"నిన్న సాయంకాలం అమ్మాయిని వరదరాజు వాళ్ళ ఊరు తీసుకుపోయేడుట."
"తిరిగివచ్చేసేరుగా."
"ఇదేం గొడవండీ, ఏం చెబుతున్నానో వినిపించుకోకుండా ?"
"లేకపోతే నువ్వు అంత గొప్పగా చెప్పవలసిన విషయం అందులో ఏముంది!"
"తండ్రికి, కూతురికి ఒక్కలాగే తోస్తాయి."
"అమ్మాయికూడా ఈమాటే అన్నదా? బాగా చెప్పింది."
"మరేం, మీ కలాగే వుంటుంది. ఎవరితో చెప్పా చెయ్యకుండా పిల్లని అలా తీసుకుపోవడమేమిటి? ఆ చనువు ఆ పిల్లడికి ఎవరు ఇచ్చేరూ అంట ?"
"ఎవరితో చెప్పాచెయ్యకుండా నీ కూతురు అలా వెంటబడి పోవడమేమిటి? ఆ స్వాతంత్ర్యం దానికి ఎవరిచ్చేరు?" భార్యమాటనే అనుకరిస్తూ అన్నాడు రాఘవయ్య.
"అది చిన్నపిల్ల. దానికేం తెలుస్తుంది ?"
"వాళ్ల వదినకూడా రాజు గురించి ఈ మాటే అంటుంది రాజీ! అనూరాధ చిన్నపిల్ల అయితే రాజు కూడా చిన్నవాడే. ఏదో సరదాగా వెళ్ళి వద్దామనుకొన్నారు. ఇందులో ఇంత రాద్ధాంతానికేముంది ?"
"వెళ్లి రావడానికి కాదండీ, ఆ గుట్లంట, పుట్లంట నడిపించి తీసుకువెళ్లేడుట _ నలుగురూ చూస్తే ఏమనుకొంటారు ?"
"ఏమనుకొంటారు? రాజమ్మగారి అమ్మాయి నిగర్వచూడమణి అనుకొంటారు."
"ఇంక మీ వ్యాఖ్యానాలు కట్టిపెట్టి ఆ పిల్లడికి కాస్త బుద్ధిచెప్పడం ఏమన్నా ఉందా లేదా!"
"ఎవరికమ్మా బుద్ధిచెప్పడం!" అంటూ వచ్చింది అనూరాధ.
"నీకేనమ్మా!
"నాకా ? ఎందుకూ? ఏం తప్పు చేసేను ?"
"ఇంకా మెల్లిగా అడుగుతున్నావా? కారు లేకుండా నడిచి ఆ ఊరు వెళ్ళడం నీ తల్లి దండ్రులకి ఎంత తలవంపో, వారి పరువు మర్యాదలు ఆ ఏట్లో ఎలా కలసి పోయేయో కొంచమైనా ఆలోచించేవా?" లేనికోపాన్ని నటిస్తూ అన్నాడు రాఘవయ్య.
తండ్రి నటనని అనూరాధ పోల్చుకుంది.
"పో....నాన్నా! అన్నిటికీ పరిహాసాలే" అంది రాధ బుంగమూతితో.
"అది కాదమ్మా, అనూ! ఇంటిదగ్గిర అమ్మతో చెప్పకుండా అలా వెళ్ళిపోవచ్చునా? నీకోసం అమ్మ యెంత కంగారుపడిందో తెలుసా?"
"మొదట వెళ్ళాలనుకోలేదు, నాన్నా! ఏటిఒడ్డున కూర్చుని అలా మాట్లాడుకొంటూంటే రాజు తన ఊరిని గురించి చెప్పసాగేడు. చూడాలని అనిపించింది. చీకటిపడకుండానే తిరిగి రావాలనుకొన్నాము. కాని, రాజు వదినగారు కదలనియ్యలేదు" అంది అనూరాధ, తల్లిని సమాధానపరచడానికి.
అసలు అటువంటి పరిస్థితి ఎలా ఏర్పడిందంటే....దానికి ముందు కథ కొంత చెప్పుకోవాలి.
