మరి ఔరంగాబాద్ లో ఏం జరిగిందో మిస్టరీగానే వుండిపోయింది ప్రసూనకు. అక్కడ ఎం జరిగిందో ఎవర్ని అడిగితే చెబుతారో ఆమెకు తెలియలేదు. తను చేసిన తప్పువల్ల తన భర్త అలా అయిపోలేదని, ఔరంగాబాద్ లో ఏదో జరిగిందని ఆమె అనుకుంది. తన భర్తనే గట్టిగా అడగాలని నిశ్చయించుకుని ఇంటికొచ్చింది.
అయినా ఆ తరువాత భర్తను ఔరంగాబాద్ లో ఎం జరిగిందో అడగలేకపోయింది.
సుందరబాబు పరిస్థితి మరింత క్షీణించింది. క్షయరోగిలా అయిపోయాడు. గడ్డం బాగా పెరిగిపోయింది. కళ్ళు లోపలికెళ్ళిపోయి గుంతల్లా అయిపోయాయి. దవడలు పీక్కుపోయాయి. పెదవులు మాటిమాటికీ ఎండిపోతున్నాయి. ముఖంలో జీవకళ మాయమై ప్రేతకళ వచ్చింది.
ఊరంతా కూడా అతన్ని చూసి దిగులు పడిపోయింది. ఎంతో సరదాగా వుండే మనిషి అలా అయిపోవడం అందర్నీ బాధించింది. చాలా మంది విషయం ఏమిటని అడిగినా సుందరబాబు జవాబు చెప్పలేదు. మౌనంగా నవ్వి వాళ్ళను తప్పించుకుని వచ్చేసేశాడు.
అనసూయమ్మ కొడుకును చూసినప్పుడంతా కళ్ళల్లో నీళ్లు నింపుకునేది. ఆమె ఎంత అడిగినా అతను ఏమీ జవాబు చెప్పలేదు.
ప్రసూన పరిస్థితి కూడా దిగజారింది. తప్పు చేశానన్న బాధ కేన్సర్ కణాల్లా పెరిగిపోయి, శరీరాన్ని పీక్కుతింటూ వుంది. నిజం చెప్పలేక, తప్పు దాచి పెట్టలేక ఆమె గిలగిల్లాడిపోతోంది.
ఇక భరించలేక ఒకరోజు తన తల్లిని పిలిపించింది.
ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తల్లితో అంది "నిజం చెప్పేయమంటావా?"
సరస్వతికి ఠక్కున ఏం జవాబు చెప్పాలో తోచలేదు. కాసేపు ఆలోచించాక "నువ్వు తొందర పడకమ్మా. నీ భర్త ఇలా అయిపోవడానికి కారణం నువ్వేనని ఖచ్చితంగా తెలిసినప్పుడు నువ్వు చేసిన పని చెప్పు. అతను క్షమిస్తాడన్న నమ్మకముంది. నీ పరిస్థితిని అర్థం చేసుకునే మనసుంది అతనికి. కానీ నువ్వు చేసిన పని అతనికి తెలిసే అవకాశం లేదు. అవధూతకీ, నీకూ, నాకూ తప్ప మరో కంటికి తెలియదు. నీ వల్ల అతను అలా అయిపోయి వుండడు. దానికి మరో కారణం వుంటుంది. మనం తొందరపడి ఆ విషయం చెబితే ఏ ఉపయోగం కోసం నువ్వు అలా చేశావో అది నిష్ప్రయోజనం అవుతుంది. నీ కాపురమే కూలిపోవచ్చు. మరి నువ్వే ఆలోచించు" అంది.
తన తల్లి చెప్పినదాన్లోనూ నిజముంది. తను ముందే చెప్పేస్తే దీని వల్ల నష్టం తప్ప లాభముండదు. మరి ఆయన ఎందుకలా అయిపోతున్నారు.
ఆమెకి ఏం చేయాలో తోచడంలేదు. కాలమే ఈ మిస్టరీని ఛేదించాలని సరిపెట్టుకుంది. మరుసటిరోజు ఉదయం సరస్వతి తన వూరు వెళ్లిపోయింది. ఆమె అక్కడ వుండి కూతురి బాధ చూడలేక వెంటనే బయల్దేరి వెళ్ళిపోయింది.
మరో నెల రోజులు గడిచాయి. పరిస్థితిలో ఏ మార్పూ లేదు.
సుందరబాబు ఇంట్లో ప్రేతకళ తాండవస్తోంది. ఇళ్లు శ్మశానంలా తయారైంది. ఆ ఇంట్లో నవ్వులు వినపడి కొన్ని నెలలవుతోంది.
అనసూయమ్మ జీవచ్చవంలా తయారైంది. మనవడి ఆలనాపాలనా చూసుకోవడం తప్ప మరో పనిని ఆమె ముట్టడం లేదు. సుందరబాబు మరింత క్షీణించిపోయాడు. ఎముకల గూడులా తయారయ్యాడు.
