Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 40


     ఇంటికి వచ్చాక నిదానంగా ఆమె వివరాలు అడిగితే ఒక్కోసారి ఒకో కథ చెబుతోంది సిరి.

     "విధి రాత సామీ! నా ఇంట్లో దొంగలు పడ్డారు. నాకింక ఆ తావున వుండాలనిపించలేదు. పిచ్చెత్తినట్టయింది. దిక్కుతోచక వూళ్లమీద పడ్డ" అని ఓసారి.

     "పట్నం చూద్దామని వచ్చిన సామి. మళ్లీ ఎట్ల పోవాలో తెలుస్తలేదు" అని ఓసారి  ఏదేదో చెబుతోంది.
 
     అందరితో కూర్చోబెట్టి ఆప్యాయంగా అన్నం పెడుతోంది అనసూయ.

     అటింత ఇటింత  కెలికి కడిగేసుకుంటుంది సిరి.

     "ఏమే! వరి అన్నం తినే అలవాటు లేదా? మరి మీరేం  వండుకు తింటారు?" అని అడిగింది అనసూయ.

     "ఏం తింటనో సెబితే బయపడ్తవ్ తల్లో!"

    అనసూయ 'తల్లో' అంటుంది సిరి.  ఇదేంభాషో అనిగొణుక్కుంటుంది అనసూయ.

     ఒకసారి చక్కగా మాట్లాడుతుంది. ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో సరిగా అర్దమై చావదు.

     కాలిమీద ఏదో చల్లగా పాకినట్లుగా అయి మెలకువ వచ్చింది కౌస్తుభకు.

     గదిలో జీరో బల్బు వెలుతురులో నేలమీద జరజరా పాకుతూ కనిపించిన ఆకారం కౌస్తుభ నోట్లో తడారిపోయేలా చేసింది.

    ఏడెనిమిది ఫీట్లకి తక్కువ కాకుండా, నల్లగా నిగనిగలాడుతున్న నల్లనాగు. గడ సర్పం.

     అవతలి గదిలో యోగానందం, రవి, మందాకిని పడుకుంటారు. యోగానందం పట్టి మంచంమీద పడుకుంటే, పిల్లలిద్దరూ క్రింద పడుకున్నారు.

     నిద్రలో ఆ పిల్లల్ని అది కాటేస్తే?

    "పాము.... పాము...."

    కౌస్తుభ అరుపుకి అందరూ లేచారు. ఆమె అరుపుకి  పాము బెదిరినట్లుగా అయి సరసరా రవి తల వైపుగా వెళ్లి బుస్సుమన్న శబ్దంతో పడగ విప్పార్చింది.

     సరిగ్గా  ఆ దృశ్యం రవి తలమీద  గొడుగు విప్పినట్లుగా వుంది.

     రవి తన తల దగ్గర మృత్యువే పడగ విప్పిందో, పాము పడగ విప్పిందో తెలియనంతగా గాఢనిద్రలో వున్నాడు.

     యోగానందం కూడా ఈ సవ్వడికి మంచంమీద లేచి కూర్చున్నాడు.

     చాటంత పడగతో రవి తల దగ్గర చుట్టలు చుట్టుకున్న పాముని చూసేసరికీ అతడికి ముచ్చెమటలు పోశాయి. ఎవరికి ఏం చేయాలో తోచడం లేదు. ఏం చేస్తే పాముకి తిక్క రేగి రవినో, ఆ ప్రక్కనే  పడుకున్న మందాకినినో కాటందుతుదేమోనన్న భయం.
 
     అందరూ బొమ్మ్లల్లా కరచరణాలు కదలనట్లుగా వూపిరి బిగపట్టుకుని చూస్తున్నారు.

     "నాగదేవతా! నాకు పుత్రభిక్ష పెట్టు...." మనసులోనే నిశ్సబ్దంగా ప్రార్దించింది అనసూయ.

     "నేను మొన్న చెప్పానా లేదా, రవిబాబు కోటికి పడగలెత్తుతాడని. నా మాటను తమాషా క్రింద కొట్టేస్తిరి.  చూడండి. నా మాటలకు సాక్ష్యం పలకడానికి స్వయంగా నాగన్నే వచ్చిండు" సంబరంగా అంది సిరి.