వరదరాజు రాఘవయ్యగారింటికి బస మార్చిన మొదటి సంవత్సరం అంతగా చెప్పుకోదగిన విశేషాలు లేకుండానే గడిచిపోయింది. వారానికి రెండు మూడు సార్లు రాజమ్మ తన ఇంట్లో భోజనం చేయ్యమనేది. తీరికగా ఉన్నప్పుడు రాఘవయ్య ఏదో పిచ్చాపాటీ మాటాడుతూండేవాడు. అనూరాధ తనకి రాని పాఠాలేమైనా ఉంటే రాజుగదికి పోయి తెలుసుకు వచ్చేది. కారు కాలేజీ టైముకి అటువైపు పోతూంటే డ్రయివరు తెలియ జేసేవాడు. ఈ విధంగా నడిచి పోయింది ఆ సంవత్సరం.
రాజు రెండో సంవత్సరం ప్రవేశించేసరికి అనూరాధ స్కూలు ఫైనలు పూర్తి చేసుకొని పి.యు.పి.లో చేరడంతో వారి స్నేహం మరికాస్త వృద్ధి చెందింది. కాలేజీకి కలిసి పోయి, కలిసి వచ్చేవారు. ఒకరి క్లాసులు ముందుగా పూర్తయినా రెండో వారి కోసం వేచివుండేవారు.
అందమైన ఆడపిల్ల వెంట ముచ్చటైన కారులోంచి దిగుతున్న ఆ అబ్బాయి కాలేజీలో చాలామంది దృష్టిని సులువుగా ఆకట్టుకొన్నాడు. ఒకరిద్దరు మాటలు కల్పించుకొని, "ఎవరీ అమ్మాయి?" అంటూ ప్రశ్నించేరు.
"మా ఇంటివారి అమ్మాయి" అని జవాబు చెప్పేడు రాజు.
"లక్కీ ఛాన్సు" అంటూ భుజం తట్టేరు ఆ అడిగిన వాళ్ళు.
రాజు అనూరాధల మధ్య పరిఢవిల్లుతున్న స్నేహాన్ని అణిచి వేసేందుకు ఇంట్లోవారు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంచేత ప్రకృతిసహజమైన స్త్రీపురుషాకర్షణ దగ్గిరికి తీయగా ఇంటా, బయటా జంటగా తిరుగుతూండేవారు. వారిద్దరి మధ్య అడ్డుగోడలా నిల్చి ఉన్న ఐశ్వర్య శిఖరాల ఎత్తును అంచనా వెయ్యలేని వారు 'ముచ్చటయిన జంట' అని కళ్ళు తిప్పుకోకుండా చూసేవారు.
అక్టోబరునెల వర్షాకాలపు వాడి తగ్గినా ఇంకా ఏరు నిండుగానే పారుతున్నది. రాజుతో స్నేహం బలపడిన తరవాత అనూరాధకి కూడా ఆ ఏరు పట్ల ఏదో ఆత్మీయభావం కలిగింది. రోజూ సాయంకాలం సమయంలో ఏటిగట్టున ఇసుకలో కాస్తసేపు కూర్చొని రాజుతో కబుర్లు చెప్పుకోడం ఆమె దినచర్యలో భాగంగా తయారయింది. అలవాటు ప్రకారం ఆ రోజు ఏటి గట్టుకి బయలుదేరుతూంటే పోస్టుమేన్ రాజు చేతిలో ఒక కవరు పెట్టేడు. దస్తూరిని బట్టి వదిన వ్రాసినదని తెలుసుకొన్నాడు. ఏటిగట్టుకి చేరే వరకూ వరదరాజు ఆ ఉత్తరాన్ని పైకి తీయలేదు. తాము దిగిన తరువాత కారుని వెనక్కి పంపివేసింది అనూరాధ.
"ఒక గంట పోయేక తీసుకురా. అంతవరకూ ఇక్కడే ఉంటాము" అంది.
ఉత్తరం చదవడం ముగించి జేబులో పెట్టుకొంటూ "రేపు మా పూర్ణని బడిలో వేస్తారుట" అన్నాడు రాజు.