Previous Page Next Page 
అష్టావక్ర పేజి 44


    "ఏం? సరేనా?"

    ఆమె అప్రయత్నంగా తలూపింది. బాబా తన వాళ్ళకి సైగ చేశాడు. వాళ్ళు ఆమెని తీసుకుని వెళ్తూంటే అతడు వెనుకనుంచి అన్నాడు. "లై- డిటెక్టర్ గానీ ఆమె అబద్ధం చెపుతూ వుందని నిశ్చయించినట్టయితే; తిరిగి నా దగ్గరికి తీసుకురానక్కర్లేదు. నేను చెప్పిన చర్య అమలు జరపండి".

    వాళ్ళు తలూపి ఆమెని తోడ్కొని వెళ్లారు.


                   *    *    *    *


    వరండా దగ్గిర తలుపు తెరుచుకుంటున్న శబ్దం అవడంతో షాడో తన గదిలోకి తిరిగి పరుగెత్తాడు. అయితే వాళ్ళు అతడి దగ్గిరకి రాలేదు. వరండాలోంచి ముందుకు సాగిపోయారు. అతడికి స్పృహ వచ్చి అయిదు నిముషాలు అయింది. తిరిగి గుమ్మం దగ్గిరకి వచ్చి చూశాడు. అతడి గుండె ఆగిపోయినట్టయింది.

    వాళ్ళముందు రంజిత నడుస్తూంది. ఏదో స్వాప్నికావస్థలో వున్నట్టు ఆమె నడుస్తూంది.

    చప్పున ఆ తలుపు దగ్గిరకి పరుగెత్తాడు.
   
    అప్పటికే అది మూసుకుపోయింది. బలమైన ఉక్కు తలుపులు. కేవలం ఎలక్ట్రానిక్ బటన్స్ ద్వారానే తెరుచుకునే అధునాతనమైన పరికరం!

    లోపలున్న లై- డిటెక్టర్ కూడా అధునాతనమైన పరికరమే. మనిషి అబద్ధం చెపుతున్నాడో, నిజం చెపుతున్నాడో తెలుసుకోగలగటం ఆ (రక్త ప్రసరణాన్ని గుర్తించే) పరికరం ద్వారా సాధ్యమవుతుంది. అయితే ఈ పరికరం ఒక మనిషి నిజం చెపుతున్నా (ఆ మనిషికున్న టెన్షన్ వల్ల) రక్త ప్రసరణ హెచ్చి, అబద్ధం చెపుతున్నట్టు చెప్పే అవకాశం వుండటంవల్ల న్యాయస్థానాలు ఇంకా ఈ పరికరాల్ని వప్పుకోలేదు. అబద్ధం చెపితే ఎలాగూ తెలుస్తుంది. నిజం చెబితే అపాయం కాస్తలో తప్పిపోతుంది.

    తనెలాగూ నిజం చెప్పటంలేదు కాబట్టి మరణం ఖాయం. అందులోనూ ఇది పల్సెస్ ద్వారా ప్రసరణాన్ని కనుక్కొనే యంత్రం.

    ఆమె ఆ పరికరం మీద చెయ్యి పెట్టి "నేను ఉస్సోక్ లో చేరదామని మనస్పూర్తిగా అనుకుంటున్నాను" అంది. పైకి అయితే అనగలిగింది గాని మనసులో అంతరాత్మని ఎలా ఆపగలదు? అది "కాదు- కాదు" అంటూనే వుంది.

    అందరి చూపులూ ఆ పరికరం మీదే నిలిచి వున్నాయి.

    ఆమె అబద్ధం చెపుతున్నట్టు పాదరస మట్టం పెరగసాగింది.


                                          *    *    *    *


    షాడో పరుగెత్తుకుంటూ ఆ స్టీలు తలుపు దగ్గరికి వచ్చాడు. పది బటన్స్ వున్నాయి అక్కడ. అతడికి ఆ విధమైన తాళం సంగతి తెలుసు. ఆ పదిలోనూ మూడు నొక్కితే తలుపు తెరుచుకుంటుంది కానీ ఏ మూడు?

    లోపల ఏం జరుగుతూందో అతడికి తెలీదు. ఏదో ఘోరం జరుగుతూ వుందని మాత్రం తెలుస్తూంది.

