Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 41

   
    పాలిపోయింది భాగవతార్ ముఖం. నీరసించిన గొంతుతో "ఎవరతను?" అన్నాడు.
    "అతడెవరో తెలుసుకున్నాను మీ అపార్టుమెంట్స్ ప్రక్కనే వున్న బందావన్ అపార్టుమెంట్స్ లో సి-4లో వుంటూన్న దయానంద చక్రవర్తి."
    ఆ మాటలు వినగానే ఏదో షాక్ తగిలినట్లు మూతలు పడిపోయాయి భాగవతార్ కళ్ళు. సోమనాధ్ ఖంగారుపడిపోతూ, భాగవతార్ గారూ! భాగవతార్ గారూ!" అని కుదిపాడు. కాని భాగవతార్ కళ్ళు తెరవలేదు. సోమనాధ్ వెళ్ళి నర్స్ కి చెప్తే నర్స్ వెళ్ళి డాక్టర్ ని పిలుచుకొచ్చింది.
    "ముందుగానే ఆ కేసెట్ లో వున్న స్త్రీ మృదుల కాదని చెప్పవలసింది. మళ్ళీ పొరపాటు జరిగిపోయింది" అని నాలుక్కరుచుకొని భాగవతార్ కోలుకున్నాక మళ్ళీ వద్దామని వెళ్ళిపోయాడు సోమనాధ్.
                             *    *    *
    మృదుల తనకి తెలిసినంత వరకు జరిగిన సంగతులన్నీ లాయర్ యశోధరాదేవికి, లాయర్ వైజయంతికి వివరంగా చెప్పింది. ఇద్దరూ మృదుల సాహసాన్ని సమయస్పూర్తిని మెచ్చుకున్నారు.
    "దేవకి నాకు బాగా తెలుసు. సహజంగా మంచి పిల్లే. కాని మన కుటుంబాల్లో చాలా మంది ఆడపిల్లలకు జరిగిన బ్రయిన్ వాష్ లాంటిదే తనకీ జరిగింది. ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి బాగా డబ్బున్న భర్త లభించడమే జీవిత సాఫల్యమన్నట్లు ఇంట్లో వాళ్ళంతా భావిస్తారు. ఆ రకమైన ఆలోచనలే పెంపొందిస్తారు. మగపిల్లవాణ్ని పెంచినట్లు స్వతంత్ర వ్యక్తిత్వం రూపొందేలా సొంత సంపాదన కోసం కృషి చేసేలా- ఈ నాటికి ఆడపిల్లల్ని పెంచడం లేదు. దేవకి ఎంతగా మనతో కలసిమెలసి పనిచేసినా డబ్బున్న మొగుడ్ని సంపాదించుకోవాలనే ఆశ మనసులో నాటుకుపోయి వుంటుంది. అయినా ఈ రోజుల్లో డబ్బు మీద ఆశ లేనిదెవరికి? అన్ని విలువలూ డబ్బుతో ముడివేసుకుపోయాయి. సమాజమంతా డబ్బు వెంట అణకువతో అగ్గగ్గలాడుతూ పరుగులు తీస్తోంది.
    వైజయంతి! దేవకిని ఎలాగయినా కాపాడగలమా?
    "ప్రయత్నించాలి. హిందూ సమాజంలో అందరి ఆడపిల్లలాగానే దేవకి కూడా ఫ్లెమింగ్ ని ఏమాత్రం అర్ధంచేసుకోకుండా పెళ్ళి చేసేసుకుంది. అటు ఫ్లెమింగ్. ఇటు రాజభూషణం బెదిరించి నిర్భందించబట్టి ఏ విధంగానూ ప్రతిఘటించలేక ఈ విషవలయంలో చిక్కుకుందని వాదిస్తే ఏవైనా ప్రయోజనముంటుందేమో చూడాలి."
    లాయర్ యశోధరాదేవి మృదులనుద్దేశించి "మృదులా! రాజభూషణం సామాన్యుడు కాడు. అతడి వివరాలన్నీ తెలుసుకున్నాను. అతడితో శతృత్వం తెంచుకోవలసి వచ్చింది మనకి. నేనేం భయపడను. నువ్వు జాగర్తగా వుండు. చేతినిండా డబ్బు, ప్రభుత్వంలో పలుకుబడి వున్న వాళ్ళేమైనా చేయగలరు" అంది.
    మృదుల లేచి నిలబడి నమస్కారం చేసి, "థాంక్యూ మేడమ్! నా జాగర్తలో నేనుంటాను" అంది.
    "అంత మాత్రం సరిపోదు. నీ ఆత్మీయులెవరితోనైనా నీకదేనా జరిగిన మరుక్షణం నాకు తెలియబర్చమని చెప్పు ప్లీజ్!" మృదుల దుందుడుకు తనం తెలిసిన యశోధరాదేవి ప్రాధేయపడుతూన్నట్టుగా అంది.
