అయితే సిద్ధార్థ తొందర్లోనో తేరుకున్నాడు.
చుట్టూ వున్న మంచుని తొలగించి శరీరాన్ని బయటకు నెమ్మదిగా తీశారు. ఇద్దరి మొహాల్లోనూ రక్తం ఇంకిపోయింది.
ఆ మృత శరీరం షెర్పాది! వాళ్ళతో పాటూ వచ్చి 'అవలాంచీ'లో ఇరుక్కుపోయి మరణించిన షెర్పాది.
మంచులో కప్పబడి వుండటం వల్ల ఏ మార్పూ లేకుండా అలాగే వుంది. కనుగుడ్లలో జీవం కూడా పోలేదు. శరీరం మాత్రం ఇనుపకడ్డీలా వుందంతే.
అదికాదు వాళ్ళ మనసులో ప్రస్తుతం కదుల్తూన్న ఆలోచన!
తాము ఎక్కడ నుంచి బయల్దేరారో- తిరిగి తిరిగి అక్కడికే వచ్చారు! అంటే... అంటే... మళ్ళీ నాగరిక ప్రపంచంలో పడటం దాదాపు అసంభవం.
ఈ వాస్తవం తెలియటంతో రాకేష్ దాదాపు పిచ్చివాడై- మోకాళ్ళ మీద కూలిపోయాడు. సిద్ధార్థ మాత్రం వంగి, షెర్పా తాలూకు బట్టలు వదులు చేయసాగాడు. అయిదు నిముషాల్లో అతడి బట్టలు తీసి రాకేష్ మీద కప్పి, తిరిగి వెదకసాగాడు. షెర్పా వేసుకున్న బట్టలు ఆచ్చాదన కాగానే కొత్త వేడి పుట్టుకొచ్చింది రాకేష్ కి. సిద్ధార్థవైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు.
ఈ ప్రపంచంలో, పైకి ఎంతో ధైర్యవంతులుగా కనబడేవారితో సహా, తొంభై శాతం పైగా ఇటువంటి పరిస్థితుల్లో మతిస్థిమితం కోల్పోవటం ఖాయం. అంతవరకూ ఎందుకు? సిద్ధార్థ పక్కన లేకపోతే మృత్యువుతో పోరాటం ఆపి తనే ఎప్పుడో మంచులో సజీవ సమాధి కాబడేవాడు.
సిద్ధార్థ ఇంకా మంచులో వెతకటం చూసి "ఏమిటి" అని అడగబోయాడు రాకేష్. అతడి ప్రశ్నకు సమాధానమా అన్నట్టు మంచులోంచి బ్యాగ్ బయటకు తీశాడు సిద్ధార్థ. షెర్పా తాలూకు వస్తువులు వున్న సంచీ అది. టీ తయారుచేసే సామాగ్రి, లైటరు, మిగిలిన పరికరాలున్నాయి.
"కొంతలో కొంత అదృష్టవంతులం" అన్నాడు సిద్దార్థ లైటరుతో వెలిగిస్తూ. పది నిముషాల్లో టీ తయారైంది. అప్పటికి దాదాపు ముప్పై ఆరు గంటల నుంచీ ఏమీ లేకపోవటంతో అది అమృతంకన్నా ఎక్కువగా తోచింది.
"టైమెంతయింది?"
"పదకొండున్నర"
సూర్యోదయానికి ఇంకా ఆరు గంటలు. ఆరు సు...దీ....ర్ఘ...మై...న... గంటలు.
కానీ ఆ తరువాత మాత్రం ఏముంది? దిక్కుతోచకుండా కొండల్లో పడి తిరగడమేగా!
బయట గాలి శబ్దం వికృతంగా వినిపిస్తూంది.
రాకేష్ కళ్ళమీద నిద్ర ముంచుకు వస్తూంది. అందులో, షెర్పా తాలూకు బట్టలు కూడా సిద్ధార్థ అతడికి ఇచ్చి వున్నాడేమో- కాస్త వెచ్చగా వుంది. అతడు నిద్రలోకి జోగుతూ వుండగా గుండెలదిరేలా పెద్ద శబ్దం వినిపించింది. ఒక ఫెళ ఫెళా రావం. వారున్న గుహ కంపించింది. కాళ్ళక్రింద నేల కదిలింది.
