Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 43

   
    భాగవతార్, నక్షత్ర, సోమనాద్ ముందు జయా నర్సింగ్ హోమ్ కెళ్ళారు. అక్కడ సిస్టర్ చెప్పిన విషయాలు విని వెంటనే లాయర్ వైజయంతి ఇంటికి చేరుకున్నారు. చూడామణి, కేశవనాద్ లు కూడా తమ కారులో వచ్చారక్కడికి. లాయర్ యశోధరాదేవి మొహం బాగా వడిలిపోయి వుంది. ఎన్నెన్నో సమస్యల నెదుర్కొని ఎంతో ధైర్యంగా పరిష్కరించగలిగినామె ఒక్కసారిగా డీలాపడి పోయినట్లు కనిపించింది. వాళ్ళంతా ఎందుకొచ్చారో చెప్పకుండానే అర్ధమైపోయింది ఆమెకి. వాళ్ళేమీ అడక్కుండానే, "సారీ! పరిస్థితి మనం ఊహించిన దానికంటే గంద్రగోళంగా తయారయిపోయింది. రాజభూషణం మృదులని రివల్యూషనరీగా ఆరోపించి అరెస్టు చేయించాడు. కరీంనగర్ జిల్లా మహాదేవ్ పూర్ కనుకునూరు, వెంకలగట్ట, కాళేశ్వరం మొదలైన ట్రైబల్ విలేజస్ ప్రాంతాలలో ఉగ్రవాదుల కార్యకలాపాలు బాగా సాగుతున్నాయట. వాళ్ళ జాడ తెలియపర్చమని పోలీసులు ట్రైబల్స్ కి హెరేజ్ చేస్తున్నారట. ఈ హెరేస్ మెంట్ కి వాళ్ళుపయోగించే కోడ్, "కోటింగ్" దురదృష్టం కొద్దీ మృదుల మేము కొనసాగిస్తోన్న మాస లిటరసీ ప్రోగ్రాంకి కనుకునూర్ ని ఎంచుకుంది. మాకు రాజకీయాలలో ఏ సంబంధం లేకపోయినా, రాజభూషణం ట్రైబల్ స్త్రీని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడ్డం- వాళ్ళంతా తిరగబడి అతడ్ని కొట్టడం - "మామూలుగా పై అధికార్లని చూస్తేనే భయపడి పారిపోయే గిరిజనులకి తిరగబడి కొట్టేంత ధైర్యం ఎలా వచ్చింది" అనే ప్రశ్న తలెత్తడం- రాజభూషణానికి పాలకవర్గాలలో మంచి పలుకుబడుండడం- గిరిజనులు రాజభూషణం మీద తిరగబడే సమయానికి మృదుల అక్కడే వుండడం- ఇన్ని కారణాల వల్ల మృదులని ఎక్స్ ట్రీమిస్ట్స్ గా ఆరోపించి అరెస్టు చేయించగలిగాడు రాజభూషణం. ప్రభుత్వం ప్రస్తుతం ఎక్స్ ట్రీ మిస్ట్ విషయంలో చాలా కఠినంగా వుంటోంది. మృదులని బెయిల్ మీద విడిపించడానికి ప్రయత్నించాను సాధ్యంకాలేదు. అయినా ఫరవాలేదు. నేను, మా వైజయంతి శాయశక్తులా ప్రయత్నించి తప్పకుండా మృదులని విదిపిస్తాము" అంది. ఆవిడ తనకీ, తనే దైర్యం చెప్పుకుంటున్నట్లుగా వున్నాయా మాటలు. చూడామణి రోషం- పౌరుషం- డాంబికం- ఎగిరిపోయాయి. శోకదేవతలా తయారైంది.
    తనకి తెలుసున్న మంత్రుల్లో ఎవర్ని ఆశ్రయిస్తే పని జరుగుతుందా అని ఆలోచిస్తున్నాడు కేశవనాద్. అతడికి శరీరంలో సత్తువ నశించినట్లు కాళ్ళూ, చేతులూ వొణుకుతున్నాయి.
