కసితో ఆవిడ మనసు ఉడికిపోయింది. కసి కేశవమీద కాదు. ఉమ మీద.
"అమ్మా! అన్నయ్యకు చాలా మంచి ఉద్యోగం దొరికింది కదే?" అంది తల్లితో.
"అవునమ్మా! అదృష్టవంతుడు!"
"ఆ అదృష్టమంతా వదినదిలే!"
"అవును. 'కోడలొచ్చినవేళ' అంటారు!"
"పో అమ్మా! నీకు బొత్తిగా తెలివిలేదు."
"ఏవిఁటీ?"
"ఆ కేశవరావుగారు అన్నయ్యకు నెలకు నాలుగు వందలెందుకిస్తున్నట్టు? నిజంగా అన్నయ్యకి అక్కడంత పని ఉంటుందంటావా? ఒకవేళ ఉంటే అన్నయ్య చెయ్యగలడా?"
"అవునే! ఆయన చాలా మంచివాడు."
"అందరూ మంచివాళ్ళే! ఆయన రోజూ మనింటికెందుకొస్తున్నారంటావు?"
"ఎందుకేవిఁటీ? చలపతీ, ఆయనా మంచి స్నేహితులు."
"స్నేహితులయితే పగలంతా ఇద్దరూ కలిసే ఉంటారుగా! మళ్ళీ ఇంటికెందుకూ? అంతగా అయితే అన్నయ్యనే వాళ్ళింటికి తీసికెళ్ళచ్చుగా! మనింటికి రావటం దేనికి?"
"ఏమో తల్లీ! నీ యక్షప్రశ్నలన్నింటికీ నేను సమాధానాలు చెప్పలేను."
"ప్రశ్నలూ లేవు, సమాధానాలు లేవు. ఒక్కటే సంగతి. అతను ఉమ వదినకోసం రావటంకోసం ఉద్యోగమిచ్చాడు. అన్నయ్య పర్స్ పోతే ఇతను స్వయంగా తెచ్చిచ్చాట్ట. అందులో ఉమ వదిన ఫోటో ఉంది. అలా అయింది పరిచయం! అంతమంది నౌకర్లున్నారు కదా! అతనే స్వయంగా ఎందుకు రావాలి? ఉమ వదిన ఫోటో ఉంది గనుక వదినను చూడాలని వచ్చాడు. చూసి మెచ్చాడు. మెచ్చి ఉద్యోగమిచ్చి అన్నయ్యను వలలో వేసుకున్నాడు. వేసుకుని ఇంటికొస్తున్నాడు. ఇంక చివరి దశ మిగిలింది. అది ఉమ వదినను లేవదీసుకుపోవటం."
వర్ధనమ్మ నిర్ఘాంతపోయింది.
"అలా అంటావా? కాదేమోనే! ఉమ అతనున్నప్పుడు అసలు బయటికే రాదుకదా!"
"మనమందరమూ ఉండగా అలాకాక ఇంకెలా ఉంటుందమ్మా! సమయమూ సందర్భమూ దొరికినపుడు చూడు. ఆనాడు విధిలేక అన్నయ్యను చేసుకుంది. కేశవలాంటి అందగాడూ, డబ్బున్నవాడూ, చదువుకున్నవాడు రమ్మంటే ఆగుతుందేమిఁటి?"
వర్ధనమ్మ గుండెలు గుబుక్కుమన్నాయి.
తన కొడుకుకూ, కోడలికి ఉండే వ్యత్యాసం ఆ తల్లి హృదయానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. వ్యక్తిత్వాలూ విలువలూ ఇవేమీ వర్ధనమ్మకు తెలియవు. ఆమె సాధారణ లౌకికస్థాయిలో మాత్రమే ఆలోచించగలదు. పల్లెటూరి చదువురాని యువతి సహితం చేసుకోటాని కొప్పుకోని చలపతిని ఉమ చేసుకుంది. ఆ సమయం అలా వచ్చి, విధిలేక చేసుకుంది. అట్లాంటప్పుడు అవకాశం కలిసొస్తే ఎందుకు లేచిపోదూ?
పాపం వర్ధనమ్మ మంచిదే! తన కొడుకు చవటతనంతో ఆవిడకున్న అపారమైన నమ్మకం మాత్రమే కోడలిపై ఇంతటి అపనమ్మకానికి కారణం.
