ఆహా! పండుగొస్తోందోచ్!
ఇరవై ఏళ్ళ క్రితం. అప్పట్లో ఇంకో పదిరోజుల్లో పండుగొస్తుందనగా ఆరోజు నుంచే కాలనీ అంతా ఉత్సాహంతో నిండిపోయేది. ఏ రోడ్డు మీద చూసినా ఆనందోత్సోహాలతో తిరిగే జనం - కాలనీ కమిటీ వాళ్ళందరం సమావేశమయ్యేవాళ్ళం ఆరోజే -
ఆ పండుగ సందర్భంగా కాలనీని ఎలా అలంకరించాల్సిందీ, నవరాత్రుల్లో ఏమేం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాల్సిందీ, ఆ కార్యక్రమాలకు ఏయే కళాకారులను ఆహ్వానించవలసింది నిర్ణయించే వాళ్ళం.
దానిప్రకారం హడావుడి మొదలయ్యేది. కొత్తబట్టలు కొనడం, టైలర్ కివ్వడం అవి తిరిగి ఇచ్చేవరకూ టైలర్ చుట్టూ తిరగడం, పండగ కోసం ప్రత్యేకంగా అవసరమయిన సామాగ్రిని సమకూర్చుకోవడం. మామిడాకులు సంపాదించడం, గ్రయిండరో, టేప్ రికార్డరో కొనడానికి మార్కెట్ సర్వే చేయడం, ఆరోజు ఏ సినిమాకు వెళ్ళాలో ముందుగానే రిజర్వు చేసుకోవడం ఇలా జరిగిపోయేది.
పండుగరోజు ఉదయం నుంచే మరింత హడావుడి - తలంటుస్నానాలు, కొత్తబట్టలు వేసుకోవడం, పూజలు, గుడికి వెళ్ళడం, భోజనాల ఏర్పాట్లు, మధ్యాహ్నం నుంచే పిల్లలకు ఆటల పోటీలు, పాటల పోటీలు, చిత్రలేఖనం జరిగేవి.
సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంతో పాటు విజేతలకు బహుమతులు అందించేవాళ్ళం. పండుగ స్పెషల్స్ (పిండి వంటలు) ఒక ఇంట్లో చేసినవి ఆ చుట్టుపక్కల పది ఇళ్ళవాళ్ళకు పంపడం, మగాళ్ళు ఆ స్పెషల్స్ అన్నీ రుచి చూసి మనింట్లోవి తప్ప మిగతా అందరి ఇళ్ళలోని వంటకాలు అద్భుతం అని తేల్చడం, దాంతో ఇంట్లో చిన్న అలకలూ - ఆనందంగా వుండేవి.
'మగాళ్ళు పూజ అవగానే ఒకరికొకరు గ్రీట్ చేసుకోవడం' క్యారమ్స్ పోటీలు, బ్యాడ్మింటన్ పోటీలు, చెస్ పోటీలు, పేకాటలు, సిటీలో బంధువుల ఇళ్ళకూ, స్నేహితుల ఇళ్ళకూ వెళ్ళి కాసేపు మంచీ చెడూ మాట్లాడుకోవడం, ఇలా పండగొస్తుందంటే చాలు ఎంతో సరదా. పండుగ వెళ్ళిపోయిందంటే 'అయ్యో' అనిపించే తీయని నిట్టూర్పు- ఉండేవి.
ఇప్పుడు - పండుగ నెలరోజులుందనగానే ఇప్పుడు కూడా హడావుడి ప్రారంభమయిపోతుంది నగరమంతా!
సాయంత్రాల్లోనూ, చీకటి పడ్డాక నగరంలో బయటికి వెళ్ళేందుకు ఎవరికీ ధైర్యం ఉండదు. చీకటి పడ్డాక రోడ్డు మీద వెళ్ళాసిన అవసరం వస్తే దారిలో కత్తి చూపించి పండుగ చందాలు వసూలు చేసేవారి కోసం ప్రతి గ్యాంగ్ కీ ఓ పదిచొప్పున నాలుగయిదు గ్యాంగ్ లకు సరిపడే మొత్తం జేబులో ఉంచుకోవాలి. అయినాగానీ డబ్బు తక్కువయిందని ఎవడు పొడిచేస్తాడో తెలీదు. అందుకని మనం వెళ్ళే రోడ్ మీద నాలుగయిదు నర్సింగ్ హోమ్ లయినా వుండేటట్లు చూసుకోవాలి.
ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోతే ఆ నెలరోజులూ సెలవు పెట్టేసి ఇంట్లో వుండాలి. ఇంటిమీద కొచ్చే ఆ లొకాలిటీ గూండాలందరికీ చందాలివ్వకపోతే ఇల్లు తగలబడడం, ఇంటిమీద రాళ్ళు పడడం జరుగుతుంది. కనుక వాళ్ళకోసం ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకుని వారికి పంచాలి.
