"అలవాటయిన వారికి ఒక బాల్చీడు నీళ్ళు తోడేసరికి నీ చేతుల్లా ఎర్రపడిపోవు. నా చేతులు చూడు. ఏటి నీళ్ళు తెచ్చి, నూతినీళ్ళు తోడి ఎలా బండబారి పోయేయో!"
రాధ ఆమె మోటుబారిన అరచేతుల్ని చూడలేదు. చేతులకున్న నల్లరంగు మట్టిగాజుల్ని చూస్తున్నది. ఆమెకి మిగిలివున్న ఆ ఒక్క బంగారు గాజుల జతా వరదరాజు బి.ఎస్ సి. రెండో సంవత్సరం కాలేజీకి ఫీజు కట్టిందికి కుదవపెట్టి, ఆ సొమ్ము మరిది చేతిలో పెట్టింది.
"మా పంటలు తిన్నగా పండితే మాకేం బాధలేదు, రాధా! రెండు సంవత్సరాలై ఫలసాయం అందుకోనున్న తరుణంలో పంటలకి తెగుళ్ళు పట్టి దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. సర్కారు పన్ను, పనివాళ్ళకి, పాలికాపులకి జీతాలూ పోను మిగిలిన పంట కటాకటిగా ఏడాది పొడుగూ తినేందుకు సరిపోతున్నది. లేకపోతే వదిన చేతిగాజులు తీయవలసిన అవసరం కలిగేదే కాదు. నేను ఉద్యోగంలో చేరగానే మొదటి నెల జీతంతో వదిన గాజులు విడిపించాలి. అప్పటికికాని నాచదువు ఉపయోగ పడిందన్న తృప్తిగా నాకు కలగదు" అన్నాడు రాజు.
"ఫస్టుమార్కులతో పరీక్షలు పాసవుతున్నావు నీకేమయ్యా?" అంటూ రాధ మెచ్చుకొంటుంటే "నాకు కావలసింది ఫస్టుమార్కులు కాదు రాధా, చదువు ముగిసిన వెంటనే మంచి ఉద్యోగం. అది లభ్యమయిననాడే ఈ మార్కులకి నిజంగా విలువ వున్నదని నేను నమ్ముతాను" అన్నాడు.
"అదేమిటి రాజూ, ఆ పిల్లని చెప్పాచెయ్యకుండా ఇలా ఇంటికి తీసుకొచ్చేవు? పెద్దింటి పిల్ల. కాస్త ఫలహారమైనా పెట్టాలంటే ఇంట్లో ఏమి వుందో....ఏమి లేదో?" అన్నాడు శివయ్య ఆందోళనగా.
"మొదట నేనూ రావాలనుకోలేదన్నయ్యా! రేపు పూర్ణని బడిలో వేస్తున్నారంటూ వదిన వ్రాసిన ఉత్తరం అందింది. పలకా, బలపం కొనితెచ్చి, దానికిచ్చి ఆశీర్వదించి పోవాలనుకొన్నాను. తనూ వస్తానని తయారయింది. పైగా, ఈ నడకా అదీ ఏనాడూ అలవాటు లేదేమో...."
"ఎత్తుకు తీసుకువచ్చినట్లు కబుర్లు చెబుతున్నావు _ నా బరువు నువ్వేం మోసేవు?" అంది అనూరాధ చావిట్లోకి తిరిగివస్తూ.
"వస్తున్నప్పుడు మొయ్యలేదు. చీకటిపడితే వెళ్లేప్పుడు మొయ్యవలసి వస్తుంది. ఇంక బయలుదేరుదామా?" అన్నాడు రాజు.
"అదేమిటి వరదం, ఇంటికి వచ్చిన పిల్లని అలా కరిచిన పళ్లతోనే అంపకం పెడతావా? కాస్త ఏదైనా తిని, పాలు తాగి మరీ పోదురుగాని. ఈ రోజు శనివారం అని మినపరొట్టెకి పిండి తడిపి వుంచేను. పది నిమిషాల్లో కాలిపోతుంది. అంతవరకు అనూరాధకి మన కూరపెరడు చూపించి తీసుకురా" అంది మీనాక్షి.
