Previous Page Next Page 
ఆత్మబలి పేజి 42


    కేశవ చలపతి ఇంటికి రాకూడదనుకుంటూనే వస్తాడు. వచ్చిన క్షణం నుండీ అతని సర్వశరీరమూ ఉమ ధ్యానంలోనే వ్యగ్రమయి ఉంటుంది. అసలు చలపతి పర్స్ లో ఉమ ఫోటో చూసిం తర్వాతనే వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు. న్యాయమయినా అన్యాయమయినా ఉమను మరొక్కసారి చూడాలనే కోరికను చంపుకోలేకపోయాడు. తననే తిరస్కరించిన ఉమ చలపతినెలా స్వీకరించిందనేది అతనికి విడదీయరాని సమస్యయింది. చలపతికి ఉద్యోగమిచ్చి సాయపడటంలో అతనిలో ఏ దురుద్దేశమూ లేదు. కేవలం ఉమకు కావలసినవాళ్ళకు సహాయపడుతున్నాననే సంతృప్తి మాత్రమే పొందగలుగుతున్నాడు.
    అయినా, చలపతి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ, అతిమెల్లిగా పనిమనిషితో మాట్లాడే ఉమ కంఠం వినటంకోసం, తెరవెనుక లీలగా కదిలే ఉమ ఆకారాన్ని దర్శించటంకోసం అతని సర్వప్రాణాలూ తహతాహలాడిపోతుంటాయి. ఉమ పంపిన ఫలహారాలను గబగబ తినేస్తే ఎక్కడయిపోతాయో అన్నట్లు అపురూపంగా తింటాడు. కాఫీగ్లాసు చెక్కిలి కొకసారి ఆనించుకొని కాఫీ త్రాగేవాడు.
    కేశవ ఇంట్లో అడుగుపెటిన దగ్గిర్నుంచీ వెళ్ళిపోయేంతవరకూ తీవ్రమైన జ్వరం వచ్చినట్లనుభూతి చెందేది ఉమ. ఆమె మస్తిష్కం వేడెక్కిపోయేది. ఏ ఆలోచనా తోచేదికాదు. ఏ క్షణంలో ఎక్కడ అతని కళ్ళబడతానో అని మూలమూల నక్కి కూర్చునేది. అతడు వెళ్ళిపోగానే పది లంఖణాలు చేసిన మనిషిలా నీరసపడిపోయేది.
    ఒకరోజున అకస్మాత్తుగా వర్ధనమ్మ, కాళీ వచ్చారు. సంభ్రమాశ్చర్యాలతో తలమునకలయింది ఉమ.
    వాళ్ళకెంతో మర్యాద చేసింది. ఉమకు మరింత ఆశ్చర్యం కలిగేలా కాళీ, వర్ధనమ్మలు ఉమతో ఎంతో ఆదరంగా వ్యవహరించారు.
    షాపునుండి వచ్చిన చలపతి తల్లినీ, చెల్లెలినీ చూసి ఆశ్చర్యపోయాడు.
    "ఎంత చిక్కిపోయావురా చలపతీ?" అంటూ ప్రేమ ప్రకటించింది వర్ధనమ్మ.
    "బలిశాను" విసుగ్గా అన్నాడు చలపతి.
    "ఛీ! చీపురుపుల్లలా ఉన్నావు! ఉన్న ఒక్కణ్ణీ వదులుకోలేనురా! మీ నాన్నగారు నీకోసం బెంగపడిపోయారు. నిన్ను తీసుకురమ్మని పంపారు. నా సంగతి సరేసరి. కళ్ళలో నువ్వే ఉన్నావు. కాళి నీమాటే ఎప్పుడూ..." దీనంగా బ్రతిమాలింది.
    "రమ్మంటే వచ్చి పొమ్మంటే పోయేటందుకు నేను మనిషినా బొమ్మనా? ఆ ఇంటికీ నాకూ ఋణం తీరిపోయింది."
    వర్ధనమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "అంత తేలిగ్గా తీరిపోయే ఋణాలురా ఇవి? తండ్రి అన్నాక కోపంలో లక్షంటారు. అవన్నీ పట్టించుకోవలసిందేనా? ఆయన నిజంగా వెళ్తారనుకోలేదు. వెళ్ళిన మరునాటినుంచీ బెంగపెట్టుక్కూర్చున్నారు. నామాటవిని వచ్చెయ్యి. మనకున్నదంతా నీక్కాకపోతే మరెవరికి?"
    "నాకేదీ అక్కర్లేదు. నేను రాను."
    ఉమ కల్పించుకొంది. "వస్తారు లెండత్తగారూ! మీరన్నట్లు ఇవి తెంపుకుంటే తెగే బంధాలు కావు. నాకూ ఒక్కదానికి ఇబ్బందిగానే ఉంది. మీ అందరితో కలిసి ఉండాలనుంది."
    "వేవిళ్ళా ఏవిఁటే?" ఆశగా అడిగింది వర్ధనమ్మ.
    "వేవిళ్ళంటే?" గాభరాగా అడిగాడు చలపతి.
    కాళి విరగబడి నవ్వింది.
    ఉమ తలవంచుకొని "అదేం లేదు" అంది.
    వర్ధనమ్మ బరువుగా నిట్టూర్చింది.
    "ఆనాడు నాకు సంపాదన లేనపుడు, ఎలా బ్రతుకుతామో అనే ఆలోచనైనా లేకుండా పొమ్మన్నారు. ఇప్పుడు మనకాళ్ళమీద మనం నిలబడుతూంటే రమ్మంటున్నారు." రోషంగా ఉమ దగ్గిర బుసలు కొట్టాడు చలపతి.
    "పోనీలెండి. కారణం ఏదైతేనేం? మళ్ళీ మనమంతా ఒకటవుతున్నాం. వాళ్ళంతట వాళ్ళు దగ్గిరవుతున్నప్పుడు పంతాలకుపోయి కన్నవాళ్ళను దూరం చేసుకోవటమెందుకూ?" లాలనగా అంది ఉమ.
    తరువాత కొద్దిరోజుల్లోనే ఉమ చలపతితో సహా అత్తవారింటికొచ్చేసింది.


