"వాయుముడప్ప!" జనాన్ని చూసి కోపంగా అరచాడతను.
"ఇలా అరుస్తున్నవారినీ, నవ్వులు, విజిల్స్ వేస్తున్నవారినీ నోరుమూసుకోమని టి.వి.సీరియల్స్ నిర్మాత హృదయపూర్వకంగా కోరుతున్నాడు."
ఆ మాట పూర్తికాక మునుపే నాలుగు టమాటోలు రామచంద్రన్ మీదా అమానుల్లాఖాన్ మీదా పడినయ్.
"ఎవరు? ఎవరీ టమాటోలు ఎగిరింది?" అరచాడు అమానుల్లాఖాన్ నెత్తిమీద నుంచి నోట్లో పడుతోన్న టమాటో తాలుకు రసం చుక్కలు చప్పరిస్తూ.
"నేను!" అంది అతని భార్య రెహానా!
"కాష్ డౌన్" అరిచింది విజయ.
"రామచంద్రన్! వీడికి కాష్ డౌన్ ఇచ్చు!"
అతను తన బొడ్డులోపలి నుంచి నోట్ల కట్ట తీసి లెక్కపెట్టి విజయకిచ్చాడు. ఆ దృశ్యం రిపోర్టర్లు ఆనందంగా ఫోటోలు తీసుకున్నారు. ఒక చేతిలోనే డబ్బు లెక్కపెట్టుకుని కాష్ సరిగ్గా ఉందని రుజువు చేసుకున్నాక అమానుల్లాఖాన్ చొక్కా కాలర్ వదిలింది విజయ.
"బ్లడీ బిచ్!" అన్నాడతను పళ్ళు కొరుకుతూ.
అతని చెంప ఛెళ్ళుమని మోతెక్కిపోయింది విజయ చేతిలో. అదిరిపడ్డాడు అమానుల్లాఖాన్.
"తేరీమాకి- ఇంగ్లీష్ తెరీమల్లె అని చెప్పావుగా ఇందాక వీడు?" కోపంగా చెంప తడుముకుంటూ అన్నాడు.
"ఆ ఒక్క తిట్టు మాత్రం నిండా తెలుసు" చేయి ఊదుకుంటూ అందామె.
అతను గొణుక్కుంటూ భార్య దగ్గరకి నడిచి సామాను అందుకోబోయాడు. ఈసారి అతని రెండో చెంప ఛెళ్ళుమంది. ఆ చేయి అతని భార్య రెహానాది.
"నీలాంటి నమక్ హరామ్ తోనా నేను కాపరం చేసేది? థూ-"
జనమంతా మళ్ళీ నవ్వులూ, కేకలూ, విజిల్సూ! అతని మొఖం కోపంతో ఎర్రబడిపోయింది.
"ఏయ్! నా చెంప మీద కొడతావా! ఎంత ధైర్యమే నీకు. తలాకీ" అంటూ అరచాడతను.
అతని మాటలు పూర్తవకముందే 'తలాక్ తలాక్ తలాక్" అంటూ అరిచేసిందామె. మళ్ళీ తప్పట్లూ, ఈలలూ మార్మోగిపోయినాయ్.
* * *
"యస్! రంగనాధన్ హియర్!" అన్నాడు డి.ఆర్.ఎమ్. మళ్ళీ.
మృదులకు ఇంక మాట్లాడక తప్పలేదు.
"సర్! దేరీజ్ ప్రాబ్లెమ్!" జంకుగా అంది.
"వాటీజ్ దట్?"
"దుగ్గిరాల దగ్గర గూడ్స్ ట్రెయిన్ పార్ట్ అయింది."
"ఓ! అంటే 8 డౌను ఈలోగా ఆగకపోతే ఆ గూడ్స్ ట్రెయిను రియర్ పోర్షన్ తో 'కొల్లయిడ్' అవుతుంది అంతేనా?"
"యస్సార్!"
"అయ్ నో మిస్ మృదుల! మీ ప్లాను చివరికి ఇలాగే ముగుస్తుందని నాకు ముందే తెలుసు!"
