Previous Page Next Page 
వారధి పేజి 42


    "మీ పూర్ణంటే ?"

    "మా అన్నయ్య కూతురు. నా దగ్గిర దానికి చాలా చనువు. చిలకలా  అన్ని కబుర్లూ  చెబుతుంది. కాని దాని ఆరోగ్యమే  అంతంత మాత్రంగా  ఉంటున్నది. నిజానికి పూర్ణని నిరుడే బడిలో చేర్చాలనుకొన్నాము. అనారోగ్యకారణంగానే  ఇంతవరకూ  ఆ పని సాగలేదు" అన్నాడు రాజు.

    "అలాగా, పాపం!" అంటూ తన సానుభూతి  వెల్లడించింది రాధ.

    క్షణకాలం  ఏదో ఆలోచించి "కారు వెళ్ళిపోయిందా?" అన్నాడు రాజు.

    "ఏం....ఏం కావాలి? దిష్టిబొమ్మలా  మన యెదురుగుండా  యెందుకని వెనక్కి తీసుకుపొమ్మన్నాను. గంటలో తిరిగి వస్తుంది" అంది రాధ.

    "పూర్ణకి పలకా బలపం  కొందామని."

    "పద. దగ్గరే కదా బజారు. నడిచిపోయి  కొనుక్కువద్దాం."

    నాలుగైదు కొట్లు తిరిగి చిన్న పలక, ఒక డజను బలపాలు, చిన్న బొమ్మల పుస్తకాలు, అవి పెట్టుకొనేందుకో  సంచి, ఇంకా  సిల్కు ఫ్రాకు కొన్నాడు రాజు.

    ఇంటినించి  వస్తున్నప్పుడు  హోటలు భోజనానికి సరిపోయేటట్లు  సొమ్ము తెచ్చుకుంటాడు రాజు. కాని కొన్నిరోజులు రాఘవయ్యగారింట భోజనం చేయడంవల్ల సొమ్ము  మిగిలిపోతూంటుంది. దానితో అన్నయ్యకి, వదినకి, పూర్ణకి ఏవేవో  కొని  తమ గ్రామంవాళ్ళు కనిపించినప్పుడల్లా పంపుతుంటాడు.

    కొన్న వస్తువుల్ని  చక్కగా  కాగితంలో  చుట్టించి, పట్టుకొని ఏటి ఒడ్డుకి వచ్చేసరికి  ఇంకా కారు రాలేదు. మాటిమాటికీ రోడ్డువైపు దృష్టి సారిస్తూ  కారుకోసం  ఎదురుచూస్తున్నాడు  రాజు.

    'ఏమిటి సంగతి?' అన్నట్లు చూసింది అనూరాధ.

    "కారు వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే  నేను గ్రామానికి  పోయి ఇవి పూర్ణకి ఇచ్చివస్తాను" అన్నాడు రాజు.

    రాఘవయ్యగారి ఇంట్లో  గదిలో చేరిన మొదటి రోజుల్లో  అనూరాధని కూడా "మీరు, మీరు" అంటూ మన్నించేవాడు రాజు. ఒకరోజున అనూరాధ తనే తెగేసి చెప్పేసింది.

    "చూడు, రాజూ, నాకు నా ఈడుపిల్లల్ని  'మీరు, అండీ' అంటూ మన్నించడం బాగుండదు. నువ్వు మన్నిస్తూంటే నేను తప్పనిసరిగా  మీరు అనవలసి వస్తున్నది. రమారమి  ఒక ఈడువాళ్ళం  ఈ మన్ననలకి  ఎగనామం పెట్టి 'నువ్వు' అని పిల్చుకొందాం" అంది.

    "నేను అలా పిలిస్తే మీ అమ్మా, నాన్నగారూ తప్పు పట్టవచ్చు" అన్నాడు రాజు బెదురుగా.

    "అదంతా నేను చూసుకొంటాను. అలవాటయ్యేవరకూ  వింతగా చూస్తారు. ఆ వెనక అదే పరిపాటి  అయిపోతుంది" అంది రాధ  ఆభయమిస్తూ  తర్వాత _

    ఇసకలోంచి  లేచి చీరకుచ్చెళ్లు  సరిచేసుకుంటూ  "పద, నేనూ వస్తాను. 'మా ఊరు....మా ఊరు' అని చెబుతూ మహా ఊరించేస్తున్నావు! ఎలా వుంటుందో చూస్తాను!" అంది రాధ.