    "ఇంత ఘాతుకానికి పూనుకున్నాడా! రాజభూషణం" నమ్మలేనట్లు అన్నాడు భాగవతార్.
    "అధర్మ విష వృక్షస్య వచ్యతే స్వాదు కిం ఫలమ్?"- అంటే అధర్మమనే విషవృక్షానికి రుచిగల పండ్లు పండుతాయా? రాజభూషణం లాంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలుకాక మంచి పనులు చేస్తారా?" అన్నాడు నక్షత్ర.
    "ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి" ఏడుపు గొంతుకతో అంది చూడామణి.   
    "భాగవతార్ గారు మృదులగారి దినచర్య మీద రిపోర్టు తయారు చెయ్యమన్నారు. ఆ సందర్భంలో అనుకోకుండా మాకు మింగియార్ గారి గురించి కూడా చాలా విషయాలు తెలిసాయి. ఆయన మన ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితులు. మనకి ఆయనే ఏదైనా సాయం చెయ్యగలరు" అని చెప్పాడు సోమనాద్.
    "మనకి మింగియార్ సాయం చేస్తాడా?" అనుమానంగా అడిగాడు భాగవతార్.
    "అగచ్చన్ వైనతెయోపి పదమేకం న గచ్చతి-" అంటే నడవకపోతే గరుత్మంతుడైనా ఒక అడుగు ముందుకు పోలేడు. ప్రయత్నిద్దాం. ప్రయత్నించకుండానే ఆలోచనలెందుకు?" అన్నాడు నక్షత్ర.
    "ముఖ్యమంత్రికి సన్నిహితుడైతే మనకి తప్పకుండా సాయం చెయ్యగలడు ప్రయత్నించండి" అంది లాయర్ యశోధరాదేవి.
    భాగవతార్ మాట్లాడే దశలో లేడు. అంచేత జరిగిందంతా సోమనాద్ వివరించాడు.
    "భగవంతుడేం చేసినా మన మంచికే అంటారు. నిన్ననే "జైలు కుప్పే" లో మా లామ్ సరీకి వెళ్ళాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. మృదులగారికి సాయం చెయ్యగలిగే అవకాశం వచ్చింది నాకు. మీరంతా ఇంటికి వెళ్ళండి. కింద నన్ను కన్ సల్ట్ చేయడానికొచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళని పంపేసి ఈ రోజే మృదులగారిని విడిపించటానికి పూనుకుంటాను" అన్నాడు మింగియార్.
    భాగవతార్ కి ఇంటికి వెళ్ళాలని లేదు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడుతూన్న ఈ సమస్యలు అతడ్ని పిచ్చివాడ్ని చేస్తున్నాయి. అన్ని విషయాలు తెలుసుకున్న ఏండెటో తన మృదంగం తీసుకొచ్చి "గురువుగారూ కొంతసేపు సంగీతసాధన చేసుకుందాం" అన్నాడు. వెంటనే భాగవతార్ సంగీతంలో లీనమైపోయాడు. "కళ కూడా ఒక తపస్సే" అనడానికి భాగవతార్ మంచి ఉదాహరణ. తన మనసంతటిలోనూ గానకళా సరస్వతిని మృదులని కాపాడమని ప్రార్దిస్తూన్నట్లుగా వుంది అతని గానం.
    మూడు రోజులు గడిచాయి. ఆ మూడు రోజులు- డెబ్బైరెండు గంటలు, నాలుగువేల మూడువందల ఇరవై నిమిషాలు. రెండు లక్షల, యాభై తొమ్మిదివేల రెండువందల సెకెన్లు. ప్రతి సెకను గానకళా సరస్వతిని తన సాధన ద్వారా మృదులని కాపాడమని ప్రార్ధిస్తూ గడిపాడు భాగవతార్.
