Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 42

 
    భర్తల్ని వదిలిపెట్టి ఇంటి విషయాన్నీ, కన్నబిడ్డల్నీ పట్టించుకోకుండా సంఘం  అస్తమయిపోయిందంటూ బజారునపడి ఉద్యమాలు నడిపే కుహనా ఆదర్శవాదులుగా వారి గురించి తెలిసిన రుత్వి "మీరంతా సీరియస్ గా ఏదో చర్చించుకుంటున్నారుగా" డిస్టర్బ్ చేయలేనట్లు వెళ్లబోయాడు కాని పడనివ్వలేదు ఇంకో బాబ్డ్ హెయిర్ ఫ్రౌఢ "నథింగ్ డూయింగ్"

 

    సగం జీవితాన్ని బ్యూటీ పార్లర్ కే అంకితం చేసిన ఆడదానిలా వుంది ఆమె అలంకరణ చూస్తుంటే. అదికాదు, మందు కాస్త ఎక్కువ కొట్టినట్లు కళ్లు బడలికగా వాలిపోవడంతోపాటు ఎక్కిళ్ళతో ఎగిరిపడుతూ అంది.

 

    "ఇంపార్టెంట్ విషయాలు అన్నీ మాటాడేసుకున్నాం యంగ్ మాన్. నీ ఆయుర్వేద  పాండిత్యం గురించి కాస్త చెబితే సంతోషిస్తాం" ఉన్మాదిలా రుత్విని లాగింది.

 

    పరిచయమిన ఒక నిముషం కాకముందే ఇంత చనువుని ప్రదర్శిస్తున్న ఆమెను చూస్తూ "లంవగాలుంటే బుగ్గన పెట్టుకోండి" అన్నాడు వున్నట్టుండి.

 

    "వ్వాట్" అదిరిపడింది బాబ్డ్ హెయిర్.

 

    "లవంగం బుగ్గన పెట్టుకోవాలా? దేనికి?"

 

    "ఎక్కిళ్లు ఆగడానికి" కూల్ గా అన్నాడు.

 

    "అవును మేడమ్! లవంగాలు బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఎక్కిళ్లు ఆగుతాయి."

 

    అప్పటికే తేరుకున్న ఇంకో స్త్రీ "మొత్తానికి ప్రిపరేషన్ లేకుండా ఆయుర్వేదంలోకి జంప్ చేసాడా. గట్టి పిండమే" అంది. రుత్వి అవకాశం యిస్తే ఏమాత్రం గట్టివాడో తెలుసుకోవాలనే ఉత్సుకతని కళ్లతోనే ప్రదర్శిస్తూ " అవునూ ఎక్కిళ్ళు ఎందుకొస్తాయి"

 

    నిజానికి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆమె  అడగలేదు. అతడితో బేటీకి దిగడంలో కాస్త ఆసక్తిని ప్రదర్శించింది అంతే.

 

    "అబ్బా....... నీ గాళ్ ఫ్రెండ్ కి కోపం రాదుగాని కాస్త ఓపికపట్టు" కమలాదాస్ రుత్వి భుజంమీద చేయి వేసింది అందరికన్నా తనకున్న చనువు ఎక్కువన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ.

 

    హఠాత్తుగా రుత్వికి కమలాదాస్ భర్త విజయేంద్రదాసు గుర్తుకొచ్చాడు. సిటీలో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమానిగా ఎందరికో ఉపాధిని కల్పించడం మాత్రమేకాక మరెందరో నిర్భాగ్యులకి నీడనిచ్చే శరణాలయాలకి లక్షల విరాళాన్ని గుప్తంగా యిచ్చే సహృదయుడు పబ్లిసిటీకి అతీతంగా వుండే ఆయనకి భార్య కమలాదాసు.

 

    "ఓహ్...కమాన్ రుత్వీ. అసలు ఎక్కిళ్లు ఎందుకొస్తాయో చెప్పలేదు నువ్వు" అడిగింది కమలాదాసు మళ్లీ.

 

    దూరంగా టేబుల్ దగ్గరున్న సశ్యని ఓరకంట గమనిస్తూ చెప్పాడు రుత్వి.

 

    "బాగా వేడిచేసే పదార్దాలుగానీ, బాగా పుల్లగా వుండి తొందరగా అరగని ఆహారంగానీ అమితంగా తీసుకోవడంతో వస్తుంటాయి. పచ్చళ్లు కారాలు, మసాలాలు అతిగా తిన్నా ఈ ఎక్కిళ్ళు వచ్చే అవకాశముంది."

 

    "రియల్లీ" బాబ్డ్ హెయిర్ మళ్లీ రియాక్టయిపోయింది.

 

    "అవునూ! కడుపు కాగానే వాంతులెందుకు అవుతాయి?"

 

    సాలోచనగా చూశాడు. అక్కడ వున్న స్త్రీలు కొన్ని ఇబ్బందికర మైన ప్రశ్నలతో తనను ఆఠ పట్టించాలనుకుంటున్నట్టు బోధపడుతూనే వుంది.

