ఎలా యితన్ని మార్చటం ? అంతలో ఆమె మెదడులో ఏదో మెరిసింది.
"అయిదు సంవత్సరాలు అయిదు కణుపులూ, ముప్పై పుల్లలు ముప్పై రోజులూ కదూ"
"అవును" అన్నాడు దార్కా.
"ఈ లెక్కలూ యివన్నీ ఎంత తప్పో ఇప్పుడు అర్ధమయ్యాయా"
"ఎలా?"
"ప్రతి నెలకీ రోజులు ముప్పై కాదు. కొన్నిటికి ముప్పై ఒకటి -ఫిబ్రవరి ఇరవై ఎనిమిదే."
దార్కా స్థాణువయ్యాడు. అమావాస్య -పున్నముల సాయంతో చివరి క్షణం వరకూ సరిగ్గా లెక్కకట్టగలిగే తన గురువయిన విషాచి, తనను నాగరిక ప్రపంచంలోకి పంపే ప్రయత్నంలో నాగరికంగా లెక్కకట్టబోయి తప్పు లెక్కవేసేడు.
అయితేనేం మంచే జరిగింది.
తులసి తనమాటమీద అతడి రియాక్షన్ కోసం చూస్తూ వుండగా అతడి మొహంలో ఓటమి బదులు సంతోషం చోటుచేసుకుంటూ వుండగా బయట సిద్దేశ్వరి అలికిడి వినిపించింది.
* * *
అదే సమయానికి తన పాక మధ్యలో ఇస్మాయిల్ చేతులు గాలిలోకి సాగి ప్రార్ధన చేస్తున్నాడు.
ముప్పై అయిదన్నా నిండకుండానే ఇస్మాయిల్ యాభై ఏళ్ళ వాడుగా మారేడు. జుట్టు చాలా తెల్లబడింది. బుగ్గలు జారిపోయాయి. కానీ మొహం మీద నవ్వు మాత్రం చెరగలేదు. మనిషిలో హుషారు తగ్గలేదు.
ఎవరో చెప్పుకుంటుంటారు -చేతబడి తిరగ్గొడుతూంటే వక్రించిందనీ అందుకే ఆ వయసులో అలా అయిపోయేడని.
ఆ మాటే అతడి దగ్గిర అంటే నవ్వుతారు - "ఆంజనేయ భక్తుడ్ని సార్. నన్నుఎవరేం చేయలేరు" అని.
అతడికి పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుకే ఇరవై సంవత్సరాలనుంచి ఆ స్కూల్ బస్ క్లీనర్ ఉద్యోగమే చేస్తున్నాడు. వాళ్ళు ఇంకో మంచి ఉద్యోగంలోకి ప్రమోట్ చేస్తామన్నా వద్దన్నాడు. అతడి జీవితం అంతా బస్ లోకి వస్తూన్న పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పటం తోనూ, దిగిపోయేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పటంతోనే సంతృప్తిగా వెళ్ళిపోయింది.
ఒక బ్యాచ్ తరువాత ఇంకొక బ్యాచ్ వచ్చేది -ఒక ఏడు తర్వాత ఇంకొక ఏడు పైబడేది కదిలివచ్చే పిల్లలు -కదలాడే జ్ఞాపకాలు మంచివి చెడ్డవి -అన్నిటిమధ్యా అస్పష్టంగా -
బస్ ఆ వీధిలోంచి వెళ్ళినప్పుడల్లా........
ఆ యిల్లు దగ్గిర పడుతున్నప్పుడల్లా......
సమయం దగ్గిర పడుతున్నట్టూ - ముంచుకొస్తున్నట్టూ భావన.
.............
................
అతడు ప్రతిరోజూ చూస్తూనే వున్నాడు తులసిని.
తన బస్ లోంచి గెంతి టాటా చెప్పి విశాలమైన కాంపౌండ్ లోకి పరిగెత్తే పదేళ్ల తులసి. -
ఒద్దికైన చీరలో కాలేజీ స్టూడెంటవటాన్నీ................
ఒక్కోరోజూ గడుస్తూంటే అతడు తల్లడిల్లి పోతున్నాడు. రాబోయే మారణహోమాన్ని తల్చుకుని.
చెప్పుకోటానికి ఎవరూలేరు. ఆపటం ఎలాగో తెలీదు. తెలిసిన కొద్ది జ్ఞానమూ తెలియచెపుతుంది . పదకొండేళ్ళ పగతో కాష్మోరా తిరగ బెట్టబోతూందని ఈసారి రెట్టించిన పగతో - ఉత్తరం దిక్కునుంచి వెతుక్కుంటూ వచ్చి. అది ఆ పాపని (తులసి అతడికి ఇంకా పాపే) పెకిలించుకు పోతుందని.
ఎలా ఆపటం?
అతడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఏం చేయాలో తేచక -
శ్రీధర్ కి చెప్పొచ్చు. కానీ ఏం లాభం? ఆ తండ్రి మనస్సు బాధ పెట్టటం తప్ప. జరిగేది ఎలానూ జరగబోతూన్నప్పుడు అది ముందేచెప్పి బాధ పెట్టటం ఎందుకు అని ఇంతకాలం ఉపేక్షించాడు. కానీ రోజు దాటి రోజూ గడుస్తూంటే అతడి మనసు ఆగలేదు. శ్రీధర్ ఇంటికి వెళ్ళాడు. శ్రీధర్ అసలు ఈ దేశంలో లేడని, పారిస్ వెళ్ళాడని తెలిసింది. కుంగిపోయాడు.
కాష్మోరా గురించి తెలిసినవాళ్ళు యిద్దరు. ఒకడు తను. రెండో వాడు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు పకీరు.
శవారూఢం స్మశాన వాసిని
క్రీం హ్రీం......... దక్షిణకాశి.
ఆ వూహతోనే అతడు వణికిపోయేడు.
.......ముక్కు నుంచి కారే రక్తం నేరేడు వర్ణంలో వుంటుంది. ఎడమకాలు నేలమీద ఆనదు.......
కదిలిస్తున్న కాష్మోరాకి పంచభూతాలూ సాయం చేస్తాయి. పంచ భూతాలు అంటే భూమి -నీరు- గాలి -ఆకాశమూ -అగ్ని.