా రజని అనే ఒకమ్మాయి దేవుడ్నే సవాల్ చేస్తోంది. 'దేవుడా! నువ్వు నా జీవితాన్నైతే చిన్నది చేయగలవుగానీ, నా పెదాలమీద చిరునవ్వుని చెరపగలవా?' అని. ఇద్దరూ వేర్వేరు విధాలుగా జీవితాన్ని నాకు చూపించారు నాన్నా."
విశ్వపతి దిగ్భ్రాంతుడై కూతురివైపు చూశాడు. పావని తల దించుకుని కొనసాగించింది. "నువ్వన్నమాట కూడా నిజమే. అందరూ సంసారాలొదిలి ఇలాగే వీధిన పడుతున్నారా అని! లేదు- లేకపోవచ్చు. సంసారాల్లో వారికేదో సుఖముండి వుండవచ్చు. లేదా పిల్లల భవిష్యత్తు గురించి భయపడి కష్టాలనుభవిస్తూ వుండవచ్చు. నేనీ రోజే ఉద్యోగంలో చేరా నాన్నా. జీతం చాలా తక్కువ. రెండు పూటలా తిండికి కూడా సరిపోకపోవచ్చు. కానీ ప్రతీదానికీ ఎక్కడో ఒకచోట 'ప్రారంభం' అంటూ వుండాలిగా నాన్నా."
"పోనీ కొన్ని రోజులు వచ్చి మనింట్లో వుండమ్మా-నీ మనసు సర్దుకున్నాక వెళ్ళొచ్చు."
"మనసు సర్దుకోదు నాన్నా! నా ఆవేశం తగ్గిపోతుంది. మీరందరూ నా చుట్టూ చేరి, కొద్ది కొద్దిగా అదైర్యాన్ని......మన సంస్కృతితో రంగరించి నాకు నూరిపోస్తారు. మళ్ళీ మామూలు స్త్రీని చేసేవరకూ మీరు నిద్రపొరు. వద్దు నాన్నా నన్నిలా వుండనీ."