    నవ్వుతూ తలూపింది మృదుల. "ఇంతటి తల్లి ప్రేమ కార్యవర్గ సభ్యులందరిపైనా గుమ్మరించే ప్రేమభాండం లాంటి మనసు ఈమెకు ఏ దేవుడిచ్చాడో" అనుకుంది.
    మృదుల హాస్పిటల్ కొచ్చేసరికి రూమ్ లో బెడ్ మీద భాగవతార్ లేడు. మొదట టాయ్ లెట్ కి వెళ్ళాడేమో ననుకుంది. గంట గడిచినా రాకపోయేసరికి అనుమానం వేసింది. లేచి నిలబడింది నర్స్ తో మాట్లాడడానికి. అప్పుడు కనిపించింది స్టిల్ షెల్ఫ్ మీద హార్లిక్స్ సీసాకింద వున్న వుత్తరం. విప్పింది.
    "ప్రియాతి ప్రియమైన- నా సర్వస్వమైన- నా జీవితా....దారమైన మృదులకి...."
    అంతవరకూ చదివి హడలిపోయింది మృదుల. భాగవతార్ ఇంత రొమేంటిక్ గా ఎప్పుడూ ఉత్తరం రాయలేదు.
    మళ్ళీ చదవడం మొదలుపెట్టింది.
    "నువ్వు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావో దేవకి చెప్పింది. ప్రేమించే మనసు కలవాణ్ననీ నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావు. ఈ విషయం తెలిసినప్పుడు ఎంత గర్వపడ్డానో- అంత సిగ్గుపడ్డాను కూడా. పాపం నీకు ఏనాడు నా మనస్సులో వున్న ప్రేమను జూపించలేకపోయాను. నిజంగా నిజం. నిన్ను చాలా చాలా ప్రేమించాను. కాని లోకంలో అందరి మగవాళ్ళలాగే నా సంకుచిత భావాలకనుగుణంగా నిన్ను మార్చుకోవాలని చూసాను. నువ్వు చలాన్ని ఎప్పుడూ కోట్ చేస్తూంటావు. ఒకసారి అన్నావు. "మగవాడు ఆడదానిలో ఆధునికతని కోరుకుంటాడట. ఎటొచ్చి ఆ ఆధునికత తన భార్యలో కాక పరాయి స్త్రీలో చూడాలనుకుండట" ఇవి చలం మాటలని నువ్వే చెప్పావు నాకు. ఎంత నిజం ఈ మాటల్లో. మూర్ఖంగా ప్రవర్తించి అనురాగమయమైన మీ మనస్సుని దారుణంగా నొప్పించాను. అది భరించలేకనే పాపం నువ్వు దయానంద చక్రవర్తిని ప్రేమించుంటావు.
    నీకో రహస్యం చెప్పనా! ఒకప్పుడు నువ్వెవరినో ప్రేమించావని అనుమానపడి నిన్ను హత్యచేసి ఆ నేరం నీ ప్రియుడిమీద నెట్టాలని ప్లాను వేసాను. ఎంత వెర్రివాణ్నో చూడు. నువ్వు నా దగ్గిర్నుంచి వెళ్ళిపోయాక అర్ధమైంది. నీకు చీమ కాలంత కష్టం కలిగించడం కంటె నేను వెయ్యి చావులైనా చావగలను.
    నేనిదివరకటి భాగవతార్ ని కాను. మనసారా నీ సుఖం కోరుకుంటున్నాను. అందుకే మనసు రాయి చేసుకుని, నువ్వు ప్రేమించిన దయానంద చక్రవర్తికి నేనే నిన్ను స్వయంగా అప్పగిస్తాను. అతడినెలాగైనా ఒప్పించి పెళ్ళి యేర్పాట్లు చేయడానికి వెళుతున్నాను. ఒక స్నేహితుడిగా నన్ను గుర్తుంచుకో, ఎప్పుడేనా నేను కనిపిస్తే చిరునవ్వుతో పల్కరిస్తావు కదూ!
                                                                                                                                నీ   
                                                                                                                          భాగవతార్"
    ఉత్తరం చదివి నవ్వాపుకోలేక పోయింది మృదుల. భలే వ్యక్తి. ఇప్పటికైనా తనొక స్వతంత్ర వ్యక్తినని, ఒకవేళ నిజంగా తను ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకుంటే ఎవరి సహకారమూ అక్కర లేకుండానే వెళ్ళిపోగలదని అర్ధం చేసుకోలేక పోతున్నాడు. ఇప్పటికీ భర్త హోదాలో తను అతడికి చెందిన వస్తువైనట్లు మరొకరి కర్పించి త్యాగం చేస్తానంటున్నాడు. సమాజంలో ముఖ్యంగా మగవాళ్ళల్లో ఈ దృక్పథం మారడానికెన్నేళ్ళు పడుతుందో.
