"అతడు నాకు పరమ ఆప్తుడు, అన్నారు. అప్పట్లో ఆయన నా మాటలు నమ్మలేదు. నాలుగు రోజులు ముఖ్యమంత్రి భవనంలో వుండి బైలుకుప్పేకు వచ్చేసాను. తరువాత చాలా విచిత్రమయిన సంఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి భార్యకి గుండె జబ్బు వచ్చింది. ప్రాణాలు దక్కవనుకున్నారు. ఆ దశలో ఆమెను తీసుకుని చికిత్సకోసం అమెరికా వెళ్ళారు ముఖ్యమంత్రి. సరిగ్గా ఆ సమయంలో ముఖ్యమంత్రి తన కాప్తుడనుకున్న వ్యక్తి అసమ్మతి వర్గాన్ని లేవదీసి కొంతమంది అనుచరుల్ని కూడదీసుకుని శాసనసభలో ముఖ్యమంత్రికి మెజారిటీ లేదని చూపించి ముఖ్యమంత్రి పదవి అలంకరించాడు. అమెరికానించి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి ఈ నమ్మకద్రోహానికి నివ్వెరబోయాడు. కాని దృడంగా నిలబడి తన అనుచరులనందర్నీ కూడదీసుకుని శాసనసభలో తనకి మెజారిటీ వుందని నిరూపించుకుని తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ పరిణామాలు తరువాత ముఖ్యమంత్రికి నా మాటల్లో విశ్వాసం కుదిరి నన్ను రాజధానిలో కొన్నాళ్ళుండమని ఆహ్వానించారు. మరో ఇద్దరు లోమాలతో మూలికలు సేకరించే మిషమీద ఆంధ్రప్రదేశ్ కొచ్చి రాజధానిలో వుంటున్నాను. ఈ ఇల్లూ అది ముఖ్యమంత్రిగారే ఏర్పాటు చేశారు. నాకు జ్ఞాననేత్రం వుందని ప్రచారం కాగానే ఎందరెందరో తమ తమ సమస్యల పరిష్కారాలకోసం నా దగ్గిరకొచ్చేవారు. ముఖ్యమంత్రి కూడా కొన్ని కొన్ని సమస్యలు నాతో చర్చించేవారు. నా మాటలు ఆయన ఎంతవరకూ విశ్వసించేవారో నాకు తెలియదు. ఆ విషయం నేనెప్పుడూ అడగలేదు. ఈ పరిచయంతోనే ముఖ్యమంత్రికి మృదులగారి గురించి నాకు తెలిసిందంతా చెప్పాను. అంతేకాదు ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడు నమ్మకద్రోహం చేసి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో రాజభూషణం అతనికి చాలా సహాయం చేశాడు. అతని పార్టీకి ధారాళంగా విరాళాలిచ్చాడు. ఇదంతా నాకు ఆ రెండో మంత్రి అనుచరుల ద్వారానే తెలిసింది. అతను అనుచరులు కొందరు తమ పార్టీ మళ్ళీ పదవిలోకి వస్తుందో రాదో తెలుసుకోవడానికే నా దగ్గరికొచ్చేవారు. వాళ్ళ ద్వారా తెలిసాయి నాకీ సంగతులు. ఈ విషయం కూడా ముఖ్యమంత్రికి చెప్పి రాజభూషణం పన్నుగడ అని వివరిస్తే ముఖ్యమంత్రి నా మాటలు విశ్వసించారు. ఆయన సహకారంతో మృదులని విడిపించగలిగాను. రాజభూషణం విషయం లాయర్ యశోధరాదేవిగారు చూసుకుంటున్నారు. నేను రేపు బైలుకుప్పే వెళ్ళిపోతున్నాను. నా దగ్గిరకొచ్చే వాళ్ళు ముసుగుల్లో ఎందుకొస్తున్నారో కొన్ని ఉదాహరణలు చెప్తాను.