    మూడోరోజున మృదులతో వచ్చాడు మింగియార్. ఆర్తిగా, దీనాతిదీనంగా వినిపిస్తోన్న భాగవతార్ సంగీతం, మృదులకి స్వాగతం పలికింది. పోలీసు లాకప్ లో మూడురోజులపాటు అనుభవించిన నరకయాతనలన్నీ ఒక్కసారిగా మాయమయినట్లనిపించింది. మృదులని చూడగానే వికసించిన ముఖంతో లేచి నిలబడి చేతులు జాపాడు భాగవతార్. ఆ చేతుల్లో వాలిపోయింది మృదుల.
    కళ్ళల్లో ఉబికిన ఆనంద భాష్పాలు తుడుచుకున్నాడు మింగియార్.
    అప్పటివరకూ అందరికి పజిల్ గా వున్న మింగియార్ తన విషయాలన్నీ వివరించాడు.
    "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కర్నాటక పర్యటించినప్పుడు జైలు కుప్పేలోని లామెసరీ కూడా సందర్శించాడు. అతి ప్రాచీన కాలం నుంచి లామాలలో కొందరికి కొన్ని విద్యలు పారంపార్యంగా సంక్రమిస్తూ వచ్చాయి. వాటిలో ఏకాగ్రమైన సాధనతో జ్ఞాననేత్రాన్ని సాధించడం మనుష్యుల నావరించి వుందే విద్యుదయాస్కాంత జీవతరంగాల వర్ణాలను బట్టి వారివారి మనోభావాలని తెలుసుకో గలగడం- మూలికలతో వైద్యాలు- జూడో విన్యాసాలు- జూడో ద్వారా ఎదుటి వ్యక్తుల్ని కొంతసేపు స్పృహతప్పే లాగ చేయగలగటం- జూడో అభ్యాసం ద్వారా మానసిక నిగ్రహాన్ని సాధించడం, మొదలైనవి ముఖ్యమయినవి. లామాలలో కూడా రకరకాల పాళ్ళున్నారు. కొందరు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరు బౌద్దాన్ని ప్రచారం చేసేవాళ్ళు. మరికొందరు రాజకీయాల్లో ప్రవేశం కల్పించుకొనేవాళ్ళు- ఇలా ఎందరో మాలోనూ, అతి కొద్దిమంది మాత్రమే పూర్తి సన్యాస జీవితాన్ని గడిపేవాళ్ళు. నేను మొదటినుంచీ సన్యాస జీవితాన్నే ఎంచుకున్నాను. మా గురువుగారికి నా అదృష్టంకొద్దీ నా మీద దయకలిగి తన విద్యలన్నీ నాకు ప్రసాదించారు. నిజానికివేవీ మంత్ర తంత్రాలతో కూడుకొన్న విద్యలు కావు. అన్నీ సైన్స్ వొప్పుకుంటున్నదే. మీ గిరిజనుల్లో మాకంటే అద్భుతంగా మూలికలతో వైద్యం చేసేవారున్నారు.
    ముఖ్యమంత్రికి మా గురువు నన్ను పరిచయం చేసి నేను సాధించిన శక్తుల గురించి గొప్పగా వర్ణించారు. ముఖ్యమంత్రి నన్ను రాజధానికి ఆహ్వానించారు.
    ముఖ్యమంత్రి భవనంలో, ముఖ్యమంత్రి తనకి సన్నిహితులైన కొందరు మంత్రులతో మాట్లాడుతూండగా నేనూ అక్కడున్నాను. వాళ్ళంతా వెళ్ళిపోయాక ముఖ్యమంత్రి సరదాగా-
    "ఇప్పుడొచ్చిన వాళ్ళల్లో ఎవరి మనోభావాలు ఎలాంటివో చెప్పగలవా?" అన్నారు.
    "వంగపండు రంగు జరీ అంచున్న ఖద్దరు పంచె కట్టుకుని, గోధుమ రంగు సిల్కు లాల్చీ వేసుకున్నాయన ఏదో ద్రోహ బుద్ధితో వున్నట్టు తోస్తోంది" అన్నాను. ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారు. 

 Previous Page Next Page