ఫ్యాన్సీ డ్రస్ అంటే ఇలా ఉండాలి
శాసన సభ సమావేశాలనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్యాన్సీ డ్రస్ తోపాటు ఇతర అంశాలు కూడా వుంటాయన్న విషయం మా కాలనీలో ప్రధాన చర్చాంశం అయిపోయింది.
"ఈ అయిడియా చాలా అద్భుతంగా వున్ది౧ అయితే దేశవ్యాప్తంగా వున్న రాజకీయనాయకులందరూ పాల్గొనేలా ఇలాంటి కార్యక్రమం ఢిల్లీలో పెడితే బాగుంటుంది" అన్నాడు రంగారెడ్డి.
"అవును! రాజకీయనాయకులు సినిమాల్లో వేషాలేయటం బాగా బోర్ కొట్టేసింది. అలా కాకుండా స్టేజ్ మీద ఫ్యాన్సీ డ్రస్ లేస్తే బాగానే వుంటుంది" సాయిరామ్ అన్నాడు.
"అలాంటి కార్యక్రమాన్ని దేశప్రజలందరూ కూడా చూసి ఆనందించాలి కాబట్టి దూరదర్శన్ ఆరోజు మిగతా కార్యక్రమాలన్నీ రద్దుచేసి ఆ కార్యక్రమం పూర్తిగా లైవ్ ప్రసారం చేయాలి!" జనార్ధన్ సజెషన్ ఇచ్చాడు.
"కాకపోతే ఆ ఫ్యాన్సీ డ్రస్ కార్యక్రమంలో రాజకీయనాయకులు ఎవరికిష్టమొచ్చిన వేషాలు వాళ్ళు వేయటం కాకుండా ప్రజలు ఎవరే వేషం వేస్తే బాగుంటుందని కోరతారో ఆ విధంగా వేస్తే జనరంజకంగా వుంటుంది" అన్నాడు గోపాల్రావ్.
దాంతో మా కాలనీ వాళ్ళందరికీ ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది.
"నన్నడిగితే మన మాజీ ఎక్సయిజ్ మంత్రి బాపిరాజు గారు మహాత్మాగాంధీ వేషం వేస్తే చూడముచ్చటగా వుంటుంది! ఎందుకంటే ఆయనకూ, మహాత్మాగాంధీకి చాలా దగ్గర పోలికలున్నాయ్- ఒక్క మీసాలు తప్ప!" అన్నాడు వెంకట్రావ్.
"ఏమిటా పోలికలు ?"
"ఇద్దరూ 'తాగుడు' అనే అంశం కోసం పాటుపడ్డారు కదా!"
జనమంతా ఈలలు వేసి తప్పట్లు కొట్టారు.
"అవునూ! బాపిరాజుగారే గాంధీ మహాత్ముడి వేషం వేయాలి" అంటూ అరిచారు.
"ఎన్టీఆర్ హిట్లర్ వేషం వేస్తే బ్రహ్మాండంగా సూటవుతారు" అంటూ అరచాడు ఓ స్టూడెంట్ వెనుక నుంచి. అందరూ తప్పట్లు కొట్టారు మళ్ళీ.
"అర్జున్ సింగ్ నిజలింగప్ప వేషం వేయాలి - ఇద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయ్. ఒకరు కాంగ్రెస్ లో చీలిక తెచ్చారు. ఇంకొకరు కాంగ్రెస్ ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు" కదా అన్నాడు పాల్.
"అవునవును! అదే కరెక్టు వేషం" అన్నారు మిగతావాళ్ళు.
"శరద్ పవార్ ఊసరివెల్లి వేషానికి కరక్టుగా సూటవుతాడు" అన్నాడు సాయిరామ్.
"సెంట్ పర్సెంట్ క్యారెక్టర్ ఫిట్ నెస్ వుంటుంది" అన్నారు మిగతావాళ్ళు.
"చింతా మోహన్ తో శకుని వేషం వేయించాలి- చాలా ఎంజాయ్ చేస్తారాయన్ని ఆ వేషంలో" అన్నాడు రంగారెడ్డి.
