Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 42

   "నేను మృదుల భర్తని."
    "గ్లాడ్ టు మీట్ యూ". చెయ్యి జాపాడు చక్రవర్తి. ఆ చెయ్యి అందుకోబోయి కట్టు కదిలి నొప్పి పుట్టగా "అబ్బా" అన్నాడు భాగవతార్.
    "ఫరవాలేదులెండి. ఇంతకీ నాతో ఏం పని?"
    "మీరు నా మృదులని పెళ్ళి చేసుకోవాలి."
    "వాట్!"
    "ఏయ్ మిస్టర్! చేసినదంతా చేసి తప్పించుకోవాలని చూడకు. నా దగ్గర రుజువులు, సాక్ష్యాలు వున్నాయి. నిన్ను కోర్టుకీడ్చి, జైలు శిక్ష వేయించగలను. మర్యాదగా మృదులని పెళ్ళి చేసుకో. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం?" ఆ గదిలో సోఫాలో కూర్చున్న నాగరిక యువతీ కీచుమనేడ్చి ఏడుపందుకుంది. చక్రవర్తి ఖంగారు పడిపోతూ-
    "చకితా! వూరుకో. ఊరుకో. ఇతడేదో మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చినట్లున్నాడు. నేను మాట్లాడి సర్ది పంపిస్తాను. ఊర్కో ప్లీజ్!" అని ఓదార్చబోయాడు. ఆ అమ్మాయి ఏడుపు మరికాస్త ఎక్కువయింది.
    "నేను హాస్పిటల్ నుంచి వచ్చినమాట నిజమేకాని అది మెంటల్ హాస్పిటల్ కాదు. మృదులని నువ్వు పెళ్ళి చేసుకుని తీరాలి. నా భార్యని అవమానిస్తే నేనూర్కోను. నానావతిలాగ నిన్ను హత్య చేస్తాను.
    "ఏమిటయ్యా వాగుతున్నావు. నీ పెళ్ళాన్ని నేపెళ్ళి చేసుకోవడమేమిటి? వొంటినిండా కట్లతో వొచ్చావు ఎక్కడ దెబ్బ కొట్టాలో నాకర్ధం కావడంలేదు. కాబట్టి బతికిపోయావుగాని లేకపోతే, చావచితకబాదేసేవాడ్ని."
    "ఈ దేబ్బలన్నీ మృదులకోసమే తిన్నాను. ఇంకా ఎన్ని దేబ్బలైనా తింటాను. గాని మృదులకి అన్యాయం జరగనీయను."
    "ఏమిటయ్యా నీ గోల! ఎందుకు పెళ్ళి చేసుకోవాలి నీ మృదులని?"
    "మృదులని ప్రేమించావు గనుక."
    "నేనా!"
    "నువ్వే. ప్రేమించావు లేక ప్రేమించినట్లు నటించావు. ఇప్పుడిహ మోసం చెయ్యడానికి వీల్లేదు."
    "రామచంద్రా! మృదుల ఎవ్వరో నాకు తెలియదయ్యా. ఆవిడనెప్పుడూ నే చూడను కూడా లేదు."
    "నేను చూశాను వీడియోలో."
    "ఏం వీడియో ఏం గొడవ? ముందు మర్యాదగా అవతలికి నడు"
    "ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావో చెప్పు వెళ్తాను."
    విసిగెత్తిపోయిన చక్రవర్తి, "యూ బ్రూట్" అంటూ లేచాడు. ఆ సమయానికక్కడి కొచ్చారు చూడామణి, కేశవనాథ్ లు.
    "ఎవర్ని బ్రూట్ అంటున్నావు మా అల్లుడ్నేనా? వొళ్ళు దగ్గిర పెట్టుకుని మాట్లాడు" పోట్లాటకి దిగింది చూడామణి.
    "చూడండత్తగారూ! ఇతడు మన మృదులని పెళ్ళి చేసుకోనంటున్నాడు. ఫిర్యాదు చేసాడు భాగవతార్.
