"శంకర్, వద్దు" కన్నీళ్లు తిరిగినయ్.
అతను నవ్వుతున్నాడు. అందంగా, సమ్మోహనంగా_
శ్రీరామ్ కూడా ఇంతే ఆ రోజు.
ఆమె గుండె ఝల్లుమంది.
ఇక్కడే ఈ క్షణంలోనే తను శ్రీరామ్ ను పోగొట్టుకుంది. అందుకు తను విచారించడం లేదు.
కానీ ఇప్పుడు శంకర్ విషయంలో తను వెనక్కు పోలేనంత దూరం ప్రయాణం చేసింది.
శ్రీరామ్ లాగా శంకర్ కూడా తనను అన్యాయం చేస్తే మానసికంగా తట్టుకునే శక్తి తనకు లేదు.
ఏమిటిప్పుడు చేయడం?
తను అభ్యంతరం చెపితే శంకర్ కూడా తనకు దూరమవుతాడా?
"సావిత్రీ!" తనలో ఐక్యం అయిపోతున్నాడతను.
ఇంకొద్ది క్షణాలు మౌనంగా ఉంటే_ఆ తర్వాత__ఇంక చేయగలిగిందేమీ లేదు.
ఇప్పుడే ఏదో ఒకటి నిర్ధారించుకోవాలి.
ఏది ముఖ్యం తనకు?
తను విలువ ఇచ్చే నీతి ముఖ్యమా? శంకర్ విలువ ఇచ్చే నీతి ముఖ్యమా?
తన విలువ వదులుకుంటే అతను దక్కుతాడు.
లేకపోతే శ్రీరామ్ లాగానే మనసు విరుచుకుని, మళ్ళీ కనిపించనంత దూరంగా__ సావిత్రి కంటినుండి కన్నీటి చుక్కలు కిందకు పోతున్నాయ్ ఏకదాటిగా. ఇంకొక్క క్షణం అంతా అల్లకల్లోలంగా వుంది.
తను తీసుకునే నిర్ణయం మీదే తన భవిష్యత్తు ఆధారపడి వుంది.
భగవాన్! ఆడదానికెందుకీ దుస్థితి కల్పించావ్.
అడ్డమయిన రాయినీ, పుట్టనీ, చెట్టునీ నమ్మి కొలుస్తునందుకా?
"సావిత్రీ!"
సావిత్రి అతని తలను తన గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకుంది.
"శంకర్__ఐ లవ్ యూ_ దయచేసి నన్ను దూరం చేయకు__" ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖం.
శంకర్ అదేమీ పట్టించుకోవడం లేదు.
అతనంతవరకూ చూడని అద్భుత ప్రపంచంలో విహరిస్తున్నాడు. ఇద్దరూ కౌగిలి విడివడేసరికి తెల్లారిపోయింది.
అతని ముఖంలోకి చూడడానికి సిగ్గుగా వుంది సావిత్రికి.
ముందు అంతటి అల్లకల్లోలానికి గురయిన తనేనా రాత్రంతా అతనితో అలా ప్రవర్తించింది?
ఎక్కడిది తనకంత ఆవేశం? ఎన్నేళ్ళ కోరికలని? నాకింత బలముందనీ, తననింతగా పెళ్ళగించేస్తాయనీ__
యింటికి చేరుకున్నారు.
"సాయంత్రం వస్తాను సావిత్రీ!"
గడప దగ్గర ఆగిపోయాడతను.
సావిత్రి లోపలికొచ్చి మంచంమీద వాలిపోయింది. హఠాత్తుగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది.
తను తప్పు చేసింది. నిజమే...కానీ తనకోసం చేసింది. తన భవిష్యత్తు కోసం, తనను పీడిస్తున్న ఒంటరితనాన్ని పారద్రోలటం కోసం.
భోజనం చేయబుద్ధి కావటం లేదు.
నిద్ర_అలసట_శరీరం ఆధీనంలో లేదు.
మధ్య మధ్యలో మెలకువ వస్తుంది. మధ్య మధ్యలో కన్నీరు_ మధ్య మధ్యలో మత్తు, నవ్వు__ఆనందం.
సాయంత్రమయిపోయింది. చీకటి పడుతుంది.
అతనింకా రాడేం?
ఎందుకింత ఆలస్యం అయింది?
తనలానే నిద్రపోతున్నాడా? తనలాగే ఆలోచిస్తున్నాడా?
రాత్రవుతున్న కొద్దీ తనతోపాటు తన శరీరం కూడా ఎదురుచూడసాగిందతని కోపం.
అందుకే__అందుకే తనీ గాలంలో చిక్కుకోకుండా ఇంతకాలం__జీవితం గడిపింది.
రాత్రి తొమ్మిదయిపోయింది. ఆకలి మొదలయింది.
కాఫీ తయారుచేసుకుని తాగిందామె.
అతనెందుకు రాలేదు? ఇంకా నిద్రలేవలేదా?
ఓసారి అతనిని చూడాలనుంది_ మాట్లాడాలని వుంది. పోనీ తనే అతనిదగ్గరకెళితే?
ఉత్సాహంగా లేచి త్వరగా రడీ అయిందామె. బయటికి అడుగుపెట్టి అక్కడే నిలబడిపోయింది.
చీకటి...
యింత రాత్రయిపోయిందనుకోలేదు. టైమ్ చూసిందామె. పదవుతోంది.
ఎలా! వెళ్ళాలా, వద్దా?
బాలకృష్ణ గదిలోంచి గట్టిగా అరుపులు వినబడుతున్నాయ్.
త్వరత్వరగా అడుగులు వేస్తూ అతని గది దగ్గరకు నడిచింది. గదికి తాళం చూస్తూనే నిరుత్సాహపడిపోయిందామె.
ఎక్కడికెళ్ళి ఉంటాడు? ఇంతవరకూ ఎందుకు తిరిగిరాలేదు?
నిరాశగా వెనక్కు తిరిగి వచ్చింది.
లోలోపల ఎక్కడో భయం...సన్నగా, నెమ్మదిగా ప్రారంభమయింది.
మర్నాడు ఆఫీస్ కు బయలుదేరేవరకూ అతనికోసమే ఎదురుచూసింది. అతని జాడ లేకపోవటంతో ఆందోళన ప్రారంభమయింది...
ఎందుకని రాలేదతను?
అతని గది చేరుకుంది. తాళం...
అపశకునం ఎదురయినట్లుంది. సాయంత్రం వరకూ ఆఫీస్ లో ఎలా గడిపిందీ తనకే తెలీదు.
బస్ కోసం ఎదురుచూడకుండా ఆటోలో ఇల్లు చేరుకుంది. ఈపాటికి వచ్చి ఉంటాడు బహుశా__
ఆటో ఆగింది.
ఇంకా తాళం అలాగే వుంది.


