Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 43

 

         రామ్మూర్తి మొహం వాడిపోయింది. "అంతదూరం నేను ఆలోచించలేదు" అన్నాడు. "కానీ ఒక్కటి మాత్రం నిజం. అది ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదు. దాన్ని ఇంకొక్కక్షణం ఏలుకోను."
   
    "ఏలుకొమ్మని ఎవరన్నారు?"
   
    "మరి?"
   
    "నేను వచ్చినప్పటి పరిస్థితి చూడగానే ఒక గొప్ప ఆలోచన వచ్చింది."
   
    "ఏమిటది?"
   
    "అందరిముందూ నేనేమన్నానో విన్నావుగా. 'తనెంత తప్పు చేసిందో తెలుసుకుంటే తానే దహించుకుపోతుంది. ఈ లోకానికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటుంది' అన్నాను. అవునా?"
   
    "అవును."

    "ఇప్పుడది దహించుకుపోయినా, మన సానుభూతి భరించలేకే చచ్చిందని అనుకుంటారు చుట్టుప్రక్కలవాళ్ళు. అదే విషయం రేపు గొడవైనా పోలీసులకి చెపుతారు."
   
    రామ్మూర్తి దిగ్భ్రమతో చూశాడు ఆమెవైపు. వాసంతి నవ్వుతూ అన్నది.
   
    "దాని నాన్న ఇవ్వగలిగినంతా ఎలాగూ ఇచ్చేశాడు. ఇంకొక్క పైసా అతని దగ్గిర్నుంచి రాదు. దీనితో ఎలాగూ నువ్వుపడలేవు. ఇప్పుడది చచ్చినా, ఇంతమంది సాక్షులున్నారు కాబట్టి, రంకు బయటపడిందని అదే ఆత్మహత్య చేసుకుందని....."
   
                                *    *    *
   

    సరిగ్గా పది నిమిషాల తర్వాత పావనికి మెలుకువ వచ్చింది. తననెవరో మోసుకెళుతున్నట్లు భావన. అంతలో అది కలకాదనీ నిజమనీ అర్ధమైంది. అర్ధమయ్యేలోపులోనే వంటింట్లో వుంది. నేలమీద దబ్బున కూలేశారు. అరవకుండా నోరు నొక్కి పెట్టారు. వాసంతి కాళ్ళు పట్టుకుంది. తల దగ్గర భర్త వున్నాడు.
   
    కిరసనాయిలు వాసన గుప్పుమంది.
   
    ఆమె అరవబోయింది.
   
    నోటి దగ్గర చెయ్యి గట్టిగా అదిమి ఉండటంవల్ల కేక బయటకు రాలేదు.
   
    వంటింటి రెండో తలుపు తెరిచి వుంది. ముందు తలుపు లోపల గడియ పెట్టారు. రెండో తలుపు బయట తాళంవేసి వుంటుంది. మంటలు రాగానే అటు తలుపు తిరిగి తాళం వేసేస్తే వంటింటి లోపల గడియ పెట్టుకుని పవనే ఆత్మహత్య చేసుకుందని అనుకుంటారు. అదీ వాళ్ళ ప్లాను.
   
    భర్తా, ఆడపడుచు, అత్తామామలు కలిసి కోడళ్ళని సజీవ దహనం చేస్తారని పేపర్లలో చదివింది. చెప్పుకుంటుండగా వింది. కానీ ఇప్పుడు తనే ఆ బలిపశువు అవుతోందని ఆమెకు తెలుస్తోంది. ఆమె అవయవాలు స్వాధీనంలో లేవు. ప్రతిఘటించాలన్నా సాధ్యం కావటం లేదు. ఆ డీప్ షాక్ లో నిశ్చేష్టురాలై అలాగే అచేతనంగా వాళ్ళవైపు చూస్తూ వుండిపోయింది.
   
    ఆ చీకట్లో అగ్గిపుల్ల మంట దగ్గిరగా రావటం తెలుస్తూంది. గదంతా కిరసనాయిలు వాసన కమ్ముకుంది.
   
    కొరివి తలకు పెడతారు.
   
    అతడు పాదాల దగ్గర అంటించాడు.
   
    మంట చూసేసరికి ఆమెకు స్పృహ వచ్చినట్టు అనిపించింది. భయంవల్ల కలిగిన మత్తు విడిపోయింది.
   