                                       26


    "హేమ్లెట్" నాటకంలో షేక్స్ పియర్ "There is a method in his madness" (హామ్లెట్ వెర్రికి ఒక వైనం అంటూ ఉంది) అంటాడు.
    కాళి మెదడు కొన్ని విషయాలలో ఎంత మందకొడిగా ఉంటుందో మరికొన్ని విషయాలలో అంత చురుకుగా పనిచేస్తుంది.
    ఉమ ఉమ్మడి కుటుంబంలో చేరిపోయినా కేశవ రాకపోకలు తగ్గలేదు. చలపతి బలవంతమే ఇందుకు కారణమయినా కేశవ ఆ ఇంటికి అయిష్టంగా మాత్రం రావటంలేదు. ఉమ దర్శనం చాలా అపురూపం కేశవకు. అయినా ఆ ఇంటికి రావటానికతని మనసెప్పుడూ ఉత్సాహిస్తూ పోతుంది. ఈ తపన అంతా దేనికో, తనేం కోరుతున్నాడో తెలియని అయోమయంలో ఉన్నాడు కేశవ. అతని బలహీనత అతనికే అర్థంకావటం లేదు.
    అందగాడూ ధనికుడూ, అవివాహితుడూ అయిన కేశవను ఆకర్షించాలని కాళి మహా తాపత్రయపడసాగింది. అతను రాగానే గబగబ మొహం మోటెక్కేలా సబ్బుతో తెగరుద్దుకొని నల్లని ముఖంమీద బూడిద గుమ్మడికాయలా పౌడరు పులుముకుని అతి పలచని నైలాన్ చీర, పైట క్రిందకు జారిపోయేలా కట్టుకుని అతని ముందు ఒకటికి పదిసార్లు తిరుగుతుంది.
    "మంచినీళ్ళు కావాలా?"
    "కులాసాగా ఉంటున్నారా?"
    "ఏదైనా టిఫిన్ చేస్తాను."
    లాటి మాటలు కల్పించుకుని మాట్లాడుతుంది. పాపం, కాళి ఇంత ప్రయాసపడినా కేశవ ఆమెనొక వ్యక్తిగా కూడా పరిగణించడు. ఆ ఇంట్లో ఉండే కుర్చీలకూ, బల్లలకూ, కాళికీ పెద్ద తేడాలేదు కేశవ దృష్టిలో.
    ఆమె మాటలు సాధారణంగా వినిపించుకోడు. తప్పనిసరిగా వినిపించుకోవలసి వచ్చినప్పుడు అతి మర్యాదగా ముభావంగా సమాధానం చెపుతాడు. అతని సర్వేంద్రియాలు ఇంటిలోపలి భాగంపైనే కేంద్రీకరించబడి ఉంటాయి. ఈర్ష్యామనస్కురాలయిన కాళి ఈ విషయం గ్రహించగలిగింది.

 Previous Page Next Page