రెండు నిముషాల తర్వాత దుగ్గిరాల ఏఎస్సెమ్ ఫోన్లోకొచ్చాడు.
"కృష్ణారావ్! వాట్ హేపెండ్? ఫస్ట్ పోర్షను వచ్చేసిందా?"
"ఇప్పుడే లూప్ కి వస్తోంది మేడమ్!"
"సెకండ్ పోర్షన్ కోసం ఇంజన్ పంపడానికి ఎంత టైమ్ పడుతుంది?"
"కనీసం పది నిముషాలు పడుతుంది మేడమ్!"
"ఓ గాడ్! అంతలోపల 8 డౌన్ వచ్చి సెకండ్ పోర్షనుతో కొలాయిడ్ అయిపోతుంది."
"అవును మేడమ్! ఈ కొంచెం వ్యవధిలో పోర్షన్ ణి తీసుకురావటం కష్టం"
మృదులకేమీ పాలుపోవటం లేదు.
ఈ విషయం డి.ఆర్.ఎమ్.కి చెప్పక తప్పదు ఇక_
హాట్ లైన్ ఫోను అందుకుందామె.
రంగనాధన్ చేతిలో ఇంతకాలానికి చిక్కింది తను. తనను కసితీరా ఇన్సల్ట్ చేస్తాడతను.
అంతేకాదు!
ఈ ప్రమాదానికి తనే బాధ్యురాలని నిందిస్తాడు. అయినాగానీ తప్పదు. తను నిజంగా బాధ్యురాలే! కనుక ఎలాంటి నిందలనయినా, అవమానాలనయినా స్వీకరించాల్సిందే!
"హలో రంగనాధన్ హియర్" మృదుల కొద్దిక్షణాలు మాట్లాడలేకపోయింది.
* * *
దూరదర్శన్ డైరెక్టర్ అమానుల్లాఖాన్ ఉలిక్కిపడి నిద్ర లేచాడు. కౌగిట్లో టి.వి సీరియల్ ప్రొడ్యూసర్ రామచంద్రన్ భార్య విజయ ఇంకా నిద్రపోతూనే వుంది. ఆ ఫస్ట్ క్లాస్ కూపే తలుపుమీద మళ్ళీ దడదడమనికొడుతోన్న చప్పుడు. అమానుల్లాఖాన్ కి భయం వేసింది.
అంత గట్టిగా ఎవరు కొడుతున్నారు తలుపు?
రామ చంద్రనా?
రామచంద్రన్ అయితే అంత గట్టిగా కొట్టడే! వాడేం చేసినా తనకు డీలక్స్ కాకా పడుతూచేసే రకం!
విజయకు మామూలుగానే అర్థం కాలేదు.
"ఉర్ధూ తెరీమల్లె" అంది చేతులూపుతూ.
"క్లోజ్ యువర్ ఐస్" అన్నాడు ఇంగ్లీషులో.
ఆమెకు అది కూడా అర్థం కాలేదు.
"అయిసా? అయిస్ వాండా" అంది మళ్ళీ చేతులూపుతూ.
అమానుల్లాఖాన్ తల గట్టిగా కొట్టుకున్నాడు.
"నీతో నాకు పెద్ద హెడేక్ వస్తున్నాడు" అన్నాడు తెలుగు టి.వి. స్టేషన్లో పనిచేసినప్పుడు జాబులు-జవాబులు శీర్షిక ద్వారా నేర్చుకున్న తెలుగులో. అదికూడా విజయకు అర్థం కాలేదు.
"తెలుంగు తేరీమల్లె" అంది మళ్ళీ. బయటమళ్ళీ తలుపు పెద్దగా కొట్టిన చప్పుడు.
ఇంక చేసేది లేక త్వరత్వరగా ఆమె కళ్ళు తనే చేత్తో మూసి, కొన్ని సైగలు చేసి అప్పుడు డోర బోల్ట్ తెరచాడు.
ఎదురుగ్గా ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్నారు.
"సారీ టు డిస్టర్బ్ యూ జెంటిల్మెన్-మేమిద్దరం ప్రెస్ రిపోర్టర్స్. బహుశా మీకు ఈపాటికి తెలిసే వుంటుంది. మన ట్రెయిన్ కి యాక్సిడెంట్ జరగబోయే అవకాశం వుంది. బ్రేక్స్ ఫెయిలయాయ్!" చెప్పాడు ఒకతను.
