Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 41


    "Its A Vertical Expression for Horizantal Desire అన్నాడట ఏదో సందర్భంలో.

 

    మార్దరెట్ వాక్యం ఇంకా పూర్తికానేలేదు, గౌరీనాధం ఆర్దోక్తిగా అన్నాడు "అలా ఐ ఎస్ జోహార్ అన్నదజి బాత్ రూం డేన్స్ గురించి."

 

    "అంటే" సాలోచనగా అతడు చెప్పిన జవాబు గురించి మరోసారి మననం చేసుకుని అప్పటికి అర్దమైనట్టు పగలబడి నవ్వేసింది. "ఓ గాడ్!" విజూషని ఓడించి సశ్య గెలిచింది ఇక్కడే.


                                                *    *    *    *

    
    "సో ..." సశ్య విజయగర్వంతో అంది రుత్విని చూస్తూ "నేనే గెలిచాను"

 

    జవాబు చెప్పకుండా సాలోచనగా చూసాడు రుత్వి.

 

    రాత్రి ఎనిమిదిగంటల సమయంలో "హాలిడే ఇన్" రెస్టారెంట్ ఖరీదైన వ్యక్తులతో రద్దీగా వుంది.

 

    వేలాడుతున్న వెన్నెలలాంటి షాండ్లి యర్స్ కాంతి వాల్ టూ వాల్ కార్పెట్ పై పరావర్తనం చెందుతున్న సబ్ డ్యూడ్ లైటింగ్. హస్కీగా వినిపిస్తున్న ఎల్డిన్ జాన్ మెలోడియస్ పాప్ సాంగ్ "సేక్రిపైస్" అదోలాంటి అనుభూతికి గురి చేస్తుంటే విజూషపై సానుభూతిలా అన్నాడు "పాపం నీ ప్రత్యర్ది చాలా ఫీలై వుంటుంది."

 

      ఆ క్షణంలో విజూష గురించి రుత్వి మాట్లాడడం నచ్చలేదు. అందుకే ఉక్రోషంగా అంది సశ్య. "ఓడిందిగా?"

 

    "ఈ ఒక్క పరీక్షతో పోరాటం పూర్తికాలేదు సశ్యా" కొన్ని వారాలపాటు పరీక్షిస్తానన్న అతని మాటల్ని గుర్తు చేసాడు రుత్వి "ఇంకా చాలా వుంది."

 

    విజూషని అతడు సమర్దిస్తున్నట్లుగా అనిపించడంతో

 

    "నన్ను డిన్నర్ కి తీసుకొచ్చావు రుత్వీ" గుర్తుచేసింది.

 

    "ఆర్డర్ చేసాను కూడా"

 

    "ఆ తర్వాత నువ్వు మా ఇంటికి వస్తావ్" అంది సశ్య.

 

    అర్దం కానట్టు చూసాడు "దేనికీ?"

 

    "అర్దరాత్రి దాకా నాతో వుండడానికి."

 

    "గెలిచావుగా, నీ యిష్టం."

 

    ఆమె ఎద లోయలలోని ఏ వీణా తంత్రుల్నో మీటిన రుత్వి కల్లోలిత హృదయంపై సితార సంగీతాన్ని వినిపించాలని ప్రయత్నించడమే కాదు. నమ్మకాల పూలతో ఒడిలో మాలల్ని అల్లుకునే స్థితికి ఆమెనునెట్టి ఏ లక్ష్యాన్నో చేరడానికి ఇంకా బలమైన రహదారిని నిర్మిస్తున్నాడు.

 

    అదిగో - సరిగ్గా అప్పుడే పలకరించారెవరో.

 

    "హాయ్"

 

    టేబుల్ కి అభిముఖంగా నిలబడి వుంది ఓ మధ్య వయస్కురాలు.

 

    వయసు నలభై వుండొచ్చు కాని.... పాతిక దాటినట్టు కనిపించడం మహాపాపం అన్నట్టు బారెడ్ షిఫాన్ శారీని మూరెడు స్థాయికి తగ్గించినట్టు చిత్రంగా ఒంటికి చుట్టుకుంది. పొడుచుకొచ్చిన పొంకం మొదలుకొని మరో అంకానికి సంకేతంలా అనిపిస్తుంటే కూడలిలో పలకరించిన కడలిలా రుత్విని ఉద్విగ్నంగా చూస్తూ నువ్విక్కడున్నావని ఇప్పుడే తెలిసింది"అంది.

 

    "నా స్నేహితురాలు" సశ్యని పరిచయం చేస్తూ అన్నాడు.

