Previous Page Next Page 
వారధి పేజి 40


    మీనాక్షి ఆమాట  వినిపించుకోలేదు. కంచుగ్లాసుతో  పాలు తెచ్చి  భర్తచేతికి  అందిస్తూ  "వరదుడు  ఉత్తరం వ్రాసేడంటే  ఏం రాసేడని అడగరేం?" అంది.

    "ఆ వ్యామోహంలోంచి  బయటపడేవరకూ  వాడేంరాసినా, వాడేం చేసినా  నేను పట్టించుకోదలచుకోలేదు."

    "వ్యామోహమేమిటి?" అర్ధంకాక  ప్రశ్నించింది మీనాక్షి.

    "వ్యామోహం కాకపోతే  ఏమిటంటావు? అంత  గొప్పవాళ్ళు  వీడిని నాలుగు నెలల పరిచయంతో ఇంట్లో  వుండమని  ఆహ్వానించేరంటే  అందులో  ఎంత కుంభకోణం  వుందో  ఆలోచించేవా? వందల  మంది పిల్లలు  హాస్టళ్ళలో  వుండి చదువుకొంటున్నారు. వారందరికీ  చదువు తిన్నగా  సాగలేదంటే  వీరింటిలో  విడిది ఇస్తారా?"

    "తల్లీ తండ్రీ లేని పిల్లడు; మెల్లిగా  చేరదీసి పిల్లనిచ్చి పెళ్ళిచేస్తే ఇంట్లో  చెప్పుకొంద తేలులా  పడివుంటాడు; తమ పిల్ల గుమ్మం  కదలనక్కరలేదన్న  ఆలోచన  కాకపోతే?...."

    "అదే వారి ఆలోచన  అయితే  మీరింతగా  నాలికెందుకు  పీక్కుంటున్నారో  నాకర్ధంకాలేదు. వరదుడు  అంత ఆస్తిపరుల  అల్లుడు అవుతున్నాడంటే  మనం సంతోషించాలి  కాని...."

    "ఆఁ, సంతోషించు!....సంతోషించు. ఇల్లూ, ఒళ్ళూ గుల్ల చేసుకొని  పెంచి, పెద్దచేసి, చదువూ, సంధ్యా చెప్పించిన  మరిదిని  ఏ ఆశా లేకుండా  మీనాక్షి  ఇల్లరికం  పంపించింది  అంటూ నలుగురూ  నీకు మెచ్చి  మేకతోలు  కప్పుతారు."

    "అదికాదండీ. వరదుడికి  మనం ఇదంతా  ప్రతిఫలం  ఆశించే చేస్తున్నామంటారా? అది ముట్టదని  తెలిసిన నాడు వాడు మనకి  ఏమీ కాకుండా  పోతాడా?"

    "ఆవేశం  కాస్త  తగ్గించుకొని  కాస్త  నిదానంగా  ఆలోచించు మీనాక్షీ! రాజుని  నువ్వు కొడుకులా  అర్ధం, ప్రాణం అర్పించి పెంచుకొస్తూ వున్నావు, కొడుకునించి  తలిదండ్రులు  ప్రతిఫలాన్ని  ఆశించడం సర్వత్రా జరుగుతున్నదే  కదా! అటువంటప్పుడు  రాజు మనకి వార్ధక్యదశలో  కాలికి  చెయ్యికి  అవాలని, వాడి చదువు సంధ్యల కోసం  తెచ్చిన  అప్పులకు  ఆదుకొని  ఇంటి  బాధ్యత  వహించాలని  కోరుకోడంలో తప్పేముంది ?"

    "పండిన  పంటని, వండిన  వంటని  ఎవరికో  ఆరగించమని  అప్పగించి  చేతులు దులుపుకోవడంలో గొప్పతనం వుందని  నేననుకోను. తన వస్తువులను  తను దక్కించుకోలేని  చేతకానితనమే  నాకు  కన్పిస్తుంది ఆ పనిలో" అన్నాడు శివయ్య.

    భర్తవాదనలో  తప్పులేదనిపించింది మీనాక్షికి. తనకి కొడుకైనా, మరిదైనా వరదుడే అన్న మమకారంతో  పెంచింది. ఉన్నకొద్ది ఆస్తినీ  అతడి చదువుకై  వెచ్చిస్తున్నది. వరదుడు పెద్దవాడై తమ నుంచి  వేరు పడతాడనే ఆలోచన  ఆమెకీ  రాలేదు. ఈ ఇంట  పుట్టిన  పిల్లడు  ఈ ఇంటి  బరువు బాధ్యతలు, పరువు మర్యాదలు  నిల్పుకొంటాడనుకొంది.