రాకేష్ వణికిపోయి బయటకు పరుగెత్తాడు.
'నో...నో' అని అరిచాడు సిద్ధార్థ. అప్పటికే రాకేష్ కాస్త బయటకు వెళ్ళి, సిద్ధార్థ భుజం పట్టుకోవడంతో తిరిగి వెనక్కి పడ్డాడు.
అంతలో మంచు, వాళ్ళ గుహ మీదుగా క్రిందికి జారిపోసాగింది.
అవలాంచి.
దాదాపు అయిదు నిముషాల పాటు పైనుంచి పెద్ద మంచు శిఖరం విరిగి ముక్కలు ముక్కలుగా పడుతూనే వుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్లు చూస్తూ వుండిపోయారు. అదృష్టవశాత్తు వాళ్ళ గుహ కప్పబడిపోలేదు. మంచు క్రిందికి జారిపోయింది. అందులోంచి బయటకు వచ్చి వుంటే మాత్రం వాళ్ళు సజీవ సమాధి అయి వుండేవారు.
చేతుల్లో మొహం దాచుకుని రాకేష్ మోకాళ్ళమీద కూర్చుండి పోయాడు. గుండె కొట్టుకుంటున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తూంది.
"అరె. అదేమిటి" అన్నాడు సిద్ధార్థ రాకేష్ కాలివైపు చూస్తూ.
రాకేష్ కాలినుంచి రక్తం స్రవిస్తూంది. బయటనించి లోపలికి రావటంతో తగిలిన గాయం అది.
రాకేష్ కూడా దానివైపు అప్పుడే చూసుకున్నాడు.
"ఇంత గాయం తగిలినా నొప్పి తెలియటం లేదా?"
లేదన్నట్టు రాకేష్ అడ్డంగా తలూపాడు.
సిద్ధార్థకి ఏదో అనుమానం వచ్చింది. వంగొని, కత్తితో రాకేష్ మోకాలిపైన నొక్కి "నొప్పిగా వుందా?" అని అడిగాడు. లేదన్నాడు రాకేష్.
రెండు నిముషాలు పరీక్షించాడు.
"ఏమైంది" రాకేష్ ఆతృతగా అడిగాడు. సిద్ధార్థ జవాబు చెప్పలేదు.
"నాకు తెలుసు. నాకు తెలుసు" పిచ్చెత్తినట్టు అరిచాడు రాకేష్. "అది... అది... ఫ్రాస్ట్ బైట్".
సిద్ధార్థ కాదనలేదు. అబద్ధం చెప్పి లాభంలేదు. ఒక వేళ తిరిగి నాగరిక ప్రపంచంలో పడితే- పడిన వెంటనే ఆలస్యం చేయకుండా అతడికాలు తొడవరకూ కత్తిరించేయాలి. మంచువల్ల అతడి కాలు ప్రాంతంలో మాంసం చచ్చిపోయింది. (దీన్నే ఫ్రాస్ట్ బైట్ అంటారు.)
పైకి పాక్కుంటూ వెళ్ళింది- వెళుతూంది. అది నడుము వరకూ వెళ్ళకుండానే కత్తిరించేయాలి.
ఆ విషయం రాకేష్ కి తెలుసు.
అతడు ఏడుస్తున్నాడు.
సిద్ధార్థ అతడిని దగ్గిరికి తీసుకున్నాడు అంతే. చిన్నపిల్లాడిలా బావురుమన్నాడు రాకేష్. యుగయుగాలుగా పేరుకుపోయింది ఒక్కసారి కరిగినట్టు దుఃఖం అతడి గుండెల్లోంచి ప్రవహించింది. తల్లి ఒడిలో చేరి ఏడ్చే శిశువులా ఒదిగిపోయాడు.
ఆపుచెయ్యలేదు సిద్ధార్థ. పూర్తిగా ఏడవనిచ్చాడు. అతడి ఆవేశం, వ్యధ తగ్గాయని నిశ్చయించుకున్నాక, వెన్ను నిమురుతూ "భయపడకు, మనం బయటపడతామన్న నమ్మకం నాకుంది" అన్నాడు.
రాకేష్ మాట్లాడలేదు.
"ఇక కాలు సంగతంటావా-"
"కాదు, కాలు..." అరిచాడు రాకేష్. అతడి మొహంలో ఎన్నడూ కనబడని ఆవేశం కనబడింది. "నీకు...నీకు తెలుసా సిద్ధార్థా - నేను... ఎంత దుర్మార్గుణ్ణో- కేదారగౌరి కడుపులో అష్టావక్రుడు పుట్టటానికీ, నన్ను కాదని నిన్ను చేసుకున్నందుకు ఆమెమీద కసి తీర్చుకోవటానికీ..."
"తెలుసు" నెమ్మదిగా అన్నాడు సిద్ధార్థా. అతడి మొహం నిర్వికారంగా వుంది. కంఠంలో ఏ విధమైన ఆవేశమూ లేదు.
"మా పెళ్ళిరోజు మంగళసూత్రానికి అంటిన రక్తం, అప్పుడే తెగిన చేతివేలూ, కేదారగౌరికి నువ్వు తొడిగిన ఉంగరం, నల్ల గొప్పి ఉసిరి ఆకు- వీటితో అనుమానం వచ్చింది రాకేష్ నాకు! పురాతన గ్రంథాలు అన్నీ వెతికాను. ఒకదానికి ఒకటి సరిపోయాయి. దాని తరువాత జరిగిన సంఘటనలన్నీ నా అనుమానాన్ని బలపర్చాయి. అయితే ఇవన్నీ అష్టావక్రుడికోసం అన్నది మాత్రం అప్పుడు నాకు తెలీదు. కేదారగౌరికి చేతబడి చేయిస్తున్నావనుకున్నాను. కొన్ని రోజుల క్రితమే మొత్తం విషయమంతా తెలిసింది".
"అష్టావక్రుడు పుట్టి తల్లిదండ్రులిద్దర్నీ చంపుతాడనీ-నువ్వూ మరికొంతమందీ అతడి ఆగమనానికి కృషి చేస్తున్నారనీ- నువ్వు నాతో హిమాలయాలకు వస్తున్నా కాదనలేదు. గౌరి నుంచి నువ్వు దూరంగా వుండటమే కావల్సింది. నా శక్తి మీద నాకు నమ్మకం వుంది. అందుకే నాతో నిన్ను తీసుకువచ్చాను".
రాకేష్ నిశ్చేష్టుడయ్యాడు. తను వింటున్నది కలో నిజమో అర్ధం కాలేదు. ఆ కొండ శిఖరం పైనున్న మంచు అంతా జారి అతడిని కప్పేస్తున్నట్టు అనుభూతి చెందాడు.
"నాకు తెలుసు... నాకు ముందే తెలుసు" అంటూన్న సిద్దార్థ కంఠం కొండల మధ్య ప్రతిధ్వనించసాగింది.
సిద్ధార్థకి ముందే అంతా తెలుసు! అయినా ప్రేమతో, కరుణతో, మానవత్వంతో తనను ఆదుకున్నాడు. రక్షించాడు. ఎందుకూ? ఆ ప్రశ్నే అడిగాడు. ఆ ప్రశ్న అడుగుతూంటే అతడి కంఠం వణికింది.
సిద్దార్థ నవ్వేడు.
"నాకీ విషయం అంతా తెలిసేసరికి, నీ మీద అనుమానం బలపడేసరికి కేదారగౌరికి ఆరో నెల. నాకు కావల్సింది ఆమె రక్షింపబడటం. అంతేకాని నిన్ను శిక్షించటం కాదు. 'ఎవడి ఖర్మకు వాడే పోతాడు' అన్న నమ్మకం నాది. అందుకే నా శతృవుల్ని, నన్ను విమర్శించేవాళ్ళని, హానితలపెట్టేవాళ్ళని నేను పట్టించుకోను. నా సమస్య అంతా కేదారగౌరిని ఎలా రక్షించుకోవాలనే! దురదృష్టవశాత్తు గౌరికి ఇటువంటి వాటిమీద నమ్మకం లేదు. చేతికి తాయెత్తు కూడా కట్టించుకోదు".
రాకేష్ సగం విన్నాడు! సగం వినలేదు. డీప్ షాక్ లో వున్నాడు అతడు.
ఒక మేరు పర్వతం ముందు నిలబడిన అల్ప ప్రాణిలా సిద్ధార్థ వ్యక్తిత్వం ముందు అతడు కుదించుకుపోయాడు. సిద్ధార్థ కాళ్ళు స్పృశించాలనే బలమైన కోరికని అతికష్టంమీద ఆపుకున్నాడు. అతడికి మళ్ళీ రోదించాలని వుంది. చిన్నతనంలో తల్లి ప్రేమ దొరికి వుంటే, కష్టమొచ్చినప్పుడు ఆ తల్లి ఒడిలో రోదించి వుండేవాడు. అప్పటినుంచి కరడు కట్టుకుపోయిన దుఃఖం ఇన్నేళ్ళుగా మనసులో పేరుకుపోయింది- ఒకేసారి అంత సులభంగా బయటపడదు.
అతడు మాట్లాడటం ప్రారంభించాడు. ఉస్సోక్ గురించి చెప్పసాగాడు. ఏ దుష్టశక్తీ అతడి కంఠాన్ని ఆపుచేయలేకపోయింది. ఏ క్షుద్రగణాధిపతీ అతడి 'కన్ ఫెషన్'ని నొక్కెయ్యలేకపోయింది.
అంతా తాపీగా విన్నాడు సిద్ధార్థ.
చివర్లో ఒకే ప్రశ్న వేశాడు.
"రాకేష్! దేముడు అనేవాడుంటే- దానికి వ్యతిరేకశక్తి దెయ్యం కూడా వుంటుందని నమ్మినవాడిని నేను. ఎల్లుండి తెల్లవారే లోపులో నేను కాష్మోరాని అడ్డుకోకపోతే కేదారగౌరికి అష్టావక్రుడు పుట్టి, ఆమెకి పురిట్లోనే మరణం సంభవించవచ్చు. ఆ సమయానికి ఏ దుష్టదేవతో నిన్ను ఆవహించి, నన్ను హత్య చేయించవచ్చు. కానీ...కానీ....మనోరూప విద్యలంటూ నిజంగా వుంటే, ఉస్సోక్ సభ్యులకు ఆ విద్య వచ్చివుంటే, నాకీ విషయమంతా తెలుసునన్న సంగతి నీవు ముందే ఎందుకు గ్రహించలేకపోయావు? సరే నా సంగతి వదిలిపెట్టు. నీ తోటి ఉస్సోక్ సభ్యుడైన ఈ షెర్పా మనల్ని చంపటానికి వచ్చాడని ఎందుకు తెలుసుకోలేకపోయావు" అని అడిగాడు. రాకేష్ జవాబు చెప్పలేదు.
కరిగిన మంచు, గుహ పైభాగం నుంచు ఒక్కో చుక్కా క్రిందికి రాలుతోంది.
32
"రేపీపాటికి..." అనుకున్నాడు రంగప్రసాద్ చేతిలో రిపోర్టు పరిశీలిస్తూ.
గౌరీ కన్నా ఎక్కువగా అతడిని భయపెడుతూంది సిద్ధార్థ తాలూకు ఆలోచన. ఏమయ్యాడు అతడు? అర్ధంతరంగా ఎక్కడ మాయమయ్యాడు...?
...బయట కారు శబ్దం వినిపించేసరికి రంగప్రసాద్ కిటికీలోంచి బయటకు చూశాడు. ఖరీదైన ఒక పొడవాటి కారు ఇంటిముందు ఆగివుంది. ఒకప్పుడయితే అలాంటి కారు గ్రామంలోకి ప్రవేశిస్తే కుర్రవాళ్లు బిలబిలమంటూ మూగేవారే. కానీ ఇప్పుడు అవతార్ బాబా ఆ గ్రామంలో వెలిశాక అలాంటి కార్లు రావటం అలవాటయిపోయింది.
రంగప్రసాద్ లేచి, బయటకి రాబోతూ వుండగా ఆ కార్లోంచి దిగిన వ్యక్తే లోపలికి వచ్చేశాడు. అతడు ఎర్రగా, పొట్టిగా వున్నాడు. అవసరమైన దానికంటే ఎక్కువగా వున్న ఎరుపు అంత ఆకర్షణీయంగా లేదు. అతడి చేతికి వున్న ఖరీదైన వజ్రాల వాచీ అతడి 'అంతస్థు'ని తెలుపుతూంది.
"మీరేనా రంగప్రసాద్?" పరీక్షగా చూస్తూ అడిగాడు.
"అవును".
"నా పేరు అగర్వాల్. సరోజ్ కుమార్ అగర్వాల్".