సావిత్రి సిగ్గుపడింది.
"ఊహు బావుండదు__"
"ఏం ఫర్వాలేదు__"
ఆమె ఊహించినట్లుగా చాలామంది చూడనే చూశారు.
అతను వెళ్ళిపోయాక తన సీట్లో కూర్చుని ఆలోచనలోకి జారిపోయిందామె.
ఆనందం...భయం రెండూ కలుగుతున్నాయి!
శ్రీరామ్ తో కూడా ఇలాగే చాలా వేగంగా సంఘటనలు జరిగాయి.
తనకు అప్పుడూ ఏదో భయంగానే వుంది.
అలాగే అతను దూరమయ్యాడు.
ఇప్పుడు మళ్ళీ ఇతనూ__అదే వేగంతో...తనను అల్లుకుపోయాడు...
తన భయానికి తనకే చిరాకు వేసింది.
శంకర్ శ్రీరామ్ లాంటి మూర్ఖుడు కాదు!
ఆ రోజు సాయంత్రం కలుసుకున్నప్పుడు శంకర్ అన్నాడు. "రేపొక్కరోజు నాకోసం సెలవు పెట్టాలి అంటారు!"
"ఎందుకూ?"
"అదంతా సీక్రెట్!"
"సరే..." నవ్వుతూ అంది.
మర్నాడు కాజువల్ లీవ్ కి అప్లికేషన్ పంపించింది.
ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చేశాడు శంకర్.
"ఇవాళ వంటా అదీ చేయకండి. చాలా ప్రోగ్రామ్ వున్నాయ్ మనకి." అన్నాడు నవ్వుతూ.
"మీ పుణ్యమా అని వంట చేయడం మర్చిపోతున్నాను__" నవ్వుతూ అంది సావిత్రి.
ఇద్దరూ బయటకొచ్చి బస్ లో అబిడ్స్ చేరుకున్నాడు. ఒక స్వీట్స్ షాపులోకి నడిచాడతను. లోపల టేబుల్ దగ్గర కూర్చున్నారు.
"ఇక్కడేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
"ఇంకా అప్పుడే అడక్కూడదు" అన్నాడతను.
సర్వర్ నాలుగు రకాల స్వీట్స్ తీసుకొచ్చి సావిత్రి ముందుంచాడు.
"ఇప్పుడు అడగొచ్చా?" అంది సావిత్రి.
"మీరు చెప్పుకోండి చూద్దాం."
సావిత్రి ఓ నిమిషం ఆలోచించి "మీకు అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చి వుంటుంది అవునా?"
"ఊహు! ఫెయిల్డ్."
"పోనీ మరో మంచి ఇంటర్వ్యూలో సెలక్టయి వుంటారు."
"ఫెయిల్డ్"
"ఇంక ఊహించడం నావల్ల కాదు"
"ఆల్ రైట్! ఇవాళ నా పుట్టిన్రోజు"
"వండర్ ఫుల్" సంతోషంగా అంది సావిత్రి "కానీ ముందే చెప్పకపోవడం అన్యాయం" చిరుకోపంతో అంది.
"నా పుట్టిన్రోజులు ఎవ్వరికీ ముందుగా చెప్పే అలవాటు లేదు. అందరినీ ఆశ్చర్యపరచటమే" నవ్వుతూ అన్నాడతను.
"సరే! అలాగయితే నేనూ ఇలాగే మిమ్మల్ని ఏడిపిస్తాను చూడండి"
"సంతోషంగా ఏడుస్తాను."
ఇద్దరూ స్వీట్లు తిని బయటికొచ్చారు.
"ఇంకేమిటి ప్రోగ్రాం?"
"మంచి ఇంగ్లీష్ పిక్చరుంది. అది మ్యాట్నీ చూడటం! తర్వాత ప్రోగ్రాం సర్ ప్రైజ్ అన్నమాట!"
"ఇలా ఇంకెన్ని ఆశ్చర్యాలున్నాయ్?"
"ఎందుకు?"
"ముందే తెలిస్తే ఆశ్చర్యపడకుండా ఉండొచ్చని."
"అలాగయితే అసలు చెప్పను"
ఇద్దరూ నవ్వేశారు.
సాయంత్రం సినిమా నుంచి బయటకొచ్చేసరికి సావిత్రికి అలసట కలిగినట్టయింది.
"ఉదయం నుంచీ ఒకటే తిరుగుడు. నేనింక ఎక్కడకూ రాలేను బాబూ! ఎక్కడయినా ఒకచోట కూర్చుందాం పదండి రాత్రి పదింటి వరకూ."
"మీరలా అలసిపోతారన్న విషయం కూడా నాకు తెలుసండి. అందుకే దానికి మరో సర్ ప్రైజ్ ఏర్పాటు చేశాను. పదండి."
టాక్సీలో కూర్చున్నారిద్దరూ.
ఓ పెద్ద హోటల్ ముందాగింది టాక్సీ.
"ఇక్కడేమిటి మళ్ళీ?" ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి టాక్సీ దిగుతూ.
"అడక్కూడదని చెప్పాను కదా! నన్ను ఫాలో అయిపోండి! అంతే?"
అతని వెనుకే నడిచిందామె... కౌంటర్ దగ్గర తీసుకొని లిఫ్ట్ వైపు నడిచాడతను. ఇద్దర్నీ పైకి తీసుకెళ్ళి వదిలింది లిఫ్ట్. అక్కడ కింద తివాచీలతో ఇంద్రభవనం ఉంది. మంచు కురుస్తున్నట్లున్న ఎయిర్ కూలర్ గాలి... గది ముందాగి తాళం తీసి లోపలకు నడిచాడతను.
"కమిన్" అన్నాడు తను లోపల నిలబడి.
ఆమె లోపలకు రాగానే తలుపు మూసి తాళం వేసేశాడతను.
"ఏమిటిదంతా?" సంభ్రమంతో అడిగింది సావిత్రి.
"ముందలా లోపలికొచ్చి కూర్చోండి" నవ్వుతూ అన్నాడతను. సావిత్రి లోపలకు నడిచింది. అందమయిన డెకోలాన్ మంచాలు, యూఫోమ్ పరుపులూ, ఖరీదయిన ఫర్నీచరూ, అద్దం, రేడియో.
సోఫాలో కూర్చుంది ఆమె.
ఆమె పక్కనే కూర్చుని రెండు చేతుల్తో తన కౌగిట్లోకి లాక్కున్నాడు శంకరం.
"ఈ రాత్రి మనిద్దరం ఇక్కడే గడపాలి సావిత్రిగారూ!"