Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 41

    ఆరోజు ఆదివారం, అమావాస్య... .అర్దరాత్రి

    మానవేతర శక్తులు స్వేచ్చగా సంచరించే సమయమది.

    చీకటి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది.

     గేటుకి గొలుసుతో కట్టివేయబడిన  డాబర్ మెన్ గొంతు చించుకున్నట్లుగా అరవడం మొదలుపెట్టింది.

     వీధికుక్కలు కొన్ని దానితో శృతి కలిపాయి.

     ఆ చీకటిని చీలుస్తూ ఒక విద్యుల్లత దూరంగా.
 
     శెట్టి ఆశ్చర్యంగా చూస్తుండగానే అది ఒక చలి సెగడులా మారిపోయింది.

     మంట!

     భగభగ మండుతున్న మంట.

    భూమికి కొన్ని అడుగుల ఎత్తులో మండుతున్న మంట.

     ఛ! అలా మంట మండటానికి ఇదేమన్నా శ్మశానమా!

     ఇదంతా తన చిత్రభమ.

    ఏదో వెహికల్ వస్తున్నట్లుంది. దానిలైట్ల ఫోకస్ అలా కనిపించి వుంటుంది.

     తిరుమలశెట్టి సందిగ్దం తీరుస్తున్నట్లుగా ఆ మంట వేగంగా ఇటువైపు రాసాగింది.
 
      ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

     నేలకి మూడడుగుల ఎత్తులో మండుతున్న మంట.

     మంట మనిషి నడిచినట్లుగా కదులుతోంది.

     శెట్టి కళ్లల్లో ఆశ్చర్యం స్థానంలో భయభీతాహాలు చోటుచేసుకున్నాయి.

     అంతకంతకు అతడి కళ్లు పెద్దవయ్యాయి.

     అవి ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా అయ్యాయి.

     పారిపోదామన్న ఆలోచన వచ్చిందిగానీ ఒక అడుగు కూడా వేయలేకపోయాడు.

     గొంతుచించుకుని అరుద్దామనుకున్నాడుగానీ చిన్న శబ్దంకూడా బయటకు రాలేదు.

     అతడి శరీరం అతడి ఆజ్ఞలకు అతీతమైంది.

     ఒకదానికొకటి  అజ్ఞాత సందేశమేదో అందినట్లుగా కుక్కలన్నీ హోరెత్తినట్లుగా అరుస్తున్నాయి.

     ఆ వీధికేదో అరిష్ట సంకేతం ఇస్తున్నట్లుగా వున్నాయవి.

     ఆ మంట మూసి వున్న యోగానందం  ఇంటిలో ప్రవేశించింది.

    శెట్టి ఇంటికి ఎదురుగానే యోగానందం ఇల్లు.

     డాబర్ మెన్ ప్రళయ ఘోష పెడుతున్నట్లుగా మొరగసాగింది.

     వరండాలో పడుతున్న నౌకరు కుక్క ఎన్నడూ లేనంత గట్టిగా అరుస్తున్న అరుపుకు గొలుసు తెంపుకునైనా   బయటకి పరిగెత్తాలన్న దాని ఆరాటం చూసేసరికి  అతడికేదో అనుమానం వచ్చినట్లుగా అయింది.

     బయటకు వచ్చి చూసాడు.

     శెట్టి స్పృహ లేకుండా నేలమీద పడిపోయి కనిపించాడు.

     ముందే భారీ ఆకారం.

     పర్వతంలా  పడి వున్నాడు.


                           *    *    *    *

   
    మందాకిని తన కల గుర్తుచేసుకుని ఒక కథలా చెబుతుంటే -

     "ఆ చెంచుపిల్ల చెప్పిన కథలు వినీ వినీ మనసులో నాటినట్టయి అవే కల్లల్లా వస్తున్నట్టున్నాయి. ఇకనుండి ఆ పిల్ల కథలు చెప్పినా, మీరు విన్నా తంతాను" అంటూ కోప్పడింది కౌస్తుభ.

     తిరుమల శెట్టి తమ ఇంటి ముందరివాడే.