"ఆ! అలాగా! మైగాడ్- యాక్సిడెంట్ అవబోతూందా?"
"అవును!"
"ఎవరు చెప్పారలా అని?"
"మొత్తం ట్రెయినంతా అల్లకల్లోలంగా వుంటే ఎవరు చెప్పారా? ఏమిటండీ! కమాన్ చెప్పండి! ఈ వార్త తెలీగానే మీ ఫీలింగ్సేమిటి?"
"నా ఫీలింగ్సా? మీరడిగేదేమిటో నాకర్థం కావటం లేదు"
"అదేనండీ, ఫీలింగ్స్! తాము ప్రయాణం చేస్తున్న ట్రైన్ కి యాక్సిడెంట్ కాబోతుందని తెలీగానే ప్రయాణీకుల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎలా రియాక్టయ్యారు అనే ఇంటర్వ్యూలు కలెక్టు చేస్తున్నాం కొంతమంది ప్రయాణీకుల దగ్గర. అప్పర్ క్లాస్ లో ఈ కోచ్ లో వున్నవారందరి దగ్గరా తీసుకుంటున్నాం".
అమానుల్లాఖాన్ కి భయం వేసింది.
"ఈ ట్రైన్ నిజంగా యాక్సిద్నేట్ అవుతున్నాడా?"అడిగాడు మళ్ళీ దూరదర్శన్ తెలుగులో.
"అవును! మరి అటూ ఇటూ పరుగెత్తే ఈ పాసింజర్స్ హడావుడి ఇంకెందుకనుకున్నారు?"
"ఓ మై గాడ్! ఏం జరిగాడసలు?"
రిపోర్టర్స్ కి అతని తెలుగు వినేసరికి అనుమానం వచ్చింది.
"మీ తెలుగు అలా వుందేమిటి? దూరదర్శన్ స్టాఫా మీరు?" అడిగాడొకతను. అమానుల్లాఖాన్ కి చెమటలు పట్టేసినయ్.
తను దూరదర్శన్ డైరెక్టర్ అని తెలుస్తే ప్రయాణీకుల మానసిక పరిస్థితి ఎలా టర్న్ అవుతుందో తను చవిచూశాడు.
"అహహ! కాడు! కాడు! అహహ! అవును! నోనో! కాడు!"
అతని కంగారు చూసేసరికి రిపోర్టర్స్ అనుమానం మరింత పెరిగిపోయింది.
"మీరు దూరదర్శన్ న్యూస్ రీడర్ గానీ, ఎనౌన్సర్ గానీ, ఇంటర్వ్యూలు చేసేవారు కానీ కాదా?"
"కాడు! కాడు!"
"ఎలాగా? ఎలాగంటే-ఆ! ఎలాగంటే- మేం మిక్కిలి వ్యవధి టి.వి. చూస్తాడు"
"ఎందుకని? మీకు ఇంట్లో, ఆఫీస్ లో వర్రీస్ ఎక్కువ వున్నాయా? జీవితం మీద ఎందుకంత విరక్తి కలిగినట్లు?"
లోపలి బెర్తు మీదనుంచి విజయ లేచి కళ్ళు నులుముకుంటూ, ఆవులిస్తూ అతని వెనుకకొచ్చి నిలబడింది.
"రామచంద్రన్ ఎంగె?" అంది మత్తుగా.
అమానుల్లాఖాన్ బాంబ్ పడ్డట్లు అదిరిపోయాడు. ఆమెను చూస్తూ రిపోర్టర్స్ కూడా స్టన్ అయ్యారు.
"మీరు సినిమాల్లో పనిమనిషి వేషాలేస్తుంటారు కదూ?" అడిగాడొకతను ఆమెని.
"ఆమ!" అంది విజయగర్వంగా. అమానుల్లాఖాన్ ఉలిక్కిపడ్డాడు.
"నో- కాడు! కాడు! యూ ఆర్ మిస్టేకెన్! ఈమె రామచంద్రన్ భార్య- ఐమీన్ మై వైఫ్" అన్నాడు గాభరాగా. "నా పెండలం!"
