"మళ్ళీ ఏమిటంటోంది? ముందు నా చొక్కా వదలమనండి?" అన్నాడు అమానుల్లాఖాన్ దిగులుగా.
రిపోర్టర్ ఆమెను చొక్కా వదలవలసిందిగా అమానుల్లాఖాన్ విజ్ఞప్తి చేస్తున్నట్లు అరవంలోకి అనువాదం చేసి నివేదించాడు.
ఆమె ఆ విజ్ఞప్తిని ఎ మాత్రం ఆలస్యం చేయకుండా తిరస్కరించింది.
ఈ దృశ్యం చూసి హడావుడిగా ఫస్ట్ క్లాస్ కారిడార్ లో నుంచి వెనుక కోచీలవేపు పరుగెడుతున్న జనం ఆగిపోయారు. ఆ జనంలో నుంచి ఎవడో బిగ్గరగా అరిచాడు. "అడుగో-రాత్రి తప్పించుకు పారిపోయాడు! వాడే దూరదర్శన్ డైరెక్టర్" ఎవరో అరచారు.
జనమంతా కేకలు, అరుపులతో తిట్లు ప్రారంభించారు.
"వీడే-మన తెలుగునీ, తెలుగు కార్యక్రమాల్నీ లంచాల మయం చేసి చిత్రవధ చేసింది వీడే" అరిచాడు ఒక పెద్దమనిషి.
"తన్నండి! నా కొడుకుని" ఎవరో అరిచారు.
"అవసరం లేదు. ఇంజన్ వెనుకేవున్న కోచ్ లోకి తోయండి! యాక్సిడెంట్ లో వాడే ఎగిరిపోతాడు" ఇంకెవరో అరిచారు. అమానుల్లాఖాన్ గింజుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు గానీ విజయ అతనిని వదలలేదు.
హఠాత్తుగా ఓ గొంతు మిగతా గొంతులన్నిటినీ డామినేట్ చేస్తూ కయ్ మంటూ అరచింది.
"భాయియో! బహనో! ఈ దూరదర్శన్ బాలుడిని మొదటి కోచిలోకి తోసేముందు కొన్ని ఆసక్తికరమయిన విషయాలు మనమందారం తెలుసుకోవాల్సి వుంది! ఈ తమిళబాల ఎవరు? ఆమె తాలూకూ ఫస్ట్ క్లాస్ కూపేలో ఈ దూరదర్శన్ బాలుడు రాత్రంతా ఎందుకున్నట్లు?"
అమానుల్లాఖాన్ కర్చీఫ్ తో మొఖం తుడుచుకున్నాడు.
"వాడు నా భార్య!" అన్నాడు దూరదర్శన్ తెలుగులో.
అందరూ ఘొల్లుమన్నారు.
"అబద్ధం!" అరిచాడు పోర్టర్" ఆమె తమిళ సినిమాల్లో ఎక్సట్రా నటి. ఆమెను రామచంద్రన్ అనే బ్రోకర్ ఈ దూరదర్శన్ డైరెక్టర్ కి ఈ రాత్రి కోసం సప్లయ్ చేశాడు. ఇందుకోసం వీరిద్దరిలో ఒకరు ఆమెకు అయిదువేల రూపాయలు ఫీజ్ ఇవ్వవలసి వుంది. ఇప్పుడు అదే రైల్లో మరెక్కడో నిద్రపోతూన్న ఆ రామచంద్రన్ గాడు కనిపించకపోవటం వల్ల ఆ అయిదువేలూ ఈ దూరదర్శన్ డైరక్టరే ఇవ్వాలని ఆమె చొక్కా పట్టుకుంది." అందరూ "షేమ్, షేమ్" అని అరవసాగారు.
"సైలెన్సు ప్లీజ్! ఈ దూరదర్శన్ బాలుడికి మీరెంత షేమ్ షేమ్ అని అరిచినా ఏ మాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ పదం అతనికి సరికొత్త పదం. అతని మొఖంలోని ఆశ్చర్యార్ధకం చూస్తేనే తెలిసిపోతోంది. ఇకపోతే ఈ సినిమా బాలికను తమిళం వచ్చిన దాతలెవరయినా నా తరపున ప్రశ్నలను అనువదించి తరువాత వాటి తాలూకు జవాబులను తెలుపవలసిందిగా కోరుతున్నాను".
