Previous Page Next Page 
ఆత్మబలి పేజి 41


    ఆమె మంచిది కావచ్చు. చెడ్డది కావచ్చు. ఆమెనంత దారుణంగా హింసించే అధికారం తనకెవరిచ్చారు? ఆమె నిస్సహాయత్వాన్ని ఆధారంగా తీసుకుని రాక్షసులకంటే దారుణంగా ప్రవర్తించాడు. దీనికి పరిహారం ఏమిటి?


                                       25


    "ఉమా! నీకొక శుభవార్త చెప్పనా!"
    పట్టరాని సంతోషం ముఖంలో ప్రతిఫలిస్తూండగా వచ్చాడు చలపతి.
    ఆశ్చర్యంగా "చెప్పండి" అంది ఉమ.
    "నాకు ఉద్యోగం దొరికింది."
    అయోమయంగా చూసింది ఉమ.
    "ఆశ్చర్యంగా ఉందికదూ! నాకూ ఆశ్చర్యంగానే ఉంది ఉమా! ఆ కేశవరావుగారు, అదే నా పర్స్ దొరికినాయన ఇవాళ దారిలో కలిశారు. నన్ను హోటల్ కు తీసికెళ్ళారు. ఆయనకు హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ గూడ్స్ వ్యాపారం ఉందిట. చాలా పెద్ద వ్యాపారమట. ఆయనొక్కడే చూసుకోలేక అవస్థపడుతున్నారుట. ఎవరైనా మేనేజర్ దొరికితే బాగుండుననుకుంటున్నారు. నాకు వీలుగా ఉంటే నన్నుండమన్నారు. జీతం నాలుగొందలు. అన్నింటికీ గుమాస్తాలున్నారు. నా వర్కంతా ఆయన నాకు బోధపరుస్తానన్నారు. నేను సంతోషంతో ఒప్పుకున్నాను ఉమా! వెధవకాలేజీకి ఇంక వెళ్ళక్కర్లేదు."
    దిగ్భ్రాంతితో వింది ఉమ.
    "వద్దు. వద్దు. ఈ ఉద్యోగానికి మీరొప్పుకోవద్దు. కాలేజీ మానొద్దు. ఆయనతో నాకొద్దని చెప్పెయ్యండి."
    తెల్లబోయాడు చలపతి. అతని మనసులో బాధ ముఖంలో స్పష్టంగా కనిపించింది.
    "అదేవిఁటి ఉమా! నాలుగొందల జీతం నేను బి.యస్.సి. పాసయితే మాత్రం వస్తుందా? ఇంత మంచి అవకాశం వదులుకోమంటావా? నేనా కాలేజీ చదువు చదవలేను బాబూ! ఆ సైన్స్ నా తలకెక్కటం లేదు!"
    "పోనీ ఆర్ట్సులోనే చదవండి,"
    "ఆర్ట్సులో అయితే ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ గా చదవొచ్చుగా! తప్పక చదువుతాను."
    "వద్దు. మీరా ఉద్యోగానికొప్పుకోవద్దు." స్థిరంగా అంది ఉమ.
    చలపతి ఉమవంక వింతగా చూశాడు.
    "నేనూ ఉద్యోగస్థుడినవటం నీకిష్టంలేదా ఉమా? నీ సంపాదనలోనే ఉండాలా?" దీనంగా అన్నాడు.
    మ్రాన్పడిపోయింది ఉమ.
    "సరే! మీయిష్టం" అంది చివరకు.
    చలపతి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆ మరునాడే ఉద్యోగంలో చేరిపోయాడు.
    అప్పటినుండి చలపతి ఇంటికి కేశవ రాకపోకలు ప్రారంభమయ్యాయి. పాపం. కేశవది తప్పులేదు. చలపతే ప్రాధేయపడుతూ అతనిని తన ఇంటికాహ్వానింస్తున్నాడు.