     "ఇదెక్కడో  తిక్కమేళం. శబ్దం చేయకే. మనం తనకేదైనా కీడు తలపెడుతున్నాం అనిపిస్తే అది  రవిని కాటేసే ప్రమాదం వుంది" శబ్దం బయటకి రాకుండా గుసగుసగా అంది కౌస్తుభ.

     "నీ జ్యోతిష్యం మండిపోను. వాడు కోటికి పడగలెత్తడం కాదే. వాడి నెత్తిన మృత్యువు పడగెత్తి ఆడుతోంది. అది  ఏ క్షణాన నా బాబును కాటేస్తుందో" భయంతో వణికిపోతోంది అనసూయ.

     "ప్చ్! పామంటే అంత భయపడతావెందుకమ్మా? అది మనల్నేం చేస్తది? అసలు నాగన్న కారణం లేకుండా ఎవరిళ్లకు రాడు. నాగన్న అడుగు పెట్టిన ఇంట్లో అశుభాలు తొలగుతాయి.  నాగులచవితినాడు పుట్టకు పాలు పోస్తనని, పచ్చి పిండి, కోడిగుడ్డు నైవేద్యం పెడతాననీ మొక్కుతల్లో. నాగన్న వచ్చిన దారి పడ్తడు."

    "నీ మొహం! ముందు నువ్వు నోరు మూసుకో" కౌస్తుభ కసిరింది ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు.

     అంతలో వూహించని సంఘటన జరిగిపోయింది.

     సిరి ఒక్క అంగలో రవిని సమీపించి, పాము పడగకింద పిడికిటితో వడిసి పట్టేసి, పైకి లేపింది. మెరుపులా తన శరీరాన్ని సిరి చేతిచుట్టూ చూట్టేసింది పాము. తన తలను  పడగలావిప్పి, సిరి ముఖాన్ని తన చీలికలయిన నాలికతో తడమసాగింది.

     ఆప్యాయంగా పెంచుకున్న కుక్కపిల్ల, చాలా రోజులకి కనిపించిన తన యజమానిని  స్పృశించి, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా వుందా దృశ్యం.

     "వీళ్లు నిన్ను చూసి భయపడుతున్నారు?వెళ్లిపో" సిరి తలుపు తెరుచుకుని పెరట్లోకి వెళ్లి ఓ మూలగా ఎలుకలు చేసిన కలుగు దగ్గర వదిలేసింది.

     మెత్తగా ఆమె చేతిలోంచి జారిపోయి కలుగులో అదృశ్యమైపోయింది పాము.

     "ముందా  కలుగుకి రాళ్లు కొట్టవే. ఆ పాము మళ్ళీ బయటకు రాకుండా"

    "నాగన్నను బంధించే ప్రయత్నం చేయకూడదు తల్లో. పగపడ్తది. "

    "ఇది మామూలు విషప్పురుగు కాదు తల్లో. దేవతా సర్పం. మీరు భయంతో మునిగిపోయి గుర్తుపట్టారో లేదో? ఇల్లంతా సుగంధంతో నిండి పోయింది. చూసిన్రా? లోపలికిపోయి చూడండి. ఇంట్లో ఆ పరిమళం ఇంకా మిగిలే వుంటుంది."

    అందరూ లోపలికి వచ్చి ముక్కులు పెద్దగా వాసన పీల్చారు.

     ఏదో సుగంధం?

    మొగలి వాసనో, మల్లెల వాసనో, శ్రీగంధం వాసనో, సరిగా తెలియడంలేదుగాని, ఈ భూమ్మీద పూల సుగంధాలన్నీ కలిపితే వచ్చేంత మధుర మయిన వాసన అది.

     దాని మాటల మెస్మరిజంలో పడి ఏదో  వాసన వచ్చినట్లుగా ఫీలయ్యారో, లేక నిజంగానే అలా అనిపించిందో... తేల్చుకోలేకపోతున్నారు.

     సిరి జ్యోస్యాన్నీ, సిరినీ ఆషామాషీగా తీసుకున్నవాళ్లు ఇప్పుడు ఆమెనంత తేలికగా తీసివేయలేకపోతున్నారు.
 
    భయంకరమయిన గడసర్పాన్ని ఏదో బొమ్మపాముని పట్టుకున్నంత తేలిగ్గా  ఎలా పట్టుకుందో....?" అది ఆమెను ఏం చేయకపోవడం మరీ ఆశ్చర్యం.

      అదే అడిగారు.