 

    "స్త్రీ శరీరంలో కొత్తగా రూపు దాల్చుకునే బిడ్డని పరాయివస్తువుగా భావించి బాడీ తీవ్రంగా రియాక్టవుతుంది. అందుకే గర్బం దాల్చిన తొలి రోజుల్లో స్త్రీలు వాంతులు చేసుకుంటారు."

 

    "అలాంటప్పుడు పచ్చిమామిడికాయలు తినాలని ఎందుకు అనిపిస్తుంది?"

 

    "వికారంగా వుంటుంది కాబట్టి పులుపు తినాలనే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాని ప్రత్యేకించి  పచ్చిమామిడికాయలు మాత్రమే తినాలనిపించదు."

 

    "అక్కడికి నువ్వు ఆడదానివై ఎప్పుడో నెల తప్పినట్లు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు రుత్వి "స్లీవ్ లెస్ స్త్రీ రుత్వి చేతిని నొక్కింది.

 

    "అవునూ........ మావిచిగురు తినగానే కోయిల కూస్తుందంటారుగా. మావిచిగురు. కూతకీ ఏమన్నా సంబంధం వుందా?" అంతా తనది కోకిల గొంతు అంటారని గుర్తుకు తెచ్చుకుంటూ.

 

    "మామిడిచెట్టు లేత చిగుళ్లుతింటే గొంతు శుద్ది అవుతుందని, గాయకులకి మంచిదని చెబుతుంది ఆయుర్వేదం. అంతేకాదు. లేత చిగుళ్ళని మెత్తగా దంచి నీళ్లలో కలిపి బాగా మరిగించి చిక్కటి కషాయం తీసి వడగొట్టి నొట్లో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నోటి వ్యాధులన్నీ తగ్గుతాయి.

 

    "వండర్ ఫుల్" ఈసారి కమలాదాసు అడిగింది. "ఈ లెక్కన జీలకర్ర బెల్లం" క్షణం ఆగి "అదే పెళ్లిలో వధూవరుల నెత్తిమీద పెడతారే దానికి ఓ అర్దం ఏదో వుండాలి" అంది  తనకు సమయస్పూర్తిగా ప్రశ్నలు అడగడం తెలిసినదానిలా.

 

    విసుక్కోలేదు రుత్వి. "ఎస్..... జీలకర్ర, బెల్లం కలుపుకుని తింటే చాలా శక్తి కలుగుతుందని చెబుతుంది ఆయుర్వేదం.  ఈ మిశ్రమంవలన లైంగిక శక్తి లైంగిక వాంచ కూడా పెరుగుతుందని."

 

    "కాబట్టే మన పూర్వీకులు జరగబోయే శోభనానికీ ముందు ఈ టైపు సాంప్రదాయం అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణ రేపేవారంటావ్."

 

    "ఇంకా నయం రేప్ చేసేవారనలేదు. " ఆర్దోక్తిగా అంది బాబ్డ్ హెయిర్ జారిపోతున్న పైటని సరిచేసుకుంటూ.

 

    ప్రత్యేకించి  తన చూపుల్ని అటు మళ్లించడానికే ఆమె అలా చేసిందని గ్రహించిన రుత్వి వాతావరణం మరింత వేడెక్కకముందే లేవాలనుకున్నాడు.

 

    "అరె...... వెళ్లిపోతావేం! అసలు విషయం అడగలేదు" బాబ్డ్ హెయిర్ ఆగకపోతే  అందరిముందూ కలియబడేట్టుంది.

 

    "ఇంతసేపు మావిచిగురు కోకిలనుంచి పెళ్లిలోని జీలకర్ర బెల్లం, ఆ తరువాత నెల  తప్పి వాంతులు చేసుకోవడం  అన్నీ మాట్లాడుకున్నాం డెలివరీ అయాక తల్లిపాలు పెరగాలంటే ఏం చేయాలో చెప్పు?"

 

    "వీళ్ల కోడలికి ఈ మధ్యనే  డెలివరీ అయిందిలే. అదీ విశేషం అయితే అస్సలు పాలుండడం లేదు" కమలాదాసు చెప్పగానే పైకి లేచిన రుత్వి అదే తాను చెప్పబోయే ఆఖరు జవాబు అన్నాడు.

 

    "బొప్పాయి పండు దోరగా వున్పప్పుడే కోసి తురిమి కూరగా వండుకుని తింటే స్తనవృద్ది కలుగుతుంది. అలాగే బార్లీ, లేదా సగ్గుబియ్యం జాల తాగినా తల్లికి బాగా వుపయోగపడి పాలు పెరుగుతాయి. ఇంకా ఓపిక వుండి చేసుకోగలిగితే జీలకర్రని నేతిలో వేయించి మెత్తగా దంచి వుప్పు కలుపుకుని మజ్జిగలోగాని పాలలోగాని అరచెంచా  వేసుకు తాగితే పచ్చి బాలింతకు చాలా మంచిది."

 Previous Page Next Page