అతను పిచ్చి పట్టినట్టు అరుస్తూ చెబుతున్నాడు.
మామూలుగా గ్రామ తలారి చేత దండోరా వేయిస్తారు. ఇప్పుడు సుందరబాబే దండోరా వేస్తుంటే జనానికి వింతగానూ, బాధగానూ వుంది.
విషయం ఏమై వుంటుందోనని ఒకరికొకరు గుసగుసలాడుకుంటున్నారు. ఇదమిత్థంగా ఎవరూ విషయం ఇదని వూహించలేకపొతున్నారు.
అనసూయమ్మకు గుండె చెదిరింది. దేవుడి గదిలో కూర్చుని ఏడుస్తూ భగవంతుడ్ని ప్రార్థించసాగింది.
ప్రసూన పరిస్థితి చెప్పనలవికానిది. తన గుండె ముక్కలై చెల్లా చెదరైపోతున్నట్టు అనిపించిందామెకు. ఏం చేయాలన్నా కాలూ, చేయి ఆడడంలేదు. పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంతసేపు ఏడ్చిన బాబు అలసిపోయి నిద్రపోయాడు.
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాలేదు సుందరబాబు. అతను రాకపోవడంతో ఎవరూ అన్నం తినలేదు.
టైమ గడుస్తున్నకొద్దీ ప్రసూనకు గుండె అదురుతోంది. ఏదో చెప్పలేని టెన్షన్ ఆమె నరాలను చిట్లిస్తోంది. కళ్ళనుంచి ధారాపాతంగా నీళ్ళుకారుతున్నాయి. అప్పుడప్పుడు శరీరం వశం తప్పుతోంది.
టైమ్ రెండు దాటింది.
జనం గుంపులు గుంపులుగా భజన మందిరం చేరుకుంటున్నారు.
అనసూయమ్మ దేవుడి గది నుంచి బయటకు రాలేదు. అత్తమ్మ వుంటే ధైర్యంగా వుంటుందని ప్రసూన పిలిస్తే ఆమె అక్కడకు రానంది.
"విషాదకరమైన వార్త వినకముందే నేను చచ్చిపోవాలమ్మా. ఎలాంటి కాపురం ఎలా అయిపొయింది. ఇదా నేను కోరుకున్నది? నేనేమి మడులూ మాన్యాలూ కావాలన్నానా? హారాలూ, అగ్రహారాలూ కోరానా? లేదే, నా కొడుకూ, కోడలు సుఖంగా వుండాలని ఆశపడ్డాను. ఆ ఆశ కూడా ఫలించకుండా ఇల్లు వల్లకాడైపోయిందే. నేను అక్కడికి రానమ్మా. వాడు చెప్పేది ఏమైనా ఈ చెవులతో వినలేనమ్మా. నువ్వెళ్ళు. అక్కడ ఎం జరుగుతుందో చూడమ్మా" అని ఏడుస్తూ చెప్పింది అనసూయమ్మ.
అదిరే గుండెతో బయల్దేరింది ప్రసూన.
భజన మందిరం కిటకిటలాడిపోతూ ఉంది. సుందరబాబు జనం మధ్యలో భజన మందిరంలో వరండాలో నిలబడి వున్నాడు. అతని చుట్టూ జనం. తల్లికి ఏమవుతుందో, తమ గురువుకి ఏం కీడు జరిగిందోనని జనం భయం భయంగా చూస్తున్నారు.
గ్రామ సర్పంచ్, కారణం చాపమీద కూర్చుని వున్నారు. ఈ పంచాయితీని సుందరబాబు ఎందుకు పెట్టించాడో, అతను ఏం చెబుతాడోనని వాళ్ళు దిగులుతో తలలు దించుకుని వున్నారు.
అంతమందికి అభిమానపాత్రుడైన సుందరబాబుకు వచ్చిన కష్టం ఏమిటో?
ప్రసూన వచ్చి స్త్రీలు వున్న చోట నిలబడింది. ఆమె ముందు కొంతమంది వున్నారు.
ముందు గుంపు వున్నా సుందరబాబుకు ప్రసూన స్పష్టంగా కనిపిస్తోంది.
టైమ మూడయ్యింది.
అంతా నిశ్శబ్దం. బావి గట్టుమీద వాలిన కాకులు దాహంతో కాబోలు అదే పనిగా అరుస్తున్నాయి. గాలి వేడిగా వీస్తోంది. ఇంకా ఎండ వేడిమి తగ్గలేదు. వేపచెట్టు మరీ పిసినారిలా కొంతమేరకే నీడను పరిచింది. ఎండలో నిల్చున్న వాళ్ళకు నెత్తి మాడిపోతోంది.
అందరికీ ఒకే ఉత్కంఠ సుందరబాబు ఏం చెబుతాడోనని అందరూ ఊపిరి బిగపట్టారు.
అప్పుడు గొంతు విప్పాడు సుందరబాబు.