ఒకావిడ తను దేవుళ్ళని, దెయ్యాలని నమ్మనంటుంది. మార్క్సిస్ట్ అని చాటుకుంటుంది. అయితే ఆవిడ పదవుల కోసం మంత్రుల్ని శాయశక్తులా కాకాలు పడుతూనే ఉంటుంది, ఇటీవల ఆవిడకి ఏదో గర్భకోశ వ్యాధి వచ్చింది. ఎంతమంది డాక్టర్లకి చూపించినా సరిగ్గా డయాగ్నెయిజ్ చేయలేకపోయారు. బాధ భరించలేక ప్రాణం విసిగి పోయిందావిడకి. చివరి ప్రయత్నంగా నా దగ్గిరకి వచ్చింది. ఆవిడే మొదటిసారిగా ముసుగులో నా దగ్గిరకొచ్చింది. ముసుగులో వస్తే తనెవరో నాకు తెలియదని ఆశపడింది. పాపం. నేనన్నీ విషయాలు తెలుసుకుంటానని ఆవిడకి తెలియదు. ఆమెని చూసి మిగిలినవాళ్ళు కూడా ముసుగులో రావడం ప్రారంభించారు. ముసుగుల్లో వుండటంవల్ల తామెవ్వరో ఎవరికీ తెలియదనే దైర్యంతో వాళ్ళు ప్రకటించే కోరికలు వింటూంటే మానవుల స్వార్ధానికి- దురాశకి మతిపోయేట్లయియ్యేది. ఒకడు మంచంలో తీసుకుంటూన్న తన తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడని అడిగాడు. మరోకావిడ "తనకు విరోధమున్న ఇంకొకావిడకి రోగం తెప్పించే చేతబడేమైనా నాకొచ్చాని" అడిగింది. మరో ప్రబుద్ధుడు "తను కోరగానే ఏ అందమైన యువతైనా తన వెంట వచ్చే మంత్రం ఏదేనా వుంటే చెప్పమని" అడిగాడు.
మరికొందరు "ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోయే అవకాశముందా" అని అడిగారు. అందుకు దారితీసే రకరకాల ఉద్యమాలు- ఆందోళనలు, తాము చెయ్యదల్చుకున్నవి చెప్పి అవి విజయవంతం అవుతాయా అని అడిగేవారు. ఇలాంటివే ఎన్నెన్నో. ప్రతి మనిషికి, ముసుగులో ఒక రూపం- ముసుగు లేకుండా మరో రూపం- ముసుగులో వున్న రూపాన్ని సైతం కనిపెట్టగలగటమే నేను సాధించిన విద్య.
భాగవతార్ గారూ! మృదులగారి లాంటి వ్యక్తిని చాలా అరుదుగా చూడగలుగుతాం మనం. ఆమెకీ ముసుగురూపం లేదు. తన వ్యక్తిత్వంతో నిర్భయంగా నిలబడుతుంది. అదే ఆమెలోని విశిష్టత.
కళ్ళు మూసుకుని ఏ అడవుల్లోనో కూర్చోవడమే తపస్సు కాదు. నిజ జీవితంలో నిజాయితీతో నిలబడటమే గొప్ప తపస్సు. మృదులగారూ! మీరు జీవితాంతమూ ఇదే నిజాయితీతో నిలబడాలని ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు మానవుడికి ప్రసాదించే వరాలన్నిటిలోకి ఇదే గొప్ప వరం__"
* * *
బ్రీఫ్ కేస్ సర్దుకుని చేత్తో పట్టుకుంది మృదుల. ఉత్సాహం ఉరకలు వేస్తోన్న ఆమె ముఖం అందాలకి అందంగా కళకళలాడుతోంది.
"మైడియర్ అవతారం గుడ్ బై. నన్ను నువ్వు భరించలేవు_"
"టా టా!" చెప్పటానికి పై కెత్తిన చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని బ్రీఫ్ కేస్ దూరంగా విసిరేసాడు భాగవతార్.
"వెళ్ళకు. నువ్వు రేపటి మహిళవి- నేనింకా నిన్నలోనే ఉన్నాను. ఎప్పటికయినా కాలం ముందుకు కదులుతుంది కానీ, వెనక్కిరాదు. నేనూ నీతోనే వస్తాను"- అతడి చేతులు విడిపించుకోకుండా మరికాస్త దగ్గిరగా జరిగి "రాగలవా, మరి?" అంది మెత్తగా. "కష్టమే అనుకో! ప్రయత్నిస్తాను. నీకోసం! నిన్ను వదిలి ఉండలేక...."
కాలింగ్ బెల్ మోగింది- భాగవతార్ చేతులు వదిలించుకుని తలుపు తెరిచింది. జర్నలిస్ట్ మహావీర్ వచ్చి కూచున్నాడు_
"ప్లెమింగ్ వ్యవహారంలో మీ అనుభవాలన్నీ వివరంగా చెప్తారా? ఆర్టికల్ వ్రాయాలి!" అన్నాడు మృదులతో!
"తప్పకుండా! రండి! నా స్టడీరూంలో కూచుందాం!"
హాల్లో భాగవతార్ ఒక్కడూ మిగిలిపోయాడు_
"కష్టం! చాలా కష్టం! కానీ తప్పదు_ కాలం "రేపు" లోకి ప్రవహించవలసిందే! గొణుక్కున్నాడు.
ఈసారి అతడి చెయ్యి జుట్టుమీదకి వెళ్ళలేదు.
*** సమాప్తం ***