     అతడు ఇంటి బయటకు వచ్చి రోడ్డువారన యూరిన్ పోస్తుంటే అక్కాచెల్లెళ్లు ఎన్నోసార్లు  తిట్టుకున్నారు.

     అందుకే శెట్టి  అంటే కోపం అసహ్యంకూడా.

     శెట్టిమీద వుండే కోపంవల్ల  కూడా అతడు కల్లోకి వచ్చాడేమో అనిపించింది.

     "కానీ ఆ మంట? అది మనింట్లోకి వచ్చినట్లు అనిపించిందే.  అది తలుచుకంటే నాకు భయమేస్తోంది."

    "పిచ్చికలలు  ఏదేదో వస్తూనే వుంటాయి.  వాటికంత అర్దాలు వెతుకుతూ కూర్చుంటే  అయినట్టే. ఇక పడుకో. రేపటినుండి కథలూ గితలూ  అన్నీ బంద్ తెల్సిందా?"

    సిరి మాత్రం అమాయకంగా నిద్రపోతోంది.

     మందాకినికి వచ్చింది పిచ్చి కల అని కొట్టివేసిన కౌస్తుభకి ఒక నిజం తెలియదు.

     శెట్టి గురించి కొంచెం వాకబు చేస్తే స్పృహలేకుండా రోడ్డుమీద పడిన శెట్టి హాస్పిటల్ కి తరలింపబడ్డాడనీ, అక్కడే అతడు కన్నుమూశాడనీ, వ్యానులో శవాన్ని తీసుకుని అటునుండి అటే వాళ్ల వూరికి తీసుకెళ్లి పోయారని తెలిసేది.

     పట్నవాసంలో ఒకరి సంగతి ఒకరికి పట్టదు.


                          *    *    *    *

   
     సిఎం వెంకునాయుడు  రాజకీయాల్లోకి వచ్చాక బాగా సంపాదించాడు.

    పార్టీ ఫండ నీ అదనీ ఇదనీ సూట్ కేసులతో సహా వచ్చి చేరుతూ వుంటుంది డబ్బు.

     ఇప్పటికి ఎంతుందో కూడా లెక్కలేనంత సంపాదించాడు.

     దేనికైనా అంతం వుంటుందేమోగానీ మనిషి ఆశకు అంతం వుండదంటారు.

     రాష్ట్ర క్షేమం కోసం స్వామి ప్రాణాలకు తెగించి బైరవకొండ లోని నిధిని ప్రభుత్వానికి అందజేస్తే  అది లోలోపలే మాయంచేసి ఓ కట్టు కథ అల్లి కల్ల బొల్లి ఏడ్పు ఏడ్చేసిన వెంకునాయుడు బొంబాయిలో పేరు మోసిన వజ్రాల వ్యాపారి కిశోర్ లాల్ ని రహస్యంగా రప్పించాడు.

     ఆయన్ని భూగృహంలోకి తీసుకువెళ్లాడు.

     పోలీస్ స్టేషన్ లో  రెండు పెట్టెలనిండా వున్న ధనాన్ని తను కొత్తగా ఖరీదు చేసిన ఐరన్ సేఫ్ లోకి చేర్పించి రాత్రికి రాత్రే తన భూగృహంలోకి తరలించాడు.

     ఇప్పుడు వాటి ఖరీదు కట్టడం కోసం కిశోర్ లాల్ ని రప్పించాడు.

    ఆయనకీ ఓ కట్టుకథ చెప్పాడు.

    "మా వూళ్లో మా పూర్వీకులు కట్టిన పాత దేవిడీని కూలగొట్టించి న్యూమోడల్ గా కట్టడానికి పునాదులు తవ్వుతుంటే పుజామందిరం వున్న చోట భూమిలో మా పూర్వీకులు దాచిన ధనం  దొరికింది. నవరత్నాలు, నవరత్నాలు పొదిగిన నగలు, బంగారు కడ్డీలు వున్నాయి.

     మీరైతేనే సరయిన విలువ కట్టగలరని మా మిత్రులు చెపితే మిమ్మల్ని పిలిపించాను. మీరెంత విలువకడితే అందులో టెన్ పర్సెంట్ మీకివ్వగలను."

    "వాటిని ఎలా మార్కెట్ చేద్దామనుకుంటున్నారు?"