"కూరపెరళ్లు, పొలాలు వస్తున్నప్పుడు చాలా చూసేను, మీరు మినపరొట్టెలు ఎలా కాలుస్తారో చూస్తాను" అంటూ ఆమె వెనుక వంటఇంట్లోకి దారితీసింది అనూరాధ.
ఆ పిల్ల మాటల ధోరణి, అరమరికలేకుండా ఇంట్లో తిరుగుతున్న తీరూ గమనించి ఆశ్చర్యపోయేడు శివయ్య.
"అంతే, అన్నయ్యా! పట్నంలో పుట్టి అక్కడే పెరిగిన పిల్లలకు, ముఖ్యంగా రాఘవయ్యగారి ఇంటి ఇళ్లలో పెరిగిన పిల్లలకు ఇటువంటివి చూసే అవసరం, అవకాశం వుండదు. అన్నం ఉడికేందుకు ఎన్ని నీళ్లు పొయ్యాలో కూడా అనూరాధకి తెలియదు. అందుకే అన్నీ వింతగా చూస్తున్నది" అన్నాడు రాజు _ఆ మూడేళ్లలోనే పట్నవాసుల అలవాట్లు, ఆలోచనలు కాచి వడపోసినట్లు మాట్లాడుతూ.
ఎర్రగా కాలిన మూకుడులో చుయ్ మని పిండి పోసి పైన నిప్పులు కప్పి పావుగంటలోనే దోరగా కాలిన గుండ్రని మినపరొట్టె పళ్లెంలో వేస్తూంటే ఆశ్చర్యంగా చూసింది అనూరాధ.
"నేను ఎన్నటికీ ఇలా ఈ రొట్టెను కాల్చలేను" అంది. పైన నిప్పులు సడలకుండా రొట్టె కాలిందో లేదో అని గరిటకాడ గుచ్చి చూస్తున్న మీనాక్షితో.
"ఇటువంటి పనులు చేయలేకపోతేనేం రాధా. నువ్వు ఇంకో రకమైన పనులు చెయ్యగలవు. నేను నీలా వీణ వాయించగలనా! కమ్మగా పాడగలనా?" అంది మీనాక్షి.
"మా ఇంటిగురించి రాజు అంతా మీతో చెబుతున్నాడన్నమాట!"
"ముఖ్యంగా నీ గురించే...."మాట మధ్యలో ఆపి చురుకుగా అనూరాధ కళ్ళల్లోకి చూసింది మీనాక్షి.
ఆ పిల్ల కళ్ళలో ఓ తళుకు తొంగిచూసి తొలగిపోయింది.
మినప రొట్టె ఫలహారంచేసి, కమ్మని ఆవుపాలు తాగి వారు బయలుదేరబోయేసరికి బాగా చీకటి పడింది.
"ఈ రాత్రికి వుండిపోండి, రేపు వెళ్లవచ్చు" అంది మీనాక్షి.
"మీదగ్గర వుండేందుకు నాకేం అభ్యంతరం లేదు కాని, అమ్మతో చెప్పిరాలేదు. కంగారుపడుతుంది" అంది రాధ.
శివయ్య పై మీది గుడ్డ సర్దుకొంటూ వడిగావెళ్లి అప్పన్నగారితో అవసరం చెప్పి బండి తీసుకువచ్చేడు.
"ఏటి రాజుబాబూ, రాకరాక వచ్చేవు. రేపు పూర్ణమ్మని బడిలో ఏస్తారుట. వుండకుండా ఎళ్ళిపోతున్నావా?" అన్నాడు రాములు.
"లేదు, వెళ్లిపోవాలి రాముడూ! ఈ అమ్మాయికూడా తోడు ఉన్నది" అన్నాడు రాజు.
"కావాలంటే ఆ అమ్మాయిగారిని ఇంటికాడ భద్రంగా నేను దింపి వత్తాను. నువ్వు రేపుండి ఎల్లు." రాములు సలహా ఇచ్చేడు.
వరదరాజు వదినవైపు చూసేడు.
"వెంటబెట్టుకు ఇంటికి తీసుకువచ్చినవాడివి, ఆడపిల్లని ఒంటరిగా పంపుతావా? నువ్వు కూడా వెళ్లు" అంది మీనాక్షి.
"నాకేం భయంలేదు. వుండాలనుకొంటే నువ్వు వుండిపో రాజూ!" అంది అనూరాధ.