రిపోర్టర్ తన చేయి పైకెత్తాడు.
"థాంక్యూ మైడియర్ జర్నలిస్ట్! మొదటిప్రశ్న! ఈ బాలికను ఉన్నత హోదాలో వున్న 'ఐ అండ్ బి' అధికారులకు రామచంద్రన్ అనే బ్రోకర్ వీరుడు ఎందుకు సప్లయ్ చేస్తున్నట్లు?"
విజయ వెంటనే తమిళంలో సమాధానమిచ్చింది.
"నన్నేకాదు! ఇంకా చాలామందిని సప్లయ్ చేస్తూంటాడు. మేమంతా తెలుగు టి.వి. సీరియల్స్ లో హీరోయిన్సుగా నటిస్తున్నాం" అందరూ హోరున ఆశ్చర్యపోయారు.
"ఇంతకూ మిమ్మల్ని వీడు ఇలా అడ్డమయిన వాళ్ళందరికీ ఎందుకు సప్లయ్ చేస్తున్నట్లు?"
"టి.వి. సీరియల్స్ శాంక్షన్ చేయించుకోవడానికి!"
అంతా హాహాకారాలు.
"వీడికిప్పటివరకూ ఎన్ని సీరియల్స్ శాంక్షన్ అయ్యాయి?"
"డజను!"
"ఒక్కొక్క సీరియల్ కి ఎంత డబ్బు తీసుకుంటాడు ఈ దూరదర్శన్ బాలుడు?"
"లక్ష_"
మళ్ళీ హాహాకారాలు_
ఆ ఇంటర్వ్యూ అలా ఎంతసేపు కొనసాగిందో కానీ అంతవరకు భర్త కోసం యెదురు చూసి చూసి మిగతా జనంతోపాటు ప్రాణాలు రక్షించుకోడానికి సామానుతో పిల్లలతోపాటు అటు వెళ్తోన్న రెహనా ఆ గుంపునీ, మధ్యలో తన భర్త కాలర్ పట్టుకుని నిలబడ్డ విజయనూ చూసి భయపడిపోయి కెవ్వున కేకవేసింది.
ఆ కేక వినగానే అమానుల్లాఖాన్ అదిరిపడి భార్యవేపు చూశాడు.
అతను మొఖాన్ని ఛటుక్కున కర్చీఫ్ తో కప్పేసుకున్నాడు.
"క్యాహువా! క్యాహువా!" అంటూ అరిచిందామె మళ్ళీ_
భవానీశంకర్ ఈ సంఘటన ఆధారంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రారంభించాడు. "క్యాహువా? అంటూ వెర్రి కేకలు వేయుచున్న ఓ భారత నారీ! నీ కలవరపాటునకు కారణమేమి?" ఉర్దూలో అడిగాడు భవానీశంకర్.
"నా భర్తనేం చేస్తున్నారు? యెందుకలా చొక్కా పట్టుకుందామె?" భయంగా గాభరాగా అడిగింది.
"ఆమెకు చెల్లించాల్సిన అయిదువేలు ఫీజు చెల్లించని కారణంగా!" అందుకున్నాడు భవానీశంకర్ ఉత్సాహంతో.
"ఏం ఫీజది?"
"యుగయుగాలుగా పురుషుడు ముక్కు మొఖం తెలీని స్త్రీకి చెల్లిస్తోన్న ఫీజు-"
"అల్లా....."
"ఓ మైగాడ్!"
"మై క్యాకరూం?"
""నేనేమి సేతునో!"
"నా భర్త రాత్రంతా గడిపింది ఈ సానితోనా!"
"అవును!"
"తూ!"
"తూ!"
