ఇవన్నీ దేముడు సృష్టించినవి అయినా దెయ్యానికి సాయం చేస్తాయి. కారణాలు అన్వేషించాలంటే మంత్రశాస్త్రాన్ని మరింత మధించాలి. పంచభూతముల గురించి తెలుసుకోవాలి. జ -అంటే పుట్టినది. పంచభూతముల నుంచి పుట్టినవి వరుసగా.... భూమి నుంచి మాంసము, నీటినుంచి నెత్తురు, అగ్నినుంచి ఆకలి, గాలినుంచి మనసు, ఆకాశం నుంచి కామము పుట్టేయి. ఇవన్నీ క్షుద్రదేవత అంశాలు. అందుకే క్షుద్ర దేవతలకి పంచభూతాలు సాయం చేస్తాయి. ఆ కారణం వల్లే దేముడెంత గొప్ప వాడయ్యాడో క్షుద్రదేవత కూడా అంత గొప్ప అయింది.
ఇక కొద్దికాలంలో - చాలా కొద్దికాలంలో
కాష్మోరా లేవబోతూంది.
అప్పుడు భూమి కంపిస్తూంది. వాయువు వెయ్యిశవాలు కాల్చిన బూడిద తోడుగా ఝంఝా మారుతమై కదుల్తుంది. ఆకాశం రక్తాన్ని వర్షిస్తుంది. అంత వర్షంలోనూ శ్మశానం మధ్యలో అగ్ని ఉజ్వలమై వెలుగుతుంది. అగ్నికి నీరు తోడవుతుంది. ఆ అయిదింటిలోంచే కాష్మోరా లేస్తుంది.
........ఇస్మాయిల్ వణికిపోయేడు. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి?
ఆ రోజు మధ్యాహ్నం అతడు విద్యావతి ఇంటికి వెళ్ళేడు.
మొట్టమొదటిసారి తన ఇంటికి తులసి విషయమై ఆందోళనపడుతూ వచ్చిన ఇద్దరూ ఇప్పటికీ అతడికి గుర్తున్నారు. శ్రీధర్, విద్యాపతి. ఆ తరువాత బిస్తా వెళ్ళిన వాళ్ళలో కూడా విద్యావతి ఉన్నాడని అతడికి తెలుసు.
పదకొండు సంవత్సరాల తర్వాత తనను కలుసుకోవచ్చిన బస్ క్లీనర్ ని విద్యావతి ఆసక్తిగా ఆహ్వానించాడు. కాలం విద్యాపతిలో బాగా మార్పు తెచ్చింది. బట్టతల .......... డయాబిటిస్.....ఊపిరిసలపనంత పని.......
కుర్చీలో ఇస్మాయిల్ ముణగదీసుకుని కూర్చున్నాడు. చుట్టూ పెద్ద పెద్ద రేక్స్ లో నల్లటి బౌండు పుస్తకాలు...... ఎక్కడో నాలుగైదు టైమ్ మిషన్ల చప్పుళ్ళు..... ఎదురుగా నల్లటి కుర్చీలో ఎత్తుగా విద్యాపతి.
వీళ్లెవరికీ పట్టదేం.....? ఒక వైపు అంత ఘోరం జరగబోతుంటే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారేం? ఉరుకులూ పరుగులూ మీద వస్తున్న ప్రళయాన్ని ఆపరేం........?
"చెప్పు" అన్నాడు విద్యాపతి. కొన్ని లీగల్ విషయాలు మాట్లాడటానికి అయిదు నిమిషాల్లో ఒక పెద్ద క్లయింట్ రాబోతున్నాడు. ఆ తొందర్లో వున్నాడు అతడు.
ఇస్మాయిల్ వణుకుతూన్న చేతివేళ్ళని గుప్పెళ్ళతో బిగించి, పిడికిళ్ళు పళ్ళోగట్టిగా అదిమిపెట్టి, కంపిస్తూన్న గొంతుతో అన్నాడు....... "కాష్మోరా లేవబోతూంది బాబూ కాష్మోరా లేవబోతూంది?"
విద్యాపతి నుదురు చిట్లించి "ఏ కాష్మోరా" అన్నాడు అర్ధంకాక.
ఇస్మాయిల్ స్థాణువయ్యాడు.
అంతలో విద్యాపతి "ఓ....కాష్మోరా" అన్నాడు గుర్తొచ్చినట్టు. తర్వాత కుర్చీ వెనక్కి వాలేడు..... "అయితే ఏమిటి?"
ఈ ప్రస్న ఇస్మాయిల్ వూహించనిది.
"దా...దా.......దాన్నాపాలి?" అన్నాడు తడారిపోయిన గొంతుతో.
"ఎలా?"
ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో ఇస్మాయిల్ కి తెలియలేదు. ఎదుటి వ్యక్తిని మౌనం మీద ఎలా కన్విన్స్ చెయ్యాలో విద్యాపతికి బాగా తెలుసు.
"అప్పుడెప్పుడో కుర్రాళ్ళుగా వున్నప్పుడు అడ్వెంచరస్ గా వెళ్ళి ఏదో చేసేం తల్చుకొంటేనే నవ్వొస్తూంది. చెప్పుకోవటానికి బాగానే వుందనుకో కానీ మళ్లీ ఇప్పుడు అదే చెబితే మూర్ఖత్వం అంటారు. ఆ రోజుల్లో కూడా వీటిమీద నాకు పెద్ద నమ్మకం లేదు. సైన్సు ఇంత అభివృద్ధి చెందుతున్న రోజుల్లో....... ఇంత ప్రాక్టీసున్న లాయర్ మళ్ళీ మంత్రాలు తంత్రాలూ అంటూ గ్రహపూజలు చేయిస్తున్నాడంటె అందరూ నవ్వుతారు. లాజికల్ గా ఆలోచిద్దాం. కాష్మోరా లేవకుండా ఆపటం కోసం వచ్చానన్నావ్, దానికోసం ఏం చెయ్యాలో నీకు తెలీదు. మరి నాకెందుకు చెప్పటం? కేవలం సానుభూతి కోసమా? లేక సాయం కోసమా?"
ఇస్మాయిల్ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తెలీదు.
విద్యాపతి బెల్ కొట్టి గుమాస్తాని పిలిచాడు. "ఇదిగో...... ఇతడికో వందరూపాయలిచ్చి పంపించు" అని మళ్ళీ తన పనిలో మునిగిపోయేడు. అతడేగానీ తలెత్తి ఇస్మాయిల్ వైపు చూసివుంటే ఆ కళ్ళనిండా నిండిన నీళ్ళను చూసేవాడు.
మరో క్షణం కూర్చొని నిశ్శబ్దంగా ఇస్మాయిల్ బయట కొచ్చేసేడు.
గుమాస్తా వంద పట్టుకొచ్చేసరికి వరండాలో ఇస్మాయిల్ లేడు. అథడికిచ్చినట్టు రాసుకొని దాన్ని తన జోబులో వేసుకున్నాడు గుమాస్తా.
* * *