    రాజు విస్మయంగా, నమ్మలేనట్లు  చూస్తూ "నేను నడిచిపోతున్నాను  రాధా" అన్నాడు.

    "అక్కడికి నేను నడవలేనట్లు ?" వెటకారంగా  అంది రాధ.



                            *    *    *


    దారి పొడుగునా  రాజు నోరు ముయ్యకుండా  ఏవో కబుర్లు చెబుతూనే వున్నాడు. పంటలు, ఫలసాయాలు, చిన్ననాటి తన అనుభవాలు, పరాభవాలు, గ్రామంలో పార్టీలు, గ్రామస్థుల మాటల  ధోరణి, తమ ఇరుగు పొరుగుల మనుష్యుల తీరుతేన్నులూ వర్ణిస్తూండగానే  ఆ వీధిలో  ప్రవేశించేరు  వారు. 

    "అదిగో, ఆ ఎర్రమట్టి అరుగుల ఇల్లే మాది. మా వదినకి  అరుగులు మాస్తే తోచదు. నెలకోసారి  అలికి ముగ్గులు, చుక్కలు పెడుతూంటుంది. 'గ్రామంలో ఇళ్ళు పండక్కి, పూజకి అలంకరించుకొంటే _ మీ ఇల్లు నెలనెలకీ అలంకరించుకొంటుంది' అంటారు చూసినవాళ్ళు.

    "మా వదినకి  ఇల్లు మాసినా, బట్ట మాసినా  ఇంక తోచదు. ఇంటిలో పని అంతా స్వయంగా చేసుకొంటున్నా  వసి వాడనట్లు  ఎప్పుడూ నవ్వుతూ వుంటుంది."   

    "భట్రాజులా మీ వదిన్ని మహా పొగిడేస్తున్నావు కాని  ఇంక జోరు తగ్గించు. స్వయంగా చూసి  మీ వదిన యెటువంటిదో  నేను తేల్చుకొంటాను" అంది రాధ నవ్వుతూ.

    వీథి అరుగుమీద  కూతుర్ని ఒడిలో కూర్చోపెట్టుకొని 'చేతిలో వెన్నముద్ద, చెంగల్వ పూదండ' అంటూ ముక్క ముక్క విరిచి పద్యం నేర్పుతున్నాడు శివయ్య. పూర్ణ తూ.చా. తప్పకుండా  తండ్రిని అనుకరిస్తున్నది. కొన్నిచోట్ల తనకి ముందే తెలుసు అన్నట్లు తండ్రి "బంగారు" అనగానే "మొలతాడు" అంటూ అందుకొంటున్నది. కూతుర్ని గుండెలకి అదుముకొని "మా తల్లి  ఎంత తెలివైనదమ్మా! రెండుసార్లు  చెప్పేసరికి అంతా నేర్చేసుకొంటున్నది" అంటూ  మురిసిపోయి  కూతురి తలమీద ముద్దులవర్షం  కురిపిస్తున్నాడు  శివయ్య.

    ఇంటిముందుకి రాగానే "మా అన్నయ్య" అంటూ అరుగు మీద వ్యక్తిని  వేలితో చూపించేడు రాజు.

    "ఆ పిల్ల పూర్ణ" అంటూ మాట అందుకొంది రాధ.

    అనుకోకుండా  తమ్ముడు రావడము, అందునా  ఒక ఆడపిల్లని  వెంట బెట్టుకొని  నడిచి రావడము శివయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఒడిలో కూతుర్ని కిందికి దింపి  ముందుకి వచ్చి "రాజూ!" అన్నాడు ఆప్యాయంగా.

    ముతక నేతపంచ, పై మీద తుండుగుడ్డతో ఎత్తుగా, బలిష్టంగా ఉన్న ఆ వ్యక్తి  అభిమానంగా తమ్ముడివంక  చాచిన చేతులవైపు కన్నార్పకుండా  చూసింది అనూరాధ. వయసు మీరుతున్నా  కాయకష్టం వల్ల  దృఢపడిన శివయ్య చేతులు బలంగా కండలుతీరి  ఉన్నాయి. కోమలంగా, సున్నితంగా ఉన్న రాజు చేతులవంక చూపు తిప్పి  వీరిద్దరూ  అన్నదమ్ములు ఎలా అయ్యేరు అనుకొంది రాధ.
 

 Previous Page Next Page