రిపోర్టర్స్ కి అతనిమీద పూర్తిగా అనుమానం వచ్చేసింది.
"సమ్ థింగ్ ఫిషీ!" అన్నాడొకడు.
"అవును!" అన్నాడు రెండోవాడు.
"నోనో! నో ఫిష్!" అన్నాడు అమానుల్లా వాళ్ళ థాట్స్ చదువుకుంటూ. "నిజంగా వాడు నా వైఫ్!"
"అయితే ఆమె రియాక్షన్ నోట్ చేసుకుంటాం! మీరు పక్కకు జరగండి!" అంటూ అతన్ని పక్కకు తీసి ఆమె ముందునిలబడ్డాడతను.
"ఈ ట్రెయిన్ కి యాక్సిడెంట్ అవుతోందని తెలీగానే మీ ఫీలింగ్స్ ఏమిటి?" అడిగాడతను.
ఆమెకెమీ అర్థం కాలేదు.
"తెలుగు తెరిమిల్లె" అంది చిరునవ్వుతో.
"టమిల్ తెరీమా?" అడిగాడు రిపోర్టర్.
ఆమె తలూపింది.
ఈ సారి అదే ప్రశ్నను తమిళంలో అడిగారు రిపోర్టర్స్.
ఆమె ముఖంలో వెంటనే భయం, గాభరా కనిపించినాయ్.
ఛటుక్కున అమానుల్లా వేపుతిరిగి తమిళంలో ఆవేశంగా మాట్లాడింది.
అమానుల్లాకు ఆమె ఏమీ మాట్లాడుతుందో అర్థం కావటం లేదు.
"ఆమె ఏమంటున్నాడు?" అనడిగాడు రిపోర్టర్ ని.
అప్పటికే ఆమె మాటలు విని నిశ్చేష్టులయి నిలబడ్డ రిపోర్టర్స్ వెంటనే తేరుకున్నారు.
"ఏమంటోందా? రాత్రంతా ఆమెతో గడిపినందుకు తనకు రావలసిన అయిదువేల రూపాయలూ ఇప్పుడే కక్కమంటోంది!" అన్నాడు రిపోర్టర్.
అమానుల్లా మొఖం వాడిపోయింది.
"ఈమె మీ భార్య అన్నారు. ఆమె రాత్రి గడిపినందుకు వెయ్యి రూపాయలు కట్టమంటోంది. ఏమిటి సంగతి? మీ భార్యతో గడిపినప్పుడల్లా మీరు వెయ్యి రూపాయలు ఇస్తుండటం అలవాటా?" వ్యంగ్యంగా అడిగాడు రిపోర్టర్.
అక్కడ చేరిన నలుగురయిదుగురు ప్రయాణీకులు ఘోల్లుననవ్వారు.
"డోంటాక్! దిసీజ్ నన్నాఫ్ యువర్ బిజినెస్!" అంటూ డోర్ మూసుకోబోయాడు. గానీ ఆమె ఛప్పున డోర్ కి అడ్డం నిలబడి తమిళంలో గట్టిగా అరవసాగింది. అమానుల్లాఖాన్ కి చెమటలు పట్టేసినయ్.
"ఏమిటంటున్నాడు వాడు?" అడిగాడు రిపోర్టర్ ని.
"మీరుగానీ, ఆ అమ్మాయిని మీకు సప్లయ్ చేసిన తెలుగు టి.వి.ప్రొడ్యూసర్ రామచంద్రన్ గానీ ఆమెకివ్వవలసిన అయిదువేల రూపాయలూ వెంటనే కక్కకపోతే మీ ఇద్దరిమీద ఇప్పుడే మాకు ప్రెస్ స్టేట్ మెంట్ ఇస్తానంటోంది".
"ఆ! అలా అంటున్నాడా? ఇప్పుడే రామచంద్రన్ ని పిలుచుకొస్తానని చెప్పండి! ప్లీజ్! వన్ మినిట్! వాడెక్కడున్నాడో వెతికి పట్టుకొస్తాను-" అంటూ ముందుకి నడవబోయాడుగానీ విజయ అచ్చం సినిమాల్లోలా ఎగిరి అతని కాలర్ పట్టుకుంది. రెండు నిమిషాలు తమిళంలో ఆవేశంగా అరిచింది మళ్ళీ.