Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 43


                                 రోలింగ్ షీల్డ
    అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న జనాభాను తగ్గించడానికి భారతదేశం తీసుకున్న అనేక చర్యలను సమీకరించడానికి నిపుణుల సమావేశం ఏర్పాటయింది.
    కేంద్రప్రభుత్వం తరపున నిపుణుడు లేచి నిలబడ్డాడు. "మేము తీసుకున్న చర్యల వల్ల మనదేశ జనాభా వచ్చే కొద్ది సంవత్సరాలలో చాలావరకూ తగ్గిపోయే అవకాశం కలిగింది" అన్నాడతను తనే తప్పట్లు కొడుతూ.
    "ఏమిటి మీరు తీసుకున్న చర్యలు?" అడిగారు మిగతావారు.
    "ఇకనుంచి మనదేశానికి లభించే ప్రపంచబ్యాంక్ ఋణాన్ని గుళ్ళూ, మసీదులూ, చర్చ లు కట్టడానికి వినియోగిస్తాం! సెక్యులర్ అంటే అర్థం అన్ని మతాలనూ ప్రోత్సహించడమే కదా! మతాల్ని ప్రోత్సహించాలంటే అన్ని మతాల వారికి ప్రార్థనా మందిరాలు కట్టించాలి! దీనికి మన దగ్గరున్న వనరులు చాలవు కాబట్టి ప్రపంచబ్యాంకు మనదేశంలోని నదులు మీద కట్టే డ్యామ్ లూ, రోడ్లూ, సైక్లోన్ షెల్టర్లకూ ఇచ్చే డబ్బంతా అన్ని మతాలవారి ప్రార్థనా మందిరాలు కట్టించడానికి మళ్ళిస్తారన్నమాట! దానివల్ల ఆహార ధాన్యాల కొరత, వరదలు, కరువులు వచ్చి చాలా జనాభా తగ్గిపోతుంది" అందరూ తప్పట్లు కొట్టారు.
    "మన టెర్రరిస్ట్ లకు అవసరమైన శిక్షణ, ఆయుధాలు ఇచ్చే విదేశాల మీద ఎలాంటి చర్యా తీసుకోకుండా వదిలేస్తాం! దాంతో టెర్రరిస్ట్ ల కార్యకలాపాలు యధేచ్చగా సాగుతుంటాయి. మన జనాభాను వాళ్ళే వేటాడి చంపి తగ్గించేస్తుంటారు" ఈసారి పెద్ద ఎత్తున తప్పట్లు కొట్టారందరూ.
    "ఇక వేర్వేరు రాష్ట్రాల జనాభాను తగ్గించే చర్యలు మేం తీసుకున్నామో వివరంగా కోరుతున్నాను" అన్నాడతను.
    ఆంద్రప్రదేశ్ నిపుణుడు లేచి నిలబడ్డాడు. "మా రాష్ట్రంలో గత అయిదేళ్ళుగా కేవలం ముఖ్యమంత్రులను మార్చే కార్యక్రమం ఒక్కటే జరుగుతున్నందువల్ల రాష్ట్రాభివృద్ధి ఆగిపోయింది. దానివల్ల కొత్త పరిశ్రమలేమీ రావడం లేదు కనుక నిరుద్యోగ సమస్య పెరిగిపోయి చివరకవి ఆకలి చావులుగా మారిపోయి జనాభా తగ్గుదలకు ఉపయోగపడుతుంది." అందరూ తప్పట్లు కొట్టారు.
    "మా రాష్ట్రంలో అమలు జరుపుతోన్న ఇంకో కొత్త స్కీమ్ ఏమిటంటే దోపిడీలు పెరిగేందుకు తోడ్పడడం - దోపిడీ దొంగలు ఇటీవలికాలంలో చాలామందిని చంపేసి ఇళ్ళు, బస్ లు, రైళ్ళు దోచుకున్నారు. అలాగే వరకట్నాల దురాచారం వల్ల భార్యలను చంపేసే దురాచారం కూడా పెద్దఎత్తున మా రాష్ట్రంలో జరుగుతోంది. ఇక పోలీసులను నక్సలైట్స్ చంపేయడం, నక్సలైట్స్ ని పోలీసులు చంపేయడం సరేసరి!