"శభాష్" అంటూ అరిచారు కుర్రాళ్ళు కొంతమంది.
"జయలలిత ద్రౌపది వేషం వేస్తే కరక్టుగా వుంటుంది. నిండు సభలో తనను అవమానపరచిన దుశ్శాసునుడిలాంటి కరుణానిధి మీదా, ఆమె మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న తమిళనాడు కాంగ్రెస్ కౌరవుల మీదా రివేంజ్ తీసుకునే పాత్రలో ఆమె తెగ షైనయిపోతుంది" అంది రాజేశ్వరి.
ఆమె మాటల్ని ఆడాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఒకరిద్దరు మాత్రం 'దుర్గ' వేషం బాగుందన్నారు.
"జయలలిత జిందాబాద్" అని అరిచారు అందరూ ముక్తకంఠముతో.
"రాజేష్ పైలట్ ఏ వేషం వేస్తే బాగుంటుంది?" అడిగాడు మా వాళ్ళను.
"మెజీషియన్ సర్కార్ వేషం వేస్తే బాగుంటుంది! దేశంలోని సమస్యలన్నీ విమానాల్లో తిరుగుతూ మంత్రదండంతో ఆ కొద్దిగంటల ప్రదర్శన కోసం మాయం చేసేస్తూంటాడు కదా! అన్నాడు సాయిరామ్.
"మరి మన్మోహన్ సంగతేమిటి?"
"సర్కస్ లో జోకర్ వేషం!" ముక్త కంఠంతో అరిచారందరూ.
"ఇగో! నన్నడిగితే ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషిలిద్దరూ రాముడు, లక్ష్మణుడు వేషాలు వేస్తే సూపర్ హిట్టు" అన్నాడు యాదగిరి.
"మరి వి.పి.సింగ్ ఏ వేషం వేస్తే బావుంటుంది?"
"మండల్ పాటలు ఇంటింటికి తిరిగిపాడే హరిదాసు" అందరూ తప్పట్లుకొట్టారు.
"హోమ్ మినిష్టర్ ఎస్పీ చవాన్ సంగతేమిటి? ఆయన ఏ వేషం వేస్తే మీకు నచ్చుతుంది" అడిగాడు గోపాల్రావ్.
"స్టంట్ మాస్టర్ పాత్ర అద్భుతంగా వుంటుంది. ప్రజల వినోదం కోసం ఉత్తుత్తిగా టెర్రరిస్టులతోనూ, అండర్ గ్రౌండ్ మాఫియాతోనూ స్టంట్స్ చేయటం, మధ్యలో మనకేసి తిరిగి "ఉత్తిదే! నిజం ఫైట్ కాదు" అని చెప్పటం చాలా బావుంటుంది.
అందరూ ఆ మాట కరక్టేనని హర్షధ్వానాలు చేశారు.
రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ యమధర్మరాజు గెటప్ లో భలే సూటవుతారు.
"అవునవును! ఆయనే ఆ వేషం వెయ్యాలి" అరిచారందరూ.
"మరి పాటల పోటీలో ఎవరెవరు పాల్గొంటారు" అడిగాను.
"రేణుకా చౌదరి 'సారా' జహాసె అచ్ఛా అన్న పాట పాడాలి. ఉపేంద్ర 'ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను' పాట, విజయభాస్కరరెడ్డి "ఏ తీరుగనను దరిచేరుతువో" అనే పాట, నరేంద్ర 'సీతారాముల కల్యాణం చూతము రారండీ' పాట పాడితే శ్రోతలు మైమరచిపోతారు" అంది రాజేశ్వరి.
"అయ్యో అసలు సంగతి మర్చిపొయాఅమ౧ మన ప్రధాని పి.వి.నరసింహారావుగారి సంగతేమిటి?" అడిగాడు రంగారెడ్డి.
"రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న చక్రవర్తి నీరో వేషం ఏకగ్రీవంగా అరిచారందరూ.
* * *