    అంతలో అతడి మెదడులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఒక మూలకి వెళ్ళి కాస్త దుమ్ము తీసుకునివచ్చి ఆ బటన్స్ మీద వూదేడు. మూడిటిమీద కాస్త ఎక్కువ మట్టి మటుకుంది. అంతకుముందు వెళ్ళిన వాళ్ళలో ఆ బటన్స్ నొక్కిన వాడి చూపుడు వేలి తాలూకు చెమట ఇంకా ఆ బటన్స్ మీద పూర్తిగా ఆరలేదు.

    తను తీసుకుంటున్నది పూర్తిగా రిస్క్ అని, ఏమాత్రం తప్పు బటన్స్ నొక్కినా లేక తప్పు వరుసలో తాకినా అలారం మ్రోగుతుందనీ తెలుసు. అయినా అక్కడ రంజిత ప్రాణం అపాయంలో వుందన్న భావం అతడిని ఆలోచించనివ్వలేదు.

    మట్టి ఎక్కువగా అంటుకున్న బటన్స్ మూడు నొక్కాడు.

    తలుపు నెమ్మదిగా తెరుచుకోవటం ప్రారంభించింది.

    అదృష్టవశాత్తు లోపలవాళ్ళు షాడోని గమనించలేదు. వారి దృష్టి అంతా రంజిత మీద వుంది.

    షాడో పిల్లిలా పరుగెత్తాడు. మిషన్ల వెనుకవైపు చేరుకున్నాడు. అక్కణ్ణుంచి రంజిత అతడికి స్పష్టంగా కనిపిస్తూంది. అప్పుడే ఆమెని వాళ్ళు ప్రశ్న అడగటం, లై-డిటెక్టర్ ద్వారా ఆమె నిజం చెపుతూందో, అబద్ధం చెపుతూందో కనుక్కోవటం జరుగుతూంది.

    షాడో దృష్టి లై- డిటెక్టర్ కి అమర్చబడివున్న వైరు మీద పడింది. దానికొన గోడకి వున్న ప్లగ్ లో దూర్చబడివుంది. అతడు మరి ఆలోచించకుండా దాన్ని పీకి పారేశాడు.

    రంజితనే చూస్తున్న ఉస్సోక్ మనుష్యులు, మిషను అడుగుభాగాన వున్న ఎర్రలైటు ఆరిపోవటాన్ని గమనించలేదు.

    ఆమెనుంచి పల్సెస్ గ్రహించటం మానేసింది. మిషను పాదరసం మట్టం పెరగటం ఆగిపోతూంది.

    రంజితని మరో రెండు మూడు ప్రశ్నలు అడిగి, సంతృప్తి చెంది, ఆమెని తిరిగి బాబా దగ్గరికి తీసుకు వెళ్ళటానికి వెనుతిరిగారు అనుచరులు.

    తలమునకలయ్యేటంత ఆశ్చర్యంతో కళ్ళు తెరిచింది రంజిత! ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ పరికరం అబద్ధం చెపితే వెంటనే పట్టుకుంటుందనీ, సూటికి నూరుపాళ్ళు అది తప్పు చెయ్యదనీ ఆమెకు తెలుసు. తనకి మరణం ఖాయం అనికూడా అనుకుంది. అలాంటిది వాళ్ళు తనపట్ల సంతృప్తి చెందటం చూసి విస్మయం చెందింది.

    గదిలోంచి బయటికి వెళ్తూ వెనుదిరిగి చూసింది. ఆమెకింకా నమ్మకం కుదరలేదు. మూసుకుపోతున్న తలుపుల సందులోంచి, మిషను వెనుకగా లేస్తూ ఒక ఆకారం కనబడింది. ఆ నీడనైనా ఆమె గుర్తుపట్టగలదు...షాడో!!!


                           33


    అకస్మాత్తుగా ఏదో మైకంలో నుంచి మెలకువ వచ్చినట్టు కళ్ళు విప్పాడు సిద్ధార్థ. కొన్ని క్షణాలపాటు ఎక్కడున్నదీ అర్ధంకాలేదు. ఒక వెచ్చనైన డ్రాయింగ్ రూమ్ లో వున్నట్టు వుంది. హాయిగా వుంది. మూడు రోజులపాటు వంటిని సూదుల్తో పొడిచిన చలి ఇప్పుడు లేదు.

