తమ్ముడి పక్కగా ఉన్న ఆ అందాలరాశిని చూసేడు శివయ్య. ఆమె ఎవరోకూడా పోల్చుకొన్నాడు. తమ్ముడిని అంతగా ఆకర్షించిన ఆ మేడలోని అందం ఏమిటో గ్రహించుకొన్నాడు.
"అనూరాధ, రాఘవయ్యగారి అమ్మాయి" అన్నాడు రాజు రాధని అన్నకి పరిచయం చేస్తూ.
"రామ్మా. రండి, గుమ్మంలోనే నిలబడిపోయేరు." తను పక్కకి తప్పుకొంటూ చావిట్లోకి దారి చూపేడు శివయ్య.
వరదరాజు కాలు ముందుకి వెయ్యకముందే అరుగుమీదినుంచి పూర్ణ పరుగున వచ్చి కాళ్ళకి చుట్టేసుకొంది.
"మా పూర్ణ రేపటినించి బడికి పోతుందట. నిజమే నేమిటి?" అంటూ పూర్ణని చేతుల్లోకి తీసుకొని బుగ్గమీద ముద్దుపెట్టుకొన్నాడు రాజు.
"చిన్నాన్నా, నాకు రెండు పాటలు వచ్చు" అంది పూర్ణ ముద్దుగా.
"ఏదీ....పాడు చూద్దాం." ఇంట్లోకి నడుస్తూనే అన్నాడు రాజు.
"తుండము....ఏకదంతము....తోరపు....బొజ్జయు.... ...."ముక్క ముక్కకీ పది బెక్కులు బెక్కుతూ చదువుతున్నది పూర్ణ. అంతలో రాజు పక్కగా నడుస్తున్న అమ్మాయి తన పాట వింటున్నదని గ్రహించి రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని "ఇంక నేను పాడను" అంది సిగ్గుగా.
ఆ మాట అన్న తీరూ, సిగ్గుతో యెర్రబడిన ఆ బుగ్గలూ చూసి 'నాకు ఇటువంటి చెల్లెలు ఒకతె వుంటే ఎంతో బాగుండేది!' అనుకొంది రాధ.
"ఫరవాలేదు. మనవాళ్ళేలే, పాడు" అన్నాడు రాజు. కాని పూర్ణ సిగ్గు తరగలేదు. "ఉహు" అంది తండ్రి వెనకగా దాక్కొంటూ.
పెరట్లో ఆవుపాలు పితుకుతున్న మీనాక్షి చావిట్లో మనుష్యుల అలికిడి. మాటల సందడి విని ఎవరా అనుకొంది. అంతలో శివయ్య పిలుపు వినిపించింది.
"ఇదిగో, మీనాక్షీ! మనింటికి యెవరువచ్చేరో చూడు" అన్నాడు ఉత్సాహంగా.
"వస్తున్నా" అంటూ రెండు నిమిషాలు గడవకముందే చేతిలో పనిని పూర్తి చేసుకొని వచ్చింది మీనాక్షి.
వరదరాజు పక్క ఆ పిల్లని చూడగానే 'ఈ పిల్లే అనూరాధ' అని పోల్చుకొంది. ఆ పిల్ల గురించి మరిది చెప్పిన మాటల్లో అతిశయోక్తి లేదనుకొంది. ఒకరోజు శివయ్య వెలిబుచ్చిన అనుమానం గుర్తుకి వచ్చింది. "ఈ పిల్ల వరదుడి భార్య అయితే అంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి?" సంతృప్తిగా ఆమె కళ్ళు మెరిసేయి.
అంతకాలంగా రాజు చెబుతున్న మాటల్నిబట్టి రాజు వదిన ఎట్లా వుంటుందని అనూరాధ ఊహించుకొందో, ఆ ఊహాచిత్రమే ప్రాణంపోసుకు వచ్చినట్లుంది మీనాక్షి.
వరదరాజు తన మాటతో వారి చూపుల తోరణాన్ని తుంచి వేసేడు.
"ఈమె_" అంటూ అనూరాధని పరిచయం చెయ్యబోతుండగానే....
"నాకు తెలుసు, వరదం! అనూరాధ" అంది మీనాక్షి.
"మీ వదినకి నా పేరు ఎలా తెలుసు?" రాధ చురుకుగా ప్రశ్నించింది.
"ఆమె నా వదిన అని నీకెలా తెలుసు?" రాజు ఎదురుప్రశ్న వేసేడు.
'ఇదా నువ్వు చేస్తున్న పని? తెలిసిందిలే నీ సంగతి' అన్నట్లు చూపుడువేలితో బెదిరిస్తూ అంది అనూరాధ.
"ఇందులో తప్పేముంది? నాకిష్టమైనవాళ్ళని గురించి నా ఆత్మీయులు అనుకొన్న వాళ్ళతో చెబుతాను" అన్నాడు రాజు, అమాయికంగా ముఖం పెట్టి.
గోడకి ఎత్తిపెట్టి ఉన్న నవారు మంచాన్ని వాల్చి "కూర్చో అమ్మా!" అంది మీనాక్షి.
అనూరాధ మంచంమీద కూర్చుని ఆ ఇంటినీ, పరిసరాలనీ వింతగా చూస్తున్నది. అది గమనించిన మీనాక్షి "మీ మేడల్లా ఉంటాయిటమ్మా మా ఇళ్ళు ?" అంది.
"అది కాదండీ! తాటికమ్మలు, రెల్లుగడ్డితో కట్టిన ఇళ్ళు చూసేను కాని...."
"ఈ ఇంటికికూడా పైన రెల్లుగడ్డి ఉంది. ఇంటి లోపలివైపు అగ్నిప్రమాదాలు వచ్చినా కాలిపోకుండా ఉండేందుకు మన్ను మెత్తేరు. ఇటువంటి ఇళ్లని మిద్దెఇళ్లు అంటారు. ఇంటి పై కప్పుకి కొంచెం కిందుగా వెదురుబద్దలతో దడిలా కట్టి దానికి ఇటూ, అటూ మన్ను మెత్తుతారు. ఈ విధంగా చేస్తే ఇంట్లో సామాను అంతా బూడిద అయిపోయే ప్రమాదం వుండదు" అంది మీనాక్షి వివరిస్తూ.
ఇంకా ఆ ఇంటిలో తను చూడని కొత్త వస్తువులు ఏమన్నా ఉన్నాయా అన్నట్లు ఇటూ అటూ చూసింది అనూరాధ. ఆమె కుతూహలాన్ని అర్ధం చేసుకొన్న మీనాక్షి ఆ పిల్లని వెంటబెట్టుకొని ఇంట్లోని వస్తువులు ఒక్కొక్కటిగా చూపించింది.
పక్క వరండాలో వున్న ధాన్యపు నందలని, వంట ఇంట్లోని మట్టి జంటపొయ్యిల్ని, నూతిపై కొత్తగా అమర్చిన కర్రగిలకను, పశువుల కొట్టంలో పేడా, మన్నూ అలికిన కుడితిబానలను ఒక్కటీ కూడా విడవకుండా అన్నిటిని పరిశీలనగా చూపి వాటి వివరాలు అడిగి తెలుసుకొంది అనూరాధ.
గిలకమీద బాల్చీడు నీళ్ళు తోడి "సరదాగానే వుంది కాని, చెయ్యి ఆ తాడుకి తగిలి రగిడి పోతుంది" అంది.