 

    వెంటనే ఆ మధ్యవయస్కురాలి గురించి సశ్యతో అన్నాడు "కమలాదాస్.... పెద్ద ఇండస్ట్రియలిస్ట్ భార్య. స్టేట్ లో లీడింగ్ సోషల్ వర్కర్ ఆమధ్య మహిళల సారా ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ రాష్ట్రంలో మధ్య నిషేదానికి మూల కారకులైన వ్యక్తి."

 

    "కానీ మందు కొట్టినట్టుంది" కమలాదాస్ కి వినిపించకుండా గొణుగుతున్నట్టుగా అంది సశ్య. అనేదికాదు కాని ఇప్పుడు పానకంలో పుడకలా ఆమె మధ్యలోకి రావడం సశ్యకి నచ్చలేదు "లిక్కర్ వాసన కొడుతోంది."

 

    కమలాదాస్ అవాక్కయినట్టు చూసింది క్షణంపాటు.

 

    "సహజమేగా సశ్యా" ఒళ్ళు మండితే చాలు ఉలిలా ఉపన్యాసంతో మనుష్యుల్ని దొలిచే కమలాదాస్ ని సపోర్టు చేస్తున్నట్టుగా అన్నాడు రుత్వి.

 

    "కొన్ని నెలల పోరాటంతో మద్యనిషేదాన్ని సాధించిన మహిళ ఆమె. ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పితే మనసు పాడై మందు కొట్టి వుంటుంది" అంటూ కమలాదాస్ చేయి పట్టుకులాగడంతో పైకి  లేచాడు.

 

    వచ్చింది ఒకందుకయితే మరెవరో స్త్రీ రుత్విమీద అలాంటి అధికారం చూపించడాన్ని అంగీకరించలేని సశ్య -

 

    "ఎక్కడికి?" అంది కమలాదాస్ ని చూస్తూ.

 

    "కొరుక్కు తినడానికి."

 

    ఆమె జవాబు ఎంత కోపాన్ని తెప్పించింది అంటే సశ్య ఘాటుగా కౌంటర్ యిచ్చేది.

 

    "చూడు సశ్యా" కమలాదాస్ రుత్విని లాక్కుపోవడానికి ఉద్యుక్తురాలవుతూ అంది "రుత్వి నీకు ఎంత కాలంగా పరిచయమో నాకు తెలీగు గానీ మాకు మాత్రం వాళ్ళ తాతగారి హయాంనుంచి స్నేహముంది."

 

    "నీ వయసులోవున్న ఆడదానికి రుత్వితో స్నేహమేంటి?"అనేసేదే సశ్య.

 

    కాని......

 

    అప్పటికే దూరంగా లాక్కుపోయింది. సశ్య చూస్తూనే వుంది.

 

    రుత్వి కమలాదాస్ తోబాటు ఓ మూలకి వెళ్లాడు. అక్కడ టేబుల్  చుట్టూ ఓ ఆరేడుగురు స్త్రీలు వున్నారు. అంతా ఇంచుమించు ఒకే వయసువాళ్లు.

 

    "వీళ్ళంతా నా ఫ్రెండ్స్ రుత్వీ. నాలా సంఘసేవంటే చాలా ఇష్టపడే వ్యక్తువు" అందరికీ రుత్వి అభివాదం చేశాడు ఇబ్బందిగానే.

 

    "ఆ మధ్య నీ క్విజ్ ప్రోగ్రాం చూసి ఎవరీ స్మార్ట్ గై అనుకుంటుంటే నా ఫ్రెండువని చెప్పాను. క్విజ్ కాంపిటీషన్స్ లో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సైన్స్ లో మాత్రమేకాదు ఆయుర్వేదంలో మీ తాతగారు మహర్షి రేంజ్ లో మనిషివనగానే నీ పరిచయం చేయమన్నారు. ఇంటికి తీసుకొచ్చేదాన్నే కానీ ఇంతలో ఇక్కడ కనిపించావ్. "

 

    పేరు పేరునా అందర్నీ పరిచయం చేయగానే ఓపిగ్గా ఓ నిముషం పాటు నిలబడ్డ రుత్వి అంతా పూర్తి కాగానే కదలబోయాడు.

 

    "అరె.......... " స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మేని బంగారాన్ని ప్రదర్శింస్తున్న ఓ ఫ్రౌఢ" అప్పుడే వెళ్ళిపోతున్నావేం? అమ్మాయిల కంపెనీ అలవాటు లేదా?" అంది గారాలుపోతూ.

 

    నవ్వాడు రుత్వి.

 Previous Page Next Page