    "మృదులనితడు పెళ్ళి చేసుకోవడమేమిటి?" అడిగాడు కేశవనాథ్.
    "మృదుల ఇతడ్ని ప్రేమించింది. అంచేత నా ప్రేమను త్యాగం చేసి మృదులనితనికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాను."
    కెవ్వున అరిచింది చూడామణి. "మృదుల ఇతడ్ని ప్రేమించిందా? నువ్వే మృదులకు తగవు అనుకుంటూంటే నీకంటే దౌర్భాగ్యుణ్ణి ఇతడ్ని ప్రేమించిందా?"
    "ఇతడు నాకంటే దౌర్భాగ్యుడన్నమాట నిజమే కాని ఏం చేస్తాం మృదుల ప్రేమించాక" సోఫాలో ఏడుస్తోన్నమ్మాయి టెంపరరీగా ఏడుపు మర్చిపోయి నవ్వేసింది. చక్రవర్తి మొహం కోపంతో ఎర్రబడింది.
    "ఇతడినెలా ప్రేమించిందయ్యా మృదుల?"
    "దేవకి నా గురించి చెప్పిందని నన్ను ప్రేమించింది. ఇతడి గురించి ఎవరు చెప్పారో మరి? అడగలేదు."
    "ఖర్మ, ఖర్మ నా కూతుర్ని చచ్చినా ఇతడికిచ్చి పెళ్ళి చెయ్యను."
    "మీరెవరు చెయ్యకపోవడానికి, నే చేస్తాను. మృదుల నా భార్య."
    "నా కూతురు."
    "నాతో పెళ్ళయిపోగానే మీ కూతురిమీద మీకు అధికారం పోతుంది."
    "భార్యని మరొకరికిచ్చి పెళ్ళి చేయాలనుకోగానే నీకూ అధికారం పోయింది."
    అత్తా అల్లుళ్ళ వాదోపవాదాలు విని భరించలేక చికాగ్గా లేచాడు కేశవనాథ్.
    "అసలు విషయమేమిటో తెలుసుకోకుండా మీలో మీరు వాదించుకుంటారేమిటి? ఏమండీ చక్రవర్తిగారూ! మా మృదుల మిమ్మల్ని ప్రేమించిందా?" అడిగాడు.
    "నాకేం తెలియదండి. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా మీ అల్లుడు గారు వినిపించుకోవడం లేదు. మీరైనా చెప్పండి" అన్నాడు చక్రవర్తి.
    "అబద్ధం. వీడియోలో స్పష్టంగా చూసాను. సొట్టకాలు స్పష్టంగా కనపడింది. ఆ సొట్ట కాలెవరిదో తెలుసుకోవడానికి నేనెంతో ప్రయాసపడ్డాను" చెప్పాడు భాగవతార్.
    చక్రవర్తి మొహం రోషంతో రగుల్తోంది. అతడ్ని చూసి జాలేసింది చకితకి. లేచి కళ్ళు తుడుచుకొని భాగవతార్ దగ్గరకొచ్చింది.
    "భాగవతార్ గారు! సరిగ్గా చెప్పండి. మా చక్రవర్తి మీ భార్యని ప్రేమించాడా!"
    "అవును"
    "ఎవరు చెప్పారు మీకు"
    "వీడియోలో చూసాను."
    "ఎవరు తీశారు వీడియో?"
    "సోమనాధ్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీస్."
    "ఆయనకి పోనుందా? వుంటే నంబరియ్యండి."
    సోమనాధ్ నెంబర్ చెప్పాడు భాగవతార్. చకిత సోమనాధ్ కి పోన్ చేసి "మీరు అర్జంటుగా ఒకసారి ఇక్కడికి రండి. భాగవతార్ మా యింటికొచ్చి చక్రవర్తిగారితో పోట్లాడుతున్నారు" అంది.