    ఆమెకాశక్తి ఎలా వచ్చిందో తెలీదుకానీ, బలం అంతా కాళ్ళలోకి తెచ్చుకుని కాలితో కొట్టింది. ఆ దెబ్బ అతడి పొత్తికడుపుక్రింద తగిలింది. 'అబ్బా' అని మూలుగుతూ అతడు కూలిపోయాడు. చేతులు పట్టుకున్న వాసంతిని గభాలున తోసి, తలమీద బలంగా కొట్టింది. వాసంతి కుప్పకూలింది. రాక్షస ధైర్యం వచ్చింది. కాలితో ఇద్దర్నీ ఎడాపెడా బాదింది. ఆ తరువాత ఆమె బయటకు పరుగెత్తింది.
   
    అదే వేగంతో ఆమె రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డంతా చీకటిగా, నిర్మానుష్యంగా వుంది. చల్లటి గాలి ఒక్కసారిగా వీచింది.
   
    దాంతో ఆమె ఆవేశం తగ్గిపోయింది.
   
    కిర్సనాయిలుతో తడిసిన చీరతో, వణికే కాళ్ళతో, చెదరిన గుండెతో, చెమట శరీరంతో ఎటు వెళ్ళాలో తోచనట్టు ఆమె రోడ్డు మధ్య నిలబడింది. చదువూ, ధైర్యమూ లేని సగటు భారతీయ స్త్రీ భవిష్యత్తులా చుట్టూ చీకటి ఆమె అయోమయంగా నడక సాగించింది. నగరం నిద్రలోకి జారుకుని చాలాసేపయింది.
   
    ఆమె వీధి మలుపు తిరుగుతుండగా, వేగంగా ఒక కారు ముందునుంచి వచ్చింది. అంత అర్ధరాత్రిపూట హారన్ ఎందుకనుకుంటున్నాడేమో, అదే వేగంతో మలుపు తిప్పాడు. ఆమెను చూసి సడెన్ బ్రేక్ వేయబోయి, తడబడి, కారు పక్కకి తిప్పి, ఒక చెత్త కుండీని దాటబోయే ప్రయత్నంలో కుడిపక్కకి వచ్చి అక్కడ అనవసరంగా ఒక ఇల్లుండటం చూసి, ఎడమ ప్రక్కకి తిరిగి, కారు మురిక్కాలవలోపడి బయటకు రావటంతో వేగం తగ్గి, అదృష్టవశాత్తు ఎలక్ట్రిక్ పోల్ పక్కగా తీసుకొచ్చి ఆపుచేశాడు.
   
    వెంట్రుకవాసిలో తప్పిపోయిన ప్రమాదం అతని మత్తుని పూర్తిగా దించేసింది. "అర్దరాత్రి ఆడది వంటరిగా నడవగలిగిననాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్నారే తప్ప, గాంధీగారు అర్ధరాత్రి రోడ్డు మధ్యగా నడవగలిగిననాడే అణాలేదు మేడమ్, అఫ్ కోర్స్! తాగి నడపటం నాదే తప్పు అనుకోండి" అన్నాడు విండోలోంచి తల బయటకు పెట్టి.
   
    పావని మాట్లాడలేదు. అప్పుడు గమనించాడు అతను కిరోసిన్ వాసనని! అది తాను తాగిన ఆల్కాహాలు వాసనో మరేమిటో తెలియక కన్ ఫ్యూజ్ అయ్యాడు. అయోమయం తీరిక రెండు మూడు సార్లు గట్టిగా గాలి పీల్చాడు.
   
    ఈ లోపులో పావని "దయచేసి బస్టాండ్ దాకా లిఫ్టు ఇస్తారా?" అని అడిగింది. అతను నవ్వి, "ఇంకెవర్నయినా ప్రయత్నించుకోవటం మంచిది. నేను అలాంటి వాడిని కాను" అన్నాడు.
   
    ఈసారి పావని అయోమయంగా చూసింది.
   
    "తాగుడు వరకూ ఓ.కే! వ్యభిచారం అవసరం ఇప్పటివరకూ రాలేదు. ఇంకెవరయినా మంచి కస్టమర్ని చూసుకోవడం మంచిది."
   
    అతను చెప్పింది అర్ధమై పావని మొహం మ్లానమైంది. ఆమె అక్కడినుంచి తొలగి వెళ్ళబోతుండగా "ఆగండి. మీ దగ్గర్నుంచి వచ్చేది కిరోసిన్ వాసనేనా?" అని అడిగాడు.
   