    "ముందు ఆ గుప్తధనం విలువెంతో తేలనీయండి. వాళ్లని కాంటాక్ట్ చేసే వుంచాను."

    తాళం చెవి ఐరన్ సేఫ్ రంధ్రంలో పెడుతుంటే నాయుడి చెయ్యి, చెయ్యితోపాటు గుండె కూడా  కొంచెం వణికినట్లు అయింది.

    తాళం చెవి  ఐరన్ సేఫ్ తాకీ తాకకముందే వెయ్యి  ఓల్టుల కరెంట్ షాక్ తగిలినట్లు అంతదూరం వెళ్లి పడ్డాడు.

     శరీరంలోని రక్తమంతా ఏదో రక్తపిశాచి పీల్చేసినట్లుగా నీరసం ఆవహించింది.

     "ఏమైంది సి. ఎం. సాబ్?" కిశోర్ లాల్ గాబరాగా అడిగాడు.

     "ఐరన్ సేఫ్ కి ఎవరో కరెంట్ షాక్ పెట్టారు."

    కిశోల్ లాల్ ఐరన్ సేఫ్ చుట్టూతిరిగి పరిశీలనగా చూసాడు. ఎక్కడా వైర్లలాంటివి కనిపించలేదు.

    ధైర్యం కూడదీసుకుని తాకీ తాకనట్లు తాకాడు. షాక్ కొట్టడంలేదు. మళ్లీ గట్టిగా పట్టుకుని చూశాడు.

     మామూలుగానే వుంది!

     "దీనికి కరెంట్ షాక్ ఎక్కడుంది సి. ఎం. సాబ్? మీ మనసులోనే ఏదో భయమున్నట్టుంది. చూడండి.... ఏమీలేదు...." ఈసారి సేఫ్ ని కౌగిలించుకుని మరీ చూశాడు కిశోర్ లాల్.

     నాయుడి మనసులో ఎక్కడో ప్రమాద సంకేతాలు ప్రారంభమయ్యాయి.

    ఈ గుప్త  సంపదకోసం ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు తాను విన్నాడు.

     ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే, ఎక్కడో అడవిలో కొండగుహలో వజ్రవైఢూర్యాలతో కూడిన అపారమైన నిధి నిక్షిప్తమై ఏం లాభమని పండితుడూ, మహా మంత్రవేత్త అయిన సుబ్రహ్మణ్య స్వామి ప్రజోపయోగం కోసం ఆ ధనాన్ని  తన చేతికి అందించాడు.

     ప్రపంచంలోని చక్రవర్తులు కాదగినంత అపారమైన ఆ ధనాన్ని చూసేసరికి తనలో దుర్బుద్ది పుట్టి, రాత్రికి తరలించిన తన బంగళాలో రహస్యంగా నిర్మించిన భూగర్బంలోకి తరలించాడు.

     దురాశ దుఃఖానికి చేటన్నారు.

     ఆ మాట తనవిషయంలో నిజమవుతుందా?

    నిధిని ఆవరించి వున్న దుష్టశక్తులను పరిహరించాకే నిధిని కైవసం చేసుకున్నానని చెప్పాడు స్వామి.

     ఆ మాటే నిజమయితే ఈ నిధిని ఎవరు ముట్టుకున్నా ప్రమాదరహితం కావాలి.

     కానీ ఇలా అయిందేమిటి?

    వెయ్యి ఓల్టుల కరెంటు తగిలినట్లు అంత దూరంలో వెళ్లి పడ్డాడు.

     లాల్ జీ చెప్పినట్లు తనలో అంతర్గతంగా  వున్న భయమే కారణమా...........?

    లాల్ జీ ఎందుకయినా మంచిదని ఒకసారి ఆంజనేయస్వామిని తలచుకున్నాడు.  ఒక్కక్షణం తటపటాయించి తాళంచెవి కన్నంలో వుంచుతుంటే వంద నాగులు ఒక్కసారి బుసకొట్టినట్లుగా శబ్దమైంది.

     అయినా భయపడలేదాయన. కన్నంలో  తాళం చెవి తిప్పి తలుపు తెరిచాడు.    

 Previous Page Next Page