    ఆ మాటలతో విషయం అర్ధమైపోయింది సోమనాధ్ కి. "ఇప్పుడే వస్తున్నాను" అని ఫోన్ పెట్టేసాడు. పది నిముషాల్లోనే తన డొక్కు కారులో అక్కడికొచ్చాడు. అందరూ నిశ్శబ్దంగా- కోపంగా- ఒకరినొకరు చూసుకుంటున్నారు.
    చకిత మాట్లాడింది మొదట. "సోమనాధ్ గారూ! మీరు తీసిన వీడియోలో మృదులతో వున్నది చక్రవర్తిగారా!" అడిగింది.
    భాగవతార్ తో సమయానికి అసలు విషయం చెప్పలేదని ఖంగారు పడుతున్న సోమనాధ్ -
    "వీడియోలో వున్నది మృదుల కాదు. మీరు" ఆనాడు చకితతో. ఈసారి కీచుగా అరిచాడు చక్రవర్తి.
    "ఎవరితో వుంది చకిత?" కోపంగా అడిగాడు.
    "మీతోనే."
    మతిపోయినట్లవుతోంది అందరికీ.
    "వీడియో ఏమిటి? ఎవరు తీశారు? ఎందుకు తీశారు? వీడియోలో ఎవరెవరు వచ్చారు?" ఆజ్ఞాపిస్తున్నట్లు అడిగాడు కేశవనాథ్.
    అతి రహస్యం బట్టబయలైంది. జరిగిందంతా చెప్పక తప్పలేదు సోమనాద్ కి. చూడామణి చండికలా మండిపడుతూ-
    "దుర్మార్గుడా! నా కూతుర్ని అవమానించడమే కాకుండా వీడియో కూడా తీయిస్తావా?" అంది.
    "అదిసరే ఇంతకి భాగవతార్ ఇంట్లో తీసిన వీడియోలో నువ్వెలా వచ్చావు?" చకితనడిగాడు చక్రవర్తి.
    "అదే ప్రశ్న నిన్నడుగుతున్నాను నువ్వెలా వచ్చావు?" నిలదీసి అడిగింది చకిత.
    "ఇంతకీ ఈ వీడియో ఎక్కడ జరిగింది?" అనుమానంగా అడిగాడు కేశవనాద్. సోమనాద్ ఫల్గుణ్ కి ఫోన్ చేసి పిలిపించాడు.
    "ఎక్కడ తీసావు నువ్వు వీడియో?" దబాయిస్తూ అడిగాడు సోమనాద్.
    "సరస్వతీ అపార్ట్ మెంట్స్ బి.7 ప్లాట్ లో. అది మీరు నాకిచ్చిన నంబరే. వెరిపై చేసుకోండి కావాలంటే." అంతమందిని ఒక్కసారి చూసి ఖంగారుపడుతూ అన్నాడు ఫల్గుణ్.
    అవును అదే మీరు నాకిచ్చిన నంబరు" చెప్పాడు భాగవతార్ తో సోమనాధ్.
    "అది నా ప్లాట్ నంబర్. నా ప్లాట్ లో వీడియో ఎందుకేర్పాటు చేయించారండీ భాగవతార్ గారూ," ఖస్సుమంటూ లేచింది చకిత. భాగవతార్ బిత్తరపోతూ "నే .... నే.... నేను ఆ ప్లాటులో వీడియో రికార్డు చేయమనలేదు. నా అపార్ట్ మెంట్ లో రికార్డు చెయ్యమన్నాను."
    "మరి ఈ నెంబరు ఎలా వచ్చింది?" ఆలోచనగా అన్నాడు కేశవనాద్. భాగవతార్ బుఱ్ఱలో ఫ్లాష్ మెరిసింది. వెలతెలబోతూ సిగ్గుపడుతూ," అది నా- ఫ్లెయిట్ సీటు నెంబరు" అని తల దించుకున్నాడు.
                           *    *    * 

 Previous Page Next Page