    అతడు తల తిప్పాడు. ప్రక్కనే రాకేష్ గాఢనిద్రలో వళ్ళూ పై తెలియకుండా పడివున్నాడు. ఎందుకింత వెచ్చగా వుందో అతడికి అర్ధమయింది. గుహ పైభాగం నుంచి కారిన నీరు క్రిందికి పూర్తిగా జారకుండానే ముందు భాగాన ఘనీభవించింది. అది తలుపులా బయటనుంచి గాలి లోపలికి రాకుండా ఆపుతూంది. అతడికి ఆ స్థితి విచిత్రంగా అనిపించింది. పక్కగోడలు మంచు, పైన కప్పు మంచు. అయినా లోపల వెచ్చగా వుంది. గాలి లేనంతసేపూ మంచుకూడా చల్లదనాన్ని ఇవ్వదు. కేవలం మంచుమీద నుంచి వచ్చే గాలే శరీరాన్ని వణికిస్తుంది.

    అతడు బయటకు కదిలి, తల బాగా వంచి, గుహలోంచి బయటకు చూశాడు. బయట దృశ్యం ఎంతో మనోహరంగా కనపడింది. అది వెన్నెల కాదు. కానీ వేల వేల మైళ్ళు దూదిపరిచినట్టు తెల్లదనం... స్వచ్చంగా మెరుస్తుంది.

    కొన్ని రోజుల్నుంచీ తిండి లేకపోవటంవల్ల వచ్చిన నీరసం, దాదాపు మరణం అనివార్యం అని తెలియటంవల్ల వచ్చిన నిస్పృహ, నిరాశ- అన్నీ ఆ క్షణం అతడు మర్చిపోయాడు. దూరంగా ఎక్కడో, సన్నగా గాలి వచ్చినప్పుడల్లా కొద్దిగా మంచు పైకి లేస్తూంది. ఒక తెల్లటి లేడి పైకిలేచి దూకినట్టు- మళ్ళీ గడ్డిలో వత్తిగిలి పడుకున్నట్టు...

    'రాకేష్' అని పిల్చాడు టైమ్ చూసుకుంటూ.

    దాదాపు గంటసేపు పడుకున్నారు ఇద్దరూ. నిజానికి అది రాకేష్ మెలకువగా వుండవలసిన టైమ్ కానీ ఆ వెచ్చదనానికి అతడూ నిద్ర ఆపుకోలేకపోయాడన్నమాట.

    తనే మెలకువగా వుండాల్సింది! తప్పుచేశాడు.

    అతడు తన అరచేతుల్నీ, కాలివేళ్ళనీ, చెవిదొప్పల్నీ బాగా రుద్దుకున్నాడు (ఆ పనికోసమే నిద్రపోకుండా ఒకరు మెలకువగా వుండాలన్నది)

    "రాకేష్" మళ్ళీ పిల్చాడు. రాకేష్ లేవలేదు. సిద్ధార్థ తనే అతడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని బాగా రుద్దసాగాడు. రాకేష్ నిద్రలోనే కాస్త కదిలి వూరుకున్నాడు. ఎన్నో రోజుల్నుంచి నిద్ర లేకపోవటంతో- ప్రాణం పోయినా ఫర్వాలేదన్నట్టు పడుకుని వున్నాడు.

    అతడి మొహం నిర్మలంగా వుంది.

    ఒక మనిషితో- తన మనసులోని కల్మషం అంతా చెప్పుకొని ప్రక్షాళనం అవటం వల్ల వచ్చిన నిర్మలత అది.

    సిద్ధార్థ అతడి చేతులు, చేతివ్రేళ్ళనూ రుద్దిన తరువాత కాళ్ళ దగ్గరికి వచ్చాడు. కాలు చేతుల్లోకి తీసుకోబోతూ వుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఒక కాలుని రుద్దే అవసరంలేదు. రక్తప్రసరణం ఆగిపోయి, అది ఎప్పుడో చచ్చుపడి పోయింది. రెండో కాలుకే అవసరం.

    బొటనవేలు దగ్గిర్నుంచే రుద్దటం మొదలుపెట్టి ఏదో అనుమానం వచ్చినట్టు, రెండోకాలిని మోకాలి దగ్గర కొట్టి చూశాడు. ఆ కాలు ఫ్రాస్ట్ బైట్ కి శిథిలమవుతూ వున్నది.

