సావిత్రి గుండెలు విపరీతమయిన వేగంతో కొట్టుకున్నాయ్.
"అవును సావిత్రీజీ! మనకి ఈ రోజు శాశ్వితంగా గుర్తుండిపోవాలి...మన జీవితంలో ఇంకెప్పుడూ అనుభవించని ఆనందం ఇవాళ అనుభవించాలి... వివాహమయిన తర్వాత మన మధ్య ఈ విధమయిన కొత్తదనం, భయం, సంతోషం ఉండవని నా నమ్మకం, అప్పుడు ఉండే బంధం వేరు. అది పవిత్రతతో కూడుకుంది. ఇప్పుడు ఉండే ఉత్సాహం అప్పుడుండదు అందుకని__"
ఆమె పెదాలమీద గాఢంగా ముద్దు పెట్టుకొన్నాడతను.
సావిత్రి ఉక్కిరి బిక్కిరయింది...అతని వీపుచుట్టూ చేతులేసి బలంగా తన గుండెలకు హత్తుకొందతన్ని.
అలాగే ఆమెను చేతుల్తో ఎత్తుకొని మంచంవైపు నడిచాడతను.
ఆమెను నెమ్మదిగా పడుకోబెట్టి తనూ ప్రక్కనే పడుకున్నాడు.
"ఇప్పుడు చెప్పండి" అన్నాడు నవ్వుతూ.
"ఏం చెప్పను?"
"ఏమయినా కబుర్లు."
"ఏమీ లేవు." చిరునవ్వుతో అంది సావిత్రి.
"ఏమీ లేకపోతే రాత్రంతా మేలుకొని గడపటం ఎలా?"
"మేలుకోవడం ఎందుకు?"
"భలేవారే! మరి ఈ రాత్రిని మర్చిపోకుండా చేయాలంటే ఇంకెలా?"
"ఏమో బాబూ! నాకు నిద్దరొస్తోంది" కళ్ళు మూసుకొందామె.
చక్కిలిగిలి పెట్టాడతను.
నవ్వేస్తూ లేచి కూర్చుందామె...చటుక్కున గుండెల మీదకు లాక్కున్నాడు.
చాలాసేపు ఏవేవో మాట్లాడుతూనే ఉన్నాడతను.
తొమ్మిది గంటలకు ఇద్దరూ భోజనాలు ముగించారు.
కాసేపు రేడియోలో పాటలు విన్నారు.
"కాసేపు పేకాట ఆడదాం రండి" కొత్తపేక తీసుకొచ్చి అన్నాడతను.
ఇద్దరికీ కార్డ్సు పంచాడు.
"ఆడండి" అన్నాడు తన కార్డ్సు తీసుకుంటూ.
"రాందే ఎలా ఆడను?"
"ఎలాగొలా ఆడండి."
"సరే..." తనూ చేతిలోకి పేక తీసుకుంటూ అంది సావిత్రి.
"అతనో కార్డు వేశాడు. అది తీసుకుని మరో కార్డు వేసింది సావిత్రి."
కెవ్వున కేక వేశాడతను. "జోకర్ వేసేశారేమిటి?"
"ఏం? వేయకూడదా...?" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
ఆమె చేతిలోని కార్డ్సు ఓసారి చూసి అన్నీ కలిపి ఓ మూలకి విసిరేశాడతను.
ఇద్దరకూ నవ్వాగలేదు.
"ఇంక నేను నిద్రపోతాను. కావాలంటే నా తరపు కూడా మీరే ఆడుకోండి" మంచం మీదకు వాలిపోతూ అంది సావిత్రి.
"అంత తేలిగ్గా పడుకోనిస్తానేం మిమ్మల్ని" తనూ ఆమె మీదకు వరుగుతూ అన్నాడతను. సావిత్రికి వళ్ళంతా చక్కిలిగిలి పెట్టినట్లయింది. అతని ఉచ్చ్వాస నిశ్వాసలు తన ముఖానికి తగిలి మైకం కలిగిస్తోంది.
"ఇంకలెండి" అతన్ని తోసివేయడానికి ప్రయత్నిస్తూ అందామె.
అతను మరింత గాఢంగా ఆమెని ఆక్రమించుకొన్నాడు. అతన్ని నివారించే శక్తి సన్నగిల్లిపోతుంది సావిత్రికి. శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లుంది. ఇద్దరి పెదాలూ కలుసుకున్నాయ్... శరీరాలు పూర్తిగా స్వాధీనం తప్పినాయ్. ఆవేశంతో ఆమెను నలిపేస్తున్నాడతను. తనూ అతని చేతిలో బొమ్మలా ఇమిడిపోతోంది సావిత్రి. తనకి స్పృహ కోల్పోతున్నట్లు అనిపించసాగింది. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు. ఊడిపోతున్న చీరను గట్టిగా పట్టుకుందామె.
"సావిత్రీ!" తీయగా, మత్తుగా పిలిచాడతను.
"ఇంక వదలండీ!" అతని చేతులు పట్టుకుంటూ అంది సావిత్రి.
"సావిత్రీ! ఇవాళ ఆనందాన్ని అంచులు చూద్దాం కాదనకు" కోరికతో అన్నాడతను.
ఎవరో తనను పైకెత్తి విసిరేస్తున్నట్లుగా గతంలో కెళ్ళిపోయిందామె.
భయంతో ఊగిసలాడిపోయింది.
మైసూర్లో__ఆరోజు__శ్రీరామ్ కూడా ఇలాగే.
"సావిత్రీ! ఇవ్వాళ ఆనందం అంచులు చూద్దాం..."
"శ్రీరామ్..."
"సావిత్రీ!"
సావిత్రికేమీ తెలీటం లేదు. తనను కౌగిట్లో ఇముడ్చుకుంటోంది ఎవరు? శ్రీరామా? శంకరా? ఎవరితను?
కళ్ళు చిట్లించి చూసిందామె.
మసగ్గా ఉందా ఆకారం_కొద్దిసేపు శంకర్ లాగానూ కొద్దిసేపు శ్రీరామ్ లాగానూ కనబడుతుంది.
శరీరం గాలిలో తేలిపోతున్నట్లుంది.
అవయవాలన్నీ మత్తుతో నిండిపోతున్నాయి.
"శంకర్! ప్లీజ్_వద్దు__"
"ఎందుకంత భయం?" అడ్డుపడుతున్న ఆమె చేతుల్ని అవలీలగా తొలగించాడతను.
ఇంకొద్ది క్షణాలు అంతే! ఆ తరువాత_తను పూర్తిగా అతని వశమయిపోతుంది.
తను ఇంతకాలంగా ఏర్పరచుకున్న నమ్మకాలూ_ఇష్టాలూ_అన్నీ_అతని చేతుల్లో_
"సావిత్రీ!" అతని గొంతు అంత వేడిగా ఉందేమిటీ? పెదాలకు కూడా అంత ఉంటుందా?