అతడి తలలో ఆలోచనల హోరు అయిపోయింది. తులసిని చంపటం కోసం కాష్మోరా లేచి వుంటుంది. తన చేతబడి పనిచెయ్యదు. తన పగ తీరదు. ఇక ఏడు రోజుల్లో తులసి మరణం తన మరణం కూడా.
మరణం అతన్ని భయపెట్టడం లేదు.
ఓటమి బాధ పెడుతూంది.
"కాష్మోరా -కాష్మోరా" అని గొణిగేడు.
ఆమెకి సంభాషణ కొనసాగించడానికి . అతనిని మాటల్లో పెట్టి మామూలు మనిషిని చెయ్యడానికీ ఆమెకు వీలు దొరికింది.
"కాష్మోరా -" అంది.
దార్కా తలెత్తాడు.
"మా ఇట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అప్పుడప్పుడూ చెప్పుకుంటూ వుంటాం కాష్మోరా అన్న పేరు. ఏమిటి కాష్మోరా అంటే-" దార్కా వెంటనే జవాబు చెప్పలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు.
"సరిగ్గా అయిదు నిమిషాల క్రితం కాష్మోరా నిద్రలేచి వుంటాడు. పదొకొండు సంవత్సరాల నిద్ర తర్వాత" దార్కా కంఠం వణికింది.
"కాష్మోరా కుంభకర్ణుడి పెద్దన్నయ్యా?" పదకొండు సంవత్సరాల తర్వాత లేవడానికి" నవ్వింది తులసి.
దార్కా నెమ్మదిగా తలెత్తాడు -అతడి కంఠంలో అదోలాటి కంపన వుంది. "అరవై రెండు క్షుద్రశక్తుల కలయిక -పదిహేనో విద్య" అన్నాడు అదే "కాష్మోరా"
తులసి అతడి వైపు జాలిగా చూసింది. సైన్సు ఇంత ప్రగతి సాధించింది. తనలాటి అమ్మాయిలు కూడా బాబాలు ఈశ్వరుడూ వీళ్ళ మోసాలు బహిర్గతం చెయ్యడం కోసం ప్రాణాలకు తెగించి అపాయాలను కొని తెచ్చుకుంటున్నారు. యువతరం ఇలా హేతువాదం వైపు కొనసాగిపోతున్న తరుణంలో -ఈ యువకుడు పాపం ఏం చదువుకున్నాడో తెలీదు కానీ -ఏదో పాత ఇంగ్లీషు సినిమాలోలా , సాతాను నిద్రలేస్తూందీ అన్న హేలూసినేషన్ లా మొహం అంతా కందగడ్డలా చేసుకుని అరుస్తున్నాడు. ఈ ప్రజల అజ్ఞానాన్ని ఎవరు పోగొట్టగలరు?
తులసికి అతడిని ఏడిపించాలని బుద్దిపుట్టింది.
"అయితే కాష్మోరా ఎప్పుడు నిద్రపోయాడో నీకెలా తెలుసు? అంటే ఐ మీన్ -ఏ మర్రిచెట్టు వూడలమీదో -రావిచెట్టు తొర్రలోనో పడుకోవడం నువ్వు చూసేవా?"
ఆమె మాటల్లో వ్యంగ్యం అతడు గ్రహించలేదు. అసలు అందులో వ్యంగ్యం వుంటుందన్న భావం అతడికి రాలేదు. "కాష్మోరా అసంతృప్తుడై నిద్రపోయాడు -నా గురువు చెప్పాడు - పదకొండు సంవత్సరాల దీర్ఘనిద్ర" అన్నాడు నిజాయితీగా.
తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆమె పెదవుల వెనుక బిగపట్టి "సరీగ్గా ఈ రోజే లేస్తాడని ఎలా తెలుసు? ఏదైనా క్లెయిర్ వాయిన్స్ లో కాష్మోరా మెసేజ్ పంపేడా" అంది.
ఆమె వాడిన ఇంగ్లీషు పదాలు అతడికి అర్ధం కాలేదు. తనలో తను "రోజుకో పుల్ల చొప్పున ముప్పై పుల్లలు విరిచేడు -నెలయింది. అలాటిది పన్నెండయితే సంవత్సరం -అయిదు కణుపులూ అయిదు సంవత్సరాలు "అన్నాడు స్వగతంలా.
అంతలో మరో గడియారం పన్నెండు కొట్టింది. ఈ సారి అతడు ఆవేశాన్నీ, ఉద్విగ్నతనీ ఆపుకోలేకపోయాడు. బిస్తా గ్రామపు మంత్రగాడిగా మారి దిక్కులు పిక్కటిల్లేలా - "ఓడిపోయాను విషాచీ........అని ఆభవంతి ప్రతిధ్వనించేలా అరిచాడు.
పూజలో ఉన్న సిద్దేశ్వరి ఉలిక్కిపడింది. వడివడిగా ఆ గదివైపు రాసాగింది.
"ఏమిటా అరుపు? ప్లీజ్ అందరూ వస్తారు" అంది తులసి దార్కా నెమ్మదిగా సర్దుకున్నాడు.
అది అర్ధరాత్రి కాబట్టి ఎవరూ లేరని తులసి అనుకొంది. కానీ సిద్దేశ్వరి ఆలయంలో చాలా పూజలు రాత్రివేళ జరుగుతాయని ఆమెకు తెలియదు. అందులోనూ ఆ రోజు మహాపూజ దేశం నలుమూలల్నుంచి మహా మహులందరూ వచ్చి ఉన్నారు.
సిద్దేశ్వరి ఒక్కోగది వెతుక్కుంటూ వస్తూంది. ఆమె మొహం ఎర్రగా కందిపోయి వుంది.
గదిలో తులసి దార్కా వైపు జాలిగా -సాలోచనగా చూసింది. తాము ఇంత కష్టపడి సైంటిఫిక్ గా నీరూపించి, మనుషుల అజ్ఞానాన్ని పారద్రోలటానికి ప్రయత్నం చేస్తూవుంటే, ఈ వ్యక్తి ఇంకా క్షుద్రశ్కతుల్నీ మానవాతీత విద్యల్ని నమ్మే యుగంలోనే వున్నాడు.