    ఆమె మాట్లాడలేదు. అతను కారు దిగి, ఆమె దగ్గరికి వచ్చి "ఏం జరిగింది? ఎవరు మీరు?" అని అడిగాడు.
   
    "నేను మీరు అనుకునేలాంటి దాన్ని కాదు. బస్టాండ్ కి వెళ్ళాలి. నిజంగానే-"
   
    "కారెక్కండి."
   
    ఆమె ఎక్కాక అతడు అడిగాడు. "నేను మరీ అనవసరం అయిన కుతూహలం చూపిస్తున్నాననుకోకపోతే అది కిరోసిన్...."
   
    "అవును" తల వంచుకుని అన్నదామె.
   
    అతను నిశ్శబ్దంగా కారు డ్రైవ్చేశాడు చాలాసేపు.
   
    "ఈ వేళప్పుడు మీ ఊరికి బస్సులున్నాయా?"
   
    "తెలీదు. లేకపోతే, ఉదయం వరకూ వెయిటింగ్ రూంలో వుంటాను."
   
    "ఈ కిరోసిన్ తడిసిన చీరతోనా?" ఆమె సమాధానం చెప్పలేదు.
   
    "ఏ ఊరు వెళ్ళాలి మీరు?"
   
    "తెలీదు."
   
    "మీ కెవరూ లేరా?"
   
    "ఉన్నారు. కానీ ఈ పరిస్థితిలో కన్నవాళ్ళు ఆదుకోరు."
   
    "మరెక్కడికి వెళతారు?"
   
    "తెలీదు."
   
    అతడామెవైపు చిత్రంగా చూశాడు. "మీ పర్సు ఏది?"
   
    "లేదు."
   
    "మరి డబ్బుల్లేకుండా బస్సు ఎలా ఎక్కుతారు?"
   
    "ఎక్కడో ఒకచోట దింపెయ్యండి."
   
    "ఏం చేస్తారు?"
   
    "చస్తాను!"
   
    అతను మాట్లాడలేదు. కొంచెం సేపయ్యాక కారు వెళుతున్న దారిచూసి, "ఇటెక్కడికి వెళుతున్నాం?" అని అడిగింది భయంతో- అతడు తాగి ఉన్నాడని గ్రహించి.
   
    "మా ఇంటికి! రేప్పొద్దున వరకూ మా ఇంటిలో వుందురుగానీ! ఏ రకంగా చావటం మంచిదా అన్న విషయమై నా భార్య, ముగ్గురు పిల్లలు కూడా మీకు సలహా యివ్వగలరు. వాళ్ళు కూడా నా మీద ఏ గౌరవమూ లేకుండా, సస్పెన్స్ క్రైం నవలలు చదువుతారు. అన్నట్టు నేనెవరో చెప్పనేలేదు కదూ. నా పేరు భరద్వాజ. నేనో రచయితను."
   
    "మీరు....మీ....రు....భరద్వాజా?"
   
    "ఆ ఎక్స్ ప్రెషన్.....గౌరవంతో కూడిన ఆశ్చర్యమా? భయంతో కూడిన అసహ్యమా?"
   
    అతని మాటల్ని పట్టించుకోకుండా ఆమె అన్నది- "మా స్నేహితురాలికి మీరొక ఆటోగ్రాఫ్ వ్రాశారు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం."
   
    "ఏం జ్ఞాపకం? వ్రాసినట్టు జ్ఞాపకమా? ఆటోగ్రాఫ్ జ్ఞాపకమా?"
   
    "ఆటోగ్రాఫే For the Man, an attractive girl" చెప్తూంటే ఆపాడు. "గుర్తొచ్చింది అమ్మాయికి అబ్బాయి, లేక భర్తకి భార్యా క్రొత్తలో అద్భుతమైన వ్యక్తుల్లా, సకల సద్గుణాలూ ప్యాక్ చేసి, దేవుడు తమకోసమే పంపిన గిఫ్టు ప్యాకెట్టులా కనబడతారు. కాలం కరిగే కొద్దీ ఆ దైవత్వపు విలువలు తొలగిపోతాయి. ఇదేగా ఆటోగ్రాఫ్?"

    "అవును భరద్వాజగారూ! ఇప్పుడు నాజీవితం అలాగే అయింది-"
   
    ఆమె చెప్పడం ప్రారంభించింది.
   
                                  *    *    *

 Previous Page Next Page