భర్త అలా అయిపోయాడన్న బాధ, తను తప్పు చేశానేమోనన్న శంక ఆమెను కుంగదీస్తున్నాయి.
ఇలా వుంటే ఎంతో కాలం తమలో ఎవరూ బతకరనిపించింది. అటో, ఇటో తేల్చేయాలనుకుంది. ఆ రాత్రి తన భర్తను అడిగి, సమాధానం రాబట్టాలని నిర్ణయించుకుంది. అవసరమనుకుంటే తన తప్పునూ చెప్పేయాలనిపించింది. ఆ తరువాత పరిణామాల గురించి ఆమె ఆలోచించలేదు.
అలా గట్టిగా నిర్ణయించుకోవడంతో ఆమెకు అంతకాలం తన గుండెలమీదునున్న బరువును కిందకు దించినట్టనిపించింది. భర్తకోసం ఎదురు చూడసాగింది.
తన భర్త మొదటిసారి తాగొచ్చాడని అనిపించగానే ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అతన్ని పట్టుకుని వలవలా ఏడ్చేసింది.
"నన్ను క్షమించు ప్రసూనా" అతని మాటలు ముద్దలు ముద్దలుగా రాలి కింద పడుతున్నాయి. అప్పటికే నిషా అతని తలకెక్కుంది.
"నేనేం చేయను? నా మనసు నా కంట్రోల్ లో లేదు. నేను ఇలా పతనం అవుతానని ఊహించలేదు. అంతా నా దురదృష్టం. ఇంటికి తాగొచ్చి పెళ్ళాన్ని కష్టపెట్టే మగాడంటే నాకు ఎంతో అసహ్యం. అలాంటిది ఈ రోజు నేనే తాగి వచ్చాను. ఆచరణలో చూపించలేని ఆదర్శాలన్నీ వ్యర్థం, ఏమంటావ?" కానీ ఇంత తెలిసీ ఈ రోజు నేను తాగాను. కారణం బాధ"
"ఏం జరిగిందో చెప్పండి. ఎందుకు మీకు బాధ?" ఆమె ఏడుస్తూనే అడిగింది.
"చెబుతాను. అయితే ఇప్పుడు కాదు ఇక్కడ కాదు. రేపు చెబుతాను. వూర్లో వాళ్లందర్నీ పిలిచి, పంచాయితీ పెట్టించి మరీ చెబుతాను. ఆ పంచాయితీకి నువ్వూ వస్తావ్, నా బాధ ఏమిటో నువ్వూ వింటావ. సరేనా ! ఇక నావల్లకాదు. ఈ నిప్పును నా గుండెల్లో దాచుకోలేను. ఇప్పటికే అది నన్ను కాల్చేసింది. రేపు చెబుతాను- రేపు చెబుతాను" అతను ఇక మాట్లాడలేడని తెలిసిపోయింది ఆమెకు.
అతన్ని అలానే భుజంమీద ఆనించుకుని మంచం దగ్గరకు తీసుకెళ్ళింది. పడుకోబెట్టి దుప్పటి కప్పింది.
తనూ వెళ్ళి పడుకుంది గానీ నిద్ర రాలేదు. రేపు అంతమందిలో తన భర్త చెప్పబోయే బాధ ఏమిటో ఎంత ఆలోచించినా తట్టడం లేదామెకు. రేపు ఏదో గొప్ప విషాదం సంభవిస్తుందని మాత్రం అనిపిస్తోంది. ఇంతకీ ఔరంగాబాద్ లో ఏం జరిగింది? తన భర్త మనో స్థయిర్యాన్ని దెబ్బతీసే సంఘటన ఎం జరిగిందక్కడ?
తను చేసిన పని చెప్పేస్తే మంచిదేమోననిపించింది ఆమెకు. కానీ ధైర్యం చాలడంలేదు. ఆమె రకరకాలుగా ఆలోచిస్తూ ఏ మూడింటికో నిద్రపోయింది.
దండోరా శబ్దం వినిపించడంతో ఆమెకు మెలకువ వచ్చింది. దిగ్గున పడకమీదనుంచి లేచి బయటకు వచ్చింది.
వీధిలో దండోరా వేస్తూ పోతున్నాడు సుందరబాబు.
ప్రతి ఇంటి ముంగిటా జనం గుమిగూడి వున్నారు.
కొందరు వారిస్తున్నా సుందరబాబు వినకుండా తప్పెట వాయిస్తూ గట్టిగా చెప్పుకుపోతున్నాడు.
"గ్రామస్థులారా ! ఈ రోజు మధ్యాహ్నం మూడింటికి భజన మందిరం దగ్గర పంచాయితీ జరుగుతుంది. మీరు తప్పక రావాలహో!"