రాజధాని నగరంలో పండుగంటే బయటినుంచి బంధువులెవరూ రారు గనుక సందడి ఏమాత్రం వుండదు.
పండుగ తాలూకు నవరాత్రి ఉత్సవాలు ఎలా చేయాలీ, ఏమేం కార్యక్రమాలు నిర్వహించాల్సిందీ ఆ ఏరియా గూండాలు నిర్ణయిస్తారు. వాళ్ళ అభిరుచులకు తగినట్లుగానే బూతులు మాట్లాడే సినిమా ఆర్టిస్ట్ లనూ, బూత్ డాన్స్ లు చేసే హీరోయిన్ లనూ ఆ కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. పరమ బూతుతో నిండి వుండే తెలుగు సినిమా పాటలను రాత్రింబవళ్ళు పెద్ద వాల్యూమ్ తో ఆ చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకూ ఎవరికీ నిద్రాహారాలు సయించకుండా వినిపిస్తుంటారు.
పండగ దగ్గరకొస్తున్న కొద్ది నగర వాసులలో భయం, సస్పెన్స్ పెరిగిపోతూ వుంటాయి. చందాలివ్వలేదని ఎప్పుడు ఏ రోడ్డు మీద కత్తిపోట్లు జరుగుతాయో తెలీదు. ఏ క్షణంలో కర్ఫ్యూ పెడతారో తెలీదు. వీధులలో మనుష్య సంచారం తగ్గిపోతూంది. గూండా సంచారం పెరిగిపోతుంది. మన దగ్గరున్న డబ్బంతా గూండాలకివ్వాలి గనుక కొత్తబట్టలు వేసుకోవడం ఎలాగూ వుండదు. పండుగ ఉత్సవాలకోసం వేసిన షామియానాలలో ఎప్పుడు ఎవడు తాగి విగ్రహాలను ధ్వంసం చేస్తాడో తెలీదు. ఎప్పుడెవరు ఆర్టీసి మీద రాళ్ళు వేస్తారో, బస్ లు ఎప్పుడు ఠక్కున ఆగిపోతాయో ఎవరికీ తెలీదు.
చివరకు పండుగకు ఒకరోజు ముందుగానే నవరాత్రోత్సవాలలో ఆఖరు రోజున బయల్దేరదీసే ఊరేగింపుల్లో గానీ ఎలాగూ మతకల్లోలాలూ, కర్ఫ్యూలు, కత్తిపోట్లు, గృహ దహనాలు తప్పవు గనుక - మనచుట్టుపక్కల వాళ్ళంతా నగరం వదిలి పెళ్లాం బిడ్డలతో పల్లెటూళ్ళకు పారిపోతారు!
మనకి పల్లెటూళ్ళల్లో పుట్టిళ్ళు, అత్తిళ్ళు వుంటే అక్కడికి పారిపోతాం.
ఎవరూ లేకపోతే పండుగరోజు తలుపులేసుకుని- ఎవరు తలుపు కొట్టినా తీయకుండా కిటికీ కంతల్లో నుంచి బయటికి చూస్తూ గడుపుతాం. వుండుండి చుట్టుప్రక్కలవాళ్ళు తెచ్చే పుకార్లను విని మరింత గాబరా పడిపోతుంటాం. 'పూజ' పేరుకి మాత్రం ఇంట్లో చేసేసుకుంటాం. పిండి వంటలుండవు- వున్నా తినబుద్ధికాదు.
ఎప్పుడెవరు ఇంటిమీద కొస్తారో, ఎప్పుడెవరిళ్ళు అంటుకుంటాయోనని గుండెలు అరచేతిలో పెట్టుకుని చూస్తుంటాం! పిల్లలు నిరాశగా ఇంట్లోనే పాఠ్యపుస్తకాలు చదువుకుంటూంటారు. టీ.వీ. పెడదామా అంటే అతి భయంకరమైన పండుగ గురించి చర్చలు, నాటకాలు వారిని చీల్చి చెండాడతాయ్.
తెల్లారిన తర్వాత న్యూస్ పేపరు చూసి పండగరోజు కేవలం పాతిక కత్తిపోట్లతోనూ, ఓ అరడజను గృహ దహనాలతోను, యాభై రాళ్ళు రువ్విన సంఘటనలతోనూ చాలా ప్రశాంతంగా నగరవాసులు జరుపుకున్నారని, ముస్లిమ్స్, హిందువులను కౌగిలించుకున్నారని, హిందువులు ముస్లిమ్ సోదరులను కౌగిలించుకుని పండగ అభినందనలు తెలుపారనీ చదివాక మనకు పోయిన ప్రాణం తిరిగి వస్తుంది.
పండగొస్తుంటే చాలు ఎంతో భయం, దిగులూ. పండగ వెళ్ళిపోయిందంటే పీడా విరగడయి పోయిందనే దీర్ఘ నిట్టూర్పు - 'హమ్మయ్య' అనుకునే ఫీలింగ్ కలుగుతాయ్.
* * *