ఇచ్చట నేరములు చేయబడును
రాను రాను ఎమ్మెల్యేలు, ఎం.పీ లతో సహా ఉన్నతస్థానాలలో వున్న రాజకీయ నాయకుల మీద వివిధ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువైపోతుండడం మేమంతా న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నాం! ఈ పరిస్థితి మరింత దిగజారితే ఎలా వుంటుంది?
ఇదిగో! ఇలా!
హైదరాబాద్ లో ఓ కాలనీలో పెద్ద ఎత్తున ఓ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతోంది. మాట్లాడితే ఆ సాంస్కృతిక సంస్థ సెక్రటరీ మైక్ దగ్గరకొచ్చి అసంఖ్యాకంగా చేరిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.
"సోదర సోదరీమణులారా! ఇంకాసేపట్లో మన నాయకులవారు వచ్చేస్తున్నారు. ఆయన ఇంటి దగ్గర్నుంచి బయల్దేరినట్టు ఇప్పుడే సమాచారం అందింది. కనుక మీరంతా నిశ్శబ్దంగా వేచియుండ ప్రార్థన- ఆయన రాగానే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతవరకూ మిమిక్రీ కార్యక్రమం చూస్తూ ఆనందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను."
జనమంతా కోపంగా ఈలలు, కేకలు వేస్తారు.
"ఇంకెంత సేపోయ్! ఆ నాయకుడు రాకపోతే పోయె. ప్రోగ్రాం మొదలుపెట్టు" అంటూ అరుపులు వినిపిస్తాయి. ఒకటి రెండు రాళ్ళు కూడా వచ్చి వేదికమీద పడతాయి. ఇంకో పావు గంట గడుస్తుంది.
మంత్రి జాడ వుండదు. ఆ సంస్థ సెక్రటరీకి గాబరా పుడుతుంది. నాయకులవారి కోసం మళ్ళీ వాళ్ళ ఆఫీసుకి ఫోన్ చేస్తాడు!
ఆ నాయకుడి పి.ఏ. మాట్లాడతాడు. "లాభం లేదు! నాయకులవారు మీ కార్యక్రమానికి రాలేరు - ఇంకో గంటవరకూ-"
"ఎందుకు?"
"దార్లో అదివరకటి శత్రువెవడో ఒంటరిగా దొరికాడట! మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం దొరకదని ఆయన వాడిని రోడ్డు మీదే నరికేశారు. మర్డరన్నాక మరి పోలీసులు, గొడవా వుంటుంది కదా! అవన్నీ చూసుకుని ఇంకో గంటకొస్తారు" ఫోన్ పెట్టేశాడతను.
సెక్రటరీ మళ్ళీ మైక్ దగ్గరకొస్తాడు.
"సోదర సోదరీమణులారా! నాయకులవారు దారిలో ఒక మర్డర్ చేయడం వల్ల మన కార్యక్రమానికి రావడానికి ఇంకో అరగంట ఆలస్యమవుతుందనీ, అంతవరకూ నిశ్శబ్దంగా మిమిక్రీ కార్యక్రమం తిలకిస్తూ వేచియుండవలసిందనీ ఆ ఏరియా పోలీసు కానిస్టేబుల్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్తున్నాడు."
ఇంకో రకం పరిస్థితి ఎలా వస్తుందంటే అసెంబ్లీ సమావేశం జరుగుతూంటుంది.
ఆ పొజిషన్ లో లీడరొకాయన లేచి బల్లగుద్దుతూ మైక్ లో అరుస్తుంటాడు.
"అధ్యక్షా! నేను గత అసెంబ్లీ సమావేశంలో కూడా మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తున్నారని గౌరవనీయులయిన మంత్రిగారిని అడిగాను."
ఆరోజు కూడా ఆయన సభకు రాకుండా ఇంకో మంత్రిగారి ద్వారా ఏదో సమాధానం చెప్పి తప్పించుకున్నారు.