"గ్రామస్థులారా ! మీరు నన్ను ప్రేమించేవాళ్ళు. చిన్నప్పట్నించి మీ మధ్య పెరిగాను. మీకు తెలియని రహస్యాలు లేవు నాకు. నా జీవితం ఎప్పుడూ అపశృతి పలికింది లేదు. ఇప్పుడు పలికింది. సంఘంలో మనిషి జీవిస్తున్నాడు కాబట్టి అతనికి ఆనందమైనా, బాధైనా ఈ సంఘంలోంచే రావాలి. అలానే కష్టమైనా, సుఖమైనా మనం సంఘంతోనే పంచుకోవాలి. ఇంతకాలం మీరు నా విజయాలే చూశారు. నా ఆనందాన్ని పంచుకున్నారు. ఈరోజు నాకో సమస్య ఎదురైంది. ఆ సమస్యను మీకు చెప్పకుండా, అది మీ కంటపడకుండా, దానిముఖం మీద టవల్ వేసి, దాచిపెట్టాలని నాకులేదు. అలా చేస్తే నేను మిమ్మల్ని మోసగించినట్టవుతుంది. అంతకు మించి నన్ను నేను మోసం చేసుకున్నట్టవుతుంది. అందుకే నాకు వచ్చిన ఈ కష్టాన్ని మీకు చెబుతున్నాను."
సుందరబాబు ఆగాడు.
అప్పుడు అతను ఏదో ట్రాన్స్ లో వున్నట్టు మత్తుగా వున్నాడు. అతని కళ్ళు ఎర్ర జీరలతో కారపుముద్దల్లా వున్నాయి. అతను ఎంతో బలవంతంగా వూపిరి పీల్చుకుంటున్నాడు.
గ్రామస్థులంతా రెప్పవేయకుండా తదేకంగా అతన్నే చూస్తున్నారు.
ప్రసూనకు ఒళ్లంతా తేలిపోతూవుంది. ఎండ ఆమె శరీరాన్ని కాలుస్తోంది.
సుందరబాబు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించగానే గుసగుసలు ఆగిపోయాయి. గాలి సవ్వడి తప్ప ఇంకే శబ్దమూ లేదు.
'నా కొచ్చిన కష్టం ... నా ఇంట్లో వున్న బాబు నా కొడుకు కాడు" అని చెప్పి ఆగాడు సుందరబాబు.
ఆ మాటలకు జనం ఉలిక్కి పడ్డారు. ఆటంబాంబు పక్కన పడ్డా అంతగా జడుసుకుని వుండరు వాళ్ళు.
తన కొడుకుగా వున్నవాడు తన కొడుకు కాదని చెబుతున్న సుందరబాబును పిచ్చోడికింద జమకట్టలేదు వాళ్ళు. తన కష్టాన్ని తమతో పంచుకుంటున్నట్టే భావించారు వాళ్ళు.
తను వూహించింది నిజమయ్యేసరికి నిలువెల్లా వణికిపోయింది ప్రసూన. ఆమెకు ఏడుపు రాలేదు. ఎవరో తన గుండెను రెండు చేతుల మధ్య అదిమిపట్టి నలిపేస్తున్నట్టు గిలగిల్లాడిపోయింది.
అక్కడనుంచి గబగబా వెళ్ళి తన భర్తకు అన్ని చెప్పేయాలనిపించింది ఆమెకు. కానీ శరీరం అందుకు సహకరించడం లేదు. తలంతా మొద్దుబారి పోయింది.
సుందరబాబు చెబుతున్న మాటలు ఎక్కడో మరో లోకం నుంచి వినిపిస్తున్నట్టుంది ఆమెకు.
"మీకు తెలుసు నాకు పెళ్లై అయిదేళ్ళయినా సంతానం కలగలేదని. మా అమ్మ, నా భార్య ప్రసూన గుడులు, గోపురాలు తిరుగుతుంటే నేనారోజు డాక్టర్ దగ్గరకు పోయాను. ఆయన అన్ని పరీక్షలూ జరిపారు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదనీ, జీవకణాలు చాలా బలహీనంగా వున్నాయని చెప్పాడు. అయితే ఈ విషయం ప్రసూనకు నేను చెప్పలేదు. అదే నా తప్పు. జీవితంలో మొదటిసారి చేసిన తప్పు ఆ తప్పు పర్యవసానం ఇంత దారుణంగా వుంటుందని ఆలోచించలేదు. తప్పు చేయడం ప్రారంభించాను కనుక అందుకు నేనే శిక్షింపబడాలి..."
ప్రసూన వణుకుతోంది. జ్వరం వచ్చినట్టు ఒళ్ళు కాలిపోతోంది ఆమెకు. ఏదో చెప్పాలని నోరు తెరుస్తున్నా ఏ శబ్దమూ బయటికి రావడం లేదు. ఆమె తీవ్రంగా చలించిపోవడంతో శరీరం వశం తప్పింది.