"నువ్వు అబద్ధాలు చెప్పటం మానేశావని నమ్మాను. పెళ్ళిచూపుల్లోనే నువ్వు ఆలిండియా రేడియోలో ప్యూనుగా వుండి, మా డాడీతో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నని అబద్ధాలు చెప్పావ్. పెళ్ళయ్యాక నీ అసలు రంగు బయటపడినప్పుడు బుద్ధి గడ్డితిందనీ, ఇంకెప్పుడూ అలా అబద్ధాలు చెప్పననీ కాళ్ళు పట్టుకున్నావ్! నీలో నిజంగా మార్పు వచ్చిందని నమ్మాను.
ఆ మధ్య ప్రతిరోజూ రోజుకో యాభయ్ వేలుచొప్పున కాష్ తీసుకొచ్చి నగలు చేయించుకోమని నాకిస్తుంటే- అనుమానం వచ్చి ఇంత డబ్బెక్కడిదని అడిగాను. ప్రభుత్వం నీ ప్రతిభకు మెచ్చి ఇన్ సెంటివ్స్ ఇస్తోందని అన్నావ్. నీ మాటలు నాకు ఇంకొంత అనుమానం కలిగించినాయ్. రోజూ రాత్రి ఇంటికి ఫారిన్ సెంట్ రాసుకుని ఇంటికొస్తూంటే నాకు వేరు వేరు అనుమానాలు ప్రారంభమయినాయి. సంగతేమిటని అడిగితే వాణిజ్య ప్రకటనలు చేసే కంపెనీలు గిఫ్ట్ లు ఇస్తున్నాయని చెప్పావ్. నాకా జవాబు నమ్మకం కలిగించలేదు."
వింటున్న వారంతా చప్పట్లు కొట్టారు.
"నీ దరిద్రపు మొఖానికి ఇంకా కర్చీఫ్ అడ్డమెందుకు? తీసెయ్" అందామె ఆవేశంగా.
"ఎన్నా సార్! ఎం జరిగింది? ఏమిటీ రొంబ జనం?" జనంలో జొరబడి అమానుల్లాఖాన్ దగ్గరకు హడావుడిగా వచ్చాడు తమిళ వ్యక్తి. మొఖంనిండా విభూతి గీతలతో.
"రామచంద్రన్! నువ్ నా కొంప ముంచింది కదురా! ముందు వీడిని నా షర్టు ఇడవమని అడుగు" దీనంగా అడిగాడు అమానుల్లాఖాన్.
రామచంద్రన్ విజయ వేపు కోపంగా చూశాడు.
"నీకేం పిచ్చెక్కిందా? ఏమిటి నిండా అల్లరి చేస్తావు?"
"తెలుగు తెరీమల్లె" అందామె పొగరుగా.
"తెలుగు తెరీమల్లె అనేది తెలుగు టి.వి.సీరియల్స్ లో హీరోయిన్ గా ఎలా నటించిందహ?" విజయవాడ పౌరుడొకడు కసిగా అరచాడు.
ఈసారి రామచంద్రన్ తమిళంలో మాట్లాడాడు విజయతో. రిపోర్టర్ అలవాటు చొప్పున ఆ మాటలు కూడా అనువాదం ప్రారంభించాడు.
"ముందాయన చొక్కా వదులు! మేమేం డబ్బివ్వకుండా పారిపోతున్నామా?"
"అదేం కుదరదు. ఈ ట్రెయినుకి యాక్సిడెంట్ అయితే ఎవరెక్కడ ఛస్తాడో నాకేం తెలుసు? కాష్ డౌన్!"
"ఇంతకూ ఈమె నీకేమౌతుంది టి.వి.సీరియల్ నిర్మాత రామచంద్రన్?" అడిగాడు భవానీశంకర్.
"ఏమి సార్? ఇంత అనుమానం పూడుస్తారు! ఈమె నా భార్య సార్!" అంతా కేకలు, విజిల్స్ వినిపించినయ్.
"నీ భార్యకు నువ్ కూడా అయిదువేలు ఇవ్వాల్సిందేనా బ్రదర్?" మళ్ళీ నవ్వులు, విజిల్స్!