మృదుల నీరు కారిపోయింది.
"ఎనీవే! యాక్సిడెంట్ రిలీఫ్ వాన్, మెడికల్ రిలీఫ్ వాన్ ఆర్డర్ చేశారు కదా!"
"చేశాం"
"ఏం చేసినా ఏం వుపయోగం వుంది? చాలామంది ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు".
"......."
"నేను ముందే చెప్పాను. ఆపరేటింగ్ డిపార్టుమెంటు లేడీస్ ఫీల్డ్ కాదని-"
"......."
"యూ హావ్ టు ఫేస్ ది 'కాన్ సీక్వెన్సెస్' మిస్ మృదులా! బి రెడీ!" మృదులకు కోపం, బాధ, దిగులు, చిరాకూ- అన్నీ కలగాపులగమయి అలుముకుంటున్నాయ్.
"ఆల్ రైట్! సో! ఇప్పుడు ఆ యాక్సిడెంట్ ఆపడానికి మీకు శక్తి లేదనీ, ఇండిపెండెంట్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా మీరు పనికిరారనీ ప్రూవ్ అవుతోంది. యామ్ ఐ కరెక్ట్?"
మృదులకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
జీవితంలో మొదటిసారి-ఓటమి చవిచూడటం. ఓటమిని వప్పుకోవటం-
కానీ తను ఓటమి ఎందుకు వప్పుకోవాలి?
ఇది ఓటమి ఎలా అవుతుంది?
తన స్థానంలో ఎవరున్నా ఇంతకంటే ఇంకేం చేయగలుగుతారు?
నిజానికి విజయవాడ స్టేషనులోనే జరగాల్సిన యాక్సిడెంటుని తను తెలివితేటలు వుపయోగించి పోస్ట్ పోన్ చేసింది ఇంకొద్ది నిముషాల తర్వాత వరకూ_ జవాబు చెప్పకుండానే ఫోన్ డిస్కనెక్ట్ చేసిందామె.
తనకు తెలుసు! ఇంత దారుణంగా అవమానం జరుగుతుందని! ఫోన్ మోగసాగింది.
చిరాకుగా అందుకుందామె.
"మృదులా హియర్!"
"హలో మిస్ మృదులా! అయామ్ వినోద్!"
ఆమె అసహనంగా ఊపిరి పీల్చుకుంది.
"యస్ వినోద్!"
"సారీ టూ డిస్టర్బ్ యూ- మీ వంటవాడు, ప్యూను ఇద్దరూ అంతులేరు ఇంతవరకూ! నాకేమో మార్నింగ్ 'టీ' తాగందే అనీజీగా ఉంటుంది. లక్కీగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించేసరికి అతను గుర్తుకొచ్చాడు. అతనికి మీరు చెప్పారని చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి పాపం వర్షంలోనే వెళ్ళి ఫ్లాస్క్ తో 'టీ' తీసుకొచ్చి ఇచ్చాడు." మృదుల ఆశ్చర్యపోయింది.
"ఎవరతను?"
"అతనే- ఆ నిరుద్యోగి ఎవరో మీ గెస్ట్ గా ఉన్నాడు కదా!"
మృదుల ఉలిక్కిపడింది.
"ఎవరి సంగతి మీరు చెప్పేది?"
"పేరు నాకు గుర్తులేదు మృదులా! ఐ విల్ జస్ట్ ఎంక్వయిరీ- నీ పేరేంటోయ్? ఓ! అజయ్! అతని పేరు అజయ్ అట మృదులా!"
మృదులకు పట్టరాని కోపం వచ్చింది.
తనింటికి అతిధిగా ఆహ్వానించిందతనిని. అతను బీదవాడు కావచ్చు. అతనికి ఉద్యోగం లేకపోయి వుండవచ్చు. అంత మాత్రాన అతనిలేనితనాన్ని ఆసరాగా తీసుకుని అతనిని ప్యూన్ లా ఉపయోగించుకోవటం ఎంత దారుణం? ఎంత మేనర్స్ లెస్ బ్రూట్ ఆ వినోద్. పైగా తనే కోరినట్లు అజయ్ తో చెప్పి-ఛీ!