    భాగవతార్ ని తల్చుకుంటే జాలేసింది. తరతరాలుగా వస్తోన్న భావదాస్యం నుంచి బయటపడలేక పోతున్నాడే కాని సహజంగా మంచివాడు. మంచంమీంచి లేవలేని దశలో వుండి తననేదో ఉద్దరిద్దామని వొంటినిండా కట్లతో హీరోగా బయల్దేరాడు. ఈ హీరోగారు ఏ అఘాయిత్యము చేయకముందే వెళ్ళి అడ్డుపడాలి. నర్స్ కి చెప్పి వెళదామని రూమ్ లోంచి బయటికొచ్చింది. ఆమె కోసమే ఎదురు చూస్తూన్నట్లు ఎవరో వ్యతి నిలబడి వున్నాడు విజిటర్స్ హాల్లో, మృదులని చూసి_
    "శ్రీమతి మృదులగారు మీరేనా?" అడిగాడు.
    "అవును."
తన విజిటింగ్ కార్డు చూపించాడు అతడు. సీక్రెట్ ఇంటలిజెన్స్ పోలీస్ ఇన్ స్పెక్టరతను.
    "యువార్ అండర్ అరెస్ట్" అని అరెస్ట్ వారంట్ చూపించాడు.
    "దేనికీ యీ అరెస్ట్?" ఆశ్చర్యంగా అడిగింది.
    సారీ మేడమ్! ఇప్పుడేం చెప్పడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్ లో అన్నీ తెలుస్తాయి" జాలిగా అన్నాడు.
    "ఒక్క క్షణం సిస్టర్ కి చెప్పి వస్తాను" ప్రాధేయపూర్వకంగా అడిగింది. ఒప్పుకున్నాడు ఇన్ స్పెక్టర్. మృదులని చూస్తోంటే అతనికి గౌరవం కలుగుతోంది. అరెస్ట్ చెయ్యవలసి వచ్చినందుకు బాధగా ఉంది. ఆమె భవిష్యత్తూహించుకుంటే భయం వేసింది.
    మృదుల డ్యూటీ సిస్టర్ ని కలుసుకుని లాయర్ వైజయంతి నంబరు కాగితం మీద వ్రాసి ఆమె చేతిలోపెట్టి, "ప్లీజ్! ఈ నంబర్ కి ఫోన్ చేసి లాయర్ యశోధరాదేవితో నన్ను సీక్రెట్ ఇంటలిజెన్స్ పోలీసు ఇన్ స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్లు చెప్పండి. ప్లీజ్!" అంది.
    పోలీస్ పేరు వినగానే సిస్టర్ కళ్ళు పెద్దవయ్యాయి. భయంగా చూసింది. రక్షక భటుల పేరు చెపితేనే సమాజంలో అందరికీ భయం- చిరాకు. మృదులకి ఆలోచించడానికి, సిస్టర్ ని కన్విన్స్ చెయ్యడానికి టైమ్ లేదు. పది రూపాయల నోటు సిస్టర్ చేతిలో పెట్టి "లాయర్ యశోధరాదేవికి ఫోన్ చేసి ఈ విషయం చెపితే నీకు మంచి బహుమానం వస్తుంది" అని ఆశ పెట్టింది.
    అలాగే అన్నట్లు తలూపింది సిస్టర్ భయం, ఆశ పోటీలు పడుతూన్న కళ్ళతో.
    మృదుల బయటికొచ్చేసి ఇన్ స్పెక్టర్ వెంట వెళ్ళి జీప్ లో కూర్చుంది.
    వొంటినిండా కట్లతో దయానంద చక్రవర్తి అపార్ట్ మెంట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు భాగవతార్.    తలుపు సగం తెరిచి "ఎవరు మీరు?" అన్నాడు చక్రవర్తి.
    అతని మాటకి సమాధానం ఇయ్యకుండా తలుపు తోసుకుని లోపలికొచ్చేశాడు భాగవతార్. వొంటినిండా కట్లతో ఎవరో గ్రహాంతర వాసిలా వున్నాడతను. లోపల ఎవరో మరో నవనాగరిక యువతీ కూర్చొని వుంది. ఆమెని చూడగానే ఒళ్ళు మండిపోయింది.
    "ఈ రోగ్ తన మృదులని మోసం చేసి వల్లో వేసుకుని ఇప్పుడు మరో అమ్మాయితో కులుకుతున్నాడా?"
    "మీరెవరు? ఎందుకొచ్చారు?" అడిగాడు చక్రవర్తి.

 Previous Page Next Page