ఒకనాడు ఉమ హాల్లో కూర్చుని ఏదో చదువుకుంటుండగా కేశవ చలపతిలు అకస్మాత్తుగా వచ్చారు. ఉమ గాభరాగా లేచి నిలబడింది. అపురూపంగా లభ్యమైన ఆ అవకాశాన్ని వదులుకోలేక కళ్ళలో ప్రాణాలు నింపి ఉమను చూశాడు కేశవ. సెకనులో నాలుగోవంతుకాలం ఉమ చూపులు కేశవ చూపులతో బంధించుకొనిపోయాయి. ఆమెకు బాహ్యజ్ఞానం నశించింది. వల్లమాలిన ప్రేమ, భరింపరాని దైన్యం, తీవ్రమైన తపన రంగరించుకున్న ఆ చూపులు ఉమ అంతరాంతరాల్లో ఆమెకే తెలియకుండా మూలమూలల దాగున్న ఏవేవో భావాలను త్రవ్వి వెలికిలాగుతుంటే, తట్టుకోలేక కంగారుగా లోపలికెళ్ళిపోయింది. ఆ స్వల్పకాలాన్నీ కాళి నిర్లక్ష్యం చెయ్యలేదు. మోచేత్తో పొడిచి తల్లిని హెచ్చరించి చూపించింది. వర్ధనమ్మా పళ్ళు నూరుకుంది.
"ఉమకు మరీ మొహమాటం."
ఉమ అలా వెళ్ళిపోవటం ఇష్టంలేని చలపతి కొంచెం బాధగా అన్నాడు. ఇంకా ఈ లోకంలోకి రాని కేశవ ఏ సమాధానమూ చెప్పలేదు. ఒక అరగంట అలాగే మైకంలో ఉన్నవాడిలా కూర్చొని కేశవ వెళ్ళిపోయాక వర్ధనమ్మ చలపతిని పిలిచింది.
"నువ్వు గుడ్డివాడివి. నీకు కనిపించదు. ఆ కేశవరావు మన ఉమను మింగేసేవాడిలా ఎలా చూశాడో చూశావా?"
"ఆయన చాలా మంచివారమ్మా!" విసుగ్గా అన్నాడు చలపతి.
"నా మొహం మంచి. ఉద్యోగమిచ్చాడని నీకు వళ్ళూ పై తెలియటం లేదు. ఆ ఉద్యోగమూ ఉమను చూసే ఇచ్చాడు."
"కొంపదీసి ఉద్యోగం మానెయ్యమంటావేవిఁటి?" కోపంగా అడిగాడు చలపతి. వర్ధనమ్మ గాభరాపడిపోయింది.
"ఉద్యోగం మానెయ్యమనటం లేదురా! ఆ కేశవను మనింటికి రావద్దను. నువ్వే అక్కడికెళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది."
చలపతికి ఒళ్లు మండిపోయింది.
"నువ్వు పిచ్చిదానివమ్మా! నాకే జాగ్రత్తలూ అవసరంలేదు. అంతగా ఉమ లేచిపోదలిస్తే నేనే స్వయంగా పంపిస్తాను" అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.
వర్ధనమ్మ రాపడిపోయింది. ఆమెకు తన వెనుకటి కొడుకే తెలుసు. ఈ మారిపోయిన కొడుకు ఆమెకసలు అర్థంకావటం లేదు.
27
వర్ధనమ్మా, కాళీ రహస్యాలు చెప్పుకోవటం ఎంత వినిపించుకోకూడదనుకున్నా, వాళ్ళ సంభాషణంతా ఉమ చెవులలో పడనే పడింది. వర్ధనమ్మ కొడుకుకు చేసిన బోధ కూడా వింది.
ఉమ కొక్కసారి తల గిఱ్ఱున తిరిగినట్లయింది. మంచితనమంటే ఏవిఁటో? మంచిగా ఉండటమంటే ఎలా?
అత్తమామల కనుగుణంగా నడచుకోవటం మంచితనం. నడవడి వాళ్ళకనుగుణంగా లేదు.
అందుకని తను చెడ్డదన్నమాట!