"అతనితోనే ఫలహారం వగైరాలు కూడా తెప్పించుకుంటున్నాం మృదులా! మాకిప్పుడేం ప్రాబ్లెమ్ లేదు. జస్ట్=మేము కంఫర్టబుల్ గానే ఉన్నాం. మా గురించి వర్రీ కావొద్దని చెప్పటానికే ఫోన్ చేశాను. హోప్ యూ ఆర్ స్టిల్ బిజీ-తర్వాత రింగ్ చేస్తాను మళ్ళీ- బై!"
ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
మృదుల రెండు చేతులతో తల పట్టుక్కూర్చుంది.
తను అజయ్ కి మొఖం ఎలా చూపించగలదు? అతను తన గురించి ఏమనుకుంటాడు? తనతో రికమండేషన్ అవసరం వుండడం చేత అతనిని తనలా ప్యూన్ లా ఉపయోగించుకుందన్న భావన అతనిలో కలుగదూ?
అతను వెళ్ళి జరిగినదంతా మూర్తి మావయ్యకూ చెప్తే- మావయ్యకు తన మీదున్న మంచి అభిప్రాయం ఏమయిపోతుంది?
* * *
డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ జయకర్ టైమ్ చూసుకున్నాడు. ఆరుగంటల పదహారు నిమిషాలు!
ఎదురుగ్గా పెద్ద వడ్లపూడి సిగ్నల్స్ కనిపించాయి. జయకర్ సంతృప్తి పడ్డాడు. ఇంచుమించుగా ఒక నిమిషం పైన కొద్ది సెకండ్లలో మూడు కిలోమీటర్ల దూరం వచ్చేసింది.
ఆ వేగం అతనికి భయం కలిగిస్తోంది.
క్షణంలో స్టేషను దాటేసింది. స్టేషనులో కిటకిటలాడిపోతూ జనం-స్టేషన్ మాస్టర్ చేయి ఊపుతున్నాడు. అంతా కలలాగుంది. ఇంజన్ లో ఇంత వేగంగా ప్రయాణం చేయటం-హఫీజ్ ఖాన్, పాయింట్స్ మెన్ ఇద్దరూ ఇంచుమించుగా వణుకుతున్నారు.
డీజిల్ అసిస్టెంట్ ఒక్కడే నిబ్బరంగా వున్నాడు.
"నీ పేరేంటోయ్?" అతనినడిగాడు జయకర్.
"కృష్ణ సార్!"
"నీకు భయం వేయటం లేదా- ఈ స్పీడ్?"
"లేద్సార్!"
"ఎందుకని" ఆశ్చర్యంగా అడిగాడు.
"రన్నింగ్ స్టాఫ్ లైఫ్ ఎప్పుడూ రిస్కే కద్సార్? ఇంటికి తిరిగి వచ్చేదాకా గ్యారంటీ ఎక్కడుంది? ప్రతిరోజూ అలాంటి జీవితం గడిపేవాడికి ఇంక భయం ఎందుకుంటుంది?" జయకర్ అతని భుజం తట్టాడు అభిమానంగా.
అతను చెప్పినమాటల్లో నిజం వుంది.
టి.టి.యి.లు, గార్డులు, డ్రయివర్లు, ఫామిలీ క్వార్టర్స్ లేని స్టేషన్ మాస్టర్లు, ఇతర ఆపరేటింగ్ సిబ్బంది-కమర్షియల్ స్టాఫ్-అందరికీ రిస్క్ వుంది. సడెన్ గా ట్రెయిన్ లో హార్ట్ ఎటాక్ వచ్చిన టి.టి.యి. యాక్సిడెంట్ లో చనిపోయిన డ్రైవర్లు, గార్డులు ఎంతమంది ప్రాణాలు కోల్పోగా తను చూడలేదు?