    ఒకవేళ  వరదుడు  తమని  కాదని  వెళ్ళిపోయినా  తను తల్లికాదు కాబట్టి  అతన్ని  పట్టి నిల్చివుంచే  అధికారం తనకి లేదు. అధికారం ఉన్నా తను ఆపివుంచదు. అన్నపూర్ణ  బిడ్డడు ఎక్కడో  ఒక దగ్గిర  కులాసాగా  ఉన్నాడన్నా తృప్తితో  తన మనసులోని  ఆవేదనని  కడిగేసుకోగలదు. ఆర్ధికంగా  తను ఎదుర్కోవలసివచ్చిన  ఒడిదుడుకుల్ని  ధైర్యంగా  ఎదుర్కొంటుంది.

    కాని భర్త సంగతి  అట్లాకాదు. అతడు  వరదుడి కోసం ఏమి చేసినా  తన విధి అన్న నిర్ణయంతోటే  చేస్తున్నాడు. అదేవిధంగా  తమ్ముడు  తన విధ్యుక్త ధర్మాన్ని  నెరవేర్చాలని  ఆశిస్తున్నాడు. కాలం ఈ అన్నదమ్ముల  మధ్య  కలతల్నే  లేపుతోందో, అభిమానాల్నే  పొరల జేస్తుందో  తెలియదు అనుకొంది.

    అంతలో  పొరుగింటి  పాలేరు  "మీనాక్షమ్మగారు, మీనాక్షమ్మ గారూ?" అంటూ వీధిలోంచి  కేకలు  పెట్టేడు.  
  
    "ఏమి రంగయ్యా!" అంటూ బయటికి  వచ్చింది మీనాక్షి.

    "పట్నంపోయేను, మీ మరిది బజార్లో  కనిపించి...."

    "కనిపించి  ఏమీ చెప్పేడు? కులాసాగా ఉన్నాడా!"

    "ఈ బొమ్మని  పూర్ణమ్మకి  ఇయ్యమన్నాడు."

    మీనాక్షి  చేతిలో  రబ్బరుబొమ్మని  పెట్టివెళ్లి  పోయేడు రంగయ్య. మీనాక్షి కళ్ళలో   నీళ్ళు తిరిగేయి.

    "నీ గురించి ఇప్పుడే ఎన్నో అనుమానాల్ని  మనసులో  నింపుకొన్నాను వరదం! నువ్వు అలా ఎన్నటికీ  మారిపోలేవు. ఈ వదిన్ని  మరిచిపోలేవు. పూర్ణపట్ల  నీకుండే  అభిమానం  ఏవిధంగానూ  కుంటుపడదు. అన్నయ్య ఎడల  నీకు  గల గౌరవం....నాకు తెలుసు  వరదం. నువ్వు ఎన్నటికీ మారిపోలేవు. నాకు  దూరంగా  పారిపోలేవు' అనుకొంది  మీనాక్షి  నమ్మికతో.


                           *    *    *


    రాఘవయ్య  ఉదయం   కాఫీ  తాగుతుంటే  కందిన  ముఖంతో ముక్కుపుటాలు  ఎగరవేస్తూ  రాజమ్మ వచ్చి  "ఏమండీ, ఈ మాట  విన్నారా?" అంది కోపంగా.

    "ఏ మాట? నువ్వు చెప్పందీ ఏ మాటైనా  ఈ ఇంట్లో  వినడం ఎలా జరుగుతుంది? అందరినోళ్ళ  తాళంచెవులూ  నీదగ్గిర  ఉండగా?" అన్నాడు  రాఘవయ్య  నవ్వుతూ.

    "నవ్వుతాలకి  కాదు" అంది రాజమ్మ  ముఖం  ముడుచుకొంటూ.

    "అవును. ఆ మాట  ముందుగానే  తెలుస్తున్నది."

    "మహ తెలివిగా  మాట్లాడుతున్నాననుకొంటున్నారు!"

    "నీ కన్నానా ?"

    ఈ విధంగా  తను చెప్పదలుచుకొన్న  విషయం  చెప్పడం కష్టం  అని తెలుసుకొన్న  రాజమ్మ  సూటిగా  సంభాషణ మొదలు పెట్టింది.
 

 Previous Page Next Page