    ఇంకోచర్య ఏమిటంటే కల్తీ మద్యాన్ని ప్రోత్సహించడం! దానివల్ల మద్యం సేవించే జనాభాను చాలావరకూ అరికట్టదానికి వీలవుతుంది. జనాబాను అరికట్టడమే కాకుండా ప్రజలలో సారా తాగే దురలవాటుని కూడా మానిపించవచ్చు.
    మళ్ళీ తప్పట్లు - "ప్రకాశం జిల్లాలో 'ప్రత్తి చావులు' కొత్తగా మా రాష్ట్రం ప్రవేశపెట్టింది. ప్రత్తి పంట వేసుకొనే బీద బిక్కికి బ్యాంకుల్లోను, పంట పాడైనప్పుడు ఋణముల మాఫీ, ఇన్సూరెన్స్ లు లాంటివి వారికి దక్కకుండా చేయటం వల్ల వారు గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జనాభా ఈ స్కీమ్ లో బాగానే తగ్గవచ్చని మా అంచనా!"
    "ఆహా! ఆంధ్రప్రదేశ్ దేశానికే తలమానికం" అరిచారు కొంతమంది.
    "ఇటీవల కనిపెట్టిన మరో కొత్త అంశం ఏమిటంటే పెద్ద పెద్ద ఓవర్ హెడ్ టాంక్ లు, ఆనకట్టలు, చెరువు కట్టలు, ఇవన్నీ కట్టిన వెంటనే కూలిపోయేట్టు డిజైన్ చేయించాం! దాంతో ఆ చుట్టుపక్కల వుండే జనం చీమలు చచ్చినట్లు చస్తారు. జనాభా పెరుగుదల దెబ్బకు పడిపోతుంది!"
    ఈసారి "ఆంధ్రప్రదేశ్ జిందాబాద్" అనికూడా అరిచారు. "ఇంకో అద్భుతమైన స్కీమ్ కూడా మేము గతకొద్ది సంవత్సరాలుగా అమలుచేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలు ఏమీ పనిచేయకుండా అడ్డుపడుతున్నాం! దీనివల్ల అనేక జబ్బులు వచ్చి జనం చస్తున్నారు. పందుల్ని అన్ని నగరాల్లోనూ, టౌన్స్ లోనూ ప్రోత్సహించి మెదడు వ్యాధిని ఎంకరేజ్ చేస్తున్నాం! దీనివల్ల చిన్నపిల్లల్ని కరవడం వల్ల చచ్చే జనాభా సంగతి సరేసరి..."
    మళ్ళీ తప్పట్లు మారుమ్రోగిపోయాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నిపుణుడు లేచి నిలబడ్డాడు. "మా రాష్ట్రంలో - ముఖ్యమంత్రి గ్రూపు, కేంద్రమంత్రి గ్రూపు అని రెండింటిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రెండు గ్రూపులూ బలాబలాలు తేల్చుకోడానికీ, ఒకరినొకరు పడదోయడానికీ, మతకల్లోలాలూ, గ్రూప్ వార్స్, గాంగ్ వార్స్ సృష్టిస్తుంటారు. దానివల్ల రాష్ట్రంలో జనాభా క్రమేపీ తగ్గిపోయే అవకాశం వుంది."
    అందరూ తప్పట్లు కొట్టారు. ఆ సదస్సు ముగిశాక జడ్జీలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
    "దేశంలో అన్ని ప్రాంతాల, అన్ని విభాగాల నిపుణులు జనాభాను తగ్గించడానికి తీసుకున్న చర్యల గురించి విన్న తరువాత ఈ దశాబ్దపు జనాభా తగ్గుదల రోలింగ్ షీల్డ్ ను ఆంధ్రప్రదేశ్ కు బహుకరించడమైనది." హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయాయి.

                                                     * * * *

 Previous Page Next Page