ఇవాళ కూడా నేను అదే ప్రశ్నవేస్తున్నానని ఆయనకు ముందే తెలుసు కదా! అయినా కూడా ఆయన మళ్ళీ సభకు రాకుండా ఎందుకు తప్పించుకుంటున్నారో నాకు తెలీడం లేదు. నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఆ రోడ్డుకు తరలించినట్టు తెలుస్తోంది! కనుక మంత్రిగారే స్వయంగా నా ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్షా!"
"మంత్రిగారు ఇంకో అయిదు నిమిషాల్లో వచ్చేస్తున్నారు- అంతవరకూ ఓపిక పట్టండి" అంటాడు స్పీకర్.
మిగతా కార్యక్రమం జరుగుతూంటుంది. పావుగంటయినా మంత్రిగారి జాడ వుండదు. దాంతో ఆ ఎమ్మెల్యే మళ్ళీ లేస్తాడు. "ఏరి అధ్యక్షా? పావుగంటయి పోయింది మంత్రిగారేరి?" అని దబాయిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి స్పీకర్ చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోతారు.
మంత్రిగారు ఇవాళ సభకు రాలేకపోతున్నట్టు సమాచారం ఇప్పుడే పంపారు. ఎందుకంటే మేజిస్ట్రేట్ ఆయనకు ఒక కేసులో మంజూరు చేసిన బెయిల్ ని హైకోర్టు ఇంతకుముందే రద్దు చేసింది. అందువల్ల ప్రస్తుతం ఆయన పోలీస్ లాకప్ లో వున్నారు. సుప్రీంకోర్టులో హైకోర్టు ఆర్డర్ మీద స్టేకు ప్రయత్నిస్తున్నారని అది రాగానే సభకు వస్తామనీ అంటున్నారు వారు-" అంటాడు స్పీకర్.
ఇదో రకం పరిస్థితి ఎలా వుంటుందంటే ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంటుంది. ఆ మీటింగ్ కి నలుగురు ముఖ్యమంత్రులు రాకపోయేసరికి మీటింగ్ ప్రారంభం కావడం ఆలస్యమవుతూంటుంది.
సాయంత్రం అయిపోయినా వారి జాడ లేకపోయేసరికి మిగతా ముఖ్యమంత్రులకు చిరాకు పుట్టి ప్రధానమంత్రికి ఫోన్ చేస్తారు.
"సార్! మీరు వచ్చి మీటింగ్ ప్రారంభిస్తే బాగుంటుంది!"
"నలుగురు ముఖ్యమంత్రులు లేకుండా మీటింగ్ ప్రారంభిస్తే ఏం బాగుంటుంది? ఇప్పుడే వారు ఎందుకు రావడంలేదో కనుక్కుంటాను" అంటారాయన.
మరో అరగంట తర్వాత వారికి ఫోన్ వస్తుంది ప్రధానమంత్రి నుంచి.
"ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రిని అసమ్మతి వర్గాలవారు దించేసి మరో ముఖ్యమంత్రిని ఎన్నుకుని గవర్నర్ దగ్గరకెళ్ళడం వల్ల" - తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి నుంచి ఫోన్ వస్తుంది.
"ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రిగారు షేర్ల కుంభకోణంలో తమకు సంబంధాలున్నందువల్ల ఇండియా వదలి స్విట్జర్లాండ్ పారిపోయారని ఇప్పుడే తెలిసింది."
ఇంకాసేపటి తర్వాత ఇంకో ఫోన్.
"మూడో రాష్ట్ర ముఖ్యమంత్రిగారిని ఆయన ఇంటి దగ్గరే కొంతమంది గూండాలు కిడ్నాప్ చేయడం వలన సభకు రాలేదని చీప్ సెక్రటరీ సమాచారం పంపించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రుల సభను వాయిదా వేస్తున్నాం."
* * *