    "నాగన్న మా కులదైవం. అడవుల్లో మేం వాటితో సహజీవనం చేస్తాం. మాకు వాటిని చూస్తే భయం వుండదు"

    "రవి కోటికి పడగలెత్తుతాడని చెప్పావు కదా...? ఏ విధంగా ఎత్తుతాడు?" కుతూహలంతో అడిగింది కౌస్తుభ.

     "అదే దేవతా రహస్యం అక్క!"

    ఈ సంఘటన తరువాత సిరి పిల్లల దృష్టిలో హీరోయిన్ అయిపోయింది.

     సిరి చెప్పే చక్కని కబుర్లకీ, కథలకీ వాళ్ళు పూర్తిగా వశమయ్యారు. రాత్రిపూట  ఏదో ఒక కథ చెబితేగానీ వూపుకోవడంలేదు  పిల్లలు.
 
     "రాత్రిచాలా అయింది. ఇక పడుకోండి." అని పెద్దవాళ్ళు కసిరే దాకా ఆ కథలూ,  కబుర్లూ సాగుతూనే వుంటాయి. ఎక్కువగా ధనలక్ష్మి కథలు. అవి ఎంతో అధ్బుతంగా, ఆసక్తిగొలిపేలా వుండేవి. ధనలక్ష్మి  రాత్రిపూట తెల్లచీర కట్టుకుని తిరుగుతుందట.  పిసినారులు కూడబెట్టి, భూమిలో పాతిపెట్టిన ధనం పిశాచమవుతుందట. మంటలా మండుతూ, దొర్లుతూ దొర్లుతూ పోతుందిట.

     "నీకు చదువు రాదుకదా? నీకిన్ని కధలు ఎలా తెలుసే?" అంటే - "మాగూడెంలో ఒక అవ్వ వుండేది. ఆమె ఎన్నో కథలు చెప్పేది. పున్నమిరాత్రుల్లో పిల్లలంతా ఆమె చుట్టూ కూర్చుని చెప్పించుకునేవాళ్ళం."

     ఒకరోజు మందాకిని నిద్రపోతూ కెవ్వున కేకవేసి లేచి కూర్చుంది.
 
     "ఏమిటి? కలగానీ వచ్చిందా?" అంది ఆమె పక్కనే పడుకున్న కౌస్తుభ.

     "అవునక్కా! భయంకరమైన కల."

    ఆ కలని గుర్తుకు తెచ్చుకుంటుంటే గుండెల్లో భయం ఉప్పెనలా పొంగింది.


                           *    *    *    *

   
    అతడి పేరు తిరుమలశెట్టి.

     పల్లెటూరి నుండి వచ్చి ఇక్కడేదో వ్యాపారంచేసి డబ్బు బాగా సంపాదించాడు.

     పెద్ద ఇల్లు కట్టుకున్నాడు.

     ఇంట్లో మోడ్రన్ గా అన్నీ అమర్చుకున్నాడు.

     అయినా ఇప్పటికీ కొన్ని పల్లెటూరి అలవాట్లు పోలేదు అతడికి.

     ఇంట్లో టాయ్ లెట్ కి  వెళ్ళకుండా వీధిలోకి వచ్చి రోడ్డు ప్రక్కన లఘుశంఖ తీర్చుకోవడం ఒకటి అందులో.

     సెకండ్ షో సినిమా చూసొచ్చి భోజనం చేసేసరికి అర్దరాత్రి పన్నెండు కావచ్చింది.

     రాత్రిపూట భోజనం చేసాక ఓ సిగరెట్  వెలిగించుకుని తన ఇంటి కాంపౌండ్ బయట ఓ అయిదారు నిముషాలపాటు అటూ- ఇటూ పచార్లు చేయడం అలవాటు తిరుమలశెట్టికి.

     ఇంట్లోకి వచ్చేసేముందు లఘుశంఖ తీర్చుకుని సిగరెట్  చివరిదమ్ము లాగి దాన్ని క్రింద పడేసి రావడం అతడి  దినచర్యల్లో ఒకటి.

     ఆరోజు అలాగే పచార్లు ముగించి లఘుశంఖ తీర్చుకోవడం కోసం కూర్చున్నాడు.

     హఠాత్తుగా కరెంట్ పోయింది.

     అంతవరకూ వెలుగుతున్న వీధి దీపాలు ఆరిపోయాయి.

 Previous Page Next Page