    చలపతి ప్రైవేట్ గా పి.యు.సి. చదవటానిక్కూడా కేశవ చాలా సహకరిస్తున్నాడు. కేశవ ఒక దేవతామూర్తిలా కనిపిస్తున్నాడు చలపతి కంటికి.
    ఉమ కిదంతా చాలా బాధగా ఉంది. కేశవకు దూరంగా ఉండమనీ, అసలు కేశవ దగ్గర ఉద్యోగమే వద్దని చెప్పాలనీ ఆమె తపన. కాని తన మాటలనెలా సమర్ధించుకోవాలో తెలియక చెప్పలేకపోతూంది.
    చలపతికి బ్రతుకంతా ఉమే! ఏ పనిచేస్తే ఉమకు సంతృప్తి కలుగుతుందో, ఏది ఉమ కానందాన్నిస్తుందోనన్న విషయమే అతని ఆలోచనల నన్నింటినీ ఆక్రమించుకుంది.
    ఉమ ప్రయత్నించి చలపతి మనోవికాసానికి దారి చేసింది.
    ఆ మార్గంలో సహృదయుడైన కేశవ సహకారంతో చలపతి మనసు త్వరత్వరగా దానంతటది వికసిస్తోంది.
    ఉమ తనను దూరంగా ఉంచిందని అతనికి మనస్తాపం లేదు. ఒకనాడతనికి ఉమతో తన కోరికనెలా వెల్లడించాలో తెలియలేదు. ఈనాడతనికి ఉమను పొందటానికి తను కొంత అర్హత సంపాదించుకోవాలని అర్థమయింది. ఆనాడు ఈనాడు అతనామెను వెఱ్ఱిగా ఆరాధిస్తున్నాడు. ఉమ తనతో ఉంటే చాలు. రోజుకొక్కసారి విజ్ఞానమూ, ఆత్మస్థైర్యమూ రంగరించుకొని కాంతులీనే ఆ కళ్ళలోకి చూడగలిగితేచాలు. ఆమె పాదపూజ చెయ్యటానికైనా అర్హతలేనివాడు తను. తన ఎన్ని జన్మల తపఃఫలితంగానో ఉమ తనదైంది. ఎంత కృషిచేసినా తను ఆమె మానసికస్థాయి నందుకోలేడు. కనీసం డిగ్రీనయినా ఆమెతో సమానంగా తీసుకోకపోతే ఎలా?
    క్రమవికాసం చెందుతున్న అతని మనసుకు ఉమకూ తనకూ ఉన్న వ్యత్యాసం బాగా అర్థమవుతూంది. ఒక్కొక్కప్పుడు గర్విస్తాడు. మరొకప్పుడు బాధతో కృంగిపోతాడు. కొన్నిసార్లు లజ్జతో తలెత్తలేడు. ఏమైనా ఉమ అతని సర్వస్వమూ!
    ఉమకు కేశవ ఎదుటికి రావటం ఇష్టంలేక తప్పుకుపోతున్నకొద్దీ, చలపతి ఒకటికి పదిసార్లామెను కేశవ ఎదుటి కాహ్వానిస్తాడు. ఆమెను తన భార్య అని చెప్పుకోవటం చాలా గొప్ప. చలపతికి భగవానుడు తనకు ప్రసాదించిన ఆ అపురూపమైన వరాన్ని మురిపెంతో తనకాత్మీయుడైన కేశవ దగ్గిర ప్రదర్శించుకోవాలని చలపతి ఆరాటం.
    చలపతితో ఈ బాధ పడలేక ఎల్లవేళలా తనతో ఉండే పనిమనిషిని కుదుర్చుకొంది ఉమ. కేశవ ఎప్పుడొచ్చినా టీ ఫలహారాలు పనిమనిషితోనే పంపేది. తయారుచెయ్యటం మాత్రం తనే స్వయంగా చేసేది. చలపతి హోటల్ నుంచి తెప్పిస్తానన్నా వినేది కాదు. ఉమను కేశవ ఎదుటికి రప్పించి సగర్వంగా "నా భార్య" అనుకొని మురిసిపోవాలనే చలపతి ఆశ ఏమాత్రమూ ఫలించేదికాదు.

 Previous Page Next Page