    రాకేష్ లో చలనం లేదు.

    పిన్నుతో మోకాలి దగ్గిర గుచ్చాడు...రాకేష్ బాధగా అట్నుంచి ఇటు తిరిగాడు....కొద్దిగా క్రింది భాగంలో తిరిగి గుచ్చాడు. రాకేష్ కి స్పర్శ తెలియలేదు.

    "మైగాడ్" అనుకున్నాడు సిద్దార్థ మనసులో.

    "రాకేష్...రాకేష్" అంటూ బలంగా తట్టి లేపాడు. నిద్రలోంచి లేచి రాకేష్ మత్తుగా "ఏమిటి" అని అడిగాడు.

    "మనం వెంటనే బయల్దేరాలి"

    "టైమెంతయింది?"

    "అర్దరాత్రి అయిందనుకుంటాను. అదికాదు ముఖ్యం. మనం వెంటనే వెళ్ళిపోవాలి..."

    "ఎందుకు?"

    "తరువాత చెపుతాను- బయల్దేరు".

    ఒంగొని దాదాపు దేకుతున్నట్టు ఇద్దరూ బయటకు వచ్చారు.

    ఒక్కసారిగా చల్లటిగాలి వాళ్ళని చుట్టుముట్టింది. "నేను చెప్పాలా" అన్నట్టు చూశాడు రాకేష్. సిద్ధార్థ మొహం తిప్పుకుని క్లుప్తంగా "నడుద్దాం" అంటూ భుజానికి సంచి తగిలించుకున్నాడు.

    రాకేష్ తన వంటివైపు చూసుకున్నాడు. షెర్పా తాలూకు బట్టలు కూడా తన వంటిమీద వుండటాన్ని గమనించి, పూర్వంకన్నా వెచ్చగా ఎందుకుందో గ్రహించాడు. సిద్దార్థవైపు కృతజ్ఞతతో చూస్తూ "నువ్వొకటి తీసుకో" అన్నాడు.

    "వద్దు" క్లుప్తంగా అన్నాడు సిద్దార్థ. అతడు అంత సీరియస్ గా ఎందుకున్నాడో అర్ధంకాక అడుగు ముందుకు వేశాడు రాకేష్.

    అంతే! పాదం దగ్గిర బ్యాలెన్స్ కుదరక ముందుకు తూలాడు. సిద్ధార్థ చప్పున వంగి అతడిని పట్టుకుంటూ, "నేనేం జరుగుతుందని భయపడుతున్నానో అదే జరిగిందన్నమాట" అని గొణుకున్నాడు తనలో తనే. రాకేష్ కి సగం వినిపించింది- సగం వినిపించలేదు.

    "ఏమిటీ?" అన్నాడు. 

    సిద్ధార్థ జవాబు చెప్పకుండా, "జాగ్రత్తగా నడవటానికి ప్రయత్నించు రాకేష్" అన్నాడు.

    "భయం- అన్నావేమిటి?" రెట్టించాడు రాకేష్. సిద్ధార్థకి చెప్పక తప్పలేదు.

    "నీ పాదం దగ్గిర ప్రారంభమయిన ఫ్రాస్ట్ బైట్ నెమ్మది నెమ్మదిగా పైకి పాకుతూంది రాకేష్. ఇప్పుడు నిన్ను నిద్ర లేపేటప్పుడు అదే గమనించాను. అందుకే వెంటనే బయల్దేరదామనుకున్నాడు" అన్నాడు కారణం వివరిస్తున్నట్టు. ఇదంతా చెప్పటం అతనికి ఇష్టంలేదు. కానీ తప్పలేదు.

    రాకేష్ కూడా తెలివితక్కువ వాడేమీకాదు. "అంటే... అంటే..." అన్నాడు తనలో తనే అనుకుంటున్నట్టు! "...నిన్న పాదం దగ్గర మాంసం చచ్చుపడిపోవటం ప్రారంభమయింది. ఈ రోజుకల్లా మోకాలి వరకూ పాకింది. నాలుగైదు రోజుల్లో గనుక కాలు తీసెయ్యకపోతే తొడలు...న...డు...ము..." 

 Previous Page Next Page