Previous Page Next Page 
అష్టావక్ర పేజి 43


    రంగప్రసాద్ మొహంలో క్షణకాలం పాటు విస్మయం కనపడింది. అగర్వాల్ ఇంతదూరం తనని వెతుక్కుంటూ రావటం ఆశ్చర్యం కలిగించింది. తన భావాల్ని అణుచుకుంటూ "కూర్చోండి" అన్నాడు.

    "మీరు పంపిన వార్త అందింది. నేనుకూడా పోలీసులకీ, కోర్టులకీ దూరంగానే ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందామనుకుంటున్నాను".

    ఈసారి రంగప్రసాద్ నిజంగానే ఆశ్చర్యాన్ని అణుచుకోలేక పోయాడు. "పోలీసు లేమిటీ?" అన్నాడు.

    "ఇంక మీరు నటించనక్కర్లేదు డాక్టర్. మీరు డాక్టర్ వేషంలో వున్న సి.బి.ఐ. ఆఫీసర్ అని నాకు తెలిసింది. మనం డైరెక్టుగా మాట్లాడుకోవచ్చు".

    రంగప్రసాద్ కి ఒక్కొక్క మాటా వింటూంటే మతిపోతూంది. ఇక మరీ అతడితో ఆడుకోవటం ఇష్టం లేనట్టుగా ఫోన్ మ్రోగింది.

    "నేను నివేదితని..." అట్నుంచి వినపడింది. "ఎంత సేపట్నుంచో ప్రయత్నిస్తూ వుంటే ఇప్పటికి దొరికారు. అన్నట్టూ అగర్వాల్ అక్కడికి వచ్చాడా?"

    "వచ్చాడు. నాకంతా గందరగోళంగా వుంది".

    అట్నుంచి నవ్వు వినపడింది. "చీకట్లో చిన్న బాణం వేశాను. సరిగ్గా తగిలిందన్నమాట".

    "ఏమిటది?"

    సరోజ్ కుమార్ వింటున్నాడు. తెలుగులో జరుగుతూన్న ఆ సంభాషణ అతడికి అర్ధం కావటం లేదు.

    నివేదిత అంది- "మనకి తెలిసిన పదం ఒక్కటే. ఎస్సెస్సే!' దానికి సరోజ్ కుమార్ అగర్వాల్ రెండు లక్షలకి పైగా డబ్బు ఇచ్చాడని తెలుసు. అంత డబ్బు ఎవడూ 'వైట్ మనీ' ఇవ్వడు. అందుకే అతడికి ఫోన్ చేసి 'ఎస్సెస్సే' ని సి.బి.ఐ. వాళ్ళు పట్టుకున్నారనీ, అందులో దొరికిన కొన్ని రసీదు పుస్తకాల్లో అగర్వాల్ పేరుందని చెప్పేసరికి కంగారుపడ్డాడు. నేనింతకన్నా ఎక్కువ మాట్లాడలేను. మిగతా విషయాలన్నీ సి.బి.ఐ. వాళ్ళే మాట్లాడతారని చెప్పాను... కృష్ణాపురంలో ఒక సి.బి.ఐ. ఆఫీసరు డాక్టరు వేషంలో వుంటారు- అతడిని కలుసుకుంటే ఏమన్నా పని జరుగుతుందేమో చూడమని చెప్పాను. ఇంగ్లీషు పిక్చర్లు చూసిన ప్రభావం. ఇంతకీ వచ్చాడా?"

    "వచ్చాడు. నా ఎదురుగానే వున్నాడు. నువ్వు ఫోన్ చేయటంగానీ ఇంకో అయిదు నిముషాలు ఆలస్యం అయివుంటే మాత్రం మా ఇద్దరిలో ఒకరికి పిచ్చెక్కి వుండేది".

    "బెస్ట్ ఆఫ్ లక్!"

    "థాంక్యూ" ఫోన్ పెట్టేశాడు.

    "ఎవరూ?" అని అడిగాడు అగర్వాల్ ఫోన్ వైపు చూస్తూ అనుమానంగా.

    "ఢిల్లీనుంచి మా పై అధికారి".

    అగర్వాల్ మొహం వాడిపోయింది. "నేను చేసింది ఏమంత పెద్ద నేరం? కావాలంటే మా ఛార్టెర్డు అకౌంటెంట్.."

    "మిస్టర్ అగర్వాల్. అసలు విషయం చెప్పండి".

    "నేను ఎస్సెస్సేకి రెండు లక్షలకి పైగా ఇచ్చిన మాట నిజమే".

    "ఎందుకు?"

    అగర్వాల్ ఇబ్బందిగా చూశాడు. అతడిని మరింత భయపెట్టటం ఇష్టం లేనట్టు రంగప్రసాద్ అనునయంగా అన్నాడు. "చూడండి మిస్టర్ అగర్వాల్. మేము ఎస్సెస్సే భవనాన్ని సోదా చేసినపుడు పెద్ద ఎత్తులో ధనం, డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్లు అందులో వున్నారు. మీరన్నట్టు మీరు చేసింది పెద్ద నేరమేమీ కాదు. మీ పేరు ఎక్కడా బయటికి పొక్కకుండా చూడగలనని నేను హామీ ఇస్తున్నాను. సరేనా? మీరెందుకు అంత డబ్బు ఇచ్చారో చెప్పండి..."

    "నా భార్యకోసం...." తల వంచుకుని అన్నాడు సరోజ్ కుమార్.

    "ఎందుకు?"

    అతడు తలవంచుకునే "మాకు సంతాన ప్రాప్తిలేదు" అన్నాడు.

    "ఆ విషయం మాకు తెలుసు".

    అగర్వాల్ ఆశ్చర్యంగా రంగప్రసాద్ వైపు చూశాడు. రంగప్రసాద్ సర్దుకుంటూ, "మాకు కొన్ని పత్రాలు దొరికాయి" అన్నాడు.

    "నా భార్య ప్రతిమది ఒక ప్రత్యేకమైన మనస్తత్వం. చిన్నప్పటి నుంచీ కష్టాల్లో పెరిగి పైకి వచ్చింది. అందువల్ల ఆమెకి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు జీవితం పట్ల వున్నాయి" హిందీలో అన్నాడు అగర్వాల్. రంగప్రసాద్ 'చెప్పండి' అన్నట్టు తలూపాడు.

    "ఆమెని చూసినప్పుడు నేను చాలా ఆకర్షితుణ్ణయ్యాను. వివాహం చేసుకుంటానని అనగానే, ఆమెకూడా ఒప్పుకుంది. తొందర్లోనే మా వివాహం జరిగిపోయింది. కానీ ఆ తరువాత ఎంతకాలానికీ మాకు పిల్లలు కలగలేదు. కారణం నాకు తెలీదు. ఎంత మంది డాక్టర్లని కలిసినా లాభం లేకపోయింది. అప్పుడే ఎస్సెస్సే రంగంలోకి వచ్చింది. ప్రతిమకి గర్భం కలగగానే డబ్బు ఇచ్చే ప్రాతిపదికమీద ఆమెకి గర్భం కలిగేలా చేస్తామని ఎస్సెస్సే వాళ్ళు చెప్పారు. అప్పటికే డాక్టర్ల చుట్టూ తిరిగిన నేను దానికి వప్పుకొన్నాను. నాకు నష్టమేముంది? రెండు లక్షలు నాకొక లెక్కలోది కాదు. ఆ తరువాత ఎస్సెస్సే వాళ్ళు ప్రతిమని ట్రీట్ చేశారు. ఆమెకి గర్భం రాగానే సంతోషంగా, అనుకున్న డబ్బు వాళ్ళకి ఇచ్చేశాను. అంతకన్నా నేనేం చెయ్యలేదు. కేవలం 'బ్లాక్ మనీ' ఇవ్వడం తప్ప ఇంకే నేరమూ చెయ్యలేదు".

    రంగప్రసాద్ వెంటనే మాట్లాడలేదు. కుర్చీ వెనక్కివాలి తాపీగా అన్నాడు. "మీరు చాలా అబద్ధాలు చెపుతున్నారు అగర్వాల్".

    "నేనా? ఏమిటి?"

    "మీకు పిల్లలు పుట్టరని మీ వివాహానికి ముందే మీకు తెలుసు. ప్రతిమ కేరక్టర్ మంచిదికాదని కూడా మీకు తెలుసు. ఒకానొక స్టేజీలో ఇంకెవరి ద్వారానైనా ప్రతిమ గర్భం దాల్చినా మీకు అభ్యంతరం లేకపోయింది. కానీ దానికీ ఆమె వప్పుకోలేదు. ఆమెకి తెలియకుండా మీరు ఇన్ సెమినేషన్ ఇన్ స్టిట్యూట్ కి తీసుకు వెళ్ళినప్పుడు ఆమె చాలా గొడవ చేసింది. మీ వ్యవహారమంతా బయట పెడతానని బెదిరించింది".

    అగర్వాల్ మొహం కత్తివేటుకి రక్తం చుక్కలేనంతగా పాలిపోయింది. "ఇదంతా- ఇదంతా మీకెలా తెలుసు?" అని అడిగాడు.

    "సి.బి.ఐ. ని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు".

    "నిజమే" వప్పుకుంటున్నట్టు అన్నాడు అగర్వాల్. "ప్రతిమ చాలా ప్రిన్సిపుల్డ్, శీలంపట్ల నాకు పెద్దగా నమ్మకంలేదు. అందుకే ప్రతిమ ఇంకెవరితోనైనా గర్భం ధరిస్తే బావుణ్ణు అని సూచించాను. ఆమె దానికి సుతరామూ వప్పుకోలేదు. నాకు సహజంగానే కోపం వచ్చింది. పెళ్ళికి ముందు తిరిగితే తప్పులేదా అన్నాను. కేవలం చదువుకోవటమే ఆ రోజుల్లో తన జీవితేచ్చ అనీ, అంతవరకు తను 'శీలం' మీద సంపాదించిందనీ ఆపైన ఒక్క మొగవాడితో కూడా అనవసరంగా పోలేదనీ అన్నది. ఆమె నిజంగా పిచ్చిది అనుకున్నాను".

    "లేకపోతే నీలాటి సామాన్యులకు అర్ధంకాని గొప్ప వ్యక్తి అయినా అయివుండాలి" మనసులో అనుకున్నాడు రంగప్రసాద్.

    అగర్వాల్ కొనసాగించాడు. 

    "ప్రతిమ ఎవరితోనూ మాట్లాడేది కాదు. పార్టీలకు తీసుకెళ్తే ఎంతోమంది మొగాళ్ళు ఆమె అందం చూసి, ఆమెతో మాట్లాడాలని వచ్చే వారు. ఆమె ఉత్సాహం చూపించేది కాదు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. భర్తగా నన్నెంతో గౌరవించేది. బలహీనత వున్నాసరే..." ఆగాడు.

    "నాకు ఆమె విషయం అర్ధంకాలేదు. పెళ్ళికి ముందే శీలం కోల్పోయిన అమ్మాయి, భర్త అనుమతి ఇచ్చినా పరాయి పురుషునితో గడపకపోవటం... కనీసం నా ఆనందం కోసమైనా గర్భం దాల్చమని చెప్పాను. వప్పుకోలేదు. చదువుకోసం ఇంకొకరితో లేని తప్పు భర్త సంతృప్తికోసం పిల్లల్ని కంటే ఏమిటి అని వాదించాను. వప్పుకోలేదు. అటువంటప్పుడు అనాధాశ్రమం నుంచే ఎవర్నైనా తెచ్చుకోవచ్చు కదా అని అంది. మూడో కంటికి తెలియకుండా పిల్లవాడిని కనేస్తే రహస్యం మనలోనే వుండిపోతుంది అన్నది నా వాదన. చివరికి నాకో ఆలోచన వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ చేయిస్తే అని! విషయం చెప్పకుండా ఆమెని ఇన్ స్టిట్యూట్ కి తీసుకొచ్చాను. అక్కడ కూడా ఆమె గొడవ చేసింది".

    చెప్పటం కొనసాగించమన్నట్టు అగర్వాల్ వైపు చూశాడు. అగర్వాల్ గొంతు సవరించుకున్నాడు.

    "ఇక ఈమెతో లాభంలేదని అనుకున్నాను. విడాకులు తీసుకుందామంటే నా గురించి ప్రపంచానికి తెలిసిపోతుందని భయం. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి! సరిగ్గా ఆ సమయంలోనే ఎస్సెస్సే నాకు సాయపడింది. తను ప్రేమించిన ఒక సినిమా యాక్టర్ ద్వారా గర్భం దాల్చటానికి ప్రతిమ వప్పుకుంది. సమస్య అలా పరిష్కారం అయింది".

    "కానీ అప్పటికే జగదీష్ చంద్ర మరణించాడు కదా?"

    "అవును. కానీ ఆ యాక్టర్ తాలూకు వీర్యాన్ని భద్రపర్చి వుంచినట్టు ఎస్సెస్సే తగిన ఋజువు చూపించింది. అయినా నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. నాక్కావల్సింది నా భార్య గర్భవతి అవటం! అది ఎవరి స్పెర్మ్ ద్వారా అయినా ఫర్వాలేదు. ప్రతిమ కూడా సంతృప్తి చెంది అంగీకరించింది. బోంబేలో ఒక పెద్ద నర్శింగ్ హోమ్ లో ప్రతిమకి ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ జరిగింది. ఆ తరువాత రెండు నెలలకి ఆమె గర్భం ధృవీకరించబడింది. ఆపైనే నేను ఎస్సెస్సేకి రెండు లక్షలూ ఇచ్చాను. నిజంగా ప్రతిమ అంత మూర్ఖంగా పట్టుబట్టకపోతే రెండు వేలతో అయిపోయేది. అనవసరంగా రెండు లక్షలు అయింది. సూది మొనలో సగం కూడా లేని ఒక చిన్న కణం కోసం రెండు లక్షలు..." పేలవంగా నవ్వుతూ అన్నాడు.

    "ఇంతకీ ఎస్సెస్సే అంటే ఏమిటో చెప్పలేదు మీరు".

    అగర్వాల్ మొహంలో నవ్వు మాయమైంది. ఎస్సెస్సే అంటే ఏమిటో తెలియకుండానే దాన్ని 'రెయిడ్' చేశారా అన్నట్టు అనుమానంగా చూశాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు-

    "ఎస్సెస్సే అంటే Sperm Selling Agency".

    దక్షిణంవైపు నుంచి వస్తూన్న గాలి హఠాత్తుగా స్థంభించినట్టయింది. ఒక శరన్మేఘం అకస్మాత్తుగా ఉరిమి గర్జించినట్టయింది. స్థబ్ధంగా వుండే భూమి అనుకోకుండా కంపించినట్టు, చరచరాలన్నీ కదిలిపోయి భయకంపితాలయినట్టూ వణుకు.

    స్పెర్మ్ సెల్లింగ్ ఏజెన్సీ... స్పెర్మ్ సెల్లింగ్ ఏజెన్సీ... అనుకున్నాడు చాలాసార్లు మనసులో.


                   *    *    *    *


    "తన పని అయిపోయింది. ఇదే ఆఖరు" అనుకుంది రంజిత. పైకి లేచిన తలుపుల వెనుక- చీకటి గుహల్లోంచి భయంకరంగా కాళ్ళు బయట పెట్టి, రాబోతూన్న జాగిలాల్ని చూస్తూనే ఆ అమ్మాయి ప్రాణాలు సగం పైకి పోయాయి. వాటి నోటివెంట వచ్చే గురక తప్ప అక్కడంతా నిశ్శబ్దంగా వుంది. ఆమె తలెత్తి చూసింది. ఎన్నో జతల కళ్ళు ఆమె మరణాన్ని నిర్వికారంగా చూస్తున్నాయి. ఆమె అప్రయత్నంగా అరిచింది "నేను ఉస్సోక్ లో చేరతాను".

    అవతార్ బాబా చెయ్యెత్తాడు. మంత్రించినట్టు జాగిలాలు వెనక్కి వెళ్ళిపోయాయి. రెండు నిముషాల్లో ఎవరో వచ్చి, ఆమెని బాబా దగ్గరికి తీసుకు వెళ్ళారు. ఆమె అతడికి నాలుగు అడుగుల దూరంలో నిలబడింది.

    అతడు తాపీగా- "జాగిలాల వల్ల చీల్చి చంపబడటం అదృష్టం రంజితా! ఒకవేళ ఆ మరణాన్ని తప్పించుకోవటానికీ, మరణాన్ని కొద్దిసేపైనా వాయిదా వేయటానికి ఇలా ఉస్సోక్ లో చేరుతున్నట్టు ఎత్తు వేద్దామనుకుంటే చాలా నష్టపోతావు. ఈసారి నీ ప్రాణాల్ని 'బ్లడ్ డ్రెయిన్' ద్వారా తీస్తాను" అని హెచ్చరించాడు.

    రంజిత వొణికిపోయింది. ఒక్కో చుక్క రక్తం తోడెయ్యడం ద్వారా దాదాపు రెండు రోజులపాటు చిత్రహింస పెట్టి చంపే పద్ధతిని 'బ్లడ్ డ్రెయిన్' అంటారు. సూదుల్తో పొడిచినట్టు బాధ- గుండెల్లో బాధ- పరాయివాళ్ళకు కూడా రాకూడని